గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 22, 2020 , 22:44:50

ప్రేమతత్వం.. జాను!

ప్రేమతత్వం.. జాను!

జానకిని ప్రేమించే విషయంలో రామ్‌కు ‘నా’ అనేదేమీ లేదు. ఆ ‘నా’లో అతడి గౌరవం కూడా ఉంది. దానిని కూడా పక్కనపెట్టాడు. రామ్‌ జానకిని ప్రేమిస్తాడు.. అంతేతప్ప ఆమె నుంచి ఏమీ ఆశించడు.. చివరికి గౌరవాన్ని కూడా. ఆమె ప్రేమించినా, ద్వేషించినా అతడినుంచి ఆమె వైపు ప్రవహించేది అనురాగమే. ఎందుకంటే, రామ్‌కు రామ్‌, జానకి అనే ఇద్దరు వ్యక్తుల్లో జానకే సర్వస్వం.. రామ్‌ అవసరమే లేదు.

ప్రేమకన్నా మధురమైనది.. అనే పేరుతో నా అభిమాన రచయితల్లో ఒకరైన రంగనాయకమ్మగారు గతంలో ఒక నవల రాశారు. ఆత్మగౌరవానికి, ప్రేమకు మధ్య వైరుధ్యం తలెత్తినప్పుడు ప్రేమను వదులుకొని ఆత్మగౌరవం బాటన నడువాలన్నది ఆ నవల సారాంశం. రంగనాయకమ్మగారి ఇతర రచనల్లాగే ఇదికూడా ఎం తో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఆ నవల చెప్పే ఆదర్శం పైనే ఉంది సమస్యంతా. ఇటీవల విడుదలైన జాను అనే సినిమా (తమిళంలో 96 అనే సిని మా దీనికి మూలం) నేపథ్యంలో ప్రేమ గురించి, ప్రేమతత్వాన్ని (Philosophy of Life) గురించి మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది.


వినటానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు గానీ.. ప్రేమకు ఆత్మగౌరవానికి పొసగదు. దీనిని జీర్ణం చేసుకోవటం కష్టం అనుకుంటే.. ప్రేమకు, స్వార్థానికి పొసగదని మనకు తెలిసిన మాటల్లోకి మార్చుకోవచ్చు. అప్పుడు స్వార్థమంటే ఏమిటన్న ప్రశ్న వస్తుం ది. తనకు, తన ప్రయోజనాలకు సంబంధించినదే స్వార్థం. నేను, నా జీవితం, నా సంపద, నా హోదా, నా సుఖం, నా సంతోషం.. ఈ జాబితాలోకి ‘నా గౌరవం’ కూడా వస్తుంది. ‘నా గౌరవం’ అనేది కూడా స్వార్థమే. ‘నా’ అనేదానిని ఆత్మ (self) అన్న పదంతో కూడా పూరించవచ్చు. కాబట్టి.. నా గౌరవం అంటే ఆత్మగౌరవమే. ‘నా’ అనేదానిని సంపూర్ణంగా పక్కనపెట్టినప్పుడే అవధుల్లేని, అపరిమితమైన, సంపూర్ణమైన ప్రేమను ఆస్వాదించటం సాధ్యమవుతుంది. 


ఈ ‘నా’ అనేదాంట్లో సంపద, హోదా, సుఖం, సంతోషం వంటి సుపరిచిత మాటలే కాదు.. ఆత్మగౌర వం కూడా ఉంటుందని జాను సినిమా తెలియజేస్తుంది. రామచంద్ర, జానకి అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథే ఈ సినిమా. స్కూల్‌ రోజుల్లోనే వీరి మధ్య గాఢమైన స్నేహం మొదలవుతుంది. పదో తరగతి తర్వాత రామ్‌ కుటుంబం వేరే ఊరికి వెళ్లిపోవటంతో వీరి అనుబంధం భౌతికంగా నిలిచిపోయినా మానసికంగా కొనసాగుతుంది. వాళ్లిద్దరూ ఒకర్నొకరు తల్చుకోని రోజంటూ ఉండదు. మూడేండ్ల తర్వాత జానకిని కలుసుకోవటానికి రామ్‌ ఆమె చదివే కాలేజీకి వస్తాడు. కానీ, ఆ ఊరిలో తనను వెంబడించి వేధిస్తున్న ఒక పోకిరీ వచ్చాడని జానకి పొరపాటుగా భావించి అతడిని కలుసుకోవటానికి నిరాకరిస్తుంది. 


ఏదో కారణాల వల్ల జానకి తనను అసహ్యించుకుంటున్నదని, అందుకే తనను కలుసుకోలేదని భావించి రామ్‌ అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దాదాపు 20 ఏండ్లకు వారి స్కూల్‌ బ్యాచ్‌ పునఃసమావేశం సందర్భంగా వారిద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నప్పు డు.. నాడు జరిగిన పొరపాటు తమ జీవితాలను ఏ విధంగా విడదీసిందో తెలుస్తుంది. అప్పటికి, జానకి పెళ్లి చేసుకొని సింగపూర్‌ లో స్థిరపడుతుంది. ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌గా వృత్తిపరంగా స్థిరపడిన రామ్‌.. జానకి జ్ఞాపకాలతోనే జీవిస్తూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ తమ భావోద్వేగాలను పం చుకోవటం, తీవ్రమైన ఆవేదనతో జానకి సింగపూర్‌కు తిరిగి వెళ్లిపోవటంతో సినిమా ముగుస్తుంది.


ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయమేమంటే.. జానకి తనను అసహ్యించుకుంటున్నదని (పొరపాటుగానే) రామ్‌ అనుకున్నప్పటికీ ఆమెను అలా దశాబ్దాల పాటు ప్రేమిస్తూ, ఆమె జ్ఞాపకాలనే ఆలంబనగా చేసుకొని జీవించటం ఎలా సాధ్యమైంది? అలాగని.. రామ్‌ వ్యక్తిత్వం లేని మనిషి కాదు. తాను ఎంచుకున్న ట్రావెల్‌ ఫొటోగ్రఫీ అంటే అతడికి ప్రాణం. ఫొటోలు తీయటం కోసం సముద్రాల లోతుల్లోకి, మారుమూల అడవుల్లోకి, ఎడారుల్లోకి, పర్వతాలపైకి వెళ్లే సాహసి, పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌. పని లో భాగంగా పేదల వాడల్లో ఉండి వారితో సావాసం చేయగల డు.. స్టార్‌ హోటళ్లలోనూ గడుపగలడు. తన వృత్తితో అంతగా మమేకమైన వ్యక్తి అతను. 


తనచుట్టూ ఉన్నవారిని.. వారి హోదా తో సంబంధం లేకుండా గౌరవిస్తాడు. తన లగేజీని మోసుకెళ్లే రిక్షావాలా ఇబ్బంది పడుతుంటే.. అతడిని పక్కన నిల్చోబెట్టుకొని ఆ రిక్షాను తానే లాగేంత సహృదయుడు. తన వద్ద ఫొటోగ్రఫీ నేర్చుకునే తన స్టూడెంట్స్‌ పట్ల తండ్రిలాగా ఎంతో ప్రేమ చూపుతూనే.. వారిని కట్టుదిట్టమైన క్రమశిక్షణలో ఉంచే మంచి ఉపాధ్యాయుడు. హాస్య చతురత, స్నేహితులతో కలిసిపోయే తత్వం.. ఇవన్నీ రామ్‌ వ్యక్తిత్వంలోని అంశాలు. ఇటువంటి రామ్‌ పిచ్చివాడిలాగా జానకినే ఆరాధిస్తూ, పెండ్లి కూడా చేసుకోకుండా ఎందుకు ఉండిపోతాడు? అదికూడా జానకి తనను ద్వేషిస్తున్నదని తెలిసి (పొరపాటుగానే అయినప్పటికీ), ఆమె పెండ్లి చేసుకున్నదని, ఆమెకు ఒక కూతురు కూడా ఉన్నదని తెలిసి కూడా ఎందుకు ఆమె మీద అతడికి అంత ప్రేమ? అతడికి ఆత్మగౌరవం లేదా? లేదు. 


రామ్‌ జీవితాన్ని పరిశీలిస్తే జానకికి సంబంధించినంతవరకూ అతడికి ఆత్మగౌరవం లేదనే మనకు అర్థమవుతుంది. జానకిని ప్రేమించే విషయంలో రామ్‌కు ‘నా’ అనేదేమీ లేదు. ఆ ‘నా’లో అతడి గౌరవం కూడా ఉంది. దానిని కూడా పక్కనపెట్టాడు. రామ్‌ జానకిని ప్రేమిస్తాడు.. అంతేతప్ప ఆమె నుంచి ఏమీ ఆశించడు.. చివరికి గౌరవాన్ని కూడా. ఆమె ప్రేమించినా, ద్వేషించినా అతడినుంచి ఆమె వైపు ప్రవహించేది అనురాగమే. ఎందుకంటే, రామ్‌కు రామ్‌, జానకి అనే ఇద్దరు వ్యక్తుల్లో జానకే సర్వస్వం.. రామ్‌ అవసరమే లేదు. అతడి ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందంటే.. ఆమెకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులను కూడా 22 ఏండ్లుగా పదిలంగా దాచుకుంటాడు. 


జానకిని కలుసుకున్నప్పుడు వాటిని అపురూపంగా చూపిస్తాడు (కాలేజీ రోజుల్లో మా క్లాస్‌లో ఒక స్నేహితుడు ఉండేవాడు. తను రహస్యంగా ప్రేమిస్తున్న అమ్మాయికి ఒకసారి ఒక పుస్తకం ఇచ్చాడు. ఆమె ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చినప్పుడు ఒక కవర్‌లో పెట్టి ఇచ్చింది. ఆ ప్లాస్టిక్‌ కవర్‌ను అతడు ఒక ట్రోఫీలాగా, ఆమె జ్ఞాపకంగా దాచుకునేవాడు). ప్రేమ అనేది ఎంత సున్నితమైన, అందమైన భావనో, అదెంత గాఢంగా ఉంటుందో ఎంతటి అపురూపమైన త్యాగాలనైనా ఎంత సహజంగా, సులభంగా చేయిస్తుందో తెలియజేసే సినిమా జాను. ఈ సినిమాకు మూలమైన తమిళ సినిమా ‘96’ ఇంకా అద్భుతంగా ఉంటుంది. వీలైతే అది చూసి ఒక గొప్ప ప్రేమకావ్యాన్ని ఆస్వాదించవచ్చు.


ఇంతగా ప్రేమించుకున్న వ్యక్తులు కలిసి ఉండకపోవటం ఎంత టి అన్యాయం? వాళ్లు ఎందుకు కలిసి ఉండలేరు? ఎందుకంటే, మనమున్న సమాజంలో ప్రేమించుకున్నవాళ్లు ఒకటి కాకుండా అడ్డుపడే అంశాలు అనేకం. కులం, మతం, ప్రాంతం, ఆర్థికహోదా మాత్రమే కాదు.. పెళ్లికూడా ప్రేమకు అవరోధమే (దీని గురించి చలం రాసినంత స్పష్టంగా ఎవరూ రాయలేదు). రామ్‌ అంటే జానకికి అంతులేని ప్రేమ. కానీ, అతడితో కలిసి ఉండలేదు. ఎందుకంటే, ఆమెకు భర్త, కూతురు ఉన్నారు. వారిని వదిలివేయలేదు. రామ్‌తో కలిసి ఉండలేదు. అంటే, ప్రేమను చంపుకొని ఆమె బతుకాల్సిందే. ప్రేమను చంపే సమాజం మనది. మరి, దీనికి పరిష్కారం ఏమిటి? మాతృకేంద్రక వ్యవస్థలే దీనికి పరిష్కారం. ఎటువంటి ఆర్థిక, సామాజిక అంతరాలు మాత్రమే కాదు.. వివాహమనేది కూడా లేని ఆ సమాజంలోనే స్త్రీ, పురుషుల ప్రేమబంధానికి ఎటువంటి అవరోధాలుండవు. పిల్లలు ఉండేది తల్లితోనే కాబట్టి.. పిల్లలకు తల్లి దూరమయ్యే మాటే ఉండదు. 


మరి పురుషులకు పిల్లలతో అనుబంధం ఉండదా అంటే.. ఉంటుంది. ఆ వ్యవస్థల్లో పురుషులకు తమ సొంత పిల్లలతో కంటే (తమ ప్రియురాలికి పుట్టిన పిల్లలతో కంటే) తమ అక్కాచెల్లెళ్ల పిల్లలతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. తల్లి కేంద్రంగా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లతో కూడిన కుటుంబమే మాతృకేంద్రక వ్యవస్థలకు మూలం. వీరి ప్రణయ సంబంధాలు బయటివారితో ఉంటాయి. వారికి ఈ కుటుంబంలో ప్రవేశం ఉండదు. మానవ సమాజాన్ని పదుల వేల ఏండ్లపాటు నడిపించి బహుశా ఓ ఐదు వేల ఏండ్ల నుంచి కనుమరుగైన మాతృకేంద్రక వ్యవస్థలు మాత్రమే నేడు మనం చూస్తున్న అన్ని సమస్యలను పరిష్కరించగలుగుతాయి.


logo
>>>>>>