సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 18, 2020 , 23:00:01

వివక్షపై విజయం

వివక్షపై విజయం

రాజకీయపక్షాలు పరస్పర విమర్శలకు దిగే కన్నా సామాజిక మార్పు కోసం తమవంతుగా ఇంకా ఏమి చేయగలమనేది ఆలోచించడం మంచిది. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వాలు చేయవలసింది ఎంతో ఉన్నది. 2019 డిసెంబర్‌ నాటి వివరాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వేదిక జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో మన దేశం 112 వ స్థానంలో ఉన్నది. గతంలో కన్నా మరో నాలుగు స్థానాలు దిగజారింది. ఈ సూచిక స్త్రీ పురుష తారతమ్యాన్ని సూచించదు.

మహిళలు సుప్రీంకోర్టు సాక్షిగా మరో అడ్డుగోడను బద్దలుకొట్టారు! సైన్యంలో మహిళా అధికారుల పట్ల సాగుతున్న వివక్షను తొలిగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మహిళా అధికారులకు నాయకత్వ బాధ్యతలు (కమాండ్‌) అప్పగించాలని స్పష్టంగా చెప్పింది. పదేండ్ల కిందటే హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, అమలు కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ పోరాడిన మహిళా అధికారులు అభినందనీయులు. మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారని, గర్భందాల్చడంతోపాటు, మాతృత్వ, కుటుంబ బాధ్యతలుంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది మూస ఆలోచనా విధానమని కొట్టివేసింది. సైనికులు గ్రామీణ ప్రాతం నుంచి వచ్చిన మగవారు ఉంటారని, వారు మహిళ నాయకత్వాన్ని అంగీకరించలేరనే వాదనను కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. 


ఇంతకాలం మహిళలను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కే పరిమితం చేస్తూ పూర్తి ఉద్యోగ కాలం, పురుషులతో సమాన ప్రయోజనాలు ఇవ్వకుండా తృణీకరిస్తున్నారు. మహిళలు తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ప్రాధాన్యం ఇవ్వమని కోరడం లేదు. తాము పురుషులతో సమానంగా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. తమకున్న అడ్డంకులను తొలిగించాలని కోరుతున్నారు. తమ వివక్ష చూపకూడదనేదే వారి వాదన. తాము సమాన బాధ్యతలు నిర్వహిస్తామని అంటున్నప్పటికీ, మీకు సాధ్యం కాదని తిరస్కరించడమే ఇంతకాలం సాగింది. మహిళలకు సమాన అవకాశాలు లభించకపోవడానికి వారి కృషిలో లోపం కాదని, మగవారి ఆలోచనా విధానమే అడ్డంకి అని దీనివల్ల స్పష్టమవుతున్నది.


సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోరాటం మినహా ఇతరరంగాల్లో పైస్థాయి పురుషులతో సమానంగా పైస్థాయి పదవులు పొందే అర్హత ఏర్పడ్డ ది. మహిళా కల్నల్‌ 850 మందితో కూడిన బెటాలియన్‌కు నాయకత్వం వహించవచ్చు. బ్రిగేడియర్‌, మేజర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ మాత్రమే కాదు, సూత్రప్రాయంగా ఆర్మీ చీఫ్‌ కూడా కావచ్చు. కానీ పోరాట విధుల్లో చూపిన ప్రతిభ ప్రాతిపదికగా ఉంటుంది. మహిళలను పోరాట విధులకు నియోగించడం లేదు కనుక ఈ అనుభవం వారికి లభించదు. మహిళా అధికారులకు సైన్యంలోని పది విభాగాలలో సమాన అవకాశాలు కల్పించడంపైనే సుప్రీంకోర్టు విచారించింది. పోరాట విధుల్లో నియోగించడంపై విచారణ జరుగలేదు. పిటిషనర్లు లేవనెత్తిన అం శాలలో ఈ విభాగం లేదు. 


అయినప్పటికీ సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వారా మహిళలు ఏమీ సాధించలేదని అనలేము. కల్నల్‌ హోదా లో ఉన్న అధికారికి స్వతంత్రంగా విధులు నిర్వహించే అవకాశాలు లభిస్తాయి. సైన్యంలో ఇంజినీరింగ్‌- ఇన్‌-చీఫ్‌, గూఢచారి విభాగం అధిపతి వంటి ఉన్నత స్థానాలు పొందవచ్చు. వైద్య విభాగంలో అవకాశం ఇప్పటికే ఉండటంతో జనరల్‌, ఎయిర్‌ మార్షల్‌, అడ్మిరల్‌ హోదాలను అందుకున్నారు. తెలంగాణ బిడ్డ రాణి రుద్రమ శతాబ్దాల కిందటే పరిపాలనా విధులు నిర్వర్తించడమే కాకుండా కరవాలం దూసి కదనరంగంలో తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. ఝాన్సీ లక్ష్మీభాయి పోరాటం తెలిసిందే. మహిళల నాయకత్వ లక్షణాలను కించపరుచడం, అడ్డుగోడలు నిర్మించడం భావ్యం కాదు.


సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకమైన వైఖరి తీసుకోవడం రాజకీయంగా కూడా వివాదాస్పదమైంది. మహిళా అధికారులు అర్హులు కాదని వాదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మహిళలను అవమానించిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. కానీ మహిళా అధికారుల తరఫున వాదించిన బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది యూపీఏ ప్రభుత్వమే అనేది గుర్తు చేశారు. కేంద్రం తమ అభిప్రాయాన్ని సమర్పించింది కూడా యూపీఏ హయాంలోనే అని ఆమె అన్నారు. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు రెండూ మహిళా అధికారులకు వ్యతిరేకంగా వ్యవహరించాయనేది స్పష్టం. వాస్తవానికి రాజ్యాంగంలో సమానత్వాన్ని గుర్తించినప్పటికీ, అన్ని రంగాలలో ఆచరించడం ఇప్పుడిప్పుడే సాగుతున్నది. 


సైన్యంలో కూడా వివిధ హోదాలలో మహిళలు కీలక బాధ్యత పోషించే సమయం వచ్చింది.  కాకపోతే కేంద్ర ప్రభుత్వం మహిళా అధికారులకు వ్యతిరేకమైన వైఖరి తీసుకోక పోవలసింది. రాజకీయపక్షాలు పరస్పర విమర్శలకు దిగే కన్నా సామాజిక మార్పు కోసం తమవంతుగా ఇంకా ఏమి చేయగలమనేది ఆలోచించడం మంచిది. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వాలు చేయవలసింది ఎంతో ఉన్నది. 2019 డిసెంబర్‌ నాటి వివరాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వేదిక జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో మన దేశం 112 వ స్థానంలో ఉన్నది. గతంలో కన్నా మరో నాలుగు స్థానాలు దిగజారింది. ఈ సూచిక స్త్రీ పురుష తారతమ్యాన్ని సూచించదు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలు ఎంత అసౌకర్యంగా ఉన్నారో తెలుపుతుంది. ఈ అసమానత తొలగాలంటే మహిళలకు సమానస్థాయి కల్పించడానికి సమాజం మానసికంగా సిద్ధం కావాలె. మహిళల ఎదుగుదలకు ప్రధాన అడ్డంకి సమాజ ఆలోచనా ధోరణే. 


logo