శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 22:32:28

వచ్చిండు, పోయిండు

వచ్చిండు, పోయిండు

కశ్మీర్‌ వివాదంపై మధ్యవర్తిత్వం జరుపడానికి రెడీ అని మోదీజీ దోస్తు ట్రంప్‌ పదేపదే అంటున్నారు. భారతదేశానికి ట్రంప్‌ అసలైన, సిసలైన మిత్రుడని మోదీజీ పదేపదే అంటున్నారు. 1954లో ఈ దేశం వచ్చినప్పుడు కృశ్చేన్‌, బుల్గానిన్‌ స్వయంగా కశ్మీర్‌ వెళ్లి ‘కశ్మీర్‌ భారతదేశ అంతర్భాగం’ అని సూటిగా ప్రకటించారు. ఎవరు అసలైన మిత్రులు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీసమేతంగా, కూతురు, అల్లుడు కూడా వెంటరాగా ఇండియా వచ్చిండు, పోయిండు-ఇచ్చింది లేదు, తీసుకపోయిందే ఎక్కువ. రెండురోజుల హంగామా (2020 ఫిబ్రవరి 24, 25) క్షణాల్లో ముగిసింది. ఈ రెం డురోజుల హంగామాలో ఈ దేశ ప్రజలకు, మొత్తం ప్రపంచానికి ప్రధానంగా కనిపించింది ట్రంప్‌-మోదీ దోస్తీ. వారిద్దరు రెండుదేశాల అధినేతల వలె, నాలుగేండ్ల నుంచి మాత్రమే పరిచయం ఉన్న వ్యక్తుల వలె గాక బాల్య మిత్రుల వలె, చిన్నప్పుడు గోలీలు, చిర్రగోనె, గుడుగుడు (చెడుగుడు) ఆడుకున్న, తరగతిలో ఒకే బెంచిమీద నిక్కర్లు తొడుక్కుని కూర్చున్న జిగ్రీ దోస్తుల వలె, లంగోటీయార్ల వలె ఈ రెండురోజు లు అశోక్‌కుమార్‌, అమితాబ్‌బచ్చన్‌ వంటి మేటి నటులు సైతం తలవంచే నటనా నైపుణాన్ని ప్రదర్శించారన్నది అభిజ్ఞుల నిశ్చితాభిప్రాయం. ఈ ఇద్దరు అధినేతల ఆలింగనాలను, ప్రేమానురాగాలను, పరస్పర ప్రశంసలను పరికిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ‘మామిడిచెట్టును అల్లుకున్నది మాధవి లత ఒకటి, ఏమా రెండిటి ప్రేమా సంపద ఇంతింతనలేము...’ అన్న అలనాటి భావగీతం యాదికొస్తున్నది. దాదాపు వందేం డ్ల కిందట ఒక ప్రసిద్ధ భావకవి రచించిన ఈ గీతం ప్రేమ గీతమే.


మొగలు చక్రవర్తి షాజహాన్‌ (అయోధ్యలో మసీదు కట్టించిన బాబర్‌ ముని మనువడు-నాలుగవతరం వాడు) తన ప్రేయసి ముంతాజ్‌ స్మార క చిహ్నంగా ఆగ్రాలో, యమునా నదీతీరంలో నలభై రెండు ఎకరాల నందనోద్యానం మధ్య 17వ శతాబ్దం ప్రారంభంలో తాజ్‌మహల్‌ను నిర్మించాడు. క్రీ.శ. 1632లో ప్రారంభమై తాజ్‌మహల్‌ నిర్మాణం ఇరువై ఏండ్లు కొనసాగి క్రీ.శ.1653లో పూర్తయింది. దాదాపు నాలుగు వందల ఏండ్ల కిందట, భారతీయ సంస్కృతీ వైవిధ్యానికి సౌందర్య నీరాజనంగా నిర్మితమైన తాజ్‌మహల్‌ ప్రపంచంలోని అద్భుతాల్లో ఒకటిగా నేటికీ సామాన్యులను, అసామాన్యులను, సౌందర్య ఆరాధకులను, ధన ఆరాధకులను, అందరిని సమానంగా ఆకర్షిస్తున్నది; తన అధ్యక్ష పదవి ఎనిమిదేండ్ల కాలంలో రెండుసార్లు (2010 లో, 2015లో) ఈ దేశం వచ్చి తాజ్‌మహల్‌ అందాలను తనివితీర ఆస్వాదించిన బరాక్‌ హుస్సేన్‌ ఒబా మా తన పిల్లలు పరీక్షల కారణంగా ఇండియా రాలేకపోయారని, తాజ్‌మహల్‌ను చూడాలన్నవాళ్ల కోరిక నెరవేరలేదని బాధపడ్డాడు.


ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మొన్న టి రెండురోజుల ముప్ఫై ఆరు గంటల పర్యటనలో సబర్మతి గాంధీజీ ఆశ్రమంలో గడిపింది కేవలం 15 నిమిషాలే! ఆ 15 నిమిషాల్లో ట్రంప్‌కు గాంధీజీ జ్ఞాపకం రాలేదు-మోదీజీ తనకు జరుపుతున్న అతిథి మర్యాదల్లో ఒళ్లు మరిచిన ట్రంప్‌కు ఇంకేదీ జ్ఞాపకం రాకపోవడంలో వింత లేదు-ప్రపంచంలోనే అన్నిటికం టే పెద్ద ఆడిటోరియంగా ప్రచారం పొందుతు న్న స్థలంలో లక్ష చిల్లరస భలో (అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు, ఆడిటోరియం వరకు కొన్ని మిలియన్ల మంది తనకు స్వాగతం పలుకుతారని మోదీ జీ అన్నట్లు ట్రంప్‌ వెల్లడించారు). మొన్న మిలియన్లు రాలే దు. 


ఇండియాలోనే మిలియన్ల మంది అప్రయత్నంగా, స్వచ్ఛందంగా వచ్చిన సంఘటనలున్నాయి. కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సభకైనా కనీసం కొన్నిలక్షల మంది రావడం సాధారణ విష యం. జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో, 1954లో, సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నికిటాకృశ్చేవ్‌, అప్పటి సోవియట్‌ ప్రధానమంత్రి బుల్గానిన్‌ ఇండియా వచ్చారు. అప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండా, స్వచ్ఛందంగా మిలియన్ల సంఖ్యలో ఈ దేశ ప్రజ లు ఆ ఇద్దరు కమ్యూనిస్టు నాయకులకు ఘన స్వాగతం పలికిన యదా ర్థం జగద్విదితం. కశ్మీర్‌ వివాదంపై మధ్యవర్తిత్వం జరుపడానికి రెడీ అని మోదీ జీ దోస్తు ట్రంప్‌ పదేపదే అంటున్నారు. భారతదేశానికి ట్రంప్‌ అసలైన, సిసలైన మిత్రుడని మోదీజీ పదేపదే అంటున్నారు. 1954లో ఈ దేశం వచ్చినప్పుడు కృశ్చేన్‌, బుల్గానిన్‌ స్వయంగా కశ్మీర్‌ వెళ్లి ‘కశ్మీర్‌ భారతదేశ అంతర్భాగం’ అని సూటిగా ప్రకటించారు. ఎవరు అసలైన మిత్రులు?


సబర్మతి ఆశ్రమానికి మోదీజీ స్వయంగా వెంట ఉండి తోడ్కొని వచ్చినవారు కమ్యూనిస్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌,ఇజ్రాయెల్‌ ప్రధాని, జపాన్‌ ప్రధాని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. వీరెవరూ అహింసావాదులు కారు,శాంతిప్రియులు కారు, సత్యాన్వేషకులు కారు. అందువల్ల, గాంధీజీ నడిచిన, జీవించిన ఈ స్థలం అపవిత్రమైందని, శుద్ధి అవసరమని భావించేవారున్నారు. గాంధీజీ ఇదే ఆశ్రమం నుంచి ఉప్పు సత్యాగ్రహం వంటి మహత్తర సత్యాగ్రహ కార్యక్రమాలను నిర్వహించారు.


అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమంలో 15 నిమిషాలు గడిపిన పిదప ట్రంప్‌నకు ఆ ఆశ్రమం నుంచి (1915లో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం రాగానే గాంధీజీకి సత్యాగ్రహ కేంద్రంగా సబర్మతి ఆశ్రమం స్థాపన ఆలోచన అంకురించింది) భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సారథ్యం వహించిన గాంధీజీ జ్ఞాపకం రాలేదు; తర్వాత, సర్దార్‌ పటేల్‌ ఆడిటోరియంలో ఇరువై ఐదు నిమిషాలు తప్పుల తడక ప్రసంగం చేసిన ట్రంప్‌ లక్ష చిల్లర మందిని చూసి ముగ్ధుడైనాడు, తన మిత్రుడు మోదీజీని మెచ్చుకున్నా డు. కానీ ట్రంప్‌నకు సర్వార్‌ పటేల్‌ జ్ఞాపకం రాలేదు. భూగోళం, చరిత్ర, సారస్వతం, సంస్కృతి, ఉద్యమాలు, రాజకీయాలు, వర్తమాన విషయా లేవీ తెలియని ట్రంప్‌నకు గాంధీజీ, సర్దార్‌పటేల్‌ ఎందుకు జ్ఞాపకం వస్తా రు? 70 ఏండ్ల భారత ప్రగతి గురించి ప్రస్తావించిన ట్రంప్‌నకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఎందుకు జ్ఞాపకం వస్తాడు? మోదీజీ ఆవహించిన ట్రం ప్‌నకు ఈ దేశం చరిత్ర ప్రాచీనమైనదన్న సంగతి తెలియదనుకోవాలె! కనీ సం మోదీజీ ప్రభుత్వ విదేశాంగశాఖ వారైనా, అమెరికాలోని భారత రాయబారి అయినా, అమెరికాలో గత సెప్టెంబర్‌లో హౌడీ-మోదీ ప్రచా ర కార్యక్రమం ఏర్పాటుచేసిన వారైనా ట్రంప్‌నకు భారత చరిత్ర గురించి చెప్పవలసింది-ఒక రియల్‌ ఎస్టేట్‌ వర్తకుడికి భారత చరిత్ర తెలుస్తుందనుకోలేం. యూఎస్‌ఏ రాజకీయాలు, చరిత్రతోనైనా ఎన్నడూ సంబంధం లేని వర్తక శిఖామణి ట్రంప్‌.


ఈ దేశానికి, ముఖ్యంగా స్వతంత్ర భారత దేశానికి విదేశీ అధినేతలు, ప్రముఖులు రావడం ఇది మొదటిసారి కాదు-చివరిసారి కాబోదు. రెం డవ ప్రపంచయుద్ధం చివరి దశలో-1942లో యూఎస్‌ఏలో అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌. గాంధీజీ సారథ్యంలోని భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అం డగా నిలిచినవాడు, భారత స్వాతంత్య్రం కోసం అప్పటి బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌పై ఒత్తిడి తెచ్చినవాడు రూజ్‌వెల్ట్‌. స్వతంత్ర భారతానికి వచ్చిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌ రెండవ ప్రపంచయుద్ధంతో గొప్ప సేనానిగా ప్రసిద్ధి పొందాడు. ఒబామా గాంధేయవాది. ఇం డియన్‌ పార్లమెంటులో ప్రసంగిస్తూ ఒబామా మొదట గాంధీజీకి ఘనం గా శ్రద్ధాంజలి ఘటించాడు. తన నేటి ఉన్నత స్థానానికి గాంధీ సిద్ధాంతాలు దోహదపడ్డాయని ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఒబామా భారత పార్లమెంటులో ప్రకటించడం విశేషం.


 ఒబామా భారతదేశానికి అప్పుడు వీడ్కో లు పలుకుతూ భారత రాజ్యాంగంలోని సమానత్వహక్కుల గురించి జ్ఞాపకం చేశాడు. మత సామర స్యం కొరవడితే ఈ దేశానికి ప్రమాదం తప్పదని ఆ రోజే ఆయన చేసిన హెచ్చరిక గమనార్హమైనది.సబర్మతి ఆశ్రమానికి మోదీజీ స్వయంగా వెంట ఉండి తోడ్కొని వచ్చినవారు కమ్యూనిస్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని, జపాన్‌ ప్రధాని, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. వీరెవరూ అహింసావాదులు కారు, శాంతిప్రియులు కారు, సత్యాన్వేషకులు కారు. అందువల్ల, గాంధీజీ నడిచిన, జీవించిన ఈ స్థలం అపవిత్రమైందని, శుద్ధి అవసరమని భావించేవారున్నారు. గాంధీజీ ఇదే ఆశ్రమం నుంచి ఉప్పు సత్యాగ్రహం వంటి మహత్తర సత్యాగ్రహ కార్యక్రమాలను నిర్వహించారు. గాంధీజీతో పాటు ఇదే స్థలంలో ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ప్రపంచ ప్రసిద్ధి పత్రికా రచయితలు లూయిఫిషర్‌, జాన్‌గంధర్‌, విన్సెంట్‌షీన్‌ వంటివా రు నడిచారు. ఇది అబద్ధ ప్రకటనలు వెలువడిన చోటు కాదు.


ఇక్కడే పటేల్‌ స్టేడియంలో ప్రసంగిస్తూ ట్రంప్‌ ఇస్లామిక్‌ టెర్రరిజానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. ఒకవంక కరడుగట్టిన మతోన్మాదులు తాలిబాన్లతో రాజీ ఒప్పందం కోసం పాకిస్థాన్‌ సహాయంతో ప్రయత్నిస్తున్న ట్రంప్‌ సబర్మతి నేలపై అబద్ధాలాడటం సమంజసం కాదు. ట్రంప్‌ వచ్చిండు, పోయిండు-తీసుక పోయిండు గానీ ఇచ్చిందే మీ లేదు. బ్రిటి ష్‌ పాలకులు రెండు వందల ఏండ్లలో చేసింది ట్రంప్‌ రెం డురోజుల్లో చేయగలిగాడు. రెండు రోజుల ట్రంప్‌ యాత్రను విశ్లేషిస్తూ యాదగిరి ‘ఇది నా ఎన్ను నువు గోకు, నీ ఎన్ను నేను గోకుతా కార్యక్ర మం’ అని అన్నాడు. మరింత సూటిగా చెప్పాలంటే ఇది స్వీయమర్దనం, పరస్పర మర్దనం, విహారయాత్ర. ఈ సంవత్సరం నవంబర్‌లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న ట్రంప్‌, ‘అమెరికా అమెరికన్లదే’ అన్న సంకుచిత నినాదంతో ఒకసారి గెలిచిన, మరోసారి గెలువాలనుకుంటున్న ట్రంప్‌ భారతదేశానికి ఏదో ఇచ్చిపోతాడనుకోవడం పొరపాటు. ఎన్నికల్లో గెలువడం కోసమే ట్రంప్‌ అమెరికాలోని భారతీయుల హక్కుల గురించి (హెచ్‌-1 వీసా తదితర హక్కులు) కచ్చితంగా ఏమీ మాట్లాడలేదు.


logo