గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 19, 2020 , 23:12:06

అంతర్గత కంచెలు!

అంతర్గత కంచెలు!

ఏదేమైనా స్వాతంత్య్రోద్యమకాలం నుంచి ఈశాన్య భారతం కుంపటిలా రాజుకుంటూనే ఉన్నది. లుక్‌ ఈస్ట్‌ పేరిట ఆ రాష్ర్టాలన్నింటినీ అభివృద్ధిబాటలో నడిపించి వేర్పాటువాదాలకు కళ్లెం వేస్తానని మోదీ చెప్పుకొచ్చారు. అభివృద్ధితోనే హింసను, వేర్పాటువాదాన్నితుదముట్టిస్తానని అన్నారు. కానీ ఒక్క అసోంలో చేసిన ప్రయత్నమే విఫల ప్రయోగంగా కనిపిస్తున్నది. ఈశాన్య రాష్ర్టాలు అభివృద్ధి చెందాలంటే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపార సంబంధాల కోసం రాకపోకలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలి. అలాంటి స్వేచ్ఛకు ఆటంకంగా ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ మారుతుందనటంలో సందేహం లేదు.

ఈశాన్య రాష్ర్టాల్లో శాంతిస్థాపనకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మరింత అశాంతికే ఊతమిచ్చేవిధంగా ఉంటున్నాయా అంటే, అవుననే సమాధానం వస్తున్నది. తాజాగా అసోంలో తలపెట్టిన అంతర్గత అనుమతి (ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌) మరింత వివాదాస్పదమవుతున్నది. దీనిప్రకారం భారత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి అసోంలోకి ప్రవేశించాలన్నా స్థానిక పాలనాధికారుల అనుమతి అవసరమని ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ చెబుతున్నది. అసోం ఒప్పందంలోని ఆరవ ప్రకరణను అమలు చేసేందుకుగాను కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో ఈ ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ విధానాన్ని తెస్తూ, దాని విధివిధానాలు, అమలు కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. 


కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో ఇప్పటికే సామాజిక సమూహాల మధ్య కనిపించని కంచెలు మొలుస్తున్నాయి. మైనారిటీలంతా తీవ్ర అభద్రతకులోనై సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. తాజాగా అసోం విషయంలో కేంద్ర నిర్ణయం మిగతా దేశం నుంచి వేరుచేస్తూ నేరు గా కనిపించే కంచెనే వేస్తున్నది. ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ విధానం కారణంగా అసోం పూర్తిగా ప్రత్యేక ప్రాంతంగా అవతరించబోతున్నది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి అసోం వెళ్లాలంటే అనుమ తి అవసరమని చెప్పటం మరో రూపంలో వీసా కావాలని నిబంధన పెట్టడం లాంటిదేనని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అసోంలోని వివిధ ఆదివాసీ సమూహాల మధ్య కూడా మరిన్ని అనుమానాలకు తావిచ్చేవిధంగా కేంద్రప్రభుత్వ విధానాలున్నాయని ఆగ్రహిస్తున్నారు.


ఈశాన్యభారతంలో ముఖ్యంగా అసోంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం గత నెల జనవరి 27న అసోంలోని వివిధ వేర్పాటువాద నేతలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నది. గతంలో కన్నా భిన్నంగా ఈసారి అసోంలో ప్రాబల్యం కలిగిన యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా), బోడో, కర్బీ పోరాటకారులు కూడా ఒప్పందంలో భాగస్వాములు కావటం గమనా ర్హం. అయితే తాజా ఒప్పందంతో ఆయా ప్రాం తాల్లోని గిరిజనులు, వారి ఆకాంక్షలపై ఆధారప డి, వారి అనుమానాలు తీర్చేవిధంగా కేంద్రం విధాన నిర్ణయాలుంటే బాగుండేది. కానీ కేం ద్రం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆయా గిరిజన సమాజాలను సంతృప్తిపర్చే చర్యలకే ప్రాధాన్యం ఇచ్చిం ది. బెంగాళీలు అధికంగా ఉన్న బరాక్‌ లోయలో ఉన్న 15 అసెంబ్లీ సీట్లు, బోడోలాండ్‌ టెరిటోరియల్‌ ఏరియా డిస్ట్రిక్ట్స్‌ (బీటీఏడీ) ఏర్పాటుతో 12 సీట్లు, కర్బీలు అధికంగా ఉన్నప్రాంతంలోని ఐదు సీట్లు గెల్చుకునేందుకు పావులు కదిపింది తప్పితే సమస్య పరిష్కారం కోసం కాదనే విమర్శలు ఊపందుకుంటున్నాయి.


‘బీటీఏడీ’తో బోడోల ఆధిపత్యంతో మిగతా ఆదివాసీ తెగల కు అస్తిత్వ సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అసోంలోని వివిధ గిరిజన తెగల జీవనపరిస్థితు లు, వారి సంస్కృతిక నేపథ్యం, ఆవాసస్థితులపై ఆధారపడి కేంద్రం స్వయంప్రతిపత్తి ప్రాంతాల ను (జిల్లాలను) ప్రకటించి ఉంటే బాగుండేది. కానీ కేవలం ఓట్ల రాజకీయం కోసం ఆయా ప్రాం తాల్లో కృత్రిమంగా విభజనరేఖలు గీయటం మరిన్న సమస్యలకు కారణమయ్యే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కొక్రాఝర్‌, చిరాగ్‌, బక్సా, ఉదల్‌గురి జిల్లాల్లో బోడోలు 46 శాతంగా ఉంటారు. వీరి కి ఎస్టీ ప్రతిపత్తి కలిగించవద్దని కర్బీలు డిమాండ్‌ చేస్తున్నారు. అలా కల్పించినట్లయితే, వారు తమ ప్రాంతాలపై రాజకీయాధిపత్యం చెలాయిస్తారని ఆందోళన చెందుతున్నారు.


నిజానికి అసోం ఓ మినీ ఆదివాసీ ప్రపంచం. 33 జిల్లాలతో ఉన్న అసోంలో 14 గుర్తింపు పొందిన మైదాన గిరిజన సమూహాలున్నాయి. 15 పర్వత ప్రాంత ఆదివాసీ తెగలు, మరో 16 షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ సమూహాలున్నాయి. ఈ అన్నితెగలు, సమూహాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ముఖ్యంగా 80వ దశకంలో ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌, ఉల్ఫా నేతృత్వంలో స్థానికేతరులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం చరిత్రాత్మకమైనది. ఉద్యమాన్ని నిర్వహించిన విద్యార్థినేతలు నేరుగా కాలేజీ హాస్టళ్ల నుంచి అసెంబ్లీకి వెళ్లి పాలనాధికారాలు చేపట్టారు. దాంతోనైనా అసోం శాంతిబాటన పడుతుందని ఆశించినవారికి అడియా సే మిగిలింది. అనేక చిన్నచిన్న సమూహాలుగా ఉన్న ఆదివాసీ తెగ సమూహాల మధ్య ఉన్న ఆధిపత్య వైరుధ్యం పరిష్కారం కాలేదు. 


తాజా మోదీ ఒప్పందం కూడా కొత్తసీసాలో పాతసారా లాగా ఉన్నదనే విమర్శలొస్తున్నాయి. ఏదేమైనా స్వాతంత్య్రోద్యమకాలం నుంచి ఈశాన్య భారతం కుంపటిలా రాజుకుంటూనే ఉన్నది. లుక్‌ ఈస్ట్‌ పేరిట ఆ రాష్ర్టాలన్నింటినీ అభివృద్ధిబాటలో నడిపించి వేర్పాటువాదాలకు కళ్లెం వేస్తానని మోదీ చెప్పుకొచ్చారు. అభివృద్ధితోనే హింసను, వేర్పాటువాదాన్ని తుదముట్టిస్తానని అన్నారు. కానీ ఒక్క అసోంలో చేసిన ప్రయత్నమే విఫల ప్రయోగంగా కనిపిస్తున్నది. ఈ శాన్య రాష్ర్టాలు అభివృద్ధి చెందాలంటే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపార సంబంధాల కోసం రాకపోకలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలి. అలాంటి స్వేచ్ఛకు ఆటంకంగా ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ మారుతుందనటంలో సందేహం లేదు.


logo