శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 25, 2020 , T00:10

అమెరికా ఎగుమతుల వివాదం

అమెరికా ఎగుమతుల వివాదం

డబ్ల్యూటీవో నిర్ణయం నేపథ్యంలో భారత్‌ దగ్గర రెండే మార్గాలున్నాయి. తక్కువ ధరకే అందుబాటులోకి రానున్న అమెరికా కోడి మాంసం ధరలను తట్టుకోవాలంటే దేశీయంగా భారీగా దాణా ఖర్చులను తగ్గించేలా సబ్సిడీలు ఇవ్వాలి. ఒక్క కాళ్లు మాత్రమే కాకుండా మొత్తం కోడి దిగుమతులను మాత్రమే అమెరికా నుంచి భారత్‌ అనుమతించాలి. దేశంలో జన్యుమార్పడి కోడిమాంసం దాణా ఉత్పత్తులు దిగుమతి కాకుండా ఆంక్షలు విధించాలి.

భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బృందంలో చర్చకు రానున్న ప్రధాన అంశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, కోడికాళ్లు, డైరీ ఉత్పత్తుల దిగుమతులు ఉండ నున్నాయి. గత పదేండ్లుగా కోడికాళ్ల దిగుమతి చుట్టూ వివా దం కొనసాగుతున్నది. డబ్ల్యూటీవోలో అమెరికాకు అనుకూలంగా నిర్ణయాలున్నాయి. భారత్‌ కచ్చితంగా అమెరికా నుంచి కోడికాళ్లు దిగుమతి చేసుకోవలసిందేనని డబ్ల్యూటీవో చెప్పింది. భారత్‌ దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నది. ఈ పర్యటనలో కచ్చితంగా రెం డు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశమున్నది. ప్రధానంగా దిగుమతి సుంకంపైన వివాదం ముడిపడి ఉంది. ప్రస్తుతం భారత్‌లో కోడికాల్ల దిగుమతి సుంకం 100 శాతం ఉంది. దీన్ని 25-30 శాతం తగ్గించడానికి సిద్ధంగా ఉంది. అయితే దీన్ని 10శాతానికి తగ్గించాలని అమెరికా కోరుతున్నది. దిగుమతి సుంకాలు భారీగా తగ్గిస్తే దేశీయంగా కోడి మాం సపు పరిశ్రమ భారీగా దెబ్బతింటుందని భారతీయ వ్యాపారస్థులు భయపడుతున్నారు. దేశంలో వినియోగదారులు కోడికాళ్లను ఇష్టపడుతారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యేవి కోడికాళ్లే కాబట్టి దేశీయ పౌల్ట్రీరంగం పోటీ తట్టుకోలేక చతికిలపడే అవకాశాలు ఎక్కువ. 


 2011లో ‘ఏవియన్‌ ఇన్‌ ఫ్లూయంజా’ భయంతో భారత్‌ అమెరికా నుంచి కోడిమాంసం ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఫలితంగా ఆ సంవత్సరం నుంచి అమెరికా నుంచి కోడి మాంసం, గుడ్లు, పందిమాం సం మన దేశంలోకి అనుమతించడం లేదు. దీనిపై 2011 అక్టోబర్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద అమెరికా ఫిర్యాదు చేసింది. డబ్ల్యూటీవో అంతర్జాతీ య నిబంధనలు పాటించకుండా భారత్‌ డబ్ల్యూటీవో సభ్య దేశాల నుంచి దిగుమతులు నిరాకరిస్తున్నదని ఆరోపిస్తున్నది. ఈ విష యంలో డబ్ల్యూటీవో అమెరికాకు వత్తాసు పలికింది. 2015 జనవరిలో భారత్‌ అభ్యంత రం చెప్పటంతో ‘అప్పిలేట్‌ బాడీ’కి అప్పగించింది. భార త్‌ అక్కడ కూడా ఓడిపోవటంతో 450 కోట్ల డాలర్లు అమెరికాకు సాలీనా భారత్‌ చెల్లించాలి లేదా దిగుమతులు అనుమతించాలని డబ్ల్యూటీవో ఆదేశించింది. నిర్ణీత కాలవ్యవధిలో దిగుమతులకు భారత్‌ సరే అనాలి. దీనికి 2016 జూన్‌ 19 వరకు భారత్‌కు సమయం ఉండేది. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం కోళ్లు, కోళ్ల మాంసం దిగుమతికి సంబంధించి నూతన మార్గదర్శకాలను కేంద్ర పశుసంవర్థక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం.. భారత్‌లో జన్యుమార్పిడి చేసిన దాణా వేసిన కోళ్లు, మాంసం, శీతలీకరణ మాంసం భారత్‌ నిరాకరించరాదు. అమెరికాకు భారత్‌ అతిపెద్ద కోడి మాంసం విఫణి. మన దేశంలో చికెన్‌ మార్కెట్‌లో సాలీనా 12 శాతం వృద్ధి నమోదవుతున్నది. 2016లో సరాసరిన 92.1పౌండ్ల సరాసరి వినియోగం నమోదైంది. అందుకే అమెరికా భారత్‌ మార్కెట్‌ను వదులుకునేందుకు ఇష్టపడటంలేదు. దీనికితోడు యాంటీ బయోటిక్స్‌ అధికంగా వాడటం, కాళ్లకు ఇవి ఇవ్వటంతో, ఆ రసాయనాల అవశేషాలు కాళ్లలో ఉండటం అమెరికన్లకు నచ్చదు. అందుకే అమెరికాలో కోడి ఛాతీభాగాలకే డిమాండ్‌ ఎక్కువ. కాళ్లకు స్థానికంగా మార్కెట్‌ లేకపోవటంతో శీతలీకరణ చేసి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అమెరికాలో 2014లో కోటి 73 లక్షల టన్నులు కోడి మాంసం ఉత్పత్తిఅయితే, అందు లో 37లక్షల టన్నులు ఎగుమతి చేశారు. అందులో కాళ్లు 17కోట్ల టన్ను లు. భారత్‌ మొత్తం ఉత్పత్తి 37లక్షల టన్నులు. ప్రపంచంలో కాళ్ల మాం సం ఉత్పత్తిలో 5వ స్థానం. మొదటి స్థానంలో అమెరికా, ఆ తర్వాత బ్రెజిల్‌ (1.27 కోట్ల టన్నులు), చైనా (1.3 కోట్ల టన్నులు), ఐరోపా యూనియన్‌ (1.3 కోట్ల టన్నులు). భారత్‌లో ప్రతి నెల సరాసరిన 30 కోట్ల బ్రాయిలర్‌ కోళ్లు వినియోగం ఉంటే, అందులో ప్రాసెస్‌ చేసినవి 5 శాం కంటే తక్కువ. ఇక కోడి కాళ్లు ప్రత్యేకంగా చూస్తే మొత్తం కోళ్ల పరిశ్రమలో 2.2 శాతమే. కానీ డబ్ల్యూటీవో నిర్ణయంతో అమెరికా నుంచి కోట్ల టన్నుల కోడి కాళ్లు అత్యంత చౌకగా మన దేశంలోకి వచ్చిపడనున్నాయి. తాజా కోడి మాంసం, కాళ్ల ధర కిలోకు రూ.150 నుంచి రూ.175 ఉంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కాళ్లు కిలో ధర.రూ.60 నుంచి 70 మాత్రమే. అంటే సగం ధరకే అవి లభ్యమవుతాయి. దేశంలో ఫ్రోజెన్‌ చికెన్‌ మార్కెట్‌ ప్రారంభదశలో ఉంది. పెరుగుతున్న పట్టణీకరణణ, మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య ధోరణులతో ఫ్రోజెన్‌ చికెన్‌ మార్కెట్‌లో సాలీనా 3నుంచి 5శాతం వృద్ధి రేటున్నది. ప్రపంచంలో తలసరి కోడిమాం సం వినియోగం 9 కిలోలు ఉంటే దేశంలో చాలా తక్కువ, మూడు కిలో లు మాత్రమే. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకోవటం భారత్‌, అమెరికాలు రెండింటికీ కీలకమే. భారత్‌కు ఈ రంగం భవిష్యత్తు మార్కెట్‌గా ఉంటే, అమెరికాకు ప్రస్తుతమే పెద్ద మార్కెట్‌. 


ఇక అమెరికా కోడి మాంసంతో ముడిపడి ఉన్న మరో ప్రధాన సమస్య జన్యుమార్పిడి దాణా. అమెరికాలో కోళ్ల మాంసం ఉత్పత్తికి జన్యుమార్పి డి మక్కజొన్న, జన్యుమార్పిడి సోయాబీన్‌ వాడుతున్నారు. వీటి ఉత్పత్తి ఖర్చులు తక్కువ కాబట్టి దాణాకు అయ్యే ఖర్చు తక్కువ. వీటితో పాటు ఆవు, పంది కొవ్వులు కోళ్లకు దాణా వేసి పెంచుతారు. దీంతో తక్కువ కాలంలోనే కోళ్లు ఎక్కువ బరువు పెరుగుతాయి. భారత్‌లో పత్తి తప్పితే ఏ పంటలోనూ జన్యుమార్పిడి రకాల సాగుకు అనుమతి లేదు. ముఖ్యం గా ఆహారధాన్యాలు, పౌల్ట్రీ దాణాకు జన్యుమార్పిడి పదార్థాలు వాడకూడదు. భారత్‌లో జన్యుమార్పిడి, జన్యుమార్పిడేతర కోళ్ల మాంసా న్ని కనిపెట్టే పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదు. ఇక దిగుమతి చేసుకునే మాంసం సముద్రపు పోర్టు ల నుంచి వినియోగదారునికి చేరేలోపు చెడిపోయే అవకాశాలూ ఎక్కువ. కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందటం కష్టమే. అమెరికా నుంచి భారత్‌లో వినియోగదారునికి చేరటానికి సరాసరిన రెం డు నుంచి 4 నెలలు పడుతుంది. కాబట్టి నాణ్యతతో పాటు రుచిలోనూ తేడా ఉంటుంది. అయితే పెరుగుతున్న దాణా ఖర్చుల నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిపడే కోడిమాంసాన్ని ధరలో తట్టుకోవాలంటే తక్కువ ఖర్చుతో వచ్చే జన్యుమార్పిడి దాణాను దేశంలోకి అనుమతించాలని ఇప్పటికే హ్యాచరీలు అడుగుతున్నాయి. జన్యుమార్పిడి దానా దిగుమతికి జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ నిరాకరించింది. దిగుమతి మాంసం ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలకు ముందే నాణ్యత నిర్ధారించేందుకు విధానాలను రూపొందించాలని 2015 జూలైలోనే ‘ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. సాంద్ర పద్ధతిలో కోళ్ల పెంపకం, అధికంగా జీవనాశకాలు వాడటం అనుమతిలేని దాణా ఉపయోగించటం పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ అభ్యంతరాలు చెప్పింది. ఏ విధంగా చూసినా అమెరికా కోడి మాంసం ఉత్పత్తులు భారతీయుల ఆరోగ్యానికి, వ్యాపారానికి గొడ్డలి పెట్టే. 

డబ్ల్యూటీవో నిర్ణయం నేపథ్యంలో భారత్‌ దగ్గర రెండే మార్గాలున్నా యి. తక్కువ ధరకే అందుబాటులోకి రానున్న అమెరికా కోడి మాంసం ధరలను తట్టుకోవాలంటే దేశీయంగా భారీగా దాణా ఖర్చులను తగ్గించేలా సబ్సిడీలు ఇవ్వాలి. ఒక్క కాళ్లు మాత్రమే కాకుండా మొత్తం కోడి  దిగుమతులను మాత్రమే అమెరికా నుంచి భారత్‌ అనుమతించాలి. దేశంలో జన్యుమార్పడి కోడిమాంసం దాణా ఉత్పత్తులు దిగుమతి కాకుండా ఆంక్షలు విధించాలి. కోళ్ల పరిశ్రమ నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ప్రత్యే క నిధిని ఏర్పాటుచేయాలి. ఏ విధంగా చూసినా ప్రస్తుత పరిణామం దేశంలోని పౌల్ట్రీ రంగానికి ఉపాధి, భవిష్యత్తు భద్రతకు పెను ప్రమాదమని చెప్పవచ్చు.

(వ్యాసకర్త: అసోసియేట్‌ ప్రొఫెసర్‌, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)


logo