శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 21, 2020 , T00:10

కబళింపు రాజకీయ కుతికపై కత్తి

కబళింపు రాజకీయ కుతికపై కత్తి

కాలం రూపొందించిన నాయకులే కలకాలం నిలుస్తారు. కాలం ప్రజలకు విసరిన సవాళ్లకు తమ గుండెలనెదురొడ్డి, తమవెంట ప్రజలను నడిపించి ఆ సవాళ్ల నడ్డివిరుస్తారు. కేసీఆర్‌ కాలం రూపొందించిన నాయకుడు. ఆ సత్యాన్ని నాటి తెలంగాణ సాధనలోనే కాదు నేటి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలోనూ ఆయన చాటిచెప్పారు. మతం పేరిట దేశప్రజల్లో చీలిక తెచ్చి, విద్వేషాలను రెచ్చగొట్టి తమ రాజకీయాధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న మోదీ పరివారానికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చతికిలపడి, ప్రాంతీయ నాయకత్వం తమ ప్రాంతాలకే పరిమితం కావడం అనివార్యమైన స్థితిలో చెలరేగిపోతున్న కమలపాలకులకు ముకుతాడు వేసేందుకు ముందుకొచ్చారు. దేశం పట్ల బాధ్యత, ప్రజల పట్ల అపారమైన ప్రేమ లేకుండా కమలనాథు ల కబళింపు రాజకీయాలను ఎదురొడ్డటం సాధ్యం కాదు. ఆ బాధ్యత, ఆ  ప్రేమ కేసీఆర్‌లో నిండుగా తొణికిసలాడుతున్నాయి కాబట్టే ఆ బాధ్యతకు సిద్ధమయ్యారు.

కేసీఆర్‌కు ఏ విషయంలోనూ అస్పష్టత ఉండదు. ధైర్యం, తెగువ ఆయనకు కవచకుండలాలు. కాబట్టే దేశంలో మరే నాయకుడూ ప్రకటించనంత స్పష్టంగా ‘సీఏఏ నూటికి నూరు శాతం తప్పుడు చట్టం, ముస్లిం లు మన ప్రజలు కారా? ఎందుకు వివక్ష చూపాలి? మనం కలిసికట్టుగా ఎందుకు జీవించకూడదు?’ అని దేశం దద్దరిల్లేలా ప్రశ్నించారు. ‘స్వభావరీత్యా, విధానరీత్యా, టీఆర్‌ఎస్‌ పూర్తి లౌకికవాద పార్టీ’ అని స్పష్టం చేశారు. ‘భారత ప్రజలు దేశంగా ఉండాలి. మన దేశంగా ఉండకూడదు. అది దేశానికి మంచిది కాదు’ అని కుండబద్దలు కొట్టారు. దేశం మునిగిపోయే, దేశ గౌరవ ప్రతిష్టలు అంతర్జాతీయంగా దెబ్బతినే పరిస్థితులు ఉం టే, మనం మౌనం పాటించడం దేశానికి మంచిది కాదు. దేశ భవిష్యత్తుకు క్షేమం కాదు’ అంటూ కర్తవ్యబోధ చేశారు’. ఈ దేశానికి ఏనాటికైనా సమా ఖ్య (ఫెడరల్‌) వ్యవస్థే శ్రీరామరక్ష. కర్ర పెత్తనాలు పనికిరావు. భారత్‌ రాష్ర్టాల కూటమి (యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌) రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఎగ్జిక్యూటివ్‌ అథారిటీలు కావు. రాజ్యాంగ వ్యవస్థలు’ కేంద్రీయ పాలనపై అర్రులు చేస్తున్న కేంద్ర పాలకులపై కన్నెర్ర చేశారు. సమాఖ్యస్ఫూర్తి ఉన్న జాతీయ పార్టీలు లేదా సమాఖ్య కూటములే విజయవంతమవుతాయి’ అంటూ హెచ్చరికతో కూడిన జోస్యం చెప్పారు.

విభిన్న ప్రాంతాలు, జాతులూ కలిగిన మనదేశంలో వాటిని గుర్తించడమే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం వెన్నెముకగా ఊపిరిపోసుకున్నదే తెలంగాణ ఉద్యమం. ఆ సామాజిక న్యాయమే సమాఖ్య వ్యవస్థకూ ఊపిరి. ఆ ఊపిరిలేని దేశం జీవచ్ఛవమే అవుతుంది. అందుకే మన రాజ్యాంగనిర్మాతలు సమాఖ్య వ్యవస్థను మన దేశానికి ఊపిరిగా మలిచారు. అయితే, ఆధిపత్య, ఆక్రమణ భావజాలం అణువణువూ నిం పుకొన్న కమలనాథులకు సమాఖ్యవ్యవస్థను ప్రధానం చేసిన రాజ్యాంగం పై కక్షగట్టారు. రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా ప్రసాదించిన స్వేచ్ఛ, హక్కులపై కత్తిగట్టారు. ఆ స్వేచ్ఛల ను మనకు లేకుండా చేసేందుకు, ఆ హక్కులను హరించేందుకు అధికార కేంద్రీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధిక జనాభా ఉన్న మతం, ప్రాంతం, జాతి, అధిక జనాభా భాషలకు అధిక హక్కులు, అధిక స్వేచ్ఛ, ఆ అధిక జనాభా కన్నా అల్ప జనాభా ఉన్న మతం, ప్రాంతం, జాతి, భాషా ప్రజలకు అల్ప హక్కులు, అల్ప స్వేచ్ఛ  అంటూ మెజారిటీ సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. అందుకు మతాన్ని ఒక బలమైన సాధనంగా వాడుకుంటున్నారు. ఆ కార్యచరణ పర్యవసానమే నేడు దేశం లో కొనసాగుతున్న అల్లకల్లోలం.

మానవీయ విలువలు ఉన్నవారెవరైనా మతం మనిషి వ్యక్తిగత విషయమని అంగీకరిస్తారు. తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా సాటి మనుషులకు స్నేహహస్తం చాపుతారు. సౌభ్రాతృత్వం పంచుతారు. అందులో మొదటివారు గాంధీ. ఆయన తన విశ్వాసాలను ప్రధానంగా నమ్మాడు. ఏ మతమైనా సాటిమనిషిని తక్కువగా చూడమనదని విశ్వసించారు. అందుకే ఆయన సర్వమత సౌభ్రాతృత్వం కోసం తన తుదిశ్వాస విడిచారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని కోరుకునే ఎవరైనా కుల, ప్రాంత, జాతి, భాషలకు అతీతంగా సర్వమానవ సమానత్వాన్ని కోరుకుంటారు. రాజకీయాలను అందుకు సాధనంగా స్వీకరిస్తారు. మహాత్ముడు కూడా అలాగే కోరుకున్నారు, ఆచరించారు. అదే గాంధీ కాలంలోనే మతం వ్యక్తిగతం కాదని, అదొక రాజకీయశక్తి అని భావించిన అమానవీయ విలువ ల సిద్ధాంతకర్త ఒకరున్నారు. ఆయనే సావర్కర్‌. ‘రాజకీయాలను హిందూవీకరించండి. హిందువులను సైనికీకరించడం’ అన్న మృత్యునినాదం మోగించారు. ఆ గాంధీ, సావర్కర్‌లే మన దేశ నేటి రాజకీయాలకు మార్గ దర్శకులుగా ఉన్నారు. పరస్పర విరుద్ధమైన ఆ ఇరువురి బాటల్లోనే నాయకులు నడుస్తున్నారు. గాంధీ బాట కేసీఆర్‌ది అయితే, సావర్కర్‌ మార్గం మోదీది. అందుకే వారిరువురిలో అన్ని వైరుధ్యాలు.

ప్రజలకు ఉపయోగపడే ప్రతిదాన్ని వారికి పంచుకుంటూ పోవాలంటారు కేసీఆర్‌. ప్రజలకు వ్యతిరేకమైన ప్రతిదాన్ని పెంచుకుంటూ పోతానంటారు మోదీ. అందుకే మోదీ దేశ ప్రజలపై ప్రయోగించిన విషపు అస్త్రం సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించాల్సి వచ్చింది కేసీఆర్‌. తమకు ఎం తటి నష్టం సంభవించినా విస్పష్టంగా సీఏఏను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. త్వరలో ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, పది లక్షలమందితో బ్రహ్మాండమైన సభను ఏర్పాటు నాయకత్వాన్ని భుజాలకెత్తుకుంటామని బాధ్యతతో ప్రకటించారు. కేసీఆర్‌ ప్రకటన దేశంలోని ప్రజానుకూల శక్తు లు పరవశించిపోయాయి. కమలనాథుల కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లక్షలాదిగా కదులుతున్న ప్రజా సమూహాలకు సరైన రాజకీ య నాయకత్వం లేనిస్థితిలో, నిర్ణయాత్మక ఈ ప్రజా కదలిక ఎక్కడ నీరుకారిపోతుందోనని ఆందోళన చెందుతున్న శ్రేణులకు కేసీఆర్‌ ప్రకటన గొప్ప ఆత్మైస్థెర్యాన్నిచ్చింది. తిరుగులేని ధైర్యాన్నిచ్చింది. ఎందుకంటే, మోదీ శక్తి అంతా ప్రతిపక్ష నాయకుల ఆసక్తిలోనే ఉన్నది. మోదీ బలమంతా ప్రతిపక్షపార్టీల బలహీనతలోనే ఉన్నది. ప్రజా వ్యతిరేక కూటమి నుంచి ఒక బలమైన నాయకుడిగా ఆయన కూటమిచే ప్రతిష్ఠించబడిన మోదీ దీటుగా ప్రజానుకూల కూటమి నుంచి ఇంకా ఒక బలమైన నాయకుడు రూపొందకపోవడమే ఆ కూటమి బలం. అదే వారి విజయ రహ స్యం. ఈ వెలితిని తీర్చి, ఈ అననుకూలతను పూడ్చే శక్తి కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నది. ఇందుకు ఆయన రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయా లే తిరుగులేని నిదర్శనం. అందుకే దేశం ఇప్పుడు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. ఆయన సారథ్యం కోసం ఎదురుచూస్తున్నది.

అధికారం తలకెక్కి, తన ఆధిపత్యం శాశ్వతమని భావించేవారు తమ మిత్రులను సైతం సహచరులుగా కాదు కదా, కనీసం అనుచరులుగా సైతం సహించలేరు. అధములుగా తప్ప, బీజేపీ నాయకత్వం ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నాయకత్వం పట్ల ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నది. ఒక్కొక్కరినీ కబళించేందుకు నూటొక్క కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలను కూకటివేళ్లతో పెకిలించి తానేమిటో నిరూపించారు కేసీఆర్‌. ఈ నేపథ్యం నుంచే కేవలం ఒక్క ప్రెస్‌మీట్‌తో బీజేపీకి వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక భూమిక ను ఏర్పరిచారు.


logo