శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , T00:20

మహతీర్‌ రాజీనామా

మహతీర్‌ రాజీనామా

వివిధ నేతల సారథ్యంలో దేశాన్ని అరువై ఏండ్లుగా పాలిస్తున్న యునైటెడ్‌ మలయ్స్‌ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (ఉమ్నో)ను 2018లో అధికారం నుంచి కూలదోసి మహతీర్‌, అన్వర్‌ల సారథ్యంలో కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశమంతా హర్షం వ్యక్తమైంది. నవ మలేషియా నిర్మాణం సాగుతుందనే ప్రచారం సాగింది. కానీ క్రమంగా మహతీర్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోవడం మొదలైంది. ఆర్థిక రంగంలో మందగమనం సాగుతున్నది. యువతలో తీవ్ర అసహనం నెలకొని ఉన్నది.

మలేషియా ప్రధాని పదవికి రాజీనామా చేయడం ద్వారా మహతీర్‌ మహమద్‌ దేశ రాజకీయాన్ని మరో మలుపుతిప్పాడు. మహతీర్‌ 94 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ నాయకుడు. తాను రెండేండ్ల పాటే ప్రధానిగా ఉంటానని, ఆ తర్వాత అన్వర్‌ ఇబ్రహీంకు పగ్గాలు అప్పగిస్తానని ఎన్నికల ముందే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ప్రకారం తనకు అధికారం అప్పగించాలని ఉప ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఒత్తిడి చేయడమే కాకుండా చాపకిందికి నీళ్లు తెస్తున్నా డు. దీంతో రాజీనామా అస్త్రం ప్రయోగించడం ద్వారా మహతీర్‌ కొత్త పొత్తులకు తలుపులు తెరిచారు. మహతీర్‌కు ఎట్లాగూ అన్వర్‌ ఇబ్రహీం నుంచి పదవీ గండం ఉండనే ఉన్నది. ఆయన మద్దతు లేకపోతే అధికార కూటమి నిలబడలేదు. అందువల్ల అన్వర్‌ పార్టీలోని అసమ్మతి వర్గాన్ని ఇప్పటికే చేరదీసిన మహతీర్‌ ప్రతిపక్ష కూటమిలోని కొందరితో మంతనాలు ప్రారంభించారు. మహతీర్‌, అన్వర్‌ పక్షాల వ్యూహాల మూలంగా కొద్దిరోజులుగా రాజకీయం వేడెక్కింది. అధికార కూటమిలోని కొందరు సమావేశమై అన్వర్‌కు అధికారం బదలాయించవద్దని మహతీర్‌కు విజ్ఞప్తి చేశారు. మరో వర్గం సమావేశమై అన్వర్‌ను ప్రధానిని చేయాలని తీర్మానించింది. ఈ తెరవెనుక పోరాటమే ఇప్పుడు పతాక సన్నివేశంలో మహతీర్‌ రాజీనామాకు దారి తీసింది. రాజకీయ నాయకులు అధికారం కోసం శత్రువులుగా, మిత్రులు గా వ్యవహరించగలరనడానికి మహతీర్‌, అన్వర్‌ల సంబంధాలు ఒక ఉదాహరణ.


మహతీర్‌, అన్వర్‌ ఇరువురూ రాజకీయ ఉద్ధండులే. మహతీర్‌ రాజకీయ ఎత్తుగడలలో మేటి అయితే అన్వర్‌కు భూమిపుత్రులలో బలమైన పట్టు ఉన్నది. 21 ఏండ్ల వయసులో రాజకీయాలలో ప్రవేశించిన మహతీర్‌ 1964లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికలలో ఓడిపోయి పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. కానీ మలయా జాతీయవాదాన్ని ప్రచారం చేయడం ద్వారా మళ్ళా అదే ఉమ్నో పార్టీలో ప్రవేశించి 1981 కల్లా ప్రధాని పదవి చేపట్టారు. ఆర్థిక సరళీకరణ చేపట్టి దేశాన్ని ఆసియన్‌ టైగర్స్‌లో ఒకటిగా మార్చాడు. కానీ నిరంకుశ పాలన సాగించి ప్రతిపక్ష నాయకులను జైలు పాలు చేశారు. స్వపక్షంలోని ఉప ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంపై అనేక ఆరోపణలు చేసి జైలు లో పెట్టాడు. రెండు దశాబ్దాలకు పైగా ప్రధానిగా పాలించి అధికారం నుంచి 2003లో వైదొలిగా డు. ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసిందనిపించింది. కానీ తొంభై ఏండ్లు దాటినా మళ్ళా అధికారంపై ఆశ పుట్టింది. తన బద్ధ శత్రువైనప్పటికీ, మలయా జాతీయుల్లో గట్టి మద్దతు ఉన్న అన్వర్‌తో చేతులు కలిపాడు. తమ కూటమి గెలిస్తే అన్వర్‌కు క్షమాభిక్ష పెడుతానని, ఉపప్రధాని పదవి అప్పగిస్తానని, రెండేండ్ల తరువాత ప్రధానిగా చేస్తానని హామీ ఇచ్చాడు. 2018లో మళ్ళా ప్రధాని అయ్యాడు. ఇప్పుడు అన్వర్‌కు పదవి అప్పగించక తప్పదు కనుక, ఆయనను వదిలించుకొని కొత్త కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్లామిక్‌ యువజన నాయకుడిగా పేరొందిన అన్వర్‌, మలయా జాతీయవాదాన్ని అస్త్రంగా చేసుకొని అతివేగంగా రాజకీయాల్లో ఎదిగి ఉపప్రధాని పదవి చేపట్టగలిగారు. కానీ మహతీర్‌ హయాంలో, ఆ తర్వాత నజీబ్‌ రజాక్‌ పాలనలో కేసులు ఎదుర్కొని జైలు పాలయ్యాడు. సమాజంలో పట్టు ఉన్నప్పటికీ అధికారం మాత్రం ఇప్పటివరకు దక్కలేదు.


వివిధ నేతల సారథ్యంలో దేశాన్ని అరువై ఏండ్లుగా పాలిస్తున్న యునైటెడ్‌ మలయ్స్‌ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (ఉమ్నో)ను 2018లో అధికారం నుంచి కూలదోసి మహతీర్‌, అన్వర్‌ల సారథ్యంలో కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశమంతా హర్షం వ్యక్తమైంది. నవ మలేషియా నిర్మాణం సాగుతుందనే ప్రచారం సాగింది. కానీ క్రమంగా మహతీర్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోవడం మొదలైంది. ఆర్థిక రంగంలో మందగమనం సాగుతున్నది. యువత లో తీవ్ర అసహనం నెలకొని ఉన్నది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న జీఎస్టీని రద్దు చేసినప్పటికీ, ఆ స్థానంలో కొన్ని నెలలకే వినియోగ పన్ను ప్రవేశ పెట్టడం ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చింది. సంక్షేమ పథకాలకు కోత వేయడం కూడా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచింది. దేశంలో 60 శాతం మలయా జాతీయులు ఉంటారు. భూమిపుత్రులైన తాము అన్యాయానికి గురవుతున్నామనే అసంతృప్తి వీరిలో ఉన్నది. ప్రతిపక్ష కూటమిలో ఉన్న ఉమ్నో, పార్టీ ఇస్లామ్‌ సే మలేషియా (పీఏఎస్‌) జాతి, మత ఉద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష కూటములు విచ్ఛిన్నమయ్యాయి. దేశానికి ప్రాతినిధ్య శక్తిగా చెప్పుకునే రాజకీయ పక్షమేదీ లేదు. రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం ఎవరితోనైనా చేతులు కలుపడానికి సిద్ధంగా ఉన్నారు.  ప్రతి వర్గం తమ వాటా కోసం ఏ గ్రూపులోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నది. రాజకీయ  పక్షాల మధ్య మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఏయే పక్షాలతో ఏ కూటమి ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఈ రాజకీయ గందరగోళంలో మహతీర్‌ కొత్త కూటమి కట్టి మెజారిటీ పొందుతారా అనేది వేచి చూడవలసిందే. ఏ కూటమి అధికారం చేపట్టినా రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నుంచి మలేషియా బయటపడే సూచనలు కనిపించడం లేదు. 


logo