మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 23, 2020 , 23:40:13

భవిష్యదర్శిని ‘రూపాంతరం’

భవిష్యదర్శిని ‘రూపాంతరం’

రచయిత్రి ‘జ్వలిత’ రచనా రంగంలో అన్ని ప్రక్రియలలోను ప్రవేశమున్న మేధాశక్తి. చెప్పాలనుకున్నది ఏ విషయమైనా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో చెప్పాలా, వద్దా అని సంశయిస్తూ ఉండే మనస్తత్వం కాదు. నిజాన్ని నిర్భయంగా ముఖం ముందే అనేస్తారు. తప్పు చేసినవారు ఎవరైనా ప్రశ్నించే తత్వం ఆమెది. మహిళలను చైతన్యవంతులను చేయాలనే మంచి ఉద్దేశమున్న మానవీయురాలు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి, పురుషులతో సమానంగా ఆడవాళ్ళు హక్కులు ఉపయోగించుకోవాలనేది ఆమె కోరిక. ఆమె మాట్లాడే విధానం కొందరిని బాధించవచ్చు, నొప్పించవచ్చు కాని ఆమె అంతరాన్ని చదివిన వారికి జ్వలిత గారి జ్వలనం వెనుక ఆంతర్యం బోధపడుతుంది. 


‘రూపాంతరం’ కథల సంపుటిలో ప్రతి కథ ఏదో ఒక సామాజిక అంశంతో ముడిపడి ఉంది. కొన్నికథల్లో పరిష్కారమార్గాలు కూడా చూపించారు. కథలు చదువుతున్నంత సేపు ఏదో ఊహ ప్రపంచంలోకి తీసుకునిపోయి తన్మయత్వాన్ని పొంది పరవశంతో తేలిపోయేలా చేయవు.ప్రతి కథ గుండెను ద్రవింపచేస్తుంది. ‘నేనుసైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’అని శ్రీశ్రీ మాటలు వల్లె వేయడం కాదు, నిజమైన మనుషులుగా మీ కర్తవ్యం నిర్వర్తించండని నిర్దేశించినట్లనిపిస్తుంది. ఏ కథను మీటినా గాయాల వేణువే కన్నీటి సంద్రమే.


‘రూపాంతరం’ కథలో ఉపయోగించిన పదజాలం సరళంగా, పాఠకులను ఆకట్టుకునేలా అర్థమయ్యేలా ఉంది. ‘పదేండ్ల పిల్ల ఎర్రగా జిలేబి ముక్కలాగా, కాలి న ఇనుపముద్ద కొలిమిల ఇనుపముక్క లాగా, ఉల్లిగడ్డ కారంలో ముంచిన రొట్టె ముక్కలాగా ఎర్రగ మారింది..’ అనడం భావ చిత్ర దృశ్యానికి నిదర్శనం.   

గ్రామాలలో కులవృత్తుల్లో రక్తసంబంధం లేకపోయినా మామ, బాబాయి, కాకా అని వరుసలతో పిలుచుకుంటూ ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటూ బతుకు చక్రాన్ని లాగిస్తారు. బుజ్జమ్మ, విజ్జమ్మలు కూడా ఈ కథలో నాయన చేసిన పెద్ద బండి పనితనాన్ని గర్వంగా స్నేహితులకు చెబుతూ అక్కా చెల్లెళ్ళు చిలిపి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ తమ కష్టాన్ని కూడా ఆనందించడం శ్రమైక జీవన సౌందర్యానికి అద్దంపట్టినట్టు అగుపిస్తుంది.


కులవృత్తి కనుమరుగై  జీవితాలు ఎలా ఛిన్నాభిన్నమైనయి. వరి కోత మిషనొచ్చి కొలిమిల పని కరువు కావడం, ట్రాక్టరొచ్చి ఎడ్లబండ్ల తయారీ తగ్గడం పనులు దొరకక దిగాలు బడి తాగుడికి అలవాటు పడటం.. కంటికి రెప్పల్లే ఉన్న పనిముట్లు నిరుపయోగంగా పడి ఉండటం చూసే బ్రహ్మయ్య తట్టుకోలేక తాగుడికి అలవాటు పడ్డాడేమోననిపిస్తుంది.

‘రూపాంతరం’ కథ ముగింపులో..‘గాలి, వెలుతురు దూరకుండా తలుపు లు చేసే పనిమంతుడు, నీటిచుక్క జారకుండ తవ్వలు, మానికలు చెయ్యగల వృత్తికారుడు స్వచ్ఛందంగా మరణించబోతున్నాడు. తన నైపుణ్యాలను చంపుకొని జీవన సంస్కృతికి సాక్ష్యాధారాలైన కొలిమికొట్టం, కొలిమితిత్తి, దాతి, సమ్మెట, బాడిస కనుమరుగైపోతయి. ఒక చేతి వృత్తి ధ్వంసమైనరోజది, ఒక జాతి సంస్కృతి, సంప్రదాయ సంపద అంపశయ్యను చేరిన రోజద’ని ముగించడం హృదయాలను కదిలిస్తుంది.


‘రూపాంతరం’ కథ నిరుద్యోగం పెరగడానికి కారణం చేతివృత్తులు ధ్వంసం కావడమేనని స్పష్టం చేస్తుంది’. ‘అమ్మ ఓడిపోయింది’ కథలో లింగ వివక్షత గురించి కళ్ళకు కట్టినట్లు వివరించారు. వద్దని వదిలించుకోబోయిన ఆడపిల్లే ఆసరాగా ఉండటం ఆడదాని అమ్మతనానికి నిదర్శనమైతే, లైంగిక దాడికి గురైన మహిళలకు ఆసరాగా ఉండాలని చెప్పారు.

‘పసిదెట్లయితది?’ కథలో సమాజం పట్ల మహిళలకున్న బాధ్యత, సంఘర్షణ మానవీయ విలువల్ని గౌరవించడం ద్వారా సమాజంలో మార్పు వస్తుందని స్పష్టీకరించారు.

‘పాతగాయం’ కథ ద్వారా ‘కోల్డ్‌స్టోరేజ్‌' పేరిట జరుగుతున్న దారుణమైన మోసాలు, దిగజారిపోయిన రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ విద్యా సంస్థల వికృతాల గురించి తెలియచేశారు. తెలంగాణ విద్యార్థులు ఉద్యమించాలనే సందేశమందించారు.


ప్రతి మనిషిని ఒక వయసులో భయపెట్టేది ఒంటరితనం. మన భావాలు పంచుకునేవారు లేక, మంచిచెడ్డలు అడిగే వారు లేక గతించిన  కాలంలోని స్మృతు లు నెమరువేసుకుంటూ రోజులు గడిపేస్తుంటారు. ఆ ఒంటరి ప్రయాణం భారమనిపిస్తుంది. అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కొందరైతే తమ భావాలు కలిసిన వ్యక్తులు ఫేస్‌బుక్‌లోనో, వాట్సప్‌లోనో కలిస్తే స్నేహం చేయడం మొదలు పెడతారు. అది పెరిగి ఒక దశలో నువ్వే నా ప్రాణమనేంతగా మారి మాట్లాడకపోతే విలవిలాడిపోతారు. ఈ మధ్యకాలంలో ఒంటరితనాన్ని తట్టుకోలేక ఎంతోమంది ప్రముఖులైనవారు కూడా చిపోయిన ఉదంతాలను చూశాం. 

స్నేహం, ప్రేమ అన్ని వయసుల వారికి కావాలి. అవి సమాజసేవలోనో, తోట పెంపకంలోనో, చెట్ల పెంపకం ద్వారానో నేను ఒంటరనే బాధ పోగొట్టుకోవచ్చు.

‘బాధపెట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టేవి స్నేహాలు కావు, ప్రేమలు కావు, ఒక విషపు వలయాలు, జీవితాలనే అతలాకుతలం చేసే సునామీలు అని ‘ఆత్మాన్వేషణ’ కథలో చెప్పడమే కాకుండా అద్భుతమైన పరిష్కారం చూపించారు జ్వలిత గారు.


కవి క్రాంతదర్శి. భవిష్యత్త్తు పరిణామాలు ముందుగానే గ్రహించి రచనలు చేస్తారనడానికి ఈ కథా సంపుటి రుజువు.

‘2019’లో జరిగే సంఘటన 2008లోనే ఆత్మాన్వేషణగా రాయడం అది సాక్షి ఫన్‌డే వారు 2008 ఊహల పల్లకి అంతర్జాల పత్రికలో ప్రచురించడం ఈ మంచి కథా సంపుటి అందించిన మిత్రురాలు జ్వలితకు అభినందనలు. ఇలాంటి సమాజ ప్రయోజనకరమైన కథలు మరిన్ని రాయాలని ఆశ, ఆకాంక్ష.

- యడవల్లి శైలజ, 9394171299


logo
>>>>>>