గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 01, 2020 , 23:03:08

లోకహిత ముక్తకాలు

లోకహిత ముక్తకాలు

తాను స్పందిస్తూ మన హృదయ స్పందనలను తన వాక్యాలతో గణిస్తాడు. ప్రేమ, కన్నీళ్లు, తడి, పలు ముక్తకాలలో ప్రధాన భూమికలు వహిస్తాయి. పోలికలు ఉపమానాలు పదచిత్రాలు రచనకు ఆలంబనగా తీసుకున్నా వాటి సహజమైన అమరిక వల్ల ఆయా పంక్తుల లక్ష్యాలను ప్రతిఫలించడం విశేషంగా కనిపిస్తుంది.

‘భూమిలో ఎంత నిస్సహాయత / చెట్టులో ఎంత స్వార్థం

పుట్టుక భూమిలోంచే అయినా  / ఆకాశాన్ని అందుకోవాలనే తపన..’

నలభైఏళ్ళు దాటినా ఈ వాక్యం తనకు వార్ధక్యం లేదన్న నమ్మకాన్ని ఇచ్చింది. బతుకంతా వాక్యాన్ని పట్టుకుని మానేరు తీరం వెంట, మనిషి లోపలి మర్మాన్ని పాడుకుంటూ, అక్షరాల చెలిమెలు తోడి గొంతుకలను తడుపుతూ సాగుతున్నాడు వారాల ఆనంద్‌. వాక్యం రసాత్మకం ఎలా అవుతుందో, రసం  అనుభూతి లయగా ఎలా ధ్వనిస్తుందో ఆ రహస్యం ఆనంద్‌కు తెలుసు.

ప్రతీకలతో పోహళింపుల నుంచి, అభివ్యక్తుల ఆర్భాటాల నుంచి, ఛందో బందోబస్తుల నుంచి విముక్తమైన విస్పష్ట భావ వ్యక్తీకరణలను స్వాతి చినుకుల్లా రసహృదయాల్లో వదిలి ‘ము(త్యాల్లా)క్తకాల్లా ’పొదిగాడు వారాల ఆనంద్‌.

బతుకు రుచుల ప్రతిఫలనాలు, సున్నితమైన అనుబంధాల ప్రతిబింబాలు, మనసులను ఉల్లాస భరితం చేసే చమత్కారాలు, అధిక్షేపాన్ని దూసే వ్యంగ్యాలు ఈ ముక్తకాల్లో మెరుస్తాయి.

చంచల స్వభావం ఉన్న మనసు గురించి..

‘గాలి కదలికకో ఆకు సవ్వడికో ఏకాగ్రత చెడితే నేరం మనసుదే 

గాలినో ఆకునో నిందించకు..’ అంటాడు. చాపల్యాన్ని మనసులో దాచుకుని నెపం మరొక దానిపై నెట్టడం స్వభావం అవుతున్న స్థితిని కళ్ళకు కడుతుంది.

‘ప్రేమికుడు అంకెల చిట్టా కాదు జమా ఖర్చు చూడడానికి 

ప్రేమది ఒకేదారి ఇవ్వడమే తెలిసిన రహదారి..’ అంటూ ప్రేమ అంతర్యాన్ని విప్పి చెబుతాడు. ఊపు కోసం ఒక్కొక్క ‘ముక్తకం’లో ప్రాసను ఆశ్రయించినా తూగును ప్రతిపంక్తిలో నిక్షిప్తం చేస్తాడు. కనుకొలకుల్లో తడిని, ఒంటరి తనపు తాత్వికతను, ప్రేమను మరిచిన వెర్రి వెతుకులాటలను లోతుగా తడిమిన వాక్యాలు మనను ఆలోచింపజేస్తాయి.

సంక్షిప్తతా నియమాన్ని అనివార్యంగా కొన్నిచోట్ల అతిక్రమించి, విరామచిహ్నాలులేని ముక్తకాలుగ ప్రదర్శిస్తాడు. అది అటుంచితే.. అంతర్లీనంగా ఒక తాత్విక రహస్యా న్ని, సాత్విక సత్యాన్ని, సౌమనస్య పరిమళాన్ని చివరిదాకా అందిస్తూ సాగిపోతాడు.

తాను స్పందిస్తూ మన హృదయ స్పందనలను తన వాక్యాలతో గణిస్తాడు.

ప్రేమ, కన్నీళ్లు, తడి, పలు ముక్తకాలలో ప్రధాన భూమికలు వహిస్తాయి. పోలికలు ఉపమానాలు పదచిత్రాలు రచనకు ఆలంబనగా తీసుకున్నా వాటి సహజమైన అమరిక వల్ల ఆయా పంక్తుల లక్ష్యాలను ప్రతిఫలించడం విశేషంగా కనిపిస్తుంది.

‘సముద్రం గాంభీర్యమే, నిశ్శబ్దం కాదు నేనూ అంతే 

 ఇద్దరిలోనూ పడి లేచే గుణమూ, నిరంతర రణమూ ఉన్నాయి..’ అంటూ  ఘర్షించే తన స్వభావాన్ని సముద్రంతో పోల్చి చెబుతాడు.

సాలీడు ఆత్మైస్థెర్యాన్ని, ఆత్మవిశ్వాసం బలాన్ని గురించి తెలిపినప్పుడు మనసులో నాటుకునేలా  ఈ ముక్తకాలు చుట్టుకుంటాయి. ద్వేషం గురించి ప్రేమ గురించి తడి గురించి పేర్చిన ముత్యాలు అడుగడుగునా ఎదురుపడుతయ్‌.

‘పూలు ముళ్ళు కుప్ప పోసినట్టు ఎన్ని అనుభవాలో

నేనేమో ఒక్కొక్క పువ్వు ఏరుకుని దాచుకుంటాను  

ఎవరైనా అంతే చేదు అనుభవాలను కూడా పాఠాలుగా స్వీకరించాలి కదా !’

విమర్శను ఆహ్వానించిన అవసరాన్ని, లోపలి ఖాళీలను తెలుసుకోవాల్సిన ఆరాటాన్ని గుర్తెరిగిన కవిగా వారాల ఆనంద్‌ మనిషి స్థితిని, జీవన తాత్వికతను, అనుబంధగంధాల అవసరాన్ని, స్నేహంలో నిజాయితీని కన్నీళ్ళ లోతులను తన అనుభవంలోంచి తోడి మన అనుభవాల ముందు నిలబెడతాడు. ఆలోచింపజేస్తాడు. 

ఈ ముక్తకాలు కేవలం రసాత్మకాలుగానే గాక చక్కని సుభాషితాలుగా, లోకహితాలుగా నిలబడతాయి. సద్వర్తనను నిలబెడతాయి. ఆర్భాటంలేని వాక్యాలతో ఆకట్టుకునే అమరికతో, చక్కటి అనువాదంతో కూర్చినవే ఈ ‘ముక్తకాలు’.

- వఝల శివకుమార్‌, 94418 83210


logo
>>>>>>