శుక్రవారం 30 అక్టోబర్ 2020
Editorial - Feb 21, 2020 , 23:04:34

జీవనదిని కలుషితం చేయొద్దు

జీవనదిని కలుషితం చేయొద్దు

గోదావరినదికి రెండువైపులా విస్తరించి ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలకు సంబంధించిన డ్రైనేజీ కాలువలను కూడా ఎలాంటి ట్రీట్‌మెంట్‌ నిర్వహించకుండానే నేరుగా నదీ ప్రవాహంలోకి యథేచ్ఛగా వదిలిపెడుతున్నారు. గోదావరినదీ లోయలో సింగరేణి నిర్వహిస్తున్న బొగ్గుగనులకు సంబంధించిన పారిశ్రామిక వ్యర్థాలు, సిమెంటు, కాగితం తదితర పరిశ్రమల నుంచి గోదావరి నదిలోకి వచ్చి కలిసే రసాయనిక వ్యర్థాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సంబంధించిన పలు కాలుష్య కారకాలు గోదావరి నదీజలాలకు కాలుష్య ప్రమాదాలుగా పరిణమించాయి.

ఉమ్మడి రాష్ట్ర ఉనికి కాలంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడం ఎట్లా అనే అత్యంత క్లిష్టమైన విపత్కర పరిస్థితుల్లో ఉన్నది తెలంగాణ సమాజం. ఆరేండ్ల స్వల్పవ్యవధిలో ఇవ్వాళ అత్యవసరమైన నీటి యాజమాన్య విధానాలను రూపొందించుకొని సమర్థవంతంగా అమలుపరుచడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అతికీలకమైన సందర్భానికి చేరుకున్నది. నదీ ప్రవాహాల ద్వారా సముద్రంలోకి వృథాగా చేరుకునే వాననీటిని ఒడిసిపట్టుకున్నది. 


ఈ నీటిని మానవ సంక్షేమం కోసం, స్థానిక అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా సాగునీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించిన విధివిధానాలను స్వయంగా రూపొందించుకొని సమర్థవంతంగా అమలుపరుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు దేశానికే దిశానిర్దేశంగా నిలుస్తున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం కేంద్రంగా సాక్షాత్కారమైన గోదావరి ప్రాణహిత నదీజలాల వినియోగంలో సీఎం కేసీఆర్‌ మేధోమథనంలో ఉదయిస్తున్న కొత్తకొత్త ఆలోచనలు సాగునీటి రంగంలో జాతీ య, అంతర్జాతీయస్థాయి సాగునీటి రంగ నిపుణులకు కూడా అందనిరీతిలో అమలులోకి వస్తున్న వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నాయి.


ఇప్పటివరకు అమల్లో ఉన్న పద్ధతులకు భిన్నమైన రీతిలో కాళేశ్వరంలాంటి భారీ ఎత్తిపోతల పథకాలను నిర్వహిస్తున్నప్పుడు, దానికి అనుసంధానంగా నదీగర్భాన్నే జలాశయాలుగా మలచుకొని ‘బ్యాక్‌ వాటర్‌'ను నిలువ చేసుకుంటున్నప్పుడు ముందుగా ఊహించని రీతిలో ఆచరణలో కొన్ని అనుకోని ఆవాంతరాలు ఎదురైన అనుభవం ద్వారానే పరిశీలించగలుగుతాం. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైన్‌ రూపొందించుకుంటున్న సందర్భంగా ప్రణాళికలో గానీ, ఆలోచనలో గానీ లేని అనేక అంశాలను ప్రాజెక్టుల నిర్మాణక్రమంలోనూ, వినియోగంలోకి వస్తున్న క్రమంలోనూ సీఎం కేసీఆర్‌ వినూత్నమైన అనుబంధ పథకాలుగానే జోడించారు. 


గోదావరి నది మీద అతికీలకమైన శ్రీరాంసాగర్‌ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన ‘పునరుజ్జీవన పథకం’, తెలంగాణలో అందుబాటులో ఉన్న చిన్ననీటి వనరుల మీద రూ.4535 కోట్ల ఖర్చుతో  నిర్మించతలపెట్టిన 1235 ‘చెక్‌డ్యాం’ల నిర్మాణం, మానేరు నదీగర్భాన్ని సైతం జీవనదిగా మార్చేందుకు ఉద్దేశించిన 181 కి.మీ. పరిధిలో ఎగువ మానేరు నుంచి మంథని సమీపంలో గోదావరినదిలో కలిసేవరకు రూ.497 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించిన 22 ‘షేక్‌ హ్యాండ్‌ చెక్‌డ్యాం’లు, వేములవాడ నుంచి మధ్యమానేరు వరకు మూలవాగుపై రూ.48 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించిన 12 చెక్‌డ్యాం... ఇవన్నీ సాగునీటి పథకాల రూపకల్పన, కార్యాచరణ క్రమంలో కేసీఆర్‌ దూరదృష్టి నుంచి వాస్తవరూపంలోకి వస్తున్న అంశాలే. పంటపొలాల నుంచి వృథాగా దిగువ ప్రాంతాలకు చేరుకునే ‘పడువాటి’ (రీ ఛార్జెబుల్‌) నీటిని కూడా ఒడిసిపట్టుకొని సద్వినియోగం చేసుకోవాలనే అనితరసాధ్యమైన అతిసూక్ష్మ ఆలోచన ముఖ్య మంత్రి బుద్ధికుశలతకు అద్దం  పడుతుంది!


కాళేశ్వరం ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకుండానే, కృష్ణానదిపై నిర్మాణంలోఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణ దశ స్థాయిలో ఉండగానే తెలంగాణ ప్రాంతం పంటపొలాలతో, పచ్చదనంతో, ప్రకృతి అందాలతో కోనసీమను, కేరళ పరిసరాలను మరిపిస్తున్నదనే మెచ్చుకోలు మాటలను ఇటీవలికాలంలో విరివిగా వింటున్నాం. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల విస్తీర్ణాన్ని సంపూర్ణంగా సాగు యోగ్యానికి తయారుచేసుకోవాలనే లక్ష్యం నెరవేరడానికి అవసరమైన పూర్వరంగాన్ని నిర్మించుకోవడం ఒక అద్భుతమైన అభివృద్ధి సూచికగా స్వీకరిస్తూనే, మరోవైపున ప్రతికూలంగా పొంచి ఉన్న ప్రమాదాల విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మన బాధ్యతగా తెలంగాణ సమాజం భావించవలసి ఉన్నది. 


మానవాళి నిర్లక్ష్యాలు, మానవ తప్పిదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక నదులు తమ పూర్వవైభవాన్ని, ప్రాశస్త్యాన్ని, ఉనికి కోల్పోయిన దుష్టాంతాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఎంతో పవిత్రమైనదిగా భావించే గంగానది, మన రాష్ట్రంలో మన కళ్లముందు సాక్షాత్కారంగా నిలిచి ఉన్న మూసీనదులు ఎదుర్కొంటున్న దుర్భర, దుర్గంధ పరిస్థితులను మననం చేసుకోవాలి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూ.లక్షల కోట్లు వెచ్చించి రాష్ట్ర ప్రజల సంక్షేమాలను కాం క్షించి వినియోగంలోకి తీసుకువస్తున్న మన నదీనదాల స్వచ్ఛతను కాపాడుకోవడంలో పౌరసమాజం  నిర్వర్తించవలసిన కర్తవ్యాలపై పెద్ద ఎత్తున ప్రచా రం నిర్వహించాలి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులతో నిండుకుండలా జలకళలాడుతున్న గోదావరి నది ఒక కాలుష్యకాసారంగా, మురికికూపంగా తయారుకాకుండా కాపాడుకోవాల్సిన అవసరాన్ని పరీవాహక ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే గతంలో ఎడారిని తలపించేలా ఎండిపోయిన గోదావరి నదికి, నదీజలాలతో రెండు దరులను తాకుతూ జీవనదిలా ప్రవహిస్తున్న ఇవ్వాల్టి గోదావరి నదికీ భూమ్యాకాశాలకున్నంత తేడా ఉన్నది.


గోదావరినదీ తీరప్రాంతాలను ఆనుకొని ఉన్న బాసర, ధర్మపురి, కోటిలింగాల, మంథని, కాళేశ్వరం, భద్రాచలం తదితర హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించే లక్షలాదిమంది భక్తులు తమ పితృదేవతలకు గోదావరినదిలో పిం డప్రదానాలు నిర్వహిస్తారు, ఈ సందర్భంగా పలురకాల కాలుష్యకారకాలను నదిలో వదులుతారు. ఇవ న్నీ జలకాలుష్యాన్ని పెంచుతున్నాయి. గోదావరినదికి రెండువైపులా విస్తరించి ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలకు సంబంధించిన డ్రైనేజీ కాలువలను కూడా ఎలాంటి ట్రీట్‌మెంట్‌ నిర్వహించకుండానే నేరుగా నదీ ప్రవాహంలోకి యథేచ్ఛగా వదిలిపెడుతున్నారు. గోదావరినదీ లోయలో సింగరేణి నిర్వహిస్తున్న బొగ్గుగనులకు సంబంధించిన పారిశ్రామిక వ్యర్థాలు, సిమెంటు, కాగితం తదితర పరిశ్రమల నుంచి గోదావరి నదిలోకి వచ్చి కలిసే రసాయనిక వ్యర్థాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సంబంధించిన పలు కాలుష్య కారకాలు గోదావరి నదీజలాలకు కాలుష్య ప్రమాదాలుగా పరిణమించాయి. 


గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంటపొలాల్లో వాడుతున్న ఎరువులు, క్రిమి సంహారక మందులు, రసాయనాలు, కలుపు నివారణ మందులు, జనావాసాల్లో వినియోగించే డిటర్జెంట్లు, ఆమ్లాలు, క్షారాలు, కాస్మోటిక్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, ఇతర కాలుష్య కారకాలన్నీకూడా ఎలాంటి నియంత్రణ లేకుండానే అంతిమంగా గోదావరి నదిలోకి చేరుకుంటున్నాయి. అనేక దశాబ్దాల కలల సాకారంగా సాధించుకున్న గోదావరి జీవనదిని కాలుష్యాల నుంచి కాపాడుకొని, గోదావరినదీ పరీవాహక ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు, ఆయురారోగ్యాలను కాపాడుకునేందుకు ఆయా ప్రాంతాల పౌర సమాజాలు కార్యోన్ముఖులు కావాల్సిన అవసరాన్ని తక్షణమే గుర్తించాలి. గతంలో ఎడారిని తలపించిన గోదావరి నదిని అనతికాలంలోనే మన ప్రజా నాయకుడు ఒక ‘జీవనది’గా మార్చగలిగినప్పుడు, అది కాలుష్యపు విషకోరల్లో చిక్కకుండా కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత మనమీద లేదా ..!?