మంగళవారం 07 ఏప్రిల్ 2020
Editorial - Mar 02, 2020 , 22:28:07

మృత్తికా ఆరోగ్యమే పంటకు ప్రాణం

మృత్తికా ఆరోగ్యమే పంటకు ప్రాణం

రసాయన ఎరువుల నుంచి సేంద్రియ ఎరువుల వాడకంవైపు మారితేనే భూములు సుస్థిర వినియోగంలో ఉంటాయి. సాగు ఖర్చులు తగ్గుతాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు భారం తగ్గుతుంది. అంతేగాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.

పంటల దిగుబడిలో ప్రధాన భూమిక భూమిదే. భూసార మే పంటలకు పెట్టుబడి. అయితే విచక్షణారహితంగా వాడుతున్న రసాయన ఎరువులతో భూములు నిస్సారమవు తున్నాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా యి. పంట భూములు పదికాలాల పాటు సారవంతంగా ఉండాలంటే వాటి సారాన్ని ముందుగానే అంచనా వేయాలి. తరచుగా తగిన మేరకు నేలకు పోషకాలు అందించాలి. ఈ దిశగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సాయిల్‌ హెల్త్‌ కార్డు’ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. ఐదు సంవత్సరాల కిందట మొదటి దశలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ఈ పథకంలో దాదాపు 700 కోట్లరూపాయలతో 22.48 కోట్ల మంది రైతులకు వీటిని పంచారు. దీనికి అనుగుణంగా 1229 ల్యాబ్‌లను బలోపేతం చేయడంతో పాటు 102 మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 8752 మినీ ల్యాబ్‌లు,1562 గ్రామస్థాయి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా సంవత్సరానికి మూడు కోట్ల నమూనాలు పరీక్షించే సౌకర్యాలున్నాయి. దీనిద్వారా రైతులు తమ పొలాల మట్టిలోని పోషకాలను అంచనా వేయవచ్చు. తదనుగుణంగా సరిపోయే పంటలు వేసుకోవచ్చు. 


అవసరమైన మోతాదు మేరకు మాత్రమే ఎరువులు వాడుకోవచ్చు. ఫలితంగా పంటలకు సాగు ఖర్చులు తగ్గుతా యి. పంటల ఉత్పాదకత మేలుగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. పెరిగిన పరీక్షా కేంద్రాల సామర్థ్యంతో మెట్టప్రాంతాలలోని భూసారాన్ని కూడా పరీక్షించవచ్చు. అవసరమైన ప్రధాన పంటలైన అపరాలు, నూనెగింజల ఉత్పత్తి  పెంచుకోచ్చు. ఈ విధంగా రైతుల ఆదాయా లు రెట్టింపు కావటంలో ‘సాయిల్‌ హెల్త్‌ కార్డు’లు ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇదే విషయాన్ని జాతీయ ఉత్పాదకత కౌన్సిల్‌ తన అధ్యయ నం ద్వారా ధృవపరిచింది.19 రాష్ర్టాలలో 76 జిల్లాల్లోని 1700 మంది రైతుల పొలాలలోని మృత్తికను పరీక్షించిన ఎన్‌పీసీ సాయిల్‌హెల్త్‌కార్డులు వాడిన రైతులు ఎకరానికి సరాసరిన రూ.30వేల మేర అదనపు ఆదాయం పొందారని తెలి పింది. అదే సమయంలో ఎరువులనూ ఆదా చేసుకోవచ్చని ఆ అధ్యయనంలో తేలింది. రైతులు 10 నుంచి 50 శాతం వరకు సంప్రదాయకంగా వాడే ఎరువులను ఆదా చేయగలిగారు. ఇందుకు సాయిల్‌ హెల్త్‌కార్డు ఆధారిత ఎరువుల వాడకం దోహదపడింది. దీనికి అదనంగా అవసరం మేరకు మాత్రమే ఎరువులను వాడటం వల్ల ప్రతి పంటలో 20నుంచి 50 శాతం వరకు దిగుబడులు పెరిగాయి. రైతులకు ఆదాయాలు సైతం పెరిగాయి. 


తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం భూసార పరీక్ష లు చేయించింది. రైతుల పొలాలలో వాడవలసిన ఎరువుల మోతాదును విస్తరణ అధికారులు సిఫార్సు చేయడం ఆహ్వానించదగిన పరిణామం. కేవలం ప్రభుత్వం సౌకర్యాలు కల్పించినంత మాత్రాన అన్నిపంటల భూములలోని భూసార పరీక్షలు పూర్తికావు. రైతులు సొంతంగా భూసార పరీక్షలకు ముందుకు రావాలి. ఆ ఫలితాలకు అనుగుణంగా మాత్రమే పం టలు, ఎరువులు వేసుకోవాలి. చిన్న కమతాలలోని రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే భూముల సుస్థిర వినియోగం పెరుగుతుంది. రైతుల ఆదాయాలు, వినియోగదారుల ఆరోగ్యం పెరుగుతాయి. 


దేశంలో 1950వ దశకంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెంపు ప్రణాళికలో భాగంగా రసాయన ఎరువుల వాడకం మొదలైంది. మొదట్లో తక్కువ మోతాదులోనే ఎరువులు వాడేవారు. హరిత విప్లవకాలంలో ఎరువుల వినియోగం బాగా పెరిగింది. నత్రజని ఎరువుల ఉత్పత్తి, వాడకంలో భారత్‌ది ప్రపంచంలో రెండోస్థానం. భాస్వరం వినియోగంలోనూ రెండోస్థానంలో ఉన్నది. అన్నిరకాల ఎరువులు కలిపి దేశంలో 5.75 కోట్ల టన్నులు వినియోగిస్తున్నాం. ఇప్పటికే ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువులు వాడుతున్న హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌ రాష్ర్టాలలోని భూముల ఉత్పాదకత మందగించినట్లు నివేదికలున్నాయి. 2025 నాటికి దేశంలో అవసరమయ్యే 32 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయటానికి, పంటలకు 4.5 కోట్ల  టన్నుల పోషకాలు అందించాల్సి ఉందని జాతీయ వ్యవసాయశాస్ర్తాల అకాడమీ తన నివేదికలో తెలిపింది. అందు లో కోటి టన్నులపైనే సేంద్రియ ఎరువులు వాడితే తప్ప భూములు పునరుజ్జీవం కావు. 


అశాస్త్రీయంగా వాడుతున్న రసాయనఎరువులతో క్షేత్రస్థాయిలో దుష్ప్ర భావాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. నేల సారం దెబ్బతిని, పంటల ఉత్సాదకత తగ్గిపోతున్నది. దేశంలో ప్రధానంగా సాగయ్యే వరి, గోధుమ పంటలలో నత్రజని, భాస్వరం, పొటాష్‌ 4:2:1 పాళ్లలో వాడాలి. కానీ దేశవ్యాప్తంగా అంతకంటే ఎక్కువ మోతాదుల్లో వాడుతున్నారు. అంటే ప్రధా న పోషకాలను మితిమీరి వాడుతున్నారు. దీంతో పలు సూక్ష్మపోషకాలు లోపిస్తున్నాయి. వివిధ రాష్ర్టాల నుంచి సేకరించిన రెండున్నర లక్షలకు పైగా నమూనాలు పరీక్షించినప్పుడు సగం నమూనాలో జింకులోపం కనిపించింది. 33 శాతం నమూనాల్లో బోరాన్‌, 10 శాతానిపైగా నమూనాల్లో ఇనుము, రాగి, మాంగనీసులు కొంతమేర లోపించినట్లు ఫలితాలు తెలుపుతున్నా యి. అంటే ప్రధాన పోషకాలనిచ్చే ఎరువులు మాత్రమే వాడుతుండటం తో కలుగుతున్న అనర్థాలివి. వీటిని తగ్గించి, ఆరోగ్యకరమైన భూములు, పోషకాలు కలిగిన ఆహార ఉత్పత్తులు అందాలంటే భూసారపరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి. 


1955-56లో భారత్‌-అమెరికా ఒప్పందంలో భాగంగా భూసారం అంచనా, తద్వారా ఎరువుల వాడకం కోసం దేశంలో 16 భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సాంద్ర వ్యవసాయ జిల్లా పథకం అమలులో భాగంగా ఎంపిక చేసిన జిల్లాలో మరో తొమ్మిది నూతన భూసార ప్రయోగశాలలు నెలకొల్పారు. అయితే దేశంలో వేలసంఖ్యలో భూసార పరీక్ష కేంద్రాలు ఉన్నప్పటికీ దాదాపు అన్నిరాష్ర్టాలలో ఆర్థిక సమస్యలు, నిర్వహణ లోపాల కారణంగా అవి నిరూపయోగంగా ఉన్నాయి. వాటిని అన్నివిధాలా పరిపుష్టం చేసి, వినియోగంలోకి తేవాలి. మరిన్ని భూసార కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.


వాటిలో పెద్ద సంఖ్యలో నిపుణులను నియమించాలి. భూసార ఆధారిత ఎరువుల వాడకంపై రైతులకు విస్తృతస్థాయిలో అవగాహన కలిగించాలి. రసాయన ఎరువుల నుంచి సేంద్రియ ఎరువుల వాడకంవైపు మారితేనే  భూములు సుస్థిర వినియోగంలో ఉంటాయి. సాగు ఖర్చులు తగ్గుతాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు భారం తగ్గుతుంది. అంతేగాకుండా  పర్యావరణా న్ని కాపాడుకోవచ్చు. ఇందుకుగాను రసాయన ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలన్నింటినీ సేంద్రియ ఎరువులకివ్వాలి. అప్పుడే రైతులు సేంద్రియ ఎరువులు వాడుతారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూములు జీవం పోసుకుంటాయి. దేశ ఆహార స్వయంసమృద్ధికి ఆ భూములు ప్రధాన వనరులుగా, కేంద్రాలుగా నిలుస్తాయి. logo