బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 21, 2020 , 23:03:12

శివాలెత్తు ఈశ్వరా..

శివాలెత్తు ఈశ్వరా..

సృష్టి స్థితి లయకారుడు నటరాజే తానై..

అవినీతిని అంతంచేసే ప్రళయకారుడే కావాలె!

వినాశకారుడే తానై శివతాండవం చేస్తూ..

అజ్ఞానాన్ని అణిచే ఆదియోగి మహేశ్వరుడే కావాలె!

కన్నీటిని తుడిచే రుద్రాక్ష ప్రియుడే తానై...

భావకాలుష్యాన్ని భస్మం చేసే రుద్రుడు కావాలె!

కోర్కెలు తీర్చే భోళాశంకరుడే తానై..

త్రిశూలధారియై ‘దిశ’కంఠులను చెండాడాలె!

మెడలోని అలంకార కాలసర్పమే కాటేసి..

కీచకుల పీచమణచే భీకర శంకరుడే కావాలె!

తలపైన గంగమ్మ ప్రశయమై ప్రవహిస్తూ..

కుళ్లు కుతంత్రాల్ని కూకటి వేళ్లతో పెకిలించాలె!

నిరాడంబర ఆదిభిక్షువు శివుడే తానై..

బడుగు బతుకుల్లో భాగ్యాల భరోసా నింపాలి! 

వెండికొండపై వెలసిన శంభుప్రభువే తానై..

వేనవేల వరాల దీవెనల్ని కురిపించి మురిపించాలే!

ప్రశాంత వదన అచలేశ్వర ఆది దేవుడే తానై..

మదిమందిరాల్లో మానవత్వ మెులకలు నాటాలె!

స్మశానమే తనదన్న దేవదేవుడే తానై..

సన్మార్గ స్వర్గసీమను భువికి తోడ్కొని రావాలె!

ఎములాడ రాజన్న, శ్రీశైల మల్లన్న..

పాపాల్ని హరిస్తూ, పుణ్యరాసుల్ని పండించాలె..!

- డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి


logo