శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , 22:39:13

ఆంగ్ల మాధ్యమం అవసరమే

ఆంగ్ల మాధ్యమం అవసరమే

ఏ భాషయినా ఎప్పుడు మృతభాషవుతుంది? చదువుల నుంచి దూరమై అధికార భాషగానూ ప్రభుత్వం నుంచి దూరమైనప్పుడు. ఈ రెండింటి నుంచి దూరమైనా ప్రజల వాడుకలో బతికిన అనేక భాషలున్నాయి. కానీ, అధికార భాష నుంచి, చదువుల నుంచి, ఉపాధినిచ్చే స్థాయి నుంచి దూరమైన భాష క్రమక్రమంగా జనం వాడుకలోంచి దూరమై మృతభాషవుతుంది. అందువల్ల మాతృభాషను ఆయా రాష్ట్రాల్లో చదువుల్లోనూ, పాలనారంగంలోనూ బతికుండేటట్టు చూడాలి.

పాఠశాలస్థాయి విద్యాభ్యాసం మాతృభాషలో చేయడం వల్ల బోధించే విషయం పసివానికి సులభంగా అర్థమవుతుంది. వివిధ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్స్‌ అర్థం కావడమే కాకుండా చదువుకోవాలనే అభిలాష పెరుగుతుంది. విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుం ది. తమ భాషపై, జాతిపై ప్రేమ పెరుగుతుంది. స్థానికతను ప్రేమించే పౌరులుగా ఎదుగుతారు. కళాకారులు, రచయితలు, కవులుగా ఎదిగేవారు తమ మాతృభాషలో భావవ్యక్తీకరణ పెరిగి ఎదిగే అవకాశం ఉన్నది. మాట్లాడటమైనా, రాయడమైనా, ఉపన్యాసాలు ఇవ్వడం లాంటివైనా భావవ్యక్తీకరణ చేయడమైనా మాతృభాష ద్వారానే సమర్థవంతంగా చేయవచ్చు. ఇంట్లో మాట్లాడే భాష, ఇరుగుపొరుగు వారితో మాట్లాడే భాష, బడిలో చదువుకునే భాష ఒకటే కావడం వల్ల ప్రతి విషయమూ తేలికగా అర్థమై మానసిక వికాసం కలుగుతుంది. 


మహాత్మా గాంధీ లాంటివారు, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ లాంటి నోబెల్‌ ప్రైజ్‌ విజేతలు, గురజాడ లాంటి గొప్ప రచయితలు కూడా మాతృభాషలోనే విద్యాబోధన, మాతృ భాషలోనే రచయితలు, కవులు రాయాలని బల్లగుద్ది మరీ చెప్పారు. పాఠశాల విద్య తెలుగు మాధ్యమంలో చదివి, కళాశాల విద్య ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదువడం వల్ల అటు ఇంగ్లిష్‌, ఇటు తెలుగూ రెండూ బాగా వస్తాయన్న వాదమూ ఉన్నది.ఇదంతా ఒకప్పటి మాట. సమాజం స్టాటిక్‌గా ఉన్నప్పటి మాట. ఎక్కడివాళ్లక్కడే ఉండి సమాజంలో చలనశీలత తక్కువగా ఉన్నప్పటి మాట.  ఇతర భాషల గురించి, ప్రపంచం గురించి అంతగా పరిచయం లేని సమయంలోని మాట. 


ఇదివరకట్లా ఇప్పుడున్న తల్లిదండ్రులు పూర్తి నిరక్షరాస్యులు కారు. నిరక్షరాస్య తల్లిదండ్రులైనా ఒక్క తెలుగు (మాతృభాష) మాత్రమే మాట్లాడటం లేదు. కారణలేవైనా ఇంగ్లీషు ప్రపంచ భాషయింది. ప్రపంచీకరణ ప్రవేశం తర్వాత ఈ ధోరణి మరీ ఎక్కువైంది. ప్రపంచం ఓ కుగ్రామం అయిందనడం సరైంది కాదు కానీ, ఇంగ్లిష్‌ ద్వారా ప్రపంచమంతా పరిచయం అవుతుంది. దేశవిదేశాలను కలుపుతుంది. గర్భస్థ శిశువు కూడా మహాభారతంలో అభిమన్యుడిలా మీడియా ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఇంగ్లిష్‌ పదాలను నేర్చుకుంటున్నాడు. ఇంకా అనేక కారణాల వల్ల ఇంగ్లిష్‌ చదువడం, నేర్చుకోవడం, తప్పనిసరైంది. రాష్ట్రం నుంచి దేశం, ప్రపంచదేశాల్లో ఎక్కడైనా బతుకాలంటే మాతృభాష సరిపోదు. ఇంగ్లిష్‌ వచ్చితీరాలి. ఇవన్నీ కావాలంటే ఒక్క భాషగా ఇంగ్లిష్‌ చదువుకుంటే సరిపోదు.  పదవ తరగతి వరకు చదువుకున్నవాళ్లు కూడా బయటకెళ్లి బతుకాలంటే చదువుకున్న ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్‌ సరిపోదు.  మారిన పరిస్థితుల్లో, ప్రపంచీకరణ యుగంలో అన్నిట్లా ఇంగ్లిష్‌ అవసరం పెరిగింది.


తెలుగు మాధ్యమంలో చదువుకున్న అతి కొద్దిమంది తప్ప ఉన్నత స్థానాల్లోకెళ్లడానికి, ప్రపంచంతో పోటీ పడటానికి ఇంగ్లిష్‌ మాధ్యమం అనివార్యమవుతున్నది. మాతృభాష మాధ్యమమే మేలన్న గాంధీ ఇంగ్లి ష్‌లోనే విదేశాల్లో బారిష్టర్‌ చదివాడు. ఇంగ్లీషువారిని ఎదిరించడానికి ఆ భాషే ఉపయోగపడింది. రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ విశ్వకవి, నోబెల్‌ విజేత అవడానికి ఇంగ్లిష్‌ చదువే కారణం. శంభుచంద్ర ముఖర్జీ మాటలు విని గురజాడ తెలుగులో రాసినా ఇంగ్లిష్‌ బాగా వచ్చినవాడే. ఇంగ్లిష్‌ భాషా జ్ఞానంతోనే సంస్కరణవాదాన్ని అర్థం చేసుకోగలిగాడు, సొంతం చేసుకోగలిగాడు. తెలుగులోనూ, ఇంగ్లిష్‌లోనూ రాయగలిగాడు. గురజాడ తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ రాయడం కొనసాగించి ఉంటే నోబెల్‌ విజేత అయ్యుండేవాడు. ప్రాంతీయభాషల్లో అద్భుతమైన రచనలు వస్తున్నా ఇంగ్లిష్‌లోకి పోకపోవడం వల్ల వాటికి న్యాయం జరుగడం లేదు. ఆయా రచయితలకు ఇంగ్లిష్‌ వచ్చినా సృజనాత్మక సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లో రాయగలిగే నిపుణత రాదు. సాటనిక్‌ వర్సెస్‌ రచయిత, లజ్జ రచయిత్రి , అరుంధతీరాయ్‌ ఇంగ్లిష్‌ మీడియంలో చదువడం వల్లనే ఇంగ్లిష్‌లో రాసి అంతర్జాతీయ ఖ్యాతి పొందగలిగారు.


చిన్నస్థాయి నుంచి, పెద్దస్థాయి వరకు ప్రపంచంలో ఎక్కడైనా బతుకడానికి ఇంగ్లిష్‌ అవసరం. అది ఒక్క సబ్జెక్టుగా చదివితే రాదు. మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌గా చదివితేనే సాధ్యమవుతుంది. తెలుగు (మాతృభాష) రావడానికి అన్నీ సబ్జెక్టులు తెలుగులో ఉండాల్సిన అవసరం లేదు.  ఇంగ్లి ష్‌ అర్థం కాదన్న ప్రశ్న లేదు. ఎందుకంటే పసిపిల్లల వయసు నుంచే ఇంగ్లి ష్‌ నేర్పిస్తున్నాం కాబట్టి, ఇంగ్లిష్‌ భాషలో నైపుణ్యం పెరుగుతుంది.గత ఇరువై ఏండ్ల నుంచి ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న విద్యార్థులు మాతృభాషకు దూరమయ్యారన్న మాటలో పాక్షిక సత్యముంది. ఇందుక్కారణం అనేక ఇంగ్లిష్‌ మాధ్యమ పాఠశాలల్లో ముఖ్యంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో మాతృభాష ఒక్క సబ్జెక్టుగానూ లేకపోవడం ఉన్నత పాఠశాలల్లోనూ మాతృభాషను పూర్తిస్థాయిలో బోధించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడం అసలు కారణం. మాతృభాషను మొక్కుబడిగా మాత్రమే చదువడం అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఇండ్లలోనూ తల్లిదండ్రులు పిల్లల తెలుగు చదువు గురించి పట్టించుకోకపోవడం, ఇంటర్‌ స్థాయిలోనైతే తెలుగు అసలే లేకపోవడం పెద్ద విషాదం.

ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్‌ మీడియం పెట్టడం వల్ల మాతృభాషలు  అంతరించిపోతాయనడం సరైంది కాదు.  


వేల ఏండ్లుగా సంస్కృతం రాజభాష గా కొందరికే పరిమితమైన చదువుల భాషగా ఉన్నపుడు మాతృ భాషలు నశించిపోయాయా? ముస్లిం రాజులు ఉర్దూ మీడియం చేసినపుడు 800 ఏండ్లు ఈ దేశాన్ని పాలించినా దేశంలోని మాతృభాషలు చావలేదు కదా? బ్రిటిష్‌వారు రాజభాషగా, బోధ నా భాషగా ఇంగ్లిష్‌ను పెట్టి 200 ఏండ్లు పాలించినా తెలుగు మాయమై పోలేదు కదా! ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పెడితే పోతుం దా? కోట్లాదిమంది తెలుగువారు నిత్య వ్యవహారాల్లో మాతృభాష మాట్లా డుతుంటే తెలుగెలా పోతుంది?  పోగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడి యం పెట్టి ఒక్క సబ్జెక్టుగా తెలుగును పూర్తిస్థాయిలో చదివింపజేయడంవల్ల చదువుల్లో తెలుగు బతుకుతుంది. కేజీ నుంచి పీజీ వరకు ప్రొఫెషన ల్‌ కోర్సులైనా సరే ఉంచడం వల్ల మాతృభాషలు బతుకుతాయి. శాశ్వతం గా బతుకుతాయి. తెలుగు సమాజంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా సరే ఆ రాష్ట్ర భాషను నేర్చుకోవాలన్న విషయాన్ని కచ్చితంగా అమలుచేస్తే పాలన ప్రజలకు చేరుతుంది. మాతృభాషలూ బతుకుతాయి.


ఏ భాషయినా ఎప్పుడు మృతభాషవుతుంది? చదువుల నుంచి దూర మై అధికార భాషగానూ ప్రభుత్వం నుంచి దూరమైనప్పుడు, ఈ రెండిం టి నుంచి దూరమైనా ప్రజల వాడుకలో బతికిన అనేక భాషలున్నాయి. కానీ, అధికార భాష నుంచి, చదువుల నుంచి, ఉపాధినిచ్చే స్థాయి నుంచి దూరమైన భాష క్రమక్రమంగా జనం వాడుకలోంచి దూరమై మృతభాషవుతుంది. అందువల్ల మాతృభాషను ఆయా రాష్ట్రాల్లో చదువుల్లోనూ, పాలనారంగంలోనూ బతికుండేటట్టు చూడాలి. మాధ్యమ భాషగా ఇంగ్లి ష్‌ను పెట్టి ఒక్క సబ్జెక్ట్‌గా మాతృభాషలను అన్ని స్థాయిల్లోనూ పూర్తిస్థాయి లో చదివేటట్టు చేయాలి. తద్వారా మాతృభాషలు బతుకుతాయి. నేటి ప్రాపంచిక అవసరాలకు సరిపోయేట్టు, మెజారిటీ తెలుగు ప్రజలు కూడా కోరుకున్నట్టు అందరికీ ఇంగ్లిష్‌ మాధ్యమ చదువులు ఇవ్వడం న్యాయమే. అందుకే మాతృభాషలు వికసించాలి, ఇంగ్లిష్‌ మాధ్యమం కావాలి.


logo