శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 19, 2020 , 23:11:30

తెలంగాణ సంస్కృత వాచస్పతి

తెలంగాణ సంస్కృత వాచస్పతి

తెలంగాణలో కవులు శూన్యమనే ఆంధ్రుల అభిప్రాయాన్ని తోసిపుచ్చిన కవిపసేణ్యులు శ్రీభాష్యం విజయసారథి. మందాకినీ కావ్యం విని సారస్వత లోకమంతా పరవశించింది. శ్రీభాష్యం వారికి దక్కిన పద్మశ్రీ పురస్కారంతో సంస్కృతభాష పరిమళించింది. తెలంగాణ సంస్కృత వాచస్పతిగా సాహితీ ప్రపంచానికి ప్రేరణై నిలిచిన శ్రీభాష్యం విజయసారథి సంప్రదాయ మందాకినిలో పునీతులై, ఆధునిక వాజ్ఞయ ఝరిలో సుస్నాతులై, సంస్కృతీ సంస్కృతాలకు ప్రతీకలై తెలంగాణ ఘనతను పద్మశ్రీతో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.

సంస్కృతి అంటే పరిష్కరణం, సంస్కరణం. సంస్కృ తి అంటే సాహిత్య సౌరభం. సంస్కృతి అంటేనే సంస్కృ తం. భారతదేశ అఖండత్వానికి ప్రతీకగా నిలిచిన అమరభాష సంస్కృతం. సంస్కృత భాష ఎంత ప్రాచీనమైందో సంస్కృత వాజ్ఞయం అంత విస్తృతతమైంది. సంస్కృత వాజ్ఞయంలో లేని శాస్త్రం లేదు. లేని విషయాలు లేవు. సంస్కృత భాష నిర్జీవమైంది కాదనీ, అమర భాషను కూడా ఆధునిక ఒరవడిక పరిచయం చేయవచ్చనీ నిరూపించిన తెలంగాణ పాండితీయశోవిభవం శ్రీభాష్యం విజయసారథి. సమన్వయం మన సనాతన ధర్మానికి పెట్టనికోట. సంస్కృత భాషా సంప్రదాయాన్ని ఆధునిక రచనా కౌశలంతో సమన్వయం చేసిన తెలంగాణ సం స్కృత వాచస్పతి శ్రీభాష్యం విజయసారథికి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.


యుగకర్తా, యుగోద్ధర్తా చక్రవర్తీ యుగస్యచ

సరస్వతీ సుతోత్తంసః జీయాద్విజయ సారథిః॥

సంస్కృత భాషలో కూలంకషమైన పాండిత్యంతో పాటు మధుర మంజుల మనోహరంగా కవిత్వం చెప్పగల మహాకవి, సంస్కృతం అంటే కేవలం అమర భాష కాద ని, మానవీయతను చాటే ప్రజల భాషని నిరూపించిన ఆధునిక కవి శ్రీభాష్యం విజయసారథి.


శ్రీభాష్యం విజయసారథి 1936లో కరీంనగర్‌ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు జన్మించారు. నిజాం పరిపాలనలో ఉర్దూ అధికార భాషగా ఉన్నప్పటికీ, గీతగోవిందంలోని లయకు ఆకర్షితులై, ప్రేరణ పొంది సంస్కృత భాషను అభ్యసించారు శ్రీభాష్యం. వరంగల్‌లోని విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలోనే చదువుకొని అదే కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు విజయసారథి. సంస్కృతం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిష్ణాతులైన శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషా సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. సుప్రభాత, కావ్య, దేశభక్తి, లేఖా, సూక్తి, మాలికా, ఉదాహరణ, సంగీత, సాంఘిక, చైతన్య, అనువాద, తెలుగు విమర్శ, స్తుతి, గద్య, నవల, ప్రహసన, ప్రహేళికల వంటి ఎన్నో ప్రక్రియలను శతాధిక గ్రంథరచన ద్వారా సుసంపన్నం చేశారు.


శ్రీభాష్యం విజయసారథి పదేండ్ల వయస్సులోనే శారదాపదకింకిణి అనే గ్రంథం రాశారు. పదిహేడేళ్ళ వయస్సులో మనోరమ అనే నవలను రాయడం ద్వారా మొదలైన శ్రీభాష్యం రచనా ప్రక్రియ నేటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. మందాకినీ కావ్యరచనతో భారతదేశంలో వినుతికెక్కిన శ్రీభాష్యం విజయసారథి మహాకవిగా, మందాకినీ కవిగా పేరు గడించారు. మందాకినీ అంటే గంగా ప్రవాహం. కేవలం 48 గంట ల్లో 200ల ధాతువుల ప్రయోగంతో 2000 లైన్లతో మందాకినీ కావ్యాన్ని రచించారు శ్రీభాష్యం. వీరికి పేరు తెచ్చిన భారతభారతీ, ప్రవీణ భారతం, రాసకేళి, సంగీత మాధవం, ప్రహేళికలు వీరు రచించిన అనేక గ్రంథాల్లో ఆణిముత్యాలు. శ్రీభాష్యం విజయసారథి రచనల్లో వస్తువర్ణన ఏదైనా ముఖ్యోద్దేశంగా ధ్వనించే ప్రధాన విషయం సమాజం. విశ్వ పౌరత్వం, సకల మానవ సౌభ్రాతృత్వం, మానవతావాదం వీరి రచనలో పరిఢవిల్లే ఆలోచనా పరిమళాలు.


రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారి మహామహోపాధ్యాయ, కె.కె.బి ర్లా ఫౌండేషన్‌ వారి వాచస్పతి, తిలక్‌ మహారాష్ట్ర విద్యాపీఠం వారి ఇం దిరా బిహారీ గోల్డ్‌మెడల్‌, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ సంస్కృ త పండిత పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి విశిష్ట పురస్కా రం, ప్రజ్ఞాభారతి వారి ప్రతిభా పురస్కారం, సృజనాత్మక సంస్కృతకవి, మహాకవి అనే బిరుదుల సత్కారం శ్రీభాష్యం విజయసారథి ప్రతిభకు పట్టం కట్టాయి. పద్మశ్రీ పురస్కారం సంస్కృత భాషకూ, సాహిత్యానికి దక్కిన అపూర్వ గౌరవంగా భావించే సుహృదయత శ్రీభాష్యం వారికే దక్కుతుంది. భారతదేశంలోని ఎందరో మహాకవులతో కవి సమ్మేళనాల్లో పాల్గొని ఘనతకెక్కిన శ్రీభాష్యం విజయసారథి తెలంగాణ కవి కాళోజీ గారితో సంభాషించినప్పు డు, ‘ఎందుకూ అక్కరకు రాని భాషను పట్టుకున్నావేంటని’ కాళోజీ నారాయణరావు శ్రీభాష్యంతో అన్నప్పుడు ‘సంస్కృతం ప్రపంచంలోకెల్లా గొప్ప భాష. నీవు ఉపయోగించే ‘ప్రభుత్వం’, ‘కార్యకర్త’, ‘అధ్యక్షుడు’.. లాంటివన్నీ సంస్కృతమే కదా! అని సమాధానమిచ్చారట. కాళోజీ తర్వాత అనేక సందర్భాల్లో, కవి సమ్మేళనాల్లో ‘వాడు రాలేదా!’ అని శ్రీభాష్యం గారిని గుర్తుచేసుకునేవారట.


తెలంగాణలో కవులు శూన్యమనే ఆంధ్రుల అభిప్రాయాన్ని తోసిపుచ్చిన కవిపసేణ్యులు శ్రీభాష్యం విజయసారథి. మందాకినీ కావ్యం విని సారస్వత లోకమంతా పరవశించింది. శ్రీభాష్యం వారికి దక్కిన పద్మశ్రీ పురస్కారంతో సంస్కృతభాష పరిమళించింది. తెలంగాణ సంస్కృత వాచస్పతిగా సాహితీ ప్రపంచానికి ప్రేరణై నిలిచిన శ్రీభాష్యం విజయసారథి సంప్రదాయ మందాకినిలో పునీతులై, ఆధునిక వాజ్ఞయ ఝరిలో సుస్నాతులై, సంస్కృతీ సంస్కృతాలకు ప్రతీకలై తెలంగాణ ఘనతను పద్మశ్రీతో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.

శ్రీభాష్యం విజయసారథి వారి లాంటి ఎందరో మేధావులు నాటి నుంచి నేటివరకూ తమతమ రచనల ద్వారా సంస్కృత భాషను సుసమృద్ధం చేస్తూ వస్తున్నారు. వారందరికీ వందనములు, అభినందనలు.


logo