శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Feb 22, 2020 , 22:42:16

జల శాస్త్రజ్ఞుడు కేసీఆర్‌

జల శాస్త్రజ్ఞుడు కేసీఆర్‌

తెలంగాణ దేశానికి మోడల్‌గా మారిందని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ అన్నప్పుడు 2001 ఏప్రిల్‌ 27కు ముందు అసెంబ్లీలో కంఠం విప్పిన కేసీఆర్‌ గుర్తుకువచ్చాడు. ఒక్కడే.. ఒకే ఒక్కడే.. ఈ బక్కమనిషే అరుస్తున్న అరుపు అది భవిష్యత్‌ తెలంగాణ రాష్ట్రం అవుతుందని నాడు ఎందరూహించారో!! తెలంగాణ కన్నీటి గాథను వినిపిస్తున్న సందర్భంలో మొత్తంగా అసెంబ్లీ నివ్వెరపోయి చూసింది నిజం.

అతడొక జలశాస్త్రం. జలాలు సమాజ ముఖచిత్రాన్ని ఎట్లా మార్చగలవో తెలుసుకొని తన చేతులతో జలాలను ఒడిసిపట్టుకుని బీడు భూములపైకి గంగమ్మను ప్రవహింపచేశాడు. నీళ్లే నాగరికతకు పురుడుపోశాయని చెప్పుకోవటం కాదు ఆ నీళ్లను తన నేలపైకి మళ్లించి తెలంగాణ సమాజ నిర్మాణానికి  పటిష్టత తెచ్చేందుకు కేసీఆర్‌ రేయనక పగలనకా శ్రమించి జలదీక్ష చేపట్డాడు. ఈ సృష్టి ప్రాణకోటికి ఇచ్చిన జలాలను మహా జనావళికి అందించటమే అసలైన మానవసేవ. ఆ మానవసేవను అందజేసిన జల మాధవుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.


మంచినీళ్ల కోసం కోసులదూరం నడిచిపోయి ఒంటెల కడుపుల్లో నీళ్లు దాచుకున్నట్లు బిందెలతో తల్లులు నీళ్లు మోసుకొచ్చిన దృశ్యాలను చూసిన బిడ్డలం కాదా మనందరం. వూళ్లకు వూళ్లు కరువులు బారినపడి వలవల ఏడ్చుకుంటూ ముంబైలు, దుబయిలు ఎక్కడికంటే అక్కడికి పొట్టచేతబట్టుకుని పోయారు కదా! తెలంగాణ గూడు చెదిరిన పక్షుల గుంపుగా మారింది. కల చెదిరింది కల్లోలాలు కరువు ల రూపేణా తెలంగాణ ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు, తలపక్కన కృష్ణాగోదావరి నదులు ప్రవహిస్తున్నప్పుడు కదా కవులు కట్టలు తెగిన ఆగ్రహాన్ని ప్రకటించారు. గుండె గొంతుకల్లోంచి వచ్చిన మహావాక్యాలు కదా ‘పొక్కిలి’, ‘మత్తడి’ కవిత్వసం కలనాలైంది. మలిదశ ఉద్యమ పొలికేకగా కేసీఆర్‌ తన కంఠాన్ని పగులుగొట్టుకొని అసెంబ్లీ లో నీటికేక వేసింది. అడుగడుగున జరిగిన మోసాల, ద్రోహాల గుట్టువిప్పి అసెంబ్లీ సాక్షిగా కదా కేసీఆర్‌ కంఠం ఉద్యమప్రళయ సంగీతమైంది. అది మహోజ్వల మలిదశ ఉద్యమ జలపాతంగా మారింది. జల సంగీతాలను వినిపించింది. జలప్రళయ ఉద్యమభేరీలు మోగించింది.


మలిదశ తెలంగాణ ఉద్యమం ఎన్నెన్నో పాటల కావ్యాలను ఆవిష్కరించింది. కవిత్వ శంఖారావాలను పూరించింది.

తల్లిస్తైన్యం బిడ్డకందనప్పుడు వేసిక కేక నా తెలంగాణ అంటూ కవిత్వాలు రాసి తలతిప్పుకుపోతున్న కృష్ణా గోదావరులను ఆగ్రహం తో శపించింది నిజం. నల్లగొండలో కవుల సమ్మేళనం జరిగితే ఫ్లోరోసిస్‌ నీళ్లను చూసి కోదాడ నుంచి కొడంగల్‌ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్‌ పాటలు కట్టాడు. కేసీఆర్‌ ఉద్యమ పిడికిలిగా మారారు. ఈడు బోయిన చెలకలా.. ఇసిరిపారేసిన పొట్టపేగుల్లా... తీరని గోసకు ఆర్తులకు ఆర్తిగా నా తెలంగాణ మారింది. పగిలిన పొదల దారుల్లోంచి పత్తిగింజల పెచ్చులు పచ్చపురుగులా ఒంటిమీద అంబాడుతున్న దరి ద్రం.. పగిలిన కన్నీళ్ల బిందువులకు చినుకుల వానగా తెలంగాణ మారింది. పగిలిన కన్నీళ్లు గొంతులు తెరిచిన ప్రవాహంగా తెలంగాణ అయ్యింది. పగలగొట్టిన కల నుంచి కలకలలు.. నా కొలిమిల  మం డింది నా చేతులే.. చరిత్రకు నాగలినిచ్చిన వాకిళ్లు పొక్కిలయ్యాయి. నోటికి మూతికి మధ్య అందని బువ్వగా మారింది గద నా తెలంగా ణ అని ఉప్పొంగి కవిత్వమైంది నిజం. యాడబడితే ఆడదొరికే మానవత్వపు పంటల తోపు తెలంగాణ నీళ్లందని నేలయ్యింది.


మెతుకులేని సీమ మెదక్‌ అని ఎన్నెన్నో పాటలు వచ్చాయి. వాన మ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవమ్మా అని ఎన్నెన్నో పాటలు వచ్చాయి. కరువు కళ్ల నీళ్ల మీద రాయని కవే తెలంగాణలో లేరు. తెలంగాణ నేలలలో గొట్టపు బావుల విషాదాన్ని వర్ణించని కవులులేరు. నీళ్లులేక నిప్పుల వర్షం కురుస్తున్న తీరు, కాలం ఎదురుతిరిగి నీటివాటా దక్కక తెలంగాణ తల్లడిల్లిపోయింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ కాదు. నా తెలంగాణ కోటి కత్తుల వాన’ అంటూ రాసుకుంటూపోయారు. నేను నా నేల, నా గాలి, నా నీరు, నా ఊరు కావాలని కలమెత్తారు. నదుల గోడలు కూలగొట్టి నా కరువు నేలపై నీళ్లు పారించే వ్యక్తికోసం తెలంగాణ తల్లి మలిదశ ఉద్యమం వైపు చూసిం ది. తల్లి పాలు దొరుకని శైశవ రోదనలు నేపథ్య స్వరాల్లోని కరువు గీతాల పల్లవిగా కవుల కలం మార్మోగింది. ఎండిన పైరుల మీదుగ తేలివచ్చే పచ్చిగాయాల గొంతుకల్లోని ఉద్యమగీతమైంది తెలంగాణ.

ప్రాణాలను హ్యండ్‌బోర్‌లో పెట్టి మంటల్లో రాచకొండలు ఎట్లా మండుతుండెనో కదా! ఆశల కండ్లు నలుపుకొని మేఘాలు ఉరిమినప్పుడల్లా అర్జునా.. ఫల్గుణా అంటూ ఉలికిపడి చూసుకుం టూ బోరుబావుల్లోకి తలలపెట్టి నీటిని కన్నీళ్లతో తోడిపోసుకున్నది నిజం. ఎన్ని బోర్లువేసినా ఎం త తవ్వుకుంటుపోయినా కన్నీళ్ల లోతు తగల టం తప్ప జలపడ్డ శబ్దం వినపడకపోయేది. నీళ్లు లేకుండా పచ్చటి కలలను ఎట్లా కనగలమని కవుల ప్రశ్నలు.


గాలికి తాటాకు లెగిరిన సగం ఒంగిగోడలతోనున్న దృశ్యాలు. నీళ్లులేని భూముల్లో పస్తుల పయిటాలలు, ఏడుపాగని వూర్ల గోసలు, తల్లడిల్లుతున్న బిడ్డలగోసగా మారిన దృశ్యాలను చూసినంకనే నల్లగొండలో 40 బోర్లు వేసినా నీళ్లు పడని హృదయవిదారక దృశ్యాన్ని ఉద్యమ గొం తుకగా కేసీఆర్‌ పదేపదే చెప్పారు. నీళ్లులేని దుస్థితి, కరెంట్‌ లేని విషమపరిస్థితి, నీళ్లులేక బత్తాయి తోటలను నరికేసుకుంటూ రైతు గుక్కబెట్టి గుండెపగిలేలా ఏడుపులను విన్న తర్వాత అసెంబ్లీ అదిరేవిధంగా కేసీఆర్‌ గర్జించారు. పాదయాత్రల ద్వారా ఎండిపోయిన కాలువలను, పూడిపోయిన చెరువులను చూసి ఆ దృశ్యాలన్నింటినీ తన కళ్లనిండా నింపుకోవటం వల్ల మాత్రమే కేసీఆర్‌ జలశాస్త్రంగా మారారు.


తెలంగాణ కన్నీళ్లు తుడవాలంటే మొదట ఈ నేలమీద నీళ్లు పారాలని తొలి ప్రాధాన్యంగా బీడుభూములకు నీళ్లు మళ్లించాలని నిర్ణయించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమనే కఠోర తపస్సు చేపట్టారు. ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడినా, ఎన్నెన్నో అడ్డంకులు కలిగించినా వెనుదిరగకుండా ముందుకు సాగి తెలంగాణ నేలపైకి గంగమ్మను రప్పించారు.

ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్‌ ఒక జలపాఠం. తెలంగాణకు కేసీఆర్‌ బీడు భూములపై పచ్చటి పంటైనాడు. పాలమూరు కరువుసీమ ను ఆకుపచ్చగా మార్చాడు. తెలంగాణ ప్రజల దుఃఖాన్ని పారద్రోలే ఆశ ల జలపాతంగా కాళేశ్వరం మహా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. భగీరథుడే తన్మయంతో చూసే ఒక మహోన్నత స్థితి తెలంగాణలో కల్పించబడింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి తననుతాను విస్తరించుకున్నప్పుడు మాత్రమే నదిగా మారుతారు. అలాంటివాళ్లే దార్శనికులవుతారు. కేసీఆర్‌ తనను విస్తరించుకొని కాళేశ్వరంగా మారారు.


తెలంగాణ దేశానికి మోడల్‌గా మారిందని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇం డియా రాజేంద్రసింగ్‌ అన్నప్పుడు 2001 ఏప్రిల్‌ 27కు ముందు అసెంబ్లీలో కంఠం విప్పిన కేసీఆర్‌ గుర్తుకువచ్చాడు. ఒక్కడే.. ఒకే ఒక్కడే.. ఈ బక్కమనిషే అరుస్తున్న అరుపు అది భవిష్యత్‌ తెలంగా ణ రాష్ట్రం అవుతుందని నాడు ఎందరూహించారో!! తెలంగాణ కన్నీటి గాథను వినిపిస్తున్న సందర్భంలో మొత్తంగా అసెంబ్లీ నివ్వెరపోయి చూసింది నిజం.ఎందరెందరో నేతల్ని చూసి వారు మాట్లాడే మాటల్ని విన్న అసెం బ్లీ కేసీఆర్‌ను చూసి నిబిడాశ్చర్యంతో నిశ్చేష్ఠురాలైంది. తెలంగాణ కన్నీటి గోసను తీర్చే ఒక నాయకుడు రాబోతున్నాడని అందరికంటే ముందు అసెంబ్లీ భవనం గుర్తించి గర్వంతో మీసం మెలేసింది. ఈ దేశంలో నీటి స్పృహ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాజేంద్రసింగ్‌ ప్రకటించిన వార్త చదివాక 20 ఏండ్ల కిందట తెలంగాణ ఎట్లుండె? నాటి తెలంగాణ కరువు నోటిలో పడి ఎలా విలవిలలాడిందో? ఈ దుస్థితి నుంచి తెలంగాణ బయటపడాలన్న ఉద్యమదర్వాజ తెరిచింది అసెంబ్లీలో కేసీఆర్‌ అరిచిన అరుపు. అదొక ఉరుముగా ప్రళయంగా మారిన పధ్నాలుగేండ్ల మలిదశ మహోద్యమం. కదిలిన తెలంగాణ మహాప్రజ. కదిలించిన కేసీఆర్‌ స్థానం  చరిత్రలో చెరిగిపోనిది.


‘గోదావరికి కొత్తనడక నేర్పిన పాలకుడు సీఎం కేసీఆర్‌' అన్న రాజేంద్రసింగ్‌ మాటలు జలచరిత్రకు పాఠ్యాంశం. ఇప్పుడు కేసీఆర్‌ నిర్మించిన తెలంగాణ చరిత్ర కాళేశ్వరం ఎత్తిపోతల దృశ్యాలుగా ఎగిసిపడుతూ, మిషన్‌కాకతీయ ప్రాజెక్టుల నుంచి చెరువుల తూముల నుంచి ఎర్రసెలకల మీదకొచ్చి నిక్షిప్తమైంది.


logo