గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Mar 01, 2020 , 23:05:27

సాహిత్యంలో మన సంస్కృతి

సాహిత్యంలో మన సంస్కృతి

సాహిత్యం వారసత్వ సంపద. ఆయాకాలాల ప్రజల అనుభవాల, భావాల, అభి రుచుల, ఇష్టానిష్టాల, సుఖదుఃఖాల, భౌతిక ఆధ్యాత్మిక విషయాల సంపుటీకర ణమే సాహిత్యం. సాహిత్యంలో అంతర్భాగాలైన పదజాలం, సామెతలు, కవిత్వం ప్రతిదానిలోను ఏదో కొంత సాంస్కృతిక విశేషం లభించవచ్చు. కాలపరిణామంలో, ఆచార సంప్రదాయాల్లో, జీవన సరళిలో ఎన్నోరకాల మార్పు లు చోటుచేసుకోవచ్చు. కొన్ని పూర్తిగా పోవచ్చు. పాక్షికంగా మారవచ్చు. కొత్తవి ప్రారంభం కావచ్చు. వీటికి పరిసర ప్రాంతీయ భాషా సాహిత్య మత వ్యాపార సంబంధాల హేతువు కావచ్చు. దాడులు కావచ్చు. పాలకసంస్కృతి ఆచారాల అనుకరణలు కావచ్చు. సాహిత్యం  సంస్కృతీపరిణామాల అవగాహనకు ఆధారభూతంగా ఎలా నిలుస్తుందో వైవిధ్యభరితమైన అంశాలు మచ్చుకు కొన్ని.. 


ఈ పిల్ల పదహారణాల తెలుగు అమ్మాయి. ‘పిల్ల’ పదం ఏనాటిది? శాతవాహన కాలంనాటి ‘గాథాసప్తశతి’లో తొలిసారి కనిపిస్తుంది. అం తకుముందే జన వ్యవహారంలో నిత్యం వాడుకలో ఉన్న పదం. అంటే ఒక పదం వెనుక  వేల ఏళ్ళ చరిత్ర ఉన్నట్లే కదా. మరి ‘పదహారణాల తెలుగు అమ్మాయి’ అని ఎందుకనాలి? పదిహేడు అనవచ్చు. పద్నాలుగు అనవచ్చు, 20 అణాలు అనవచ్చు కదా! 

నిజాం కాలంలో ఉన్న ద్రవ్య మారకం ఇది. ‘అణా’ అంటే ఆరు పైస లు. 16 అణాలు అంటే 96 పైసలు. నిజాంకాలంలో 96 పైసలే రూపా యి కింద లెక్క. బ్రిటిషాంధ్రలో నూరుపైసలకు రూపాయి. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు నిజాం ‘రుపీ’ ని బ్రిటిష్‌ ‘రూపాయి’ని సమానం చేశారు. అయితే జనంలో సెంట్‌ పర్సెంట్‌ (నూటికి నూరుశాతం) అనే దగ్గర పదహారణాలు అనే జాతీయమే వాడుకలో ఉంది. మనం 25 పైసలకు చారాణా (4x6= 24 పైసలు) అనీ, 50 పైసలకు (8x6 = 48) ఆఠాణా, 75పైసలకు (12 x 6=72) బారాణా అనీ వ్యవహారానికి వాడుతూ సర్దుకు న్నాం. ఇది చరిత్రలోని ఒక పరిణామానికి సాక్ష్యం.

ఈ రోజు పెళ్ళిలో మాంగల్యధారణ అన్నది ప్రధానాంశం. నిజానికి ముహూర్తం అంటే నిర్దేశిత సమయమేం కాదు. దాదాపు 40 నిమిషాలు ఉం టుంది. పురోహితులు సరిగ్గా మధ్యలో ముహూర్తం పెడతా రు. మన సౌకర్యం కోసం కాస్త అటూ ఇటూ అయినా పరవాలేదు. ఆ మూహుర్తంలో కూడా జిలకర బెల్లం పెట్టడమే ముఖ్యం తప్ప మాంగల్యధారణ కాదు. జిలకరబెల్లం, సప్తపది, హోమం ఇవే పెళ్ళికి మూలం. మాంగల్యధారణ తర్వాత కాలంలో వచ్చిన దాక్షిణాత్య ఆచా రం. దీని కాలం ఎప్పటిది అని తెలుసుకోవాలంటే సాహిత్యాధారం తోడ్పడుతుంది. తిక్కన.. ఉత్తరాభిమన్యుల వివాహంలో తలంబ్రాలు పోసుకోవడాన్ని వర్ణించాడే తప్ప మాంగల్యధారణ వర్ణించలేదు. పోతన భాగవతంలో.. 


‘మ్రింగెడువాడు  విభుండని

మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్‌

మ్రింగుమనె సర్వమంగళ

మంగళ సూత్రంబు నెంతమది నమ్మినదో ’(భాగవతం.8-241)

అని స్పష్టంగా మాంగల్యధారణను చెప్పాడు. అంటే తిక్కన నాటికి లేకుండా పోతనకాలం నాటికి మధ్యలో ఈ ఆచారం వచ్చి స్థిరపడింద ని ఊహించాలి. లలితా సహస్రనామం అందరూ పారాయణం చేస్తుంటారు. బ్రహ్మాండ పురాణం ఉత్తరభాగంలో లలితాసహస్రనామం ఉం ది. అందులో ‘కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా’ అని వస్తుం ది. శివుడు పార్వతిమెడలో మంగళసూత్రం కట్టాడని భావం. ‘బ్రహ్మాం డ పురాణం’ గుప్తుల కాలంలో రాయబడిందంటారు. మరి అప్పుడు ఈ ఆచారం ఉందా? ఉన్నట్లు ఆధారాలు లేవు. ఎవరో భక్తాగ్రగణ్యుడు లలితాసహస్ర నామాన్ని బ్రహ్మాండపురాణంలో దూర్చడంలో విజయం సాధించాడు. ఇలా మధ్యలో చేర్చిన వాటిని ప్రక్షిప్తాలని పిలుస్తాం.

‘చేతులారంగ శివుని పూజింపడేని - 

నోరునొవ్వంగ హరికీర్తి నుడవడేని

దయయు సత్యంబు లోనుగా దలపడేని 

కలుగ నేటికి తల్లుల కడుపు చేటు..’


 అందరికీ తెలిసిన పోతన పద్యం ఇది.  సాధారణంగా అర్థం చెప్పేస్తారు. కాని ఇందులో ఒక సంస్కృతీ విశేషాన్ని పోతన నిక్షిప్తం చేశాడని గమనిస్తే మరింత ఆనందం కలుగుతుంది. అభిషేకప్రియుడు శివుడు, కనుక శివాలయానికి వెళ్ళి శివుని నెత్తి మీద నీళ్లు పోయాలి. ఎందుకు గరళతాపహరణార్థం. అది చేతులారంగ చేయాల్సిందే. విష్ణువు సంకీర్తన ప్రియుడు. అందుకే విష్ణువుకు సుప్రభాతాలు, సహస్రనామాదులు ఉంటాయి. అవన్నీ నోరు నొవ్వంగ చేయాల్సిందే. చేతులారంగ హరిని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని.. అంటే ఛందస్సు సరిపోవచ్చు. కాని భావం గంగలో కలుస్తుంది. సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. అభిషేకప్రియుడు శివుడు. సంకీర్తన ప్రియుడు విష్ణువు. నమస్కారప్రియుడు సూర్యుడు. స్మరణప్రియుడు దత్తాత్రేయుడు. ఆయాదేవతల అభీష్టాల ప్రకారం పూజిస్తేనే మన అభీష్టాలు నెరవేరుతాయి.


‘కార్తికీవేళ భీమశంకరుని నగరఁ

దూఱునెవ్వాడు చిచ్చఱతోరణంబు

వాడు దూఱడు ప్రాణనిర్యాణవేళ 

ఘోరయమపట్టణద్వారతోరణంబు..’ 

                    (భీమేశ్వరపురాణం 3-25)

దక్షారామ భీమేశ్వరునికి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి జ్వాలాతోరణం ఏర్పరుస్తారట. దాని గుం డా దూరి పోతే భక్తుడు యమలోకంలోకి పోడు.  అంటే పుణ్యం వస్తుందని విశ్వాసం. దీన్ని శ్రీనాథుడు ‘కాశీఖండం’లో కూడా ప్రస్తావించాడు. ఇది నేటికీ సజీవంగా ఉన్న ఆచారం. శ్రీనాథునికన్నా ముందెప్పటినుంచి ఈ ఆచారం ఉందో నికరంగా తెలియకపోయినా  శ్రీనాథునినుం చి నేటిదాక అవిచ్ఛిన్నంగా వస్తున్న ఆచారమని చెప్పటానికి ప్రబల సాక్ష్యం ఇది.

 ‘ఏమి శకునమున చొచ్చితిమో కాశికి’ అని అనడం వల్ల శకునాలను నమ్మడం కూడా ఆ సమాజంలో వుందని తెలుస్తుంది. భారతీ య సమాజంలో ఇది సామాన్యాంశమే. వ్యాసుడు అగస్త్యుడు దక్షారామానికి తిరిగి పోతున్నపుడు నగర ప్రవేశానికి శుభముహూర్తం (3-39),(3-56) చూశారు. ఏ ముహూర్తం సరి గా కుదరని పక్షంలో అభిజిన్ముహూర్తం మధ్యా హ్నం 11.45 నుంచి 12.30 వరకు నిస్సంకోచంగా చేయవచ్చు. అది విజయముహూర్తం అన్న విశ్వాసం  నేటికీ ప్రబలంగానే ఉంది. యానాదు లు అని పిలువబడే నిరక్షరాస్య సంచారజాతులు గడ్డపారముహూర్తంలో పెళ్ళిచేసుకొంటారు. మిట్టమధ్యాహ్నం గడ్డపారను నిలబెడితే నీడ పడదు. అదే అక్షరాస్యుల అభిజిన్ముహూర్తం. సురవరంప్రతాపరెడ్డిగారు తమ ‘ఆంధ్రుల సాంఘికచరిత్ర’ లో తెలుగువారి ఆచారవ్యవహారాలు, విశ్వాసాలు కుప్పలు పోశారు.  


దుశ్శాలువలతో సత్కరిస్తామని సభల్లో ప్రకటిస్తుంటారు.  దుశ్శాలు వ అంటే రెండు శాలువలని అర్థం. కాని ఒక శాలువాతోనే సత్కరిస్తారు. దీని వెనుక ఉన్న సం స్కృతి కోణం చూడా లి. సన్మానంలో రెం డు శాలువలతో సత్కరించాలి. రెండు వస్ర్తా లు ఒంటి మీద ఉం డాలి.  ఒంటిబట్ట అమంగళం. అశుభకార్యాల్లో అంటే దినాలప్పుడు ఒంటిపంచె పెడతారు. శుభకార్యాల్లో బట్టలజత పెదతారు. ఇది మన సంస్కృ తి. 

వెనుకటి కాలంలో మనపేరు మనం నేరుగా చెప్పడం సభ్యత కాదు. మనగురించి వేరే వారు చెప్పాలి. ‘శృంగారనైషధం’లోని ఈ ఘట్టం చూడండి.. ఇంద్రాగ్నియమ వరుణులలో ఎవరినైన వరింపుమని దమయంతికి మారువేషంలో ఉన్న నలుడు చెప్తాడు. ఆమె ‘భవాదృశంబైన నాయక రత్నంబు నే వంశంబు భరించె? నే వర్ణంబులు నీపుణ్యనామంబునకు ప్రకాశంబులైన యవి’ అని పేరు, వివరాలు అడుగుతుంది. అప్పు డు నలుడు తక్కువ వాడినైతే చెప్పడం భావ్యం కాదు. గొప్ప వాడినైతే స్వోత్కర్ష అవుతుంది అం టూ.. నలుడు ఇంకా ఇలా అంటాడు. 


‘పేరడుగం దలంచెదవొ? 

భీమతనూభవ!  యావిచారముం

దూరము సేయు మెవ్వరికి 

దోసము తాఁ దనపేరు సెప్పుటా

చారపరంపరా స్థితికి శాస్త్రము 

మూలము, శాస్త్ర చోదితా 

చార వివేక హీనుఁడగు జాల్ముని మెత్తురె పండితోత్తముల్‌.’ (శృంగారనైషధం 4-56)

తనపేరు తాను చెప్పుకోవడం శాస్త్రవిరుద్ధం, సంప్రదాయ విరుద్ధం. అది ఒక సంస్కృతి.  ఒక్క తన పేరు మాత్రమే కాదు, భార్యాభర్తలు ఒకరినొకరు పేర్లు చెప్పుకోరు. అందుకు పెళ్ళయ్యాక అత్తగారింట్లో కాలు పెట్టేవేళ ఒకరినొకరు పేర్లు చెప్పిస్తారు. అదొక వేడుక. 

‘అమరపతిన్‌ వరించెదవొ, 

హవ్యవహున్‌ చరణంబు దొక్కెదో

శమనునిని జెట్టవట్టెదవొ, 

సాగరవల్లభుపెండ్లి యాడెదో

ప్రమదము కౌతుకంబు 

ననురాగము పెంపును సొంపు మీరగా

కమలదళాక్షి, యొక్కరుని గైకొనుమా, యనుమానుమేటికిన్‌..’


(శృంగారనైషధం 4- 48)

అని శ్రీనాథుడు వివాహక్రియకు పర్యాయాలుగా వరించు, చరణంబు ద్రొక్కు, చేయి పట్టుకొను, పెండ్లియాడు, నాలుగు పదాలను వాడాడు. కాలు తొక్కుట, చేయిపట్టుకొనుట అనే ఆచారాలు నుడికారాలుగా శ్రీనాథుని నాటికే స్ధిరపడ్డాయనడానికి  ఈ పద్యం సాక్ష్యం.

రామాయణంలో రావణాసురుడు చనిపోతాడు. శ్రీరాముడు విభీషణునితో చెప్పి అంత్యక్రియలకు ఏర్పాటు చేయిస్తు మరణాంతాని వైరాణి అంటా డు.ఇది మనసంస్కృతి. బతికున్నంత వరకే వైరం. చనిపోయినవాడిని గురించి చెడ్డగా చెప్పకూడదు.    

 విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు నవల లో భారతీయ సంస్కృతికి పాశ్చా త్య సంస్కృతికి భేదాలను చెప్తా డు. ఒక ఆధ్యాపకుడు  పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్తాడు. వారిలో నలుగురు నదిలో పడి చనిపోతారు.దాంతో టీచర్‌ కూడా తీవ్ర దుఃఖంతో నదిలో దూకి చనిపోతాడు. ఇది విన్న పాశ్చాత్యుడు ‘వాట్‌ ఏ బ్యూటిఫుల్‌ స్టోరీ’ అని స్పందిస్తే, తెలుగు వాడు మాత్రం ‘అయ్యోపాపం’ అని సహానుభూ తి పొందుతాడు. చనిపోవడంలో సౌందర్యాన్ని పాశ్చాత్యుడు చూశా డు. ఆ విషాదం తో సహానుభూతి పొందాడు తెలుగువాడు. ఇది రెం డు జాతుల సంస్కృతుల్లో ఉన్న తేడా. ఇలా సాహి త్యం సాంస్కృతిక  అంశాలను తర్వాతి తరానికి అందిస్తుంది. వాటిని గమనించే ఓపిక, కోరిక మన కుండాలి. అలవోకగా ఎన్నెన్నో అంశాలు ఆశ్చర్యా న్ని, ఆనందాన్ని కలిగిస్తాయి.

- ఆచార్య వెలుదండ నిత్యానందరావు, 

94416 66881


దక్షారామ భీమేశ్వరునికి 

కార్తీక పౌర్ణమి నాడు రాత్రి జ్వాలాతోరణం ఏర్పరుస్తారట. దాని గుం డా దూరి పోతే భక్తుడు యమలోకంలోకి పోడు.  అంటే పుణ్యం వస్తుందని విశ్వాసం. దీన్ని శ్రీనాథుడు ‘కాశీఖండం’లో కూడ ప్రస్తావించాడు. 


logo