సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Mar 02, 2020 , 22:23:25

నిత్యకాంతుల తెలంగాణ

నిత్యకాంతుల తెలంగాణ

విద్యుత్‌ వాడకం రికార్డుస్థాయికి పెరిగిందంటే, అదే స్థాయిలో పెట్టుబడులు, వ్యవసాయరంగంలో దిగుబడులు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడువాలంటే విద్యుత్‌ ఇరిగేషన్‌ రంగాలే కీలకమని గుర్తించిన కేసీఆర్‌ ఈ రంగాలకు పెద్దపీట వేశారు. అందులో భాగంగానే ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి కాళేశ్వరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. నిరంతర విద్యుత్‌, నీటి సరఫరా కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రతిపక్షాలు లేని అవినీతి గురించి మాట్లాడటం చూసి ప్రజలు ఈసడించుకున్నారు. పారిశ్రామికరంగాన్ని, వ్యవసాయరంగాన్ని పరిగెత్తిస్తే సంపద పెరిగింది. పెరిగిన సంపదను సంక్షేమ పథకాలతో జనాలకు పంచాలని ఆలోచన చేశారు కేసీఆర్‌. ఆసరా, కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు వివిధవర్గాల అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల్లో కేసీఆర్‌ కిట్‌ ఎన్నదగినదని కేంద్ర బృందం గుర్తించింది. ఈ కిట్‌తోనే తల్లి బిడ్డల సంరక్షణ పెరిగిందని కితాబిచ్చింది.

దయం పేపర్‌ చదువుతుంటే నాకు రెండు వార్తలు కనపడ్డయి. ఒకటి- విద్యుత్‌ వాడకంలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రికార్డులు బ్రేక్‌ చేసినట్లు. మరొకటి తల్లి బిడ్డ సంరక్షణలో తెలంగాణ భేష్‌ అంటూ.. కేంద్ర పరిశీలన బృందం ఇచ్చిన నివేదిక. ఈవార్తలు చదువుతుం టే నాకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. తెలంగాణ రావడం ఖాయం అని తెలిసి, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొనే ప్రయత్నంలో భాగంగా ప్రజల లో గందరగోళం సృష్టించాలని నాటి ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రాంతం అంధకారం అవుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి ఉండదు, కొందామన్నా దొరకదు..’ అంటూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాడు. ఒక మీడియా ప్రతినిధిగా దానికి నేను హాజరైన. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వినియోగాన్ని తెలంగాణ రాష్ట్రం బ్రేక్‌ చేసింది. అలాగే ‘తల్లి బిడ్డ సంరక్షణకు కేసీఆర్‌ కిట్‌ అద్భుతంగా పనిచేసింది’ అంటూ కేంద్ర బృం దం నివేదిక ఇచ్చినట్లు వచ్చిన వార్త. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చూసి న సినిమా యాది కొచ్చింది. అందులో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాట గుర్తుకొచ్చింది.


 పాలకుడికి విజన్‌ ఉండాలి. దానితోపాటు అన్నిరంగాలమీద సంపూర్ణ అవగాహన ఉండాలి. ప్రజలకు ఏమికావాలో తెలిసి ఉండాలి. దీనితోపాటు రాష్ర్టానికి తక్షణం ఏమికావాలో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకోగలగాలి. అప్పుడే జనరంజకమైన పాలన అందించగలుగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు వాళ్లకు ఆసక్తి ఉన్న రంగాలమీదే దృష్టి పెట్టారు. కొందరు వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తే, కొంతమంది పారిశ్రామికరంగాన్ని నిర్లక్ష్యం చేశారు. మరికొంతమంది సంక్షేమాన్ని విస్మరించారు. కొందరు సాగునీటిరంగాన్ని పట్టించుకోలేదు. ఇలా ఏదో ఒకదాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇలా వారి పాలనలో ఏదో ఒక వెలితి కనబడేది.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ప్రజల్లో అనేక ఆకాంక్షలు. ఉద్యమ రథసారథి తెలంగాణ సాధకుడు కేసీఆర్‌తోనే మా ఆకాంక్షలు నెరువేరుతాయనే భావనతో ఆయనకే జనం పట్టంకట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేసీఆర్‌. ఇది కత్తి మీద సామని తెలుసు.  ప్రజల ఆకాంక్షలను గుర్తించిన వారిగా రాష్ర్టానికి ఏం కావాలో, ఏం చేయాలో పరిపూర్ణ అవగాహన ఉన్నవారు. దీంతో తగిన ప్రాధాన్య క్రమాన్ని ఎంచుకున్నారనడానికి ఇప్పుడు వస్తున్న ఫలితాలే నిదర్శనం. అందులో భాగమే విద్యుత్‌ వినియోగంలో ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ వినియోగం 13,162 మెగావాట్లు నమోదు కాగా, కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు 13,168 మెగావాట్ల రికార్డు విద్యుత్‌కు చేరింది.


 దీంతో ఉమ్మడి ఏపీ రికార్డ్‌ బ్రేక్‌ చేసినట్లైంది. సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యుత్‌, ఇరిగేషన్‌రంగాలపై దృష్టి సారించారు. విద్యుత్‌, ఇరిగేషన్‌ రంగాలను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవడంలోనే ఆయన ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది. విద్యుత్తు, నీళ్లు పుష్కలంగా ఉంటే ఉన్న పరిశ్రమలు బాగా నడుస్తాయి. కొత్త పరిశ్రమలు వస్తాయి. కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరగడం అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం. కొనుగో లు శక్తి పెరగడం అంటే రాష్ట్ర సంపద పెరగడం. పెరిగిన సంపదను ప్రజలకు పంచాలంటే సంక్షేమ పథకాలు పెంచడం. అందులో భాగమే కేసీఆర్‌ కిట్‌. ఈ నేపథ్యంలోంచే మనం పేపర్లో వచ్చిన వార్తలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే సీఎం కేసీఆర్‌ ఎంత ఖర్చు అయి నా విద్యుత్‌ను కొనడంతో పాటు కొత్త విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించాలన్న సంకల్పంతో అడుగులు వేశారు. అందులో భాగమే భద్రాద్రి కొత్తగూ డెం, యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం. దీంతోపాటు జైపూర్‌ థర్మల్‌ ప్లాంటును త్వరగా పూర్తి చేశారు. విద్యుత్‌ కొనుగోలు కోసం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకోవడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 


దీనిపై కొంద రు విపక్ష నాయకులు అవినీతి అంటూ అనవసర రాద్ధాంతం చేశారు. జనం మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే రైతులకు, పరిశ్రమలకు విద్యుత్‌ కావాలి. చిరు వ్యాపారులకు, గృహ అవసరాలకు విద్యుత్‌ కావా లి. ఒకరకంగా చెప్పాలంటే విద్యుత్‌ నిత్యావసరం. అలాంటి విద్యుత్‌ను ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తుంటే అవినీతి జరిగిందంటూ కాకి గోల చేసినా జనం పట్టించుకోకుండా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు. గతంలో వ్యవసాయానికి క్రాప్‌ హాలిడే, పరిశ్రమలకు ఇండస్ట్రీయల్‌ హాలిడేలు ఉండేవి. విద్యుత్‌రంగంపై ఆధారపడిన కాటేజ్‌ ఇండస్ట్రీస్‌కు, చిరువ్యాపారులకు జనరేటర్లే దిక్కు అయ్యేవి. నేడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ను ఇస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ ఇండస్ట్రియల్‌ పాలసీని ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మల్టీనేషనల్‌ కంపెనీలు పెట్టుబడులతో తెలంగాణకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పారిశ్రామికరంగంతో పాటు వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తులు పెరగడంతో పాటు రికార్డుస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగింది.


విద్యుత్‌ వాడకం రికార్డుస్థాయికి పెరిగిందంటే, అదే స్థాయిలో పెట్టుబడులు, వ్యవసాయరంగంలో దిగుబడులు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడువాలంటే విద్యుత్‌ ఇరిగేషన్‌ రంగాలే కీలకమని గుర్తించిన కేసీఆర్‌ ఈ రంగాలకు పెద్దపీట వేశారు. అందులో భాగంగానే ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి కాళేశ్వరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. నిరంతర విద్యుత్‌, నీటి సరఫరా కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రతిపక్షాలు లేని అవినీతి గురించి  మాట్లాడటం చూసి ప్రజలు ఈసడించుకున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు ఇప్పుడు మన కళ్లముందున్నాయి. ఎన్న డూ నిండని చెరువులు నిండుతున్నాయి. ఎప్పుడూ పారని భూములకు నీళ్లు పారుతున్నాయి. వేసవి సమీపిస్తున్నా కాలువల్లో, చెరువుల్లో నీళ్లు కనపడుతున్నాయి. రికార్డుస్థాయిలో విద్యుత్‌ వినియోగం ఎలా పెరింగిందో అదేస్థాయిలో వరి ఉత్పత్తి కూడా పెరిగింది. సాధారణంగా యాసంగి సీజన్‌లో వరి సాగు 17లక్షల ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో రికార్డు స్థాయి లో 30 లక్షలకు పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 86 శాతానికి పైగా పెరుగుదల 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌, సాగు నీరు అందించడంతోనే సాధ్యమైంది.  రైతులకు పుష్కలంగా సాగు నీరు ఇచ్చిన కేసీఆర్‌ రైతుబంధు పేరుతో ఎకరానికి రెండు పంటలకు కలిపి 10 వేలు పెట్టుబడులు ఇవ్వడంతో రైతుకు ఏనుగంతా బలమొచ్చింది. 


పారిశ్రామికరంగాన్ని, వ్యవసాయరంగాన్ని పరిగెత్తిస్తే సంపద పెరిగింది. పెరిగిన సంపదను సంక్షేమ పథకాలతో జనాలకు పంచాలని ఆలోచన చేశారు కేసీఆర్‌. ఆసరా, కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు వివిధవర్గాల అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల్లో కేసీఆర్‌ కిట్‌ ఎన్నదగినదని కేంద్ర బృందం గుర్తించింది. ఈ కిట్‌తోనే తల్లి బిడ్డల సంరక్షణ పెరిగిందని కితాబిచ్చింది.  కేంద్రం ఇచ్చిన ప్రశంసతో పాటు అనేక అంతర్జాతీయ సామాజిక సర్వేలు, ఆర్థిక సర్వే లు, నీతి ఆయోగ్‌ నివేదికలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి కన్నా, ఇతర రాష్ర్టాల కన్నా భేషుగ్గా ఉందని తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో పేద, ధనిక అంతరం కూడా క్రమంగా తగ్గుముఖం పట్టిందని చెప్పడంతో పాటు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న మహా నగరాల్లో హైదరాబాద్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని వారి నివేదికల్లో పొందుపరిచారు. ప్రపంచంలో సిలికాన్‌ వ్యాలీ, ఇండియాలో బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ రంగాలకు కేంద్రం. కానీ నేడు ఆ స్థానాన్ని హైదరాబాద్‌ ఆక్రమించింది. మొన్నటి పార్లమెంటు సమావేశాలలో సమర్పించిన ఆర్థికసర్వేలో కూడా పన్ను రాబడిలో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని చెప్పింది. పన్నుల రాబడి పెరిగిందంటే సంపద పెరిగిందనడానికి సూచికే కదా.  


(వ్యాసకర్త: ఇన్‌పుట్‌ ఎడిటర్‌,టీ న్యూస్‌)


logo