గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 02, 2020 , 22:15:42

జీవులను బతుకనిద్దాం

జీవులను బతుకనిద్దాం

ఐక్యరాజ్యసమితి మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించింది. దీంతో వన్యప్రాణుల దినోత్సవాన్ని ఏటా మార్చి 3న జరుపుకుంటున్నాం. అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి ఈరోజున ప్రత్యేకంగా కార్యక్రమం జరుపుకుంటాం.  భూమి లెక్కలేనన్ని జీవజాతులకు, వృక్షజాలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి, ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నాం. కాని మానవుల కార్యకలాపాలు జీవ  జాతులు, సహజ వనరులను జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో అన్ని జీవ జాతులలో నాలుగింట ఒక వంతు అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఇలా జీవజాతులు అంతరించిపోతే ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమా దం ఉన్నది. ఈ ప్రభావం మానవజాతిని కూడా ప్రమాదంలో పడేస్తుంది.


మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ కోసం 1972లో చట్టం చేశారు. జనాభా పెరిగిపోవడం, అడవులు తగ్గిపోవడంతో కాలుష్యం పెరిగిపోతున్నది. దీంతో వాతావరణంలో మార్పులు జరిగి  జీవజాతులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ చట్టాలతో వాటిని రక్షించు కోవాలి. అయితే  ప్రభుత్వం ఒక్కటే ఈ పని చేయదు. రాజ్యాంగం ప్రకారం అడవులు, నదులు, చెరువులు కుంటలు, కాలువలు చుట్టూ ఉన్న పక్షులు, జంతువుల, చెట్లను సంరక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ. లేదంటే మానవ జాతికి ప్రమాదమే. అందుకే వన్యప్రాణుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. 

- నెరుపటి ఆనంద్‌, సైన్స్‌ టీచర్‌, ఉన్నత పాఠశాల, టేకుర్తి

(నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం)


logo