గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 22:37:10

ప్రపంచ మహమ్మారి!

ప్రపంచ మహమ్మారి!

పక్షులు, పందుల నుంచి వచ్చిన వైరస్‌ కొత్త రూపంతో మానవులకు సంక్రమించింది. ఈ విధంగా 2009లో మొదలైన స్వైన్‌ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్నది. భారీ ఫామ్‌లలో హృదయవిదారక పరిస్థితులలో జంతువులను, పక్షులను బంధించి వధిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలున్నాయి. ఆహారాన్ని నెలల కొద్ది నిలువ చేస్తూ ఖండాంతరాలకు సరఫరాకు చేస్తున్న విధానాలు మంచివేనా అనేది సమీక్షించుకోవడం మంచిది. ‘బిగ్‌ ఫామ్స్‌ మేక్‌ బిగ్‌ ఫ్లూ’ అనే వాదన కొట్టిపారేయదగినది కాదు. కరోనా వైరస్‌ భయపెడుతున్న ఈ తరుణంలోనైనా- మానవులు విజ్ఞతతో ఆలోచించాలి.

చైనాలో స్థిరపడిన కరోనా వైరస్‌ దాదాపు యాభై ఇతర దేశాలకు కూడా వ్యాపించడంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా గుర్తించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రపంచ మహమ్మారిగా మారడానికి ఒక అడుగు దూరంలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడాన్ని బట్టి పరిస్థితి ఎంత విషమించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఒక ప్రాంతంలోని అనేకమందిని బలిగొంటూ ఉంటే దానిని మహమ్మారి అంటారు. అది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తమవుతున్నది. చైనాలో నే ఇప్పటివరకు దాదాపు 80 వేల మందికి కరోనా వైరస్‌ సోకిందనీ, 2,788 మంది మరణించారని తెలుస్తున్నది. 


చైనా పారదర్శక వ్యవస్థ కాదు కనుక వాస్తవ సంఖ్య ఎంతో చెప్పలేము. ఈ వైరస్‌ కారణంగా ఇతర దేశాలలో మరో 20 మంది మరణించారు. చైనా తరువాత అతి ఎక్కువగా ప్రభావితమైన దేశం దక్షిణకొరియా. ఇటలీలో కూడా 229 మందికి సోకింది. ఇరాన్‌లో 61 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా గల నైజీరియాలోనూ వైరస్‌ అడుగుపెట్టింది. ఇరాక్‌, కువైట్‌, ఒమన్‌, బహ్రైన్‌ వంటి పశ్చిమాసియా దేశాలలో ఉనికిని చాటుకున్నది. చైనాలో పర్యటించినందుకు మంగోలియా అధ్యక్షుడికే ఏకాంతవాసం తప్పడం లేదు. వైరస్‌ వ్యాప్తిమూలంగా చైనా సమాజం ఎంత ఒత్తిడికి గురవుతున్నదో ఊహాతీతం. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు, కార్యక్రమాలు రద్దవుతున్నాయి. పలుదేశాల్లో షేర్‌ మార్కెట్లు పతనమవుతున్నాయి. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కరోనా వైరస్‌ వ్యాప్తి పెనుముప్పుగా పరిణమించింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే శుష్కించిన ఆర్థికవ్యవస్థలు మరింత ప్రమాదంలో పడవచ్చు.


కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ లేదు. అందువల్ల ఈ వైరస్‌ విస్తరించకుండా ప్రపంచదేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ ఉపశమించేలోగా ఎంతమందిని బలిగొంటుందో తెలువదు. కొంచెం ముందు వెనుకలుగా అంతర్జాతీయ సమాజం ఈ వైరస్‌ విస్తరణను అరికట్ట గలుగుతుందనడంలో సందేహం లేదు. కానీ ఇంతటితో ఇటువంటి వైరస్‌ల విస్తరణ ముగుస్తుందనే భరోసా మాత్రం లేదు. వైరస్‌లు ఎప్పటికప్పుడు మార్పుచెందుతూ వ్యాక్సిన్‌లకు లొం గకుండా సవాలు చేస్తున్నవి. మానవాళిని ఏదో ఒక వైరస్‌ తరచూ పీడిస్తూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు పెరిగిన ఈ కాలంలో వైరస్‌లు తరచూ వ్యాపించడం వల్ల ఆర్థికాది రంగా లు ఇబ్బందుల్లో పడుతున్నాయి. 2003లో సార్స్‌ బెదరగొట్టింది. 2005లో బర్డ్‌ ఫ్లూ వచ్చిం ది. ఎబోలా, స్వైన్‌ఫ్లూ, నిపా వైరస్‌- ఈ విధంగా ఏదో రూపంలో దాడులు సాగుతూనే ఉన్నాయి. 


వ్యాధులకు వ్యాక్సిన్‌లు, మందులు వాడటానికి ఒక హద్దు ఉన్నది. యాంటీ బయాటిక్స్‌ అధికం గా వాడటం వల్ల చివరికి బ్యాక్టీరియా మందుల కు లొంగకుండా మొండిగా మారిపోయింది. ఇప్పుడు వైరస్‌ తనను తాను మార్చుకుంటూ కొత్త రూపాలలో వచ్చి దెబ్బకొడుతున్నది. మున్ముందు ఇదే కరోనా వైరస్‌ మార్పు చెంది మరింత ఉగ్రరూపంలో దాడిచేసినా ఆశ్చర్యం లేదు.ఈ మహమ్మారులను అరికట్టే విషయమై వైద్యరంగానికే పరిమితమై ఆలోచించకూడదు. వైద్య రంగానికి బయట తాత్విక దృష్టితో పరిష్కారాన్ని సాధించాలి. ఆహారతయారీ, రవాణా, నిలువ మొదలైన విధానాల్లో అనుసరిస్తున్న వికృత పోకడలే భిన్న వ్యాధులు ప్రబలడానికి కారణమనే అభిప్రాయం ఉన్నది. 


1980 దశకంలో ఆవులకు శాకాహారం కాకుండా, ఎముకలు, మాంసాన్ని నుజ్జుచేసి ఆహారంగా అందించడం ‘మాడ్‌ కౌ’ వ్యాధి జనించడానికి కారణమైంది. ఆవుల నాడీ వ్యవస్థ దెబ్బతిని చివరకు అది మానవులకూ శాపంగా పరిణమించింది. అమెరికా సరిహద్దులోని మెక్సికో ప్రాంతంలో ఒక ఆహార కంపెనీ భారీ కబేళాను ఏర్పాటుచేసింది. భారీ ఎత్తున పందులను వధించి, మాంసాన్ని ఎగుమతి చేస్తున్నది. ఆ పందుల అవశేషాలను గుట్టలుగుట్టలుగా పడివేయడంతో, ఆహారం కోసం పక్షులు వచ్చిచేరాయి. పక్షులు, పందుల నుంచి వచ్చిన వైరస్‌ కొత్త రూపంతో మానవులకు సంక్రమించింది. ఈ విధంగా 2009లో మొదలైన స్వైన్‌ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్నది. భారీ ఫామ్‌లలో హృదయవిదారక పరిస్థితులలో జంతువులను, పక్షులను బంధించి వధిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలున్నాయి. ఆహారాన్ని నెలల కొద్ది నిలువ చేస్తూ ఖండాంతరాలకు సరఫరాకు చేస్తున్న విధానాలు మంచివేనా అనేది సమీక్షించుకోవడం మంచిది. ‘బిగ్‌ ఫామ్స్‌ మేక్‌ బిగ్‌ ఫ్లూ’ అనే వాదన కొట్టిపారేయదగినది కాదు. కరోనా వైరస్‌ భయపెడుతున్న ఈ తరుణంలోనైనా- మానవులు విజ్ఞతతో ఆలోచించాలి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వ్యవహరించకూడదనే, జంతువుల పట్ల కారుణ్యం చూపాలనే వాదనలను కూడా పట్టించుకోవాలి. 


logo
>>>>>>