శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 28, 2020 , 00:05:15

‘పురో’భివృద్ధి

‘పురో’భివృద్ధి

ఆధునికమైనవిగా చెప్పుకుంటున్ననగరాల్లో వసతులు లోపించడం వల్ల జనజీవనం దుర్భరంగా మారుతుంది. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు భారీగా సాగుతూ ఉంటాయి. భవిష్యత్‌ పరిస్థితులను అంచనా వేసి ఇప్పటినుంచే తగు ఏర్పాట్లు చేసుకోకపోతే నగర సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇప్పటికే నరకాలుగా మారిన నగరాలను మళ్ళా నివాసయోగ్యంగా మార్చడానికి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగుతుండటం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహరచనకు అనుగుణంగా పురపాలక మంత్రి కేటీఆర్‌ ముం దుండి  ఈ కార్యక్రమాన్ని నడుపుతుండటంతో- క్షేత్రస్థాయిలో నాయకులు, అధికారులు, ప్రజలు భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం పదిరోజుల కార్యక్రమంగా చేపట్టినా, దీనిని నిరంతర ప్రక్రియగా చెప్పుకోవచ్చు. నగరాల నిర్వహణలో, ప్రజల జీవనసరళిలో భారీ మార్పులకు ఈ కార్యక్రమం నాంది పలుకుతుంది. ప్రజాప్రతినిధులు ముందుండి నడిపించడం, స్థానిక నాయకత్వం లో, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, ప్రజలను వివిధ అంశాలపై చైతన్యవంతం చేసి భాగస్వాములుగా మార్చడం దిశగా ఈ కార్యక్రమంగా సాగుతున్నది. 


మహబూబ్‌నగర్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్‌ ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ నాయకులను, అధికారులను, ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. నగరాలు పరిశుభ్రంగా, వసతులతో కూడి ఉండటమనేది కేవ లం ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. నిధులు కేటాయించినంత మాత్రాన తీరేది కాదు. అది ప్రజల జీవన సంస్కృతికి సంబంధించినది. ప్రజలలో చైతన్యం తేవడం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. అందువల్లనే కేటీఆర్‌ జిల్లాలు తిరుగుతూ, పాదయాత్రలు చేస్తూ, ప్రజలను పలుకరిస్తూ ఉత్తేజితులను చేస్తున్నారు. 12 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలలో ఈ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది.


గ్రామస్థాయిలో అమలుకు నోచుకోకపోతే, ఢిల్లీ స్థాయిలో ఎన్ని పథకాలు రచించినా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానికి వివరించారు. గ్రామస్థాయి నాయకులు తమకు కేటాయించిన నిధులను వినియోగించుకొని చేతులు దులుపుకొనే పరిస్థితులు ఉండకూడదు. అందుకనే మొదట పల్లె ప్రగతిపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ కొనసాగింపుగా పట్టణ ప్రగతిని చేపట్టింది. దేశవ్యాప్తంగా నగరాల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. సమీప పల్లెలన్నీ కలిసిపోతున్నప్పుడు రహదారులను ప్రణాళికాబద్ధంగా నిర్మించ రు. మంచినీటి, మురికి పారుదల వసతులను తగిన స్థాయిలో కల్పించరు. పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతుంటాయి. పారిశుధ్య వసతులను పట్టించుకోరు.


పల్లెల్లో ఏది ఉన్నా లేకపోయినా సంప్రదాయబద్ధం గా రూపొందిన జీవనసరళి ఉంటుంది. ఆధునిక వసతులు లేనప్పటికీ అదొక లోపంగా కనబడదు. కానీ ఆధునికమైనవిగా చెప్పుకుంటున్న నగరాల్లో వసతు లు లోపించడం వల్ల జనజీవనం దుర్భరంగా మారుతుంది. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు భారీగా సాగుతూ ఉంటాయి. భవిష్యత్‌ పరిస్థితులను అంచ నా వేసి ఇప్పటినుంచే తగు ఏర్పాట్లు చేసుకోకపోతే నగర సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇప్పటికే నరకాలుగా మారిన నగరాలను మళ్ళా నివాసయోగ్యంగా మార్చడానికి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకాలం పేరుకుపోయిన సమస్యలను ఈ కార్యక్రమంలో భాగంగా  గుర్తించి పరిష్కరిస్తున్నారు. వసతులను మెరుగుపరచడంతోపాటు పచ్చదనాన్ని పెంచడానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు నిధుల కొరత లేకుండా చూడటం మరో విశేషం. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా వ్యవహరిస్తే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా నగరాల నిర్వహణలో భారీ మార్పులు రాబోతున్నాయని నగరపాలన ప్రణాళికావేత్తలు చెబుతున్నారు. గృహనిర్మాణాల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. నీటిని, ఇంధనాన్ని పొదుపు చేసే విధానాలు వస్తాయి. చెత్త, మురుగునీరుతో పాటు ఏదీ వృథాగా వదలడం జరగదు. వ్యక్తిగత వాహనాల కన్నా మాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు ప్రాధాన్యం పెరుగవచ్చు. వైపరీత్యాలను తట్టుకునేవిధంగా నగరాలను తీర్చిదిద్దవలసి వస్తుంది. ‘స్మార్ట్‌ సిటీ’భావన కూడా బలపడుతున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నగర నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ తెచ్చే మార్పులు జీవనసరళిని మారుస్తాయి. కృత్రిమ మేధ వంటి కొత్త సాంకేతికత ను వినియోగించడం వల్ల నగర జీవనంలో భారీ మార్పు వస్తుంది. వాహనాల మధ్య సమన్వ యం నెలకొని ట్రాఫిక్‌ రద్దీ, సిగ్నల్‌ విధానాలు మచ్చుకు కూడా కనిపించవని నిపుణులు అంటున్నారు. 


కాలనీల నిర్వహణ, భద్రత కూడా కొత్త పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాలలో ఇంతగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటే మనం ఇంకా చెత్త చెదారం ఏరిపారేసే దశలోనే ఉండకూడదు. తొందరగా జీవన విధానాలను మెరుగుపరుచుకొని, తాజా సాంకేతికతను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ఏర్పడకముందు రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి తో వ్యవహరించక పోవడమే ప్రధాన సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ పట్టణాల అభివృద్ధి విషయమై దూరదృష్టితో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. దీనికి అనుగుణంగా అధికార బృందం కూడా అలసత్వం లేకుండా చురుగ్గా వ్యవహరించాలి. ప్రజలు కూడా మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై నగరజీవనాన్ని సుఖమయంగా చేసుకోవాలి.


logo