గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 16, 2020 , 23:04:52

ఆధ్యాత్మిక రచయిత రుక్మిణి

ఆధ్యాత్మిక రచయిత రుక్మిణి

డాక్టర్‌ రుక్మిణి తండ్రిగారైన ఆచార్య రామరాజు గారితో కలిసి రచించిన ‘శ్రీ సొరకాయల స్వామి చరిత్ర’ను 1992లో ప్రచురించారు. ‘ది సేజ్‌ ఆఫ్‌ నారాయణవరం’ గ్రంథాన్ని సేకరించి తెలుగులో మూడు భాగాలుగా ఈ గ్రంథ రచన చేశారు. మెుదటి భాగంలో సొరకాయల స్వామి వ్యక్తిత్వం, ఆవిష్కరణలు, అద్భుతాలు, సర్వజ్ఞత్వము-భవిష్యవాణి, దివ్యత్వము, మద్రాసు రాకపోకలు, మహాసమాధి వరకు రచించి, రెండవ భాగంలో సమకాలీనులు, మహాసమాధి తర్వాత అంశాలు, మూడవ భాగంలో సమకాలీన మహానుభావులు మెుదలైన విషయాలను గ్రంథస్థం చేశారు.

విదుషీమణి బిరుదురాజు రుక్మిణి 1952 జనవరి16న వరంగల్‌ జిల్లా హన్మకొండలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సూర్యాదేవి, రామరాజులు. జానపద వాజ్ఞయ పరిశోధకుడైన ఆచార్య బిరుదురాజు రామరాజు రెండవకుమార్తె రుక్మిణి. వీరు 1978లో ‘నన్నయ భారతములో ఉపమ’ అనే అంశంపై నన్న య భారతమందలి ఉపమలంకార వైశిష్టము గూర్చిన పరిశోధనకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటును పొందారు. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు భాషాశాఖలో ఆచార్యులుగా 2011జనవరి 31న ఉద్యోగ విరమణ చేశారు.

1983ను నన్నయ్య సంవత్సరంగా పాటించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఆ సిద్ధాంత రచనను గ్రంథంగా ప్రచురించారు. తన గ్రంథంలో నన్నయ్య భార త రచనానువాదం గురించి..‘ పరంపరాగతమైన సంప్రదాయ సంస్కారముల ప్రభావము, తత్కాలీన దేశభాషల వాతావరణము, నవ నవ్యోశాలినమైన స్వీయప్రతిభ ఇవన్ని కలిసి నన్న య అపూర్వ వ్యక్తిత్వ నిర్మాణమునకు కారణములై తెలుగులో కావ్యత్వమును సంతరించుకున్న స్వతంత్ర రచనయా? అన్నం త ఉత్కృష్టముగా భారతము ఆవిష్కృతమైనది’ అని చెప్పారు. తెలుగు భారతమును వాస్తవమైన పరిణామ దృష్టితో చూడాలంటూ.. తెలుగు భాషాస్వత్వము, తెలుగుజాతి ఆలోచనారూపము, సాహిత్య ప్రభావము, తత్కాలీన పరిస్థితులు. అవి; భాషాగతములు, సాంఘికములు అన్నీ కలిసి కవి మనోదర్పణంపై ప్రభూతమగు సృష్టి  సంస్కృత భారతమునకు యథాతథముగా ఉండుటకు ఆయనలోని కవి రూపమును ప్రకాశింపజేయు అలంకారములోనిదే ఉపమాలంకారము. ఇందులో ‘ఉపమాశైలూషి’ నాల్యవిన్యాసముతో పాటు అంతస్తత్వ పరిశీలనారూపమే తన సిద్ధాంత వ్యాస రచనగా వెలువడిందని ఆమె రాసుకున్నారు.

2004లో 27 మంది యోగినుల వృత్తాంతాలతో కూడిన ‘ఆంధ్ర యోగినులు’ గ్రంథం ప్రచురించారు. వేదభూమీ కర్మభూమీ అని కీర్తింపబడుతూ ఆధ్యాత్మికంగా శిఖరాయమానమై న భారతభూమిని ఎందరో మహనీయుల సంస్కారం పావనం చేసింది. కానీ చరిత్రలో నమోదైన మహనీయులంతా పురుషు లే కావడంతో స్త్రీల పావన చరిత్రలు విస్మృతిలోకి నెట్టివేయబడిన సత్యాన్ని ఎత్తిచూపుతున్నది.1995 నుంచి తెలంగాణ, రాయలసీమ, కృష్ణా గోదావరి జిల్లాల్లో పర్యటించి 50కి పైగా యోగినుల చరిత్ర సమాచారాన్ని సేకరించారు రుక్మిణి. ఆ యోగినులు సామాన్య జీవన విధానం నుంచి యోగ పథంలోకి మరలిన తీరు, వారు ప్రజలకు ఉపయోగపడిన తీరు, వారి చిత్తవృత్తి, లభించిన సిద్దులూ, గురువు లూ, వారి ప్రబోధాలు తనకు లభించినంత మేరకు ‘ఆంధ్ర యోగినులు’ గ్రంథంలో చేర్చారు. వారిలో కంది మల్లయ్యపల్లె ఈశ్వరమ్మ మెుదలుకొని తరిగొండ వెంకమ్మ, దొంతులమ్మ, తిక్క లక్ష్మమ్మ, గయాబాయి, తాడాుు్వ శబరిమాత, శృంగవృక్షం శివబాలయోగేశ్వరీదేవితో కూడిన 27 మంది యోగినుల వృత్తాంతాలు లిఖించబడ్డాయి.

రుక్మిణి భావవివరణ చేసిన ‘సీత పాట’ సరససీతారామ సంవాదము అనే గ్రంథము. ఇది 2001లో తిరుమల  దేవస్థానం వారు ప్రచురించారు. ఈ తాత్విక కావ్యాన్ని 17వ శతాబ్ది మధ్య భాగంలో ఓరుగల్లు ప్రాంతంలోని పరుశరామపంతుల లింగమూర్తి గురుమూర్తి రచించారు. మోక్షమార్గము, జీవాత్మ పరమాత్మ సంబంధ భేదములను ఈ ఆధ్యాత్మిక కావ్యంలో వివరించారు. దీనిలోని ప్రధాన అంశం లోకంలోని ముక్తి మార్గాల్లో ఏది సులభమార్గమో తెలియజేయమని ప్రార్థించడం. తెలుగు నేలన అద్వైత వేదాంతులూ, ముఖ్యంగా  స్త్రీలు ఈ పాట పాడుతుంటారనీ, పూర్వం ఈ గ్రంథం గుజలీ రూపంలో ఉండేదనీ, ఈ తరం వారికి అందుబాటులోకి భావ వివరణ ద్వారా రుక్మిణి చేత చేయించామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు.

తన ‘వ్యాస పారిజాతం’ గ్రంథ ఉద్దేశం చెప్తూ భారతీయ సంస్కృతి మూలాలు అపరిమితమైన విషయ సంపద కలిగినవి కనుక ఆ విషయాలను స్థూలంగా పరిచయం చేయడం ఆ గ్రంథ లక్ష్యం అని చెప్పుకున్నారు.  ఇందులోని కథలు కొన్ని ఉపనిషద్విషయమునకు సంబంధించినవి. ఇవి ‘సనాతన సార థి’ మాసపత్రికలో 1988-89ల్లో ప్రచురింపబడినవి.మానవుడు జననమరణాల మధ్యన జీవిస్తాడు. ఉత్తమ దశకు చేరుకునేందుకు కర్మమార్గాన పయనిస్తాడు. మతాలు అనేవి నైతిక విలువల పరిరక్షణకే ఏర్పడినాయి. వాటన్నింటి పరమార్థము సత్యం, ధర్మం, శాంతి ప్రేమాహింసల తత్వాన్ని తెలియజెప్పడమే. అయితే మానవునిలోని స్వార్థం, దురాశలు, అసహనాలు, దౌర్జన్యాలు వీటి స్వరూపాలను మార్చివేస్తాయి. ‘వ్యాస పారిజాతం’లో ఉపనిషత్కథలు అధ్యాయంలో 11 కథలనూ, రామాయణం అనే అధ్యాయంలో 5 కథలనూ, ఆంధ్ర మహాభారతం అనే అధ్యాయంలో 4 కథలనూ తీసుకొని పరిచయం చేశారు.

డాక్టర్‌ శాంతారాం టిఫ్ణీస్‌ మూలరచన అయిన ‘శ్రీ సద్గురు సతి గోదావరిమాత చరిత్ర’ను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు రచయిత్రి. శిరిడీక్షేత్రానికి సమీపంలోని సాకోరిలో ఉపాసనీ బాబా నెలకొల్పిన కన్యాకుమారి స్థానాన్ని శ్రీ గోదావరిమాతకు అప్పగించిపోయారు. గోదావరిమాత ఆధ్వర్యంలో ఆ కన్యాకుమారి స్థానం ఆర్ష సంస్కృతికి, వైదికధర్మానికి, భారతీయ స్త్రీత్వ పావిత్య్రానికీ ఆదర్శ సంస్థగా నిలబడింది. ఆశ్రమంలోని బ్రహ్మావాదినులైన కన్యకలు సాధకులు. వారు ప్రేమ కూ, భక్తికీ, త్యాగానికీ ప్రతీకలు.

డాక్టర్‌ రుక్మిణి తండ్రిగారైన ఆచార్య రామరాజు గారితో కలిసి రచించిన ‘శ్రీ సొరకాయల స్వామి చరిత్ర’ను 1992లో ప్రచురించారు. ‘ది సేజ్‌ ఆఫ్‌ నారాయణవరం’ గ్రంథాన్ని సేకరించి తెలుగులో మూడు భాగాలుగా ఈ గ్రంథ రచన చేశారు. మెుదటి భాగంలో సొరకాయల స్వామి వ్యక్తిత్వం, ఆవిష్కరణలు, అద్భుతాలు, సర్వజ్ఞత్వము-భవిష్యవాణి, దివ్యత్వము, మద్రాసు రాకపోకలు, మహాసమాధి వరకు రచించి, రెండవ భాగంలో సమకాలీనులు, మహాసమాధి తర్వాత అంశాలు, మూడవ భాగంలో సమకాలీన మహానుభావులు మెుదలైన విషయాలను గ్రంథస్థం చేశారు.

జానపద రామాయణ గాథ అయిన ‘భరత ప్రపంచ రామాయణము’ను 1990లో పరిష్కరణ చేశారు రుక్మిణి. ఈ అము ద్ర మూలగ్రంథం కృతికర్త పురం రంగారావు. వీరిది కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ తాలూకాలోని పూశాల (పుప్పుశాల) గ్రామం. తల్లిదండ్రులు రాజమ్మ-నరసింగారావులు. 1942-43 ప్రాంతంలో వీరు మరణించినట్లు చెప్తారు. 95 ఏండ్లు వీరు జీవించారు.‘భరత ప్రపంచ రామాయణము’ మూడు అశ్వాల ప్రబం ధం. ప్రథమాశ్వంలో 150, ద్వితీయాశ్వంలో 84, తృతీయా శ్వంలో 158 గద్యపద్యాలున్నవి. శ్రీరాముడి వనవాస సమ యంలో ఆయన పాదుకల్ని రాజప్రతినిధిగా పెట్టుకొని రాజ్యమేలిన భరతుడి కథను వర్ణించడం వల్ల దీనికి ‘భరత ప్రపంచ రామాయణము’ అన్న పేరు పెట్టినారు. ఇది ప్రబంధ కథా వస్తు పరిణామానికి అద్దం పట్టిన కల్పిత గాథా రచన.

రుక్మిణి భావవివరణ చేసిన ‘సీత పాట’ సరససీతారామ సంవాదము అనే గ్రంథము. ఇది 2001లో తిరుమల దేవస్థానం వారు ప్రచురించారు. ఈ తాత్విక కావ్యాన్ని 17వ శతాబ్ది మధ్య భాగంలో ఓరుగల్లు ప్రాంతంలోని పరుశరామపంతుల లింగమూర్తి గురుమూర్తి రచించారు. మోక్షమార్గము, జీవాత్మ పరమాత్మ సంబంధ భేదములను ఈ ఆధ్యాత్మిక కావ్యంలో వివరించారు. దీనిలోని ప్రధాన అంశం లోకంలోని ముక్తి మార్గాల్లో ఏది సులభమార్గమో తెలియజేయమని ప్రార్థించడం. తెలుగు నేలన అద్వైత వేదాంతులూ, ముఖ్యంగా స్త్రీలు ఈ పాట పాడుతుంటారనీ, పూర్వం ఈ గ్రంథం గుజలీ రూపంలో ఉండేదనీ, ఈ తరం వారికి అందుబాటులోకి భావ వివరణ ద్వారా రుక్మిణి చేత చేయించామని ప్రచురణకర్తలు పేర్కొన్నారు.

పలు పరిశోధక పత్రాలను రచించి, ఆధ్యాత్మిక గ్రంథాలను అనువదించి, పరిష్కరించి, భావవితరణ చేసిన రుక్మిణి ఆధునిక యోగినిలా జీవించారు. ఆమె ఆడంబరాలూ, అలంకరణలూ, భౌతిక సంపదలపట్ల నిర్లిప్తంగా ఉన్నారు. ఆర్థికంగా, హార్థికంగా విద్యార్థులకూ, ఆపన్నులకూ సహాయమందించారు. ఆకుచాటు పూలగుత్తివలె ఉండి సువాసనలు వీస్తూ, డాంబికపు లోకం డొల్లతనాలకు దూరంగా ఉంటూ ఆచరణాత్మకమైన అమూల్యమైన మానవతా సందేశమిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో తన ముద్రను వేసి ఆమె 18 ఫిబ్రవరి, 2017న అనంతతీరాలకు వెళ్ళిపోయారు.

- అనిశెట్టి రజిత, 98494 82462

( ఫిబ్రవరి 18న రుక్మిణి మూడవ వర్ధంతి సందర్భంగా..)

logo
>>>>>>