గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , 23:02:58

ట్రంప్‌ స్నేహబంధం

ట్రంప్‌ స్నేహబంధం

అమెరికా విదేశాంగ విధానంలోనూ భారత్‌ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో వాణిజ్య మార్గాల రక్షణకు, చైనా ప్రభావాన్ని కట్టడి చేయడానికి భారత్‌తో మైత్రి అవసరమని అమెరికా భావిస్తున్నది. అయితే అమెరికా దీనిని భౌగోళిక రాజకీయ అవసరంగా మాత్రమే భావించకూడదు. ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ సుస్థిరంగా ఉండటం అంతర్జాతీయ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. అందువల్ల భారత్‌తో మైత్రిని వాణిజ్య, భద్రతా ప్రయోజనాల కోణంలోనే చూడకూడదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటన గతంతో పోలిస్తే విశేషమైనదిగా నిలుస్తుంది. ఇప్ప టివరకు అమెరికా అధ్యక్షులు విదేశీ యాత్రలో భాగంగా ఇతర దేశాలతో పాటు భారత సందర్శనకు వచ్చారు. విధాన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో భారత, పాకిస్థాన్‌ దేశాలను కలిపి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ట్రంప్‌ ప్రత్యేకించి భారత పర్యటన కోసమే రావడం అమెరికా విధానకర్తల దృక్కోణంలో మన దేశానికి పెరిగిన ప్రాధాన్యాన్ని సూచిస్తున్నది. ప్రధాని మోదీ కూడా తదనుగుణమైన స్వాగత ఏర్పాట్లుచేశారు. రహదారులకు ఇరువైపులా ప్రజలు స్వాగతం పలుకుతుండగా ప్రయాణించిన ట్రంప్‌, మోతెరా స్టేడియంలో లక్షకు పైగా జనాన్ని ఉద్దేశించి మాట్లాడా రు. ఆ మరుసటి రోజు పరిశ్రమల ప్రతినిధులతోనూ సమావేశమై వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సాధారణంగా విదేశీ నాయకులు అధికారిక చర్చలతో పాటు అదనంగా పౌర కార్యక్రమాలలోనూ పాల్గొనడం పరిపాటి. కానీ ట్రంప్‌ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలతో పాటు, ప్రజలతో కలిసిపోవడానికీ విశేష ప్రాధాన్యం ఉన్నది. ఈ ప్రజా కార్యక్రమాన్ని అమెరికాలో ట్రంప్‌ ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడేదనే స్థాయికి కుదించి చూడకూడదు. రెండుదేశాల మధ్య భిన్న రంగాలలో సంబంధాలు బలపడుతూనే ఉన్నాయి. ఇందుకు రెండు దేశాల మధ్య కుదిరిన తాజా ఒప్పందాలే నిదర్శనం. అయితే దేశాల మధ్య అధికారిక సంబంధాలను నెరపడంతో పాటు, ఆ స్ఫూర్తిని ప్రజలకు చేర్చడం కూడా అవసరం. ఈ కోణంలో భారత్‌, అమెరికా సంబంధాలు మరిం త ఉన్నత స్థాయికి చేరుకున్నాయనే సందేశాన్ని ట్రంప్‌ పర్యటన ఇవ్వగలిగింది. 


ట్రంప్‌ పర్యటన సందర్భంగా రక్షణ, ఇంధన రంగాలలో భారీ ఒప్పందాలు కుదిరాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై పోరుకు సహకరించుకోవాలనే అవగాహన కుదిరింది. వాణిజ్య చర్చలు ఇంకా సాగుతున్నాయి. ప్రధాని మోదీ చెప్పినట్టు- రెం డు దేశాల సంబంధాలు ప్రపంచస్థాయి సమగ్ర భాగస్వామ్యం స్థాయికి చేరుకున్నాయి. అయితే ద్వైపాక్షిక సంబంధాలు ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కాదని, వాటిని ప్రజలే నడిపిస్తున్నారని కూడా ఆయన అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భారత్‌కు సోవియెట్‌ యూనియన్‌తో సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. సోవియెట్‌ యూనియన్‌ భద్రతా మండలిలో భారత్‌కు బాసటగా ఉండేది. అనేకరంగాలలో భారత్‌ పురోభివృద్ధికి సహకరించింది. రక్షణరంగంలో ప్రధాన భాగస్వామి. అయినా భారత ప్రజలకు మాత్రం అమెరికా సమాజంతోనే సంబంధాలు ఎక్కువ. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత మేధోవర్గానికి బ్రిటన్‌తో సంబంధాలు బలంగా ఉండేవి. ఆ తర్వాత అమెరికా సమాజంతో అల్లుకుపోయారు. ఇప్పుడు కొత్త అంతర్జాతీయ వ్యవస్థలో భారత్‌ అమెరికాకు అతి సులభంగా దగ్గర కాగలిగిందీ అంటే అందుకు ఈ సామాజిక సంబంధాలే కారణం. సోవియెట్‌ యూనియన్‌తో ఈ సామాజిక సంబంధాలు లేనప్పటికీ, ప్రజలలో అదొక మిత్ర దేశమనే భావన పాతుకుపోయింది. కానీ ఇప్పుడు అమెరికా సమాజంతో ఇక్కడి ప్రజలకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అమెరికాను పూర్తిస్థాయి మిత్రదేశంగా చూసే పరిస్థితి లేదు. అమెరికా ఆధిపత్యశక్తి అనే భావనే ఎక్కువ. ఇందుకు ప్రచ్ఛన్న యుద్ధకాలపు పరిస్థితులు ఒక కారణమైతే, అమెరికా వ్యవహరిస్తున్న తీరు మరో కారణం. రెండూ ప్రజాస్వామ్య దేశాలు. రెండు సమాజాల మధ్య భావసారూప్యం కూడా ఉన్నది. అయినా ఈ అనుకూలతను ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతకు అమెరికా ఉపయోగించుకోలేకపోతున్నది. రెండుదేశాల నాయకులు ఈ అంశంపై దృష్టిసారించినట్టు కనబడుతున్నది. కానీ అమెరికా వైఖరిలో చాలా మార్పు అవసరం.


భారత అమెరికా సంబంధాలు పటిష్ఠపడటం రెండు దేశాలకూ అవసరమే. పొరుగునే ఉన్న చైనా ప్రభావాన్ని కట్టడి చేయడానికి అమెరికాతో స్నేహం భారత్‌కు అవసరం. అభివృద్ధి చెందిన దేశంతో అనుబంధాన్ని అన్నిరంగాలకూ విస్తరించుకోవచ్చు. భారత విదేశాంగ విధానంలో వచ్చిన మౌలిక మార్పు మూలంగా అమెరికా ప్రాధాన్యం విస్మరించలేనిది. అమెరికా విదేశాంగ విధానంలోనూ భారత్‌ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో వాణిజ్య మార్గాల రక్షణ కు, చైనా ప్రభావాన్ని కట్టడి చేయడానికి భారత్‌తో మైత్రి అవసరమని అమెరికా భావిస్తున్నది. అయితే అమెరికా దీనిని భౌగోళిక రాజకీయ అవసరంగా మాత్రమే భావించకూడదు. ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ సుస్థిరంగా ఉండటం అంతర్జాతీయ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. అందువల్ల భారత్‌తో మైత్రిని వాణిజ్య, భద్రతా ప్రయోజనాల కోణంలోనే చూడకూడదు. అమెరికాకు ఉపగ్రహంగా ఉండకుండా భారత్‌ స్వతంత్రతను కోరుకుంటుంది. యూరేషియా తదితర ప్రాంతాల్లో భారత విధానాలను గౌరవించాలి. వాణిజ్యరంగంలోనూ భారత్‌ వాదనలు కాదనలేనివి. నాలుగో పారిశ్రామిక విప్లవంగా భావిస్తున్న డిజిటల్‌ ఆర్థికవ్యవస్థలో భారత్‌ తన స్థానాన్ని పదిలపరచుకోవాలనుకోవడంలో తప్పేమీ లేదు. వాణిజ్య సుంకాలు, డేటా స్థానికీకరణ వంటి వివాదాలలో భారత్‌పై ఒత్తిడి తేకూడదు. భారత్‌ వంటి పెద్ద దేశం తన మార్కెట్‌ను, సమాజాన్ని అమెరికా కంపెనీల ప్రయోజనాలకు వదిలిపెట్టదు. భారత్‌తో స్నేహాన్ని పటిష్ఠపరచుకోవాలని భావిస్తున్న అమెరికా కొంత ఉదారంగా వ్యహరించడం తప్పనిసరి. అవసరమైతే ఒక మెట్టు దిగడానికి కూడా అది సిద్ధపడాలి. 


logo
>>>>>>