గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 19, 2020 , 23:06:20

ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నెన్ని విజయాలు

ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నెన్ని విజయాలు

ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్‌' గెలువటం ఒక్కటే కాదు. దేనికదిగా మరెన్నో విజయాలున్నాయి. ఒక సోకాల్డ్‌ జాతీయపార్టీపై ఒక ఫెడరల్‌ పార్టీ గెలిచింది.జాతిని విచ్ఛిన్నం చేయబూనిన పార్టీని సకలజనుల సహజీవన పార్టీ చిత్తుచేసింది. మాటల్లో తప్ప చేతల్లో అభివృద్ధి కన్పించని పార్టీపై సామాన్యుల పురోగతే తన లక్ష్యమని ఆచరణలో చూపిన పార్టీ పైచేయి సాధించింది. అహంభావంతో విర్రవీగిన పార్టీని వినయవిధేయతల పార్టీ మట్టికరిపించింది. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే రాజధానీవాసులు దేశ ప్రజాస్వామ్యం కోసం మరెన్నో విజయాలు సాధించుకున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటికన్న కొట్టొచ్చినట్లు కన్పించి న విషయం బీజేపీ సాగించిన పరమ భయంకరమైన మతతత్వ విద్వేష్ర పచారం. చివరికి ఫలితాలు వెలువడినప్పు డు తిరిగి అదేవిధంగా అన్నింటికన్న కొట్టొచ్చినట్లు కన్పించింది అటువంటి విషప్రచారాల పార్టీని ప్రజలు చిత్తు చేయ టం. గత 72 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక పార్టీ, ఒక ప్రధాని, ఒక హోంమంత్రి ఇంతహీనమైన స్థాయికి పతనమై ప్రచారాలు చేయ టం ఎన్నడూ లేదు. అటువంటి ప్రచారాన్ని ప్రజలు నేలమట్టం చేయటం కూడా ఎప్పుడూ జరుగలేదు. ఈ స్థితిలో కొంత పోల్చదగిన విద్వేష ప్రచారం ఒకే ఒకటి ఉన్నది. అది 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కొత్త ప్రధాని రాజీవ్‌గాంధీ ఆధ్వర్యాన సాగిన సిక్కు వ్యతిరేక ప్రచారం. 


అందుకు ప్రత్యక్ష సాక్షి అయిన ఈ రచయిత ఉద్దేశంలో, అపుడు కాంగ్రెస్‌ కన్న ఇప్పుడు బీజేపీ రెండాకులు ఎక్కువ చదివింది. అధికారం కోసం ఆ రోజుల్లో కాంగ్రెస్‌ ఎంతపతనం అయిందో ఈసారి బీజేపీ అంతకన్న పతనమైంది. అపుడు కాంగ్రె స్‌ ఆ విధమైన ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అప్పటి నుం చి 35 ఏండ్లు తిరిగేసరికి ఈ రెండు పార్టీల పాత్రలు తారుమారయ్యా యి. లక్ష్యం అప్పుడు సిక్కులు కాగా ఇప్పుడు ముస్లింలు. ఆ విధంగా వేర్వేరు దశల్లో ఈ రెండు సోకాల్డ్‌ జాతీయపార్టీలు బోనెక్కవలసిన దోషానికి పాల్పడ్డాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్పటికి ఇప్పటికి కొట్టొ చ్చినట్లు కన్పించే తేడా ఒకటున్నది. అప్పుడు ఇందిరా హత్య వల్ల కలిగి న ఉద్వేగంలో ప్రజలు సిక్కు వ్యతిరేక ప్రచారానికిలోనై కాంగ్రెస్‌కు ఘనవిజయం కట్టబెట్టారు. అప్పుడు ఆ స్థితిని విమర్శించి, ఆ విధమైన ఓటిం గ్‌తో నష్టపోయిన బీజేపీ, ఈ 35 సంవత్సరాల్లో ఎటువంటి గుణపాఠం నేర్వలేదుగాని, సాధారణ ప్రజలు మాత్రం తగినంత నేర్చినట్లు ఈ అసెం బ్లీ ఫలితాలు చూపుతున్నాయి. బీజేపీ సంకుచిత ప్రచారాలు ఏవీ వారిపై ప్రభావం చూపలేదు.


ఈ సారి ఢిల్లీ ఎన్నికలు యావద్దేశ దృష్టినే కాదు, ప్రపంచదేశాల దృష్టి ని ఆకర్షించాయి. అందుకు కారణాలు తెలిసినవే గనుక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ గమనించదగినదేమంటే, ఆప్‌ గెలుస్తుందా లేదా అన్నదానికంటే బీజేపీ విషప్రచారం ఎంత ప్రభావం చూపగలదన్నదే దేశ విదేశాల్లో ప్రశ్నగా మారింది. ఆప్‌ జయాపజయాలు ఢిల్లీకి పరిమితమైన విషయం. కానీ ఒక జాతీయపార్టీగా, కేంద్రంలోని అధికారపక్షంగా, దేశమంతటా అల్పసంఖ్యాక వర్గాలపై బాహాటంగా కత్తిగట్టిన పార్టీగా బీజేపీ గెలుపోటముల ప్రభావం ఢిల్లీ పరిధిని దాటి దేశవ్యాప్తంగా ఉంటుంది. 


అంతర్జాతీయంగానూ ఉంటుంది. భవిష్యత్తును నిర్దేశిస్తుంది. పైన కాంగ్రె స్‌ పార్టీ సిక్కు వ్యతిరేక ప్రచారం గురించి చెప్పుకున్నాం. అప్పుడది ఢిల్లీకి, కొద్దిపాటి ఉత్తరాది రాష్ర్టాలకు పరిమితమైనటువంటిది. అందుకు భిన్నం గా బీజేపీ ప్రచారం దేశవ్యాప్తమైనది. అంతర్జాతీయమైనది. మొత్తం దేశ భవిష్యత్తుకు సంబంధించినది. ఈ దేశ సామాజిక సాంప్రదాయాలకు, సంస్కృతికి, రాజ్యాంగానికి అక్షరరీత్యా-స్ఫూర్తిరీత్యా కూడా విరుద్ధమైనది. తాముచేసిన పనికి కాంగ్రెస్‌వారు కొంతకాలం తర్వాతనైనా పశ్చాత్తాపం ప్రకటించారు. కానీ బీజేపీ లక్ష్యాలు, అందుకోసం సాగించే విద్వే ష ప్రచారం, చర్యలూ పశ్చాత్తాప ప్రకటనకే ఆస్కారం లేనటువంటివి. తమ విషపూరిత విధానాలు లక్ష్యాన్ని సాధించలేకపోతే విచారిస్తారువారు. కసితో మరింత విషం కక్కుతారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, అందులోనూ బీజేపీ ధోరణి, ఎన్నికల్లో ఆ పార్టీ జయాపజయాలూ మొత్తం దేశ, ప్రపంచ దృష్టిని ఆకర్షించటం వెను క ఇదంతా ఉన్నది. ఇందులో అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వాన గల ఆమ్‌ ఆద్మీ పార్టీది నిమిత్త మాత్రమైన పాత్ర. ఎన్నికల్లో ప్రచారం ఎంత దుర్మార్గమైన విధంగా సాగినా అది బీజేపీ దిగువ శ్రేణులకు పరిమితమైఉంటే ఎవరూ ఇంత సీరియస్‌గా తీసుకొని ఉండేవారుకాదు. కానీ సాక్షా త్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వాళ్లను వారి దుస్తులతో గుర్తించవచ్చు (ముస్లింలని భావం)అన్నారు. షాహీన్‌బాగ్‌ ధర్నా దేశద్రోహులు చేస్తున్న ఒక ప్రయోగం అన్నారు. ఆ ప్రయోగం సఫలమైతే అంతటా అదే పని చేస్తారని తన ఉద్దేశం. హోంమంత్రి అమిత్‌ షా, వారిని చెదలు అంటూ అభివర్ణించా రు. 


ఓటింగ్‌ నాడు ఈవీఎం మీట నొక్కితే ఆ ఫలితాలు షాహీన్‌బాగ్‌లో కరెంట్‌షాక్‌ కావాలన్నారు. ఇటువంటివారే ఇంత బాధ్యతారహితంగా, దారుణంగా మాట్లాడినప్పుడు కేంద్రమంత్రి అయిన అనురాగ్‌ ఠాకూర్‌ గోలీమారో పిలుపుగాని, మరొక మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కేజ్రీవాల్‌ను టెర్రిరిస్టు అనటం గాని, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ బిర్యానీ వ్యాఖ్యలుగాని, ఇతర మంత్రులు, ఎంపీలు, తదితరుల విపరీత ధోరణిగాని మోదీ, అమిత్‌ షాలను అనుకరించేవి మాత్రమే అవుతాయి. ఫలితాలు వెలువడిన తర్వాత హోంమంత్రి అటువంటి వ్యాఖ్యలను ఆయా వ్యక్తులు చేసి ఉండవలసింది కాదన్నారు. కానీ స్వయంగా తాను, మోదీ చేసిన వ్యాఖ్యల గురించి ఏమీ మాట్లాడలేదు. తమతో సహా తక్కినవా రంతా చేసిన ప్రచారంలోని విద్వేషం గురించి అప్పుడే తెలియదా ఆయనకు? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పదేపదే చేశారు. అందువల్ల గెలుస్తామనుకున్నారు. గెలిచి ఉంటే అదే సరైన ధోరణి అని భావించేవారు. 


గెలువలేదు గనుక నీతివాక్యాలు చెప్తున్నారు. పోనీ ఇటువంటి అనుభవంతో మున్ముందు వారి ధోరణి మారుతుందా అన్నది ప్రశ్న. ఇప్పటికై తే అటువంటి ఆశ కలుగటం లేదు. వారి మౌలిక సిద్ధాంతాల్లోనే, దీర్ఘకాలిక సామాజిక-రాజకీయ లక్ష్యాల్లోనే సామాజిక విచ్ఛిన్నత, దేశ రాజ్యాం గ భంగమన్నవి మిళితమై ఉన్నాయి. భారత సమాజంలో కులవ్యవస్థను సృష్టించి వేల ఏండ్లుగా దళిత బహుజనులను పీడించి అణిచివేస్తున్నది ఈ శక్తులే. అల్పసంఖ్యాక వర్గాలను అణిచివేసి నిర్మూలించజూస్తున్న మతతత్వశక్తులు కూడా ఇవే. వారి లెక్కల్లో ఢిల్లీ ఓటమి ఒక చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. కనుక తక్కిన దేశంలో గానీ, అందులో భాగంగా తెలంగాణలో గాని తమ విచ్ఛిన్నకర అజెండాను ముందుకు తీసుకుపోయేందుకు వారు ప్రయత్నిస్తారు. తెలంగాణలో అదేపని పదేపదే చేయ టం కన్పిస్తున్నదే.


బీజేపీ ప్రదర్శించిన అన్ని అవలక్షణాలకు ఒక నాయకునిగా కేజ్రీవాల్‌, ఆయన పార్టీ, దేశ రాజధాని ప్రజలు సంపూర్ణమైన రీతిలో విరుగుడును చూపించారు. దాని అర్థం విషప్రచారపు ప్రభావం అసలు లేదని కాదు. బీజేపీ ఓట్లు, సీట్లు ఎంతో కొంత పెరుగటమే అందుకు నిదర్శనం. కానీ ఆ ప్రచార మహోధృతితో, అందులో పాల్గొన్న అతిరథ, మహారథులతో వారి అధికార బలం, ధనబలం, అంగ బలంతో, వారు చిమ్మిన విషతీవ్రతతో లెక్కలు కట్టినట్లయితే 62 సీట్లు వారికి, 8 సీట్లు ఆప్‌కు రావలసింది. కథ అందుకు విరుద్ధంగా నడిచిందంటే దాని అర్థతాత్పర్యాలను ప్రజలు ఎవరికివారే చెప్పుకోగలరు.


జనసంఘ్‌ పార్టీ బీజేపీగా మారిన తర్వాత వారి అధికార రాజకీయపు  ఎత్తుగడలు రకరకాలుగా మారుతూ వస్తున్నాయి. మొదట జనసంఘ్‌ గా మత తత్వానికి పెద్దపీట వేశారు. తర్వాత వాజపేయి-అద్వానీల కాలంలో ఉదారవాదంతో కూడిన అభివృద్ధిని, మతతత్వాన్ని తమ రథానికి రెండు గుర్రాలుగా మార్చుకున్నారు. అదొక తెలివైన ఎత్తుగడ. ఆ విధంగా రథం కొంతముందుకు వెళ్లి ఆగిపోయింది. తర్వాత నరేంద్ర మోదీ మొదటి విడుత పాలనలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు నటించారు. ఈ రెండవ విడుతలో మత తత్వానిది పెద్దపీట అవుతున్నది. రెం డవసారి గెలువటమే గాక మెజారిటీ పెరుగటం పెద్ద అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ప్రతిపక్షాల బలహీనత మరింత ధైర్యాన్నిచ్చింది. ఇటువంటి పరిస్థితులు అన్నీ లేకపోయినట్లయితే ఢిల్లీ ఎన్నికల్లో వారి ధోరణి స్వయంగా ప్రధానమంత్రిని మొదలుకొని కిందిస్థాయి వరకు ఇంత భయం గొలిపేదిగా మారి ఉండేది కాదు.


బీజేపీ ప్రదర్శించిన అన్ని అవలక్షణాలకు ఒక నాయకునిగా కేజ్రీవాల్‌, ఆయన పార్టీ, దేశ రాజధాని ప్రజలు సంపూర్ణమైన రీతిలో విరుగుడును చూపించారు. దాని అర్థం విషప్రచారపు ప్రభావం అసలు లేదని కాదు. బీజేపీ ఓట్లు, సీట్లు ఎంతో కొంత పెరుగటమే అందుకు నిదర్శనం. కానీ ఆ ప్రచార మహోధృతితో, అందులో పాల్గొన్న అతిరథ, మహారథులతో వారి అధికార బలం, ధనబలం, అంగ బలంతో, వారు చిమ్మిన విషతీవ్రతతో లెక్కలు కట్టినట్లయితే 62 సీట్లు వారికి, 8 సీట్లు ఆప్‌కు రావలసింది. కథ అందుకు విరుద్ధంగా నడిచిందంటే దాని అర్థ తాత్పర్యాలను ప్రజలు ఎవరికివారే చెప్పుకోగలరు. 


ఇదే విషయాన్ని రెండవ వైపునుంచి చూసినట్లయితే, బీజేపీ రాజకీయాలకు ఆప్‌ పార్టీ ఒక విరుగుడు ప్రయో గమవుతున్నది. అటువంటి ప్రయోగానికి తెలంగాణ మరొక దృష్టాంతమైంది ఇప్పటికే. అభివృద్ధి-సంక్షేమాలతో పాటు సామాజిక సామరస్యతలు కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో వలెనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన ఎట్లా రూపుదిద్దుకొని సాగుతున్నాయో తెలిసిందే. మొత్తం దేశంలోనే ఏ బీజేపీయేతర రాష్ట్రం కూడా మోదీ బీజేపీని చూసి జంకనవస రం లేదని, ప్రశాంతంగా, స్థిరచిత్తంతో పాజిటివ్‌ విధానాలను అనుసరి స్తే సరిపోతుందని ఈ అనుభవాలు చెబుతున్నాయి.


 ఫలితాలు దేశంలో కొత్త రాజకీయాలకు నాంది పలికాయని కేజ్రీవాల్‌ అన్నారు గాని, తను ప్రస్తావించిన పని సంస్కృతిని ప్రజలు ఆదరించటం మొదటినుంచి ఉన్నదే. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో గాని, రాజ్యాంగరీత్యా గాని  ప్రజ లు ఆశించేది అదేనన్నది సార్వత్రిక నీతి. దానిని స్వప్రయోజనాల కోసం విస్మరించటం వల్లనే మన తొలిదశ పార్టీలు ఓడిపోవటం మొదలైంది. మరుగునపడిన ఈ సంస్కృతిని తిరిగి ముందుకు తీసుకురావటం ఆయా పార్టీలకు, దేశానికి మంచి చేయటంతో పాటు బీజేపీ తరహా విచ్ఛిన్నకరశక్తులకు విరుగుడు కాగలదు. ఇతర పార్టీలు ఈ సంస్కృతిని విడనాడటం వల్లనే ప్రజాదరణ కోల్పోయి శూన్యం ఏర్పడి ఆ శూన్యంలోకి బీజేపీ వంటి అప్రజాస్వామికశక్తులు ప్రవేశించాయి.


logo