సోమవారం 30 మార్చి 2020
Editorial - Feb 26, 2020 , 23:43:38

ఈ పాపం ఎవరిది?

ఈ పాపం ఎవరిది?

ఏదైనా వివాదాంశంపై భిన్నాభిప్రాయాలు ఉండటం సాధారణం. నిరసన ప్రదర్శనలు కూడా సాగుతుంటాయి. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం గల రాజకీయ పక్షాలు ముందుకువచ్చి, భయాందోళనలతో ఉన్న వర్గాలకు భరోసా ఇవ్వాలి. పార్లమెంటరీ పద్ధతిలో పరిష్కారం లభిస్తుందనే నమ్మకం కలిగించాలి. ఆందోళనకారుల తరఫున బాధ్యత తీసుకొని చర్చలు సాగించాలి. కానీ జాతీయపక్షమైన కాంగ్రెస్‌, స్థానికంగా బలంగా ఉన్న ఆప్‌ వ్యవహరించిన తీరు సంతృప్తికరంగా లేదు.

రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో మూడురోజుల పాటు పెచ్చరిల్లిన హింసావిధ్వంసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విద్వేషదాడుల్లో ఇరువై మందికి పైగా మరణించగా, దాదాపు మూడు వందల మంది గాయపడ్డారు. గూఢచార విభాగం యువ అధికారి ఒకరు కూడా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సాధారణంగా ఘర్షణలు లేదా దాడులు సాగినప్పుడు చేతికందిన కర్రలు, కత్తులు వినియోగిస్తారు. కానీ ఈ దాడుల్లో అనేకమందికి బుల్లెట్‌ గాయాలు కావడం దిగ్భ్రాంతికరం. మరణించిన వారిలో దాదాపు పది మందికి బుల్లెట్‌ గాయాలున్నాయి. దీనిని బట్టి మారణాయుధాలు సంఘ విద్రోహశక్తుల దగ్గర ఏమేర చేరాయో అర్థం చేసుకోవచ్చు. 


కొంతమందిపై యాసిడ్‌ దాడులు జరిగాయి. దుండగులు పోలీసులపైనే పెట్రోలు బాంబులు విసిరారు. ఇనుప చువ్వలు, కర్రలు చేతబూని, హెల్మెట్లు పెట్టుకొని, గుంపులుగా వచ్చి సాగించిన దాడులను గమనిస్తే, ఇవి అనుకోకుండా పెల్లుబికినవి కావని, పథకం ప్రకారం సాగిన దాడులని అర్థమవుతున్నది. పారా మిలిటరీ, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌ దళాలను రంగంలోకి దింపి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. రాజధాని ఢిల్లీలోనే, అధికారపీఠాలకు సమీపంలో ఇంత హింస, విధ్వంసం చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించాలి. నిప్పు రాజేసింది ఎవరైనా కావచ్చు. అవకాశం దొరికితే హత్యలు, విధ్వంసాలు సాగించడానికి సంఘ విద్రోహశక్తులు కాచుకొని ఉంటాయి. అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా శాంతి భద్రతలను, సామరస్య జీవనాన్ని కాపాడటం తమ బాధ్యతగా అన్నివర్గాలూ గుర్తించాలి.


దేశంలో పాదుకొని ఉన్న ప్రజాస్వామిక, రాజ్యాంగవ్యవస్థలకు ఇటువంటి ఘటనలు పరీక్ష వంటివి. శాసనసభ్యులు, పరిపాలన యం త్రాం గం, న్యాయస్థానం, రాజకీయపక్షాలు మొదలైన వ్యవస్థలన్నీ చట్టబద్ధపాలనను, ప్రజల హక్కుల ను, సామరస్య జీవనాన్ని పరిరక్షించడంలో క్రియాశీలంగా వ్యవహరించాలి. ఒక వ్యవస్థ విఫలమైనా ఇతర వ్యవస్థలు అప్రమత్తం కావా లి. ఢిల్లీలో హింసాకాండ సందర్భంగా హైకోర్టు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమైనది. ఈ అల్లర్ల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో, న్యాయస్థానం తీవ్రంగా స్పందించి ప్రజలను రెచ్చగొట్టిన నాయకులపై చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. పౌరసత్వ సవరణ చట్టం పై వ్యతిరేక ప్రదర్శనలకు ఢిల్లీ కేంద్ర బిందువైం ది. 


ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా రాజకీ య నాయకులు ఈ వివాదాన్ని ఉపయోగించుకోవడానికి యత్నించారు. దానికి కొనసాగింపు గానే తాజా విద్వేషదాడులు, విధ్వంసాలు చోటు చేసుకున్నాయనే అభిప్రాయం కూడా ఉన్నది. అందువల్లే ఈ మొత్తం ఉదంతంలో రెచ్చగొట్టేవి ధంగా వ్యవహరించిన నలుగురు బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. కపిల్‌మిశ్రాతో పాటు అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మ, అభయ్‌ వర్మపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. విధ్వంసాలకు పాల్పడినవారందరిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వీరు విద్వేష ప్రసంగాలు చేసిన దృశ్యాలు టీవీ చానెల్స్‌లో ప్రసారమయ్యాయి. కపిల్‌ మిశ్రా ముందుండి విద్వేషదాడులు సాగిస్తుంటే, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారనే ఆరోపణ ఉన్నది. అభయ్‌ వర్మ ‘గోలీ మారో...’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణ ఉన్నది.


ఢిల్లీ అల్లర్ల తీరును పరిశీలిస్తే రాజకీయవ్యవస్థ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనబడుతున్నది. ఢిల్లీ హైకోర్టు చర్యలకు ఆదేశించిన నలుగురు నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందినవారు. కపిల్‌ మిశ్రా గతంలో బీజేపీ ఎమ్మెల్యే, ఇప్పటికీ ఢిల్లీలో ప్రముఖ నాయకుడు. పర్వేశ్‌ వర్మ లోక్‌సభసభ్యుడు. అభయ్‌ వర్మ పార్టీ తరఫున శాసనసభ్యుడి గా ఎన్నికయ్యారు. ఇక అనురాగ్‌ఠాకూర్‌ కేంద్ర మంత్రి. హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి  ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ కుమారుడు. రాజకీయ కుటుంబం నుంచి ఎదిగివచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో, పార్లమెంటులో వాజపేయి ప్రసంగాలు విన్నవారికి వీరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. 


ఒక బీజేపీ మాత్రమే కాదు, మిగతా రాజకీయపక్షాల నాయకత్వాలు కూడా  పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన విషయంలో ఆశించిన రీతిలో వ్యవహరించాయా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదైనా వివాదాంశంపై భిన్నాభిప్రాయాలు ఉండటం సాధారణం. నిరసన ప్రదర్శనలు కూడా సాగుతుంటాయి. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం గల రాజకీయ పక్షాలు ముందుకువచ్చి, భయాందోళనలతో ఉన్న వర్గాలకు భరోసా ఇవ్వాలి. పార్లమెంటరీ పద్ధతిలో పరిష్కారం లభిస్తుందనే నమ్మకం కలిగించాలి. ఆందోళనకారుల తరఫున బాధ్యత తీసుకొని చర్చలు సాగించాలి. కానీ జాతీయపక్షమైన కాంగ్రెస్‌, స్థానికంగా బలంగా ఉన్న ఆప్‌ వ్యవహరించిన తీరు సంతృప్తికరంగా లేదు. రాజకీయపక్షాలు, శాంతిభద్రతల యంత్రాంగం విశ్వసనీయత కోల్పోయేరీతిలో వ్యవహరించడం దేశానికి, సమాజానికి ఎంత నష్టదాయకం!


logo