శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 26, 2020 , 22:47:37

ఆరోగ్య తెలంగాణకు మార్గదర్శి

ఆరోగ్య తెలంగాణకు మార్గదర్శి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామం ‘చింతమడక’తో పాటు ఆ గ్రామం చుట్టూ ఉన్న సుమారు ఆరు గ్రామాల్లో పదివేల పైచిలుకు ప్రజారోగ్య సంబంధిత వివరాల నమోదు ప్రక్రియ ద్వారా మొదలైన ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌'రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఒక ప్రధాన ఆరోగ్య సం బంధిత నిర్ధారణాంశం. చింతమడకలో ఆరంభమైన ఈ వినూత్న ఆరోగ్య వివరాల సేకరణ ప్రక్రియ రానున్నరోజుల్లో ఆరోగ్య తెలంగాణ రూపకల్పనకు దిక్సూచి.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న హెల్త్‌ ప్రొఫైలింగ్‌ విధానం ఆరోగ్య సమస్యల నిర్ధారణలో దిక్సూచిగా నిలుస్తున్నది. సాధారణ వ్యాధుల నిర్ధారణకు తోడు, సమస్యాత్మక, అం టువ్యాధుల, దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ, చికిత్స అం శాలను రికార్డు చేసేందుకు, వాటికి తగురీతిలో నివారణ విధానాలను సూచించడానికి ఈ హెల్త్‌ ప్రొఫైలింగ్‌ ఎంతగానో ఉపకరిస్తుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అమలుచేస్తున్న పథకాల్లో ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' కూడా ముఖ్యమైనది. 


తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్కో అం శాన్ని ఆకళింపు చేసుకుంటూ ప్రజలకు సమగ్ర పాలన అందిస్తున్నది. ఆరో గ్య సంబంధిత అంశాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. ‘సమగ్ర కుటుంబ సర్వే’ ద్వారా ఎలాగైతే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించుకునేరీతిలో ప్రయత్నం జరిగిందో అదే తరహాలో ఆరో గ్యం విషయంలో కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతున్నది.


మన రాష్ట్రంలో గ్రామాలే ప్రధానంగా ప్రాంతాలవారీగా పలు ఆరోగ్య సమస్యలున్నాయి. వివిధ వృత్తుల్లో ఉన్న ఉద్యోగ, కార్మికవర్గాల్లో కొన్ని ప్రత్యేక వ్యాధి లక్షణాలు పొడసూపుతాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి సంబంధించిన వివరాలను సేకరించి ఒక ప్రణాళికాబద్ధమైన చికిత్స విధానాలను అమలుపరుచగలిగే కార్యక్రమాన్ని రూపొందించుకోవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేక వృత్తుల్లో నిమగ్నమైన ఉద్యోగ కార్మికవర్గాలకు శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు విస్తరించే అవకాశాలున్నాయి. అవి ఒక సమూహానికో, కొందరు వ్యక్తులకో విస్తరించినప్పుడు చికిత్సపరంగా జాగ్రత్తలు సూచించగలిగే సామర్థ్యం ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' సమగ్రం గా చేపట్టినప్పుడు సాధ్యమవుతుంది.


ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాల్లో నీటిలోని వివిధ లవణాలను బేరీజు వేసే పరీక్షలు చేసినట్టే, అక్కడున్న ప్రజానీకం పలు వ్యాధుల బారిన పడినప్పు డు వారి శారీరక లక్షణాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపర్చగలిగే అవకాశం ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' పథకం ద్వారా సాధ్యమవుతుంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో బోధకాలు లాంటి వ్యాధుల విస్తరణ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ వ్యాధిగ్రస్థుల ఆరోగ్య వివరాలను పొందుపరిచేందుకు కూడా ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' ఉపకరిస్తుంది. పోషకాహార లోపం వల్ల సంక్రమించే సాధారణ వ్యాధులను గురించి కూడా సమగ్ర ఆరోగ్య పట్టికలను తయారుచేసుకున్నప్పుడు సేకరించుకోగలుగుతాం. కొన్ని వృత్తుల్లో నిమగ్నమైన సందర్భాల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారినపడిన వారి వివరాలు కూడా ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌'లో పొందుపర్చుకోగలుగుతాం. ముఖ్యంగా బీడీ, చేనేత కార్మికులు తాము నిమగ్నమైన పనిలోని అవశేషాలను శ్వాసద్వారా స్వీకరించినప్పుడు శ్వాసకోశ సంబంధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికితోడు కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ పర్యవసానంగా కూడా సిలికోసిస్‌, అస్బెస్టోసిస్‌ లాంటి వ్యాధులు సంక్రమించిన ఆరోగ్య చరిత్ర మన ముందున్నది.


సామాజిక హెల్త్‌ప్రొఫైల్‌ ప్రక్రియ సోషియోడెమోగ్రాఫిక్‌ లక్షణాలు, ఆరోగ్యస్థితి, జీవన నాణ్యత, ఆరోగ్య ప్రమాద కారకాలు మొదలైన విషయాలను బేరీజు వేసుకొని ఆరోగ్య వనరుల సూచికలతో రూపొందించబడింది. ఈ సూచికలు ప్రాథమికంగా వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తాయి. అలాగే ఇదొక వ్యక్తి గురించిన కొన్ని ఆరోగ్య లక్షణాలను సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారు ప్రొఫైల్‌ పొందే ప్రక్రియను వ్యక్తిగత ప్రొఫైలింగ్‌ అంటారు. ఒక వ్యక్తి లక్షణాల వివరాలను నిల్వ చేయడానికి ఈ ప్రొఫైల్‌ ఉపయోగిస్తాం. కమ్యూనిటీ ప్రొఫైలింగ్‌ అనేది ఒక ప్రాంత పర్యావరణ లక్షణాలను ఆకళింపు చేసుకుంటూ ఆరోగ్య లక్షణాలను నమోదు చేస్తుంది. హెల్త్‌ ప్రొఫైలింగ్‌ విధానం ఒక ప్రాంత ఆరోగ్య సమస్యల్లో సాధారణ అంశాలను తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుంది. వ్యక్తులకు సంబంధించిన సమగ్ర ఆరోగ్య చరిత్రను ఆమూలాగ్రం అందించగలిగే ఈ ప్రక్రియ మన లాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒక సంజీవనిగా ఉపకరిస్తుంది. సాధారణ ఆరోగ్య సమస్యలను గురిం చి నమోదుచేయగలిగే రక్త నమూనాలు, బీపీ, ఈసీజీ, మధుమేహ సంబంధిత వివరాల సేకరణ, ఇలా సుమారు యాభై పైచిలుకు సాధారణ ఆరోగ్య వివరాలు ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌'లో ఉంటాయి.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామం ‘చింతమడక’తో పాటు ఆ గ్రామం చుట్టూ ఉన్న సుమారు ఆరు గ్రామాల్లో పదివేల పైచిలుకు ప్రజారోగ్య సంబంధిత వివరాల నమోదు ప్రక్రియ ద్వారా మొదలైన ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' రాష్ట్రం లో రానున్న రోజుల్లో ఒక ప్రధాన ఆరోగ్య సంబంధిత నిర్ధారణాంశం. చింతమడకలో ఆరంభమైన ఈ వినూత్న ఆరోగ్య వివరాల సేకరణ ప్రక్రియ రానున్నరోజుల్లో ఆరోగ్య తెలంగాణ రూపకల్పనకు దిక్సూచి. సాధారణ ఆరోగ్య సమస్యల పట్ల గతంలో ఉన్న సూచికలకు, ఇప్పుడు నమో దయ్యే వివరాలు అనుసంధానంగా వ్యవహరించడమే కాకుండా ప్రభుత్వరం గంలో ఉన్న వైద్య సేవా వనరులకు ఇవి సరైన సమాచారం అందించడంలో మార్గనిర్దేశకాలుగా నిలుస్తాయి. ఈ హెల్త్‌ ప్రొఫైలింగ్‌ ఆదివాసీ ప్రజానీకం అధికంగా నివసించే ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని గిరిజనులకు, కార్మికులు అధికంగా ఉండే కరీంనగర్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఆరోగ్యమే మహాభాగ్యమనే అంశాన్ని వాస్తవరూపంలోకి తేగలిగే ప్రధా న వనరుగా ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌'లో నమోదయ్యే వివరాలు ఉపకరిస్తాయి. భౌగోళిక, సామాజిక పరిస్థితుల కారణంగా ఎదురయ్యే వ్యాధులను గురిం చి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తగు తరుణోపాయాలను ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' ద్వారా ఆచరణాత్మకం చేయవచ్చు. రాష్ట్ర ప్రగతిని వినూత్న ఒరవడితో దిశానిర్దేశనం చేస్తూ పలు విలక్షణమైన కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న సీఎం కేసీఆర్‌ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘హెల్త్‌ ప్రొఫైలింగ్‌' ఆరోగ్య తెలంగాణకు మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. పాథాలజీ పరంగా వివిధ పరీక్షల నిర్వహణ ద్వారా వ్యక్తి ఆరోగ్యస్థితి బేరీజు వేసే ప్రక్రియ ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ విధానంలో వాస్తవరూపం దాలుస్తుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేద దేశాలలోని వివిధ వ్యాధుల వివరాలను సేకరించడానికి ప్రధాన వనరుగా ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది.


logo