శనివారం 28 మార్చి 2020
Editorial - Feb 26, 2020 , 22:50:11

ఆర్య-ద్రవిడ యుద్ధమూ తెస్తారా?

ఆర్య-ద్రవిడ యుద్ధమూ తెస్తారా?

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల భైంసాను సందర్శించినప్పుడు రాష్ట్ర బీజేపీ ఎంపీ ఒకరు అక్కడ జరుగుతున్నది శివాజీ-ఔరంగజేబ్‌ల యుద్ధమన్నారు. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడేవారు కొన్ని ఆలోచిస్తున్నట్లు లేరు. బీజేపీ దక్షిణాదికి వ్యాపించే ప్రయత్నాలను కొందరు ద్రవిడ భూమిపై ఆర్యుల దండయాత్రగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వర్గం ఔరంగజేబు అంటూ మరొకవర్గం ఆర్యులంటూ చరిత్ర పొరలను తవ్వుతూపోతే దేశ ఐక్యత పటిష్టమవుతుందా లేక విచ్ఛిన్నమవుతుందా? అందరూ చేయవలసింది జాతి నిర్మాణమా లేక దేశ విచ్ఛిత్తికి దారులు వేయటమా?

ఏ పార్టీకైనా, వర్గాలకైనా తమ సిద్ధాంతాలు, రాజకీయ ప్రయోజనాలు తమకుండవచ్చు. అందుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేయవచ్చు. కానీ అందుకు కొన్ని పరిమితులను పాటించకుండా యథేచ్ఛగా వ్యవహరించినట్లయితే అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. బీజేపీ ఎంపీ ప్రస్తావించిన శివాజీ-ఔరంగజేబుల విషయం ముందుగా చూద్దాం. ఆ ఘటనలన్నీ వాస్తవాలు. మన చరిత్రలో ఒక భాగం. ఒక దేశపు వందలు, వేల ఏండ్ల చరిత్రలో ఇటువంటి పొరలు అనేకం ఉంటాయి. ఆ విధమైన పొరల్లో ఆర్యుల దండయాత్ర (లేదా వలసలు) పొర కూడా ఒకటి. మొదటిది వందల ఏండ్ల కిందటిది అయితే రెండవది వేల ఏండ్ల కిందటిది. ఇటువంటివి ఇంకా అనేక పొరలు ఇటీవలి బ్రిటిష్‌ ఆక్రమణ వరకు భారతదేశ సుదీర్ఘ చరిత్రలో కలగలిసి భాగమైపోయాయి. 1947తో ఒక సరికొత్త భారతదేశం ఆవిష్కారమైంది. ఒక ఆధునికమైన, ప్రజాస్వామికమైన దేశ నిర్మాణానికి యావత్‌ ప్రపంచంలోనే ఎక్కడాలేని ఇంతటి మహా వైవిధ్య భూమిలో ఒక ఐక్యజాతి నిర్మాణానికి 1947లో నాంది జరిగింది.


దేశ చరిత్ర ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త మలుపు తిరిగిన తర్వాత ఇక శివాజీ-ఔరంగజేబులు, ఆర్యులు, బ్రిటిష్‌ వలసపాల న వంటి పొరలకు గడిచిపోయిన చారిత్రక విలువ తప్ప సజీవమైన విలు వ ఎంతమాత్రం ఉండదు. చారిత్రక విలువ అంటే అర్థం గతం నుంచి పాఠాలను నేర్చుకొని వర్తమానానికి పాజిటివ్‌ పద్ధతిలో అన్వయించుకోవటం. ఇక్కడ సజీవ విలువ అంటే లేదా సజీవ సంబంధం అంటే అర్థం గతాన్ని నెగిటివ్‌గా కెలుకుతూ వర్తమాన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకొనజూడటం. ఈ నెగిటివిజం ఆ పనిచేసే శక్తులకు ఎంత ఉపయోగపడేదీ తెలియదు గాని, ఆధునిక-ప్రజాస్వామిక దేశానికి, ఐక్యజాతి నిర్మాణానికి మాత్రం దోహదం చేయకపోగా హాని కలిగిస్తుంది. 


ఏ దేశ చరిత్రలోనైనా ఇటువంటి ప్రశ్నలు సుప్తభుజంగాలు. వాటిని కదిలిస్తే కాటు వేయగలవు. ఆయా విషయాలను అకడమిక్‌గా అధ్యయనం చేయ టం వేరు, రాజకీయంగా ఉపయోగించుకొనచూడటం వేరు. అయితే ఒకటి చెప్పుకోవాలి. ఆర్య జాతి భావన ఆధిపత్య భావన కాగా, ద్రవిడ భావన అటువంటి ఆధిపత్య భావనపై ప్రతిఘటనగా, తమ అస్తిత్వంతో ఆత్మగౌరవంతో ముడిపడినదిగా వ్యక్తమవుతుంటుంది. వర్తమాన స్థితి లో తమ ఫెడరల్‌ హక్కులతో సంబంధం గలదిగా ప్రదర్శితమవుతుంటుంది. ఆ పరిమితులకు మించి తొలిదశ ద్రవిడ ఉద్యమం వలె స్వతం త్ర ద్రవిడనాడును కోరటం మాత్రం చరిత్ర పొరలను హానికరమైన రీతి లో తవ్వచూడటం అవుతుంది.


దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లో, తూర్పున కూడా ఆర్య-ద్రవిడ వైరుధ్యం ఒక భావజాలంగా నేటికీ ఉన్నమాట నిజం. భాష, సంస్కృతి, రాజకీయ ఆధిపత్యాల విషయాల్లో ఈ భావజాలం స్వాతంత్య్రం తర్వా త కూడా ఏదో ఒక స్థాయిలో కొనసాగుతూ వస్తున్నదని తెలిసిందే. కేం ద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. బీజేపీ ఆర్యశక్తుల ప్రతినిధి అని, భారతదేశాన్ని తమ వశం చేసుకునేందుకు క్రీస్తు పూర్వకాలం నుంచి ఈ శక్తులు సాగిస్తూ వస్తున్న ప్రయత్నాలలో భాగమే దక్షిణాదివైపు బీజేపీ విస్తరణ అని నమ్మి వాదించేవారు చాలామందే ఉన్నారు. 


ఈ నమ్మకాలను బలపరిచేందుకా అన్నట్లు రెం డవ వైపు ఏమి జరుగుతున్నది? ఉదాహరణకు తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి కావటాన్ని ద్రవిడ భావనల పరాజయంగా, ఆమె మరణాన్ని ద్రవిడశక్తుల విజయంగా సంఘ్‌పరివార్‌ సానుభూతిపరులు బాహాటంగా వ్యాఖ్యానించారు. కొత్తగా రజనీకాంత్‌ రాక తిరిగి తమకు ఆశాకిరణమని పరివార్‌ సానుభూతిపరులంటున్నారు. ప్రస్తుతం డీఎంకే కు, బీజేపీకి మధ్య రగులుతున్న వైరానికి ద్రవిడ-ఆర్య వైరుధ్యం ఒక కారణమనే భావన ఉన్నది. ఇటీవలికాలంలో పరివారీయులు రామస్వా మి నాయకర్‌తో సహా కొందరు ద్రవిడ హీరోలపై వ్యాఖ్యలు చేయటం, వారి విగ్రహాలను మలినపరుచటం తెలిసిందే. హిందీ-ద్రవిడ భాషల నిరంతర వైరుధ్యం ఈ స్థితికి మరొక ఉదాహరణ.


ఇటువంటి ద్రవిడ భాషా-సంస్కృతీపరమైన ఉదంతాలే కర్ణాటక, కేరళలోనూ తరచూ జరుగుతున్నాయి. వాటినన్నింటిని ఇక్కడ పేర్కొనవలసిన అవసరం లేదు గాని రెండు విషయాలు చెప్పుకోవాలి. రెండేండ్ల కిందట పార్లమెంటులో వామనుడు-బలిచక్రవర్తి ప్రస్తావన రాగా, వెంట నే కేరళలో వామనుడు ఆర్యులకు ప్రతినిధి అని, స్థానిక ద్రవిడుడు అయి న బలిచక్రవర్తిని అణిచివేశాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తమ ఆదివాసీ రాజైన హిరణ్యకశిపుడిని ఆర్యులు అణిచివేశారని బెంగాల్‌, బీహార్‌, ఒడిషా, ఝార్ఖండ్‌ సంతాల్‌ జాతులు వాదించాయి. వారు హిరణ్యకశిపుడిని ఇప్పటికీ తమ ప్రాచీన రాజుగా కొలుస్తున్నారు. 


ఇదొకటి కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార పత్రిక ‘పాంచజన్య’ సంపాదకునిగా ఉండిన తరు ణ్‌ విజయ్‌, మనలో జాతి వివక్ష ఉన్నట్లయితే నల్లవారైన దక్షిణ భారతీయులతో ఎట్లా సహజీవనం చేస్తున్నామంటూ కొంతకాలం కిందట బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇందులో మనం అంటే తెల్లవాళ్లం, ఆర్యులమని, దక్షిణాత్యులు నల్లవారంటే ద్రావిడులనే అర్థాన్ని వెంటనే అందరూ చెప్పుకున్నారు. దానిపై వివాదమైంది.  తాజాగా మోదీ ప్రభు త్వం పౌరసత్వ చట్టం నుంచి శ్రీలంక తమిళులను మినహాయించటం ఎందుకని ఈ ద్రవిడ భావజాలవాదులు ప్రశ్నిస్తున్నారు. కొన్నేండ్ల కిం దట ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు అకడమీషియన్లు ఆర్య-ద్రవిడ అంశంపై చర్చ జరిపారు.


భారతదేశ చరిత్ర పొరలలోని ఒకానొక పొరలో గల శివాజీ-ఔరంగజేబు అంశాన్ని బీజేపీ తన ప్రయోజనాల కోసం తవ్వి తీయదలచుకుంటే, మరొకరు అంతకన్న వెనుకటి పొరల్లోకి వెళ్లి ఆర్య-ద్రవిడ అంశాన్ని ముందుకుతేవటంలో ఆశ్చర్యపడదగింది ఉండదు. ఆర్యులు బయటివారన్న అనేకానేకుల్లో సాక్షాత్తూ బాలగంగాధర్‌ తిలక్‌ ఉన్నారు. ఇటీవలి సంవత్సరాల శాస్త్రీయమైన డీఎన్‌ఏ పరీక్షలు కూడా దాన్ని ధృవీకరించాయి. కానీ పైన అనుకున్నట్లు భారతీయ సమాజం ఈ దశలనన్నీ గడిచిపోయి ఆధునిక, ప్రజాస్వామిక జాతి నిర్మాణ దశలోకి అడుగుపెట్టింది.


చరిత్ర గుర్తుండటం సహజం. గుర్తుండాలి కూడా. కాని పైన అనుకున్నట్లు చరిత్రలో అనేక పొరలుంటాయి. మంచిచెడులు గాని, వైరుధ్యాలు గాని ఆ పొరలలో నిక్షిప్తమవుతాయి. ఆ పొరలలో, అనుభవాలలో గల మంచిని మానవ సమాజం ఒకతరం నుంచి మరొక తరానికి వారసత్వంగా ఇచ్చుకుంటూ పోతుంది. చెడు క్రమంగా వెనుకబడుతుంది. అట్లాగే జరుగాలి కూడా. అదే మానవ సమాజపు విజ్ఞత, వికాసశీలత. ఆ క్రమంలో భారతీయులకు ఒక మహత్తరమైన మలుపు, అవకాశం 1947లో లభించింది. అంతవరకు వేల ఏండ్ల కాలంలో సంస్కృతి పరంగా ఒక భావనరూపంలో తప్ప రాజకీయంగా, భౌగోళికంగా ఒక స్థిరమైన భారతదేశం అంటూ లేదు. 


అశోక చక్రవర్తి, మొఘల్‌ చక్రవర్తు లు ఇంచుమించు ఉపఖండాన్ని అంతా పాలించనైతే పాలించారు గాని ఫ్యూడల్‌ రాచరికాలు ఎప్పుడైనా తాత్కాలిక ప్రాతిపదికగలవే తప్ప ఆధునిక దేశాల వలె సుస్థిర ప్రాతిపదికలు గలవి కావు. జాతి ఐక్యతలు లేక, చరిత్రలో అనేక పొరలుగల సమాజాలకు దేశ స్వాతంత్య్రాలు ఒక సరికొత్త మలుపు అయ్యాయి. రకరకాల అస్థిరతల నుంచి జాతి నిర్మాణం అన్నది వారి అజెండాపైకి కొత్తగా వచ్చి చేరింది. జాతి భావన వేరు, జాతీయతా భావన వేరు. జాతీయత అన్నది ప్రకోపించి కొమ్ములు మొలిచి ఫాసిజం, నాజీయిజంగా మారి ఒకే దేశంలోని ఇతర వర్గాలను నిర్మూలించబూనింది. 


ఇదంతా భారత స్వాతంత్య్రోద్యమకాలంలోనే నాయకులు స్పష్టంగా అర్థం చేసుకున్న విషయం. అందుకే వారంతా దేశ భౌగోళిక ఐక్యత, రాజకీయ ఐక్యత, జాతి భావనల ఐక్యత, అభివృద్ధి ద్వారా ఐక్యత అనే లక్ష్యాల కోసం తమ కృషిని ఆరంభించారు. జాతి నిర్మాణం అన్నది 1940లు, 1950లు, 1960లలో ఇండియాలోనే గాక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మాజీ వలసదేశాల్లో సాగిన ఒక పెద్ద చర్చ. భారతదేశంలో జాతి నిర్మాణం మొదలైనా నేటికీ ఇంకా పూర్తికాలేదన్నది పలువురి అభిప్రాయం. ఢిల్లీలో జరుగుతున్న తాజా హింసపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానిస్తూ ఇది ‘ఒక జాతిగా మనమెంత సున్నితమైన స్థితిలో ఉన్నామో గుర్తుచేసే బాధాకర పరిణామం’ అన్న మాట కూడా భారత జాతి నిర్మాణంలోని సంక్లిష్టతను, నాయకత్వం బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరాన్ని సూచిస్తున్నది.


భారతదేశ చరిత్ర పొరలలోని ఒకానొక పొరలో గల శివాజీ-ఔరంగజేబు అంశాన్ని బీజేపీ తన ప్రయోజనాల కోసం తవ్వి తీయదలచుకుం టే, మరొకరు అంతకన్న వెనుకటి పొరల్లోకి వెళ్లి ఆర్య-ద్రవిడ అంశాన్ని ముందుకుతేవటంలో ఆశ్చర్యపడదగింది ఉండదు. ఆర్యులు బయటివారన్న అనేకానేకుల్లో సాక్షాత్తూ బాల గంగాధర్‌ తిలక్‌ ఉన్నారు. ఇటీవలి సంవత్సరాల శాస్త్రీయమైన డీఎన్‌ఏ పరీక్షలు కూడా దాన్ని ధృవీకరించా యి. కానీ పైన అనుకున్నట్లు భారతీయ సమాజం  ఈ దశలనన్నీ గడిచిపోయి ఆధునిక, ప్రజాస్వామిక జాతి నిర్మాణ దశలోకి అడుగుపెట్టింది. 


దీనిని శివాజీ-ఔరంగజేబు వాదులు గాని, ఆర్య-ద్రవిడవాదులు గాని విస్మరించటాన్ని ఆమోదించలేం. ముఖ్యంగా శివాజీ-ఔరంగజేబు వాదులు తమ చర్యల ద్వారా ఆర్య-ద్రవిడ వివాదాన్ని రెచ్చగొట్టదలిచా రా అన్నది సూటి ప్రశ్న. అందువల్ల తమ తాత్కాలిక ప్రయోజనాలు ఏమి నెరవేరుతాయోగాని, దేశానికి కలిగే దీర్ఘకాలిక హాని గురించి వారు తమను తాము హెచ్చరించుకోవటం మంచిది. తెలంగాణ బీజేపీ నాయకులు మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పాఠాలను ఎంతమాత్రం గ్రహించినట్లు లేరు. వారికి తమ సిద్ధాంతాలు ఉండవచ్చు. వాటి ఆధారంగా పార్టీని నిర్మించుకోవచ్చు. ఆ పని చేయగల సమర్థత లేనివారే వక్రచర్యలకు పాల్పడుతుంటారు. అది దేశభక్తి కాదు గదా అందుకు పూర్తి విరుద్ధమైన ధోరణిగా తేలుతుంది.


logo