శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Mar 01, 2020 , 23:01:12

ఇల్లు

ఇల్లు

ఇల్లంటే..

గోడలు కాదు

వాటి మధ్యన కదలాడే

మమతల నీడలు


ఇల్లంటే..

పాతేసుకున్న కుర్చీలు కాదు

ప్రవహించే విశ్వవిహారాలు

తలుపులు మూస్తే ఎలా!

రెప్పలకు

చూపులే తోరణాలు


ఇల్లంటే..

జననాలూ, పురుటి కేకలు

మరణాలూ

అవధులు లేని రోదనలు,

మూలమూలలా పాకుతున్న

జ్ఞాపకాలు


ఇల్లంటే..

రోదలూ వ్యథలూ

అలవిగాని నిశ్శబ్దాలు


ఇల్లంటే..

సూర్యుడు

అనుమతి కోరే ప్రదేశాలు

చినుకులు

ఎంత ఉరుకులాడినా

అందని సందేశాలు

ఇల్లంటే..

ప్రేమలూ అనురాగాలు

భావుకతను మేల్కొల్పే

నేపథ్య సంగీతాలు


ఇల్లంటే..

ఉద్వేగాలు

ఉద్యమ మూలాలు

అనుకొని పర్యవసానాలు


ఇల్లంటే..

పుస్తకాలు

నిరంతరం

గాలిలో నిండే జ్ఞాన ప్రసారాలు...

- డాక్టర్‌ ఎన్‌.గోపీ


logo