మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 21, 2020 , T00:05

అమ్మభాషను కాపాడుకుందాం

అమ్మభాషను కాపాడుకుందాం


మాతృభాష అంటే వట్టి అక్షరాల పోగు కాదు. తల్లిపేగు నుంచి గర్భస్థ శిశువుకు ప్రాణధార ఎలా ప్రవహిస్తుందో, తల్లి భాష నుంచి మనిషికి జ్ఞానధార అలానే సంక్రమిస్తుందనే శాస్త్రీయతను కాదనలేం. మాతృభాష పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన ఫిబ్రవరి, 21వ తేదీని ఐక్యరాజ్య సమి తి సాంస్కృతిక విభాగమైన ‘యునెస్కో’ ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది. ప్రపంచంలో ప్రతి రెండు వారాలకు ఓ భాష అంతరించిపోతున్నట్లు యునెస్కో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ‘కోయిచిరో మత్సుర’ స్పష్టంచేశారు. ఏ భాష అంతరించినా మానవ మేధలో కొంతభాగం అంతరించినట్లే. అంతేకాదు ఆ జాతి సాం స్కృతిక వారసత్వానికి సంబంధించి వెలకట్టలేని రూపాలైన ఆచార వ్యవహారాలు, సామెతలు, నానుడులు, జాతీయాలు మౌఖిక, లిఖిత, ఆ ప్రాంత సమాచార సంగతులు సర్వం అంతరించిపోతాయి. మాతృభాష కన్నయితే, ఆం గ్లభాష కళ్లజోడు లాంటిది. అసలు కళ్లుంటేకదా కళ్లజోడు తో పనిపడేది!

ప్రపంచవ్యాప్తంగా మాతృభాషే నాగరిక జాతికి జీవనాధారం. దేశంలో రాష్ర్టాలన్నింటా ఆయా రాష్ర్టాల మాతృభాషలే అధికారభాష కావాలని పరిపాలన, విద్యాబోధన మాతృభాషలో జరుగాలని నెహ్రూ భావించారు. నాటి రాధాకృష్ణన్‌ కొఠారి, విద్యాకమిషన్‌లు, ఇటీవలి నూతన జాతీయ విద్యావిధాన ముసాయిదా కూడా పిల్ల ల్లో గ్రహణశక్తి అత్యధికంగా ఉండే 28 ఏండ్ల వయస్సు లో మాతృభాష బోధనకే మొగ్గుచూపాయి. కానీ నేడు పరభాష మోజులో పడి మాతృభాషనే మృతభాషగా మారు స్తున్నారు. భాషను మనం రక్షించుకుంటే అది మన స్వేచ్ఛ, సృజన, వినూత్నతలను పరిరక్షిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని భావించి, జాతీయ నూతన విద్యావిధానంపై రాష్ర్టాల అభిప్రాయం అడిగినప్పుడు, మన రాష్ట్రం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని తెలిపింది. ఆధునిక సాంకేతిక ఉపకరణాల్లో వాడటానికి ఉపయోగపడేలా మాతృభాషను ఆధునీకరించే కృషిజరుగాలి. మాతృభాషపై ఆ జాతి చూపించే గౌరవంతో పాటు ఒక తరం నుంచి మరోతరం వరకు భాష అందిస్తున్న తీరుపై మనుగడ ఆధారపడి ఉన్నది.

- మేకిరి దామోదర్‌, వరంగల్‌

(నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)


logo
>>>>>>