గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 21, 2020 , 23:09:09

ట్రంప్‌ పర్యటన

ట్రంప్‌ పర్యటన

అమెరికా కోరుకుంటున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సెప్‌) ఒప్పందం సాకారమై ఉంటే భారత్‌ ఇప్పటికే చాలా నష్టపోయేది. ఈ ఒప్పందం నుంచి ఎన్డీయే ప్రభుత్వం బయటకురావాలని గతేడాది నవంబర్‌లో నిర్ణయించటం ముదావహం. పొరుగుదేశాలు ముఖ్యంగా చైనా ప్రాంతీయంగా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాలు, టెర్రరిజానికి అండగా నిలుస్తున్న పాక్‌ చర్యలకు చెక్‌ పెట్టాలంటే అమెరికా అండతో వ్యూహాత్మక దౌత్యసంబంధాలను బలోపేతం చేసుకోవాలి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు భారత్‌ ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24, 25 తేదీల్లో  దేశంలో ట్రంప్‌ రెండురోజుల పర్యటించనున్నారు. తొలిరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇటీవలనే నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోతెరా స్టేడియం దాకా 22 కి.మీ. రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ షోలో దారిపొడవునా అందంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేరీతిలో తీర్చిదిద్దిన వేదికలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు దేశం నలుమూలల నుంచీ కళాకారులను రప్పిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.


‘నమస్తే ట్రంప్‌' పేరుతో మోతెరా స్టేడియంలో నిర్వహిస్తున్న స్వాగతసభలో మోదీ, ట్రంప్‌ ప్రసంగిస్తారు. ఇది అమెరికా పర్యటనలో మోదీకి ఏర్పాటుచేసిన ‘హౌడీ మోదీ’ సభకు ధీటుగా జరిపేందుకు అటు కేంద్రం, ఇటు గుజరాత్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రెండో రోజు తాజ్‌మహల్‌ను ట్రంప్‌ సందర్శిస్తారు. దీనికిగాను ఆగ్రా ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఈ పర్యటన నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గుజరాత్‌ లో సబర్మతీ నదీతీరం వెంబడి ఉన్న మురికివాడలు ట్రంప్‌కు కనిపించకుండా అడ్డుగోడలు కట్టడం, ఇదేరీతిలో ఢిల్లీలోనూ యమునా తీర ప్రాంతంలో యాచకులు కనిపించకుండా దూరప్రాంతాలకు తరలించటం విమర్శలకు తావిస్తున్నది.


ట్రంప్‌ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కుదిరే దౌత్య, వాణిజ్యపరమైన ఒప్పందాల విషయంలో స్పష్టత లేకున్నా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌, అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత పర్యటన ను కేవలం స్నేహపూర్వక సౌహార్ద్ర సందర్శనగా ఎవరూ పరిగణించకపోవటమే దీనికి కారణం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు భారత్‌ పర్యటన మొదటిదే అయినా, ఈ 8 నెలల కాలంలో వివి ధ సందర్భాల్లో ట్రంప్‌తో మోదీ ఐదు సార్లు భేటీ అయ్యారు. గతేడాది అమెరికా పర్యటన సందర్భంలో కూడా మోదీ పర్యటన నుంచి అమెరికాలోని ప్రవాస భారతీయులు ఎంతో ఆశించారు. ఆ క్రమంలో జరిగిన ప్రచార ఆర్భాటం అంతా ఇంతా కాదు. 


ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన వలసలు, హెచ్‌1బీ వీసాల విషయంలో అనుసరించిన కఠిన విధానాలతో భారత సంతతి విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యా రు. సరిగ్గా ఆ సందర్భంలోనే మోదీ అమెరికాలో పర్యటించారు. భారతీయుల భయాలు దూరంచేసే దిశలో విధాన నిర్ణయాలు ట్రంప్‌ నుంచి వెలువడుతాయని ఆశించారు. కానీ అలాంటిదేమీ లేకుండానే మోదీ ప్రచార పటాటోపంతోనే ముగిసింది. ప్రస్తుత ట్రంప్‌ భారత్‌ పర్యటన ప్రచారానికే పరిమితమైనదని అనుకోవటానికి లేదు. గత కొన్నేండ్లుగా అమెరికా భారత్‌ నుంచి విస్తృతస్థాయి స్వేచ్ఛా వాణిజ్యానికి తహతహలాడుతున్నది. ఇందులో వ్యవసాయరంగ ఎగుమతులు, డెయిరీ తదితర రంగాల్లో స్వేచ్ఛా వాణిజ్యానికి, ఎగుమతులకు అవకాశం ఉండాలని అమెరికా ఆశిస్తున్నది. దీనికి సంబంధించి విస్తృతస్థాయి ఒప్పందాలు ఇప్పటికిప్పుడు కుదరకపోయినా, మౌలికంగా ప్రాథమికస్థాయి ఒప్పందాలతోనైనా తిరిగివెళ్లాలని ట్రంప్‌ పర్యటనలో ఉన్న ఆలోచనలని అర్థమవుతున్నది.


అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల్లోనే గాక, వాణిజ్య ఒప్పందాల్లో భారత్‌కు కీలక భాగస్వామ్యం ఉన్నది. రక్షణ, సహకార ఒప్పందాల్లో ఇరుదేశాలు భాగస్వాములై ఉన్నాయి. అమెరికా నుంచి భారత్‌ రక్షణరంగంలో మూడు బిలియన్‌ డాలర్ల విలువైన కొనుగోళ్లు చేస్తున్నది. అమెరికా లో ట్రంప్‌ అవలంబిస్తున్న ఆత్మరక్షణ విధానాల నేపథ్యంలో భారత్‌ వ్యాపారరంగంలో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. టారిఫ్‌ల పెంపు, కొన్నిరకాల అల్యూమినియం లోహ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించటంతో భారత్‌ తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుతం అమెరికా ఆశిస్తున్నట్లు వ్యవసాయం, డెయిరీ రంగాల్లో బహుళజాతి సంస్థల్ని అనుమతించాలన్నది అమెరికా ఆకాంక్ష. ఇదే జరిగితే ఈ రెండురంగాలకు శరాఘాతమే. దేశంలోని చిన్నస్థాయి డైయిరీ రైతులు, స్థానిక సహకార సంఘాలు, చిన్నస్థాయి అమ్మకందారులు సుమారుగా 15 కోట్ల మంది తీవ్రంగా నష్టపోతారు. గ్రామీణ ప్రాంతంలోని చిన్నతరహా డెయిరీల వార్షిక ఉత్పత్తి విలువ పదివేల కోట్ల డాలర్లు. 


దేశంలో ఉత్పత్తయ్యే పాలలో సగం గ్రామీణ భారతం నుంచే వచ్చి దేశ అవసరాలను తీరుస్తున్నాయి. పాల ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం డెయిరీ రైతులకు అందుతున్నది. అమెరికా కోరుతున్న విధంగా స్వేచ్ఛా వ్యాపారానికి తావిస్తే ఈ రంగమంతా విధ్వంసమై రైతాంగం తీవ్రంగా నష్టపోయి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అమెరికా కోరుకుంటున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సెప్‌) ఒప్పందం సాకారమై ఉంటే భారత్‌ ఇప్పటికే చాలా నష్టపోయేది. ఈ ఒప్పందం నుంచి ఎన్డీయే ప్రభుత్వం బయటకురావాలని గతేడాది నవంబర్‌లో నిర్ణయించటం ముదావహం. పొరుగుదేశాలు ముఖ్యంగా చైనా ప్రాంతీయంగా అనుసరిస్తున్న ఆధిపత్య విధానాలు, టెర్రరిజానికి అండగా నిలుస్తున్న పాక్‌ చర్యలకు చెక్‌ పెట్టాలంటే అమెరికా అండతో వ్యూహాత్మక దౌత్యసంబంధాలను బలోపేతం చేసుకోవాలి. విశాల భారత ప్రయోజనాలకు విఘాతం కలుగనిరీతిలో వాణిజ్య ఒప్పందాలకు పెద్దపీట వేయాలి. 


logo