గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Feb 18, 2020 , 22:55:17

భాషే మన ఐడీ కార్డు

భాషే మన ఐడీ కార్డు

ప్రాణి మనుగడకు ముఖ్యంగా కావల్సింది గాలి, నీరు, ఆహారం. గాలి ఉంటేనే ప్రాణి బతుకుతుంది. దానికి నీరు, ఆహారం అవసరమౌతాయి. సాహిత్యానికి కూడా అలాంటివే మూడు కావాలి. భాష, రూపం, వస్తువు. భాష ఉంటేనే సాహిత్యానికి ఒక రూపం ఏర్పడుతుంది. రూపం పాఠకుడి మనసులో బొమ్మ కడితేనే వస్తువు ప్రకటింపబడుతుంది. దీన్నిబట్టి వస్తువు కన్నా, రూపానికన్నా భాష ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. భాషే మన ఐడీ కార్డు.

వాస్తవాలు తెలుసుకోవడంలోనే సగం జీవితం గడిచిపోయింది. కాలం వృథా అయిపోయింది అని బాధపడుతున్నది. ఆ పరిస్థితి రాబోయే తరాలకు రాకూడదు. సంస్కృతి, సంప్రదాయం పేరుతో గతంలోని చెత్తనంతా వచ్చే తరాల మీద బలవంతంగా రుద్దకూడదు. వారి రెక్కల మీద మోయలేని భారం వేసి, సంశయంలో పడదోసి వారి జీవితాలు దుర్భరం చేయకూడదు.


భాషను మించిన ఐడెంటిటీ కార్డు మనకు ఇంకొకటి లేదు. సూది వెంట దారంలా భాష వెంట సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం వగైరా అన్నీ వాటంతట అవే సాహిత్యంలో వచ్చిచేరుతాయి. అయితే ఇప్పుడు వాటిని కొంచెం ఎడిట్‌ చేసుకోవాల్సిన తరు ణం వచ్చింది.సాహిత్యంలో భాషను, యాసను నిలుపుకోవడమంటే మన తల్లి పాల తీయదనాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు. మన మట్టి వాసనను మనం ఎలుగెత్తి చాటుకున్నట్టు. రెపరెపమనే మన జెండాను మనం ఎగరేసుకున్నట్టు. మన చిరునామా మనం సరిగా చెప్పుకున్నట్టు. భాషే మూలం. యాసే కేంద్రకం. 


పలానా జిల్లావాన్ని అని చెబితే చిరునామా పూర్తిగా చెప్పినట్టు కాదు. ఇంకా లోతుల్లోకి, మూలాల్లోకి వెళ్లాలి. ఏ మండలమో, ఏ గ్రామమో, ఏ వీధో చెపితే గాని మన చిరునామా పూర్తికాదు. చిరునామాను విశ్లేషించి చూస్తే అది వర్గాన్ని, ఆర్థిక స్థోమతను కూడా తెలియజేస్తుంది. ఒక ప్రాంతం నుంచి వెలువడ్డ రచన మనకు అనేక విషయాలు తెలియజేస్తుంది. పువ్వు వెంట వచ్చే తావి లాగా. ఇక సాహిత్యం జీవిత దర్శనం అయినప్పుడు, జీవితానికి సంధించిన అన్ని అంశాలు, అన్ని పార్శాలు అందులో చోటుచేసుకుంటాయి. ప్రధానం గా భాష! అసలు భాషే మూల వాహిక కనుక. భాష ఎంత స్పష్టంగా ఎంత సరళంగా వాడితే, ఆ రచన అంత స్పష్టంగా అంత సరళంగా అంత బలంగా తయారవుతుంది.


సాహిత్య పరిణామక్రమంలో ఒకప్పుడు పండితులు మాత్రమే రచనలు చేసేవారు. రచనలు గ్రాంథికంలో వచ్చేవి. భూస్వామ్య వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినట్లుగా సాహిత్యం గ్రాంథికంలోంచి వ్యావహారికంలోకి మారింది. వ్యావహారిక భాషను పత్రికా భాష, ఉమ్మ డి భాష అని ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. కానీ ప్రామాణిక భాష ఏదీ అంటే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతీయ భాషే ప్రామాణికం. సృజనాత్మక రచనలు ఆయా ప్రాంతీయ భాషల్లో వచ్చినప్పుడే బలంగా ఉంటున్నాయన్న విషయం నిర్వివాదాంశం. పరిపాలనా వ్యవస్థకు శాస్త్ర సాంకేతిక విషయ వివరణకు ఉమ్మడి భాషను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆ భాష. అందులోని విషయం అన్ని ప్రాంతాలవారికి అందాల్సి ఉంది గనుక. సృజనాత్మక రచనలు కూడా ఉమ్మడి భాషలో చేపట్టొచ్చు. విషయాన్ని ప్రతిభావంతంగా దర్శింపజేయొచ్చు. 


ఒక ప్రాంతానికి చెం దిన భాషను, యాసను ఉపయోగించి రచన వెలువడితే అది ఇతర ప్రాం తాలవారికి అర్థం కాదనేది తప్పు. కొన్ని సాహిత్య విలువలతో దానిలోని స్ఫూర్తి, ఆర్తి నేరుగా అన్ని ప్రాంతాల పాఠకులకు అందుతుంది. స్వానుభావంతో చెప్పేదేమంటే తెలంగాణ ప్రజల భాషలో నేను తొలుత రాసిన కవితలు, కథలూ తెలుగు రాష్ర్టాలలోనూ వాటి బయటా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యాయి. పైగా అవి ప్రజ ల భాషలో రాసినందుకే శక్తిమంతమైనాయని అందరూ ఒప్పుకున్నారు. అర్థం కాలేదని ఎవరూ అనలేదు.


ప్రత్యేకంగా ప్రజల భాషలో రచనలు రావడానికి చాలా సంవత్సరాలకు ముందే ఆ భాషా పదాలు సాహిత్యంలో జొరబడ్డాయి. మన ప్రాచీ న సాహిత్య ప్రక్రియలైన పద కవిత, తత్వ కవిత, మార్గ కవిత, శతకం, ద్విపద లాంటి వాటిలో ప్రజల భాషలోని పదాలు చాలా కనబడుతాయి. రచనలు ప్రజలకు అర్థం కావాలి. అందుబాటులోకి రావాలనే భావనలోంచే కవులు తమ రచనల్లో ప్రజా భాషా పదాల్ని ఎక్కువగా వాడి ఉం టారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రాచీనకాలం నుంచి నేటి అత్యాధునికయుగం వరకు ఉన్న కవులు, రచయితల్లో కొంతమంది తమ రచనలు జానపద సాహిత్యానికి దగ్గరగా లేదా సమాంతరంగా ఉండాలనుకోవ డం వల్ల, ప్రజల భాషలోని పదాలు లిఖిత సాహిత్యంలో అంతర్భాగమయ్యాయి, అవుతున్నాయి, అవుతాయి.


ఉమ్మడి భాషలో ప్రాంతీయ పదాలు జొప్పించి ఒకరకమైన స్వతంత్ర ప్రత్యేక ప్రాంతీయ భాషకు రూపకల్పన జరుగుతూ ఉంది. ఉదాహరణ కు ‘బతుకులోని తండ్లాటను తెలుసుకో’ అనే వాక్యంలో ‘తండ్లాట’ అనే ది తెలంగాణ పల్లెల్లో విరివిగా వినిపించే మాట! మిగతా పదాలు అన్ని తెలుగు ప్రాంతాల్లో వినిపించే మాటలు. నేత పనివారి జీవితాల గూర్చి వచ్చే రచనల్లో-వారి వృత్తికి సంబంధించిన పదాలు చేరుతాయి. బొగ్గు గనుల్లో పనిచేసే వారి జీవితాల గూర్చి వచ్చే రచనల్లో వారికి పరిమితమైన సాంకేతిక పదజాలం సాహిత్యంలో చేరుతుంది.


తెలుగైపోయిన ఉరుదూ పదాలతో ఒక రకమైన భాష హైదరాబాదు పాత బస్తీలో వినిపిస్తుంది. ‘అద్దం వేసేయండి. గాలి జొరబడి బాధిస్తోం ది’ అని ఆ మాటకు అర్థం ఈ విధంగా తెలంగాణ ప్రజల భాష ఉరుదూ, ఫారసీ, అరబ్బీ, సంస్కృతం, కన్నడం, మరాఠీ లాంటి అనేక భాషల పదాలతో తయారయ్యింది. ఆధునికకాలంలో విద్యావంతుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇంగ్లీషు పదాలు ఎక్కువగా చేరుతున్నాయి. ఫలితం గా ఉమ్మడి భాష పెరుగుతూ ఉండటంతో పాటే ప్రాంతీయ భాష కూడా పెరుగుతూ ఉంది. గమనించవల్సిన విషయమేమంటే, ఒక ప్రాంతీయ భాషలోనే అనేకానేక భాషా భేదాలున్నాయి. ఉంటాయి. ఎక్కడికక్కడ అవి ఉమ్మడి భాషలో కలిసిపోతుంటాయి. సమకాలీన సాహిత్యరంగం లో ఎంతోమంది ప్రతిభామూర్తులు నిజాయితీగా తమ తమ మూలాల్ని వెతికిచూపుతున్నారు. వారంతా తమ గళంలో ఒదిగిన భాష ను, యాస ను తమ కలంలో జొప్పించి గర్వించదగిన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందించవల్సిందే!


సాహిత్యం స్పష్టంగా ఉండాలి. నిజాయితీలోంచి రావాలి. చిత్తశుద్ధి లోంచి రావాలి. నిజాల్ని వెల్లడించాలి. మరి ఇవన్నీ ఉండాలన్నప్పుడు సమాజంలోని మనుషుల్లాగానే ఆయా ప్రాంతపు సాహిత్య పాత్రలు కూడా ఆయా సమాజాల్లోంచే రావాలి. అలాంటప్పుడు పలుకుబళ్ళు, జాతీయా లు, నుడికారాలు తప్పనిసరి. అవన్నీ ఉన్నప్పుడే సాహిత్యం సమాజపు ఆత్మలో అంతర్భాగమైపోతుంది. పచ్చి నిజాలు ఉన్నవి ఉన్నట్లుగా రాస్తే అది సాహిత్యం కాదు. వాస్తవాల మీద కాల్పనిక సృజనాత్మకత ఒక సన్నని పొరలా కప్పి ఉండాలి. అప్పుడే ఆ నిజాలు సాహి త్య విలువలుగా మారిపోతాయి. సరే, ఈ విషయాలు ఇట్లా ఉండనిద్దాం. 


చివరగా మరొక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం. భాషా సాహిత్యాల గురించి మనం ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు. భాషా విద్వేషాల గురించి, భాషోద్యమాల గురించి ఎంతైనా చర్చించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తల్లి పాలు తాగి పెరిగితేనే ఆరోగ్యంగా ఉంటా రు. అలాగే మాతృభాషలోనే విషయాలు సులువుగా నేర్చుకోగలుగుతా రు. ఎదుగుతున్న కొద్దీ ప్రపంచదేశాలెన్ని తిరిగినా, ఎంతోమందిని కలిసినా, తల్లి స్థానం తల్లికే ఉంటుంది. తల్లి లాంటి పుట్టిపెరిగిన ఊరి స్థానం ఆ ఊరికే ఉంటుంది. ఎవరూ కాదనలేరు. కాని ఇప్పుడు కొంచెం వైజ్ఞానికంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యుగ స్పృహను జీవితానికి అన్వయించుకోవాల్సిన అవసరం వచ్చింది.


మాతృభాష సరే. కాని, అందులో మనం పిల్లలకు ఏం నేర్పుతున్నామనన్ది కూడా ఇప్పుడు చాలా ముఖ్యం! పసి పిల్లలు నిలకడగా కూర్చుంటున్న దశలోనే మన వాళ్లు ‘జేజకు దండం పెట్టు’ అని చెపుతుంటారు. ఇంకొంచెం పెరగగానే ‘చందమామ రావే జాబిల్లి రావే’ అని పాడి వినిపిస్తుంటారు. కొంచెం కొంచెం మాటలు వస్తున్న దశలోనే ‘చేత వెన్న ముద్ద. చెంగల్వ పూదండ’ అని దేవుడి వర్ణనలతో పాఠాలు ప్రారంభమవుతాయి. జీవితంలో ఎప్పుడూ ఎక్కడా వెన్నముద్ద తినే కల్పిత పాత్ర కృష్ణుడు కనపడకపోయినా సరే-వాస్తవం ఏమంటే వేల యేళ్లు గడిచినా చందమామ దిగిరాలేదు. మనిషే చంద్రుడి పైకి వెళ్లి రావల్సి వచ్చింది. ఊహల్లోంచి, భ్రమల్లోంచి వచ్చేది సాహిత్యమైతే, వాస్తవంలోంచి, నిజంలోంచి వచ్చేది సైన్సు. ‘పద పద పోదాం.. చంద్రుడి పైకి’ అని పాడాల్సిన సమయం వచ్చింది కాదా? దేవుడు, దయ్యం, భూతాలు, మహిమలు, మాయల కథలు మానేసి మానవుడి శౌర్యగాథలు చెప్పాల్సిన సమయం, మానవుడి నూతన ఆవిష్కరణల గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది.


‘జానీ-జానీ -యస్‌ పాప్పా/ ఈటింగ్‌ షుగర్‌? / నో పాప్పా/ టెల్లింగ్‌ లైస్‌?  లేదా ‘అప్‌ ఎబౌద హిల్‌'  కాని ‘ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌' లాంటి ఇంగ్లీషు రైమ్స్‌ పర్యావరణం గూర్చి, సామాజిక జీవనం గూర్చి, వ్యక్తిత్వ వికాసం గూర్చి ఉన్నాయి. దేవుడి గూర్చి, భక్తి గూర్చి, మతం గూర్చి లేవు. ఏ దేశంలో ఏ భాషలో ఎలాంటి అబద్ధపు పాటలు ఉన్నా అవి పిల్లలకు నేర్పడం మానెయ్యాలి. వారికి వాస్తవాలు చెప్పడం అవసరం. ఇప్పుడున్న తరం ఏమనుకుంటోందంటే.. చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పినవన్నీ అబద్ధాలు కదా? వాస్తవాలు తెలుసుకోవడంలోనే సగం జీవితం గడిచిపోయింది. కాలం వృథా అయిపోయింది అని బాధ పడుతున్నది. 


ఆ పరిస్థితి రాబోయే తరాలకు రాకూడదు. సంస్కృతి, సంప్రదాయం పేరుతో గతంలోని చెత్తనంతా వచ్చే తరాల మీద బలవంతంగా రుద్దకూడదు. వారి రెక్కల మీద మోయలేని భారం వేసి, సంశయంలో పడదోసి వారి జీవితాలు దుర్భరం చేయకూడదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడనివ్వాలి. మానవీయ విలువల్ని దర్శింపనీయాలి. భాష మన ఐడి కార్డు నిజమే! బాల్యంలో బోధన మాతృభాషలోనే జరుగాలి. నిజమే! అదే న్యాయం. అయితే వాస్తవ దృక్కోణం లోంచి వైజ్ఞానికంగా జరుగాల్సి ఉంది. 


logo