గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 16, 2020 , 23:03:08

పురా దుఃఖ నివేదన ‘శ్రీకాంత్‌'

పురా దుఃఖ నివేదన ‘శ్రీకాంత్‌'

పదిహేడేళ్ళ విరామం తర్వాత శ్రీకాంత్‌ నుంచి వచ్చిన మూడవ కవిత్వ పుస్తకం ఇది. రకరకాల పత్రికల ద్వారా, తన బ్లాగ్‌ ద్వారా చాలామందికి చిర పరిచితమైన కవిత్వం ఇది. మధ్యలో వచ్చిన అనేక కవులపై, వారి కవిత్వంపై ఈ కవిత్వశైలి ప్రభావం సుస్పష్టం, వొప్పుకుతీరాల్సిన వాస్తవం. వాద, వివాద, ప్రతివాద గందరగోళాల సాహిత్య వాతావరణంలో ఒక వాసంత సమీరం ఇలా తాకుతుంది..

‘వానలు కురిసే వేళల్లో, ఎండలు చిట్లే కాలాల్లో

వొంటరిగా ఒక్కళ్ళే అనేకం అవుతూ, అనేకం అయ్యి వొక్కళ్లుగా మిగులుతూ

దీపం వెలిగించిన చీకట్లో తమని తాము రాసుకుంటూ నిన్ను నీకు చెరిపివేస్తూ

ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు

ఎందుకో కానీ మోహిస్తారు స్త్రీలు..’

ఇది శ్రీకాంత్‌ కవిత్వం. ‘శ్రీకాంత్‌' అనే పుస్తకంలోని కవిత్వం. కవి పేరు, పుస్తకం పేరూ ఒక్కటే అయిన ఒక అపూర్వ అపురూప సందర్భం సృజించిన కవితా ప్రవాహం. పతితుల, భ్రష్టుల, బాధాసర్పదష్టుల ఏడ్పుని నిక్కంగా పట్టుకొని ఏడవండేడవండని, ఏడ్చి బాధ తీర్చుకోండని ధైర్యం చెప్పడం ఈ పుస్తకం. సమస్త జీవన విధ్వంసాన్నీ, మాయమైపోతున్న మానవ సంబం ధా ల్ని, ఆవిరైపోతున్న అనుబంధాల్నీ, చిట్లిపోతున్న వాటి చప్పుడుని చెవులు రిక్కించి విని తట్టుకోలేక చేస్తున్న నిశ్శబ్ద శబ్దం ఈ కవిత్వం.


ఇది కేవలం అలయ్‌ బలయ్‌. ఇది కేవలం అనునయింపు. ఇది కేవలం అక్కున చేర్చుకుని ఓదార్చడం. ఇక్కడ హామీ పత్రాల్లేవు. అదిగో నవలోకం.. అంటూ చేతుల్లో మంత్రదండం తిప్పడం లేదు. ఒక సినీ కవి చెప్పిన కసితీరా నవ్వేందుకు లోకం వుంది, కడుపారా ఏడ్చేందుకు శోకం ఉంది వాక్యాల సమ గ్ర సారాంశం పేజీ పేజీలోనూ రూపుదిద్దుకోవడం వుంది. ఈ దుఃఖ భరిత ప్రపంచం ఒక వాస్తవం. ఈ చెప్పుకోలేని బాధల రక్తస్రావం ఒక అనివార్యత. గూడు చెదరడమూ, గుండె పగలడమూ చర్వితచర్వణంగా మారిన ప్రపంచం లో సహానుభూతిని పంచే తాత్త్విక జీవన చింతనను వెన్నెలలా కురిపించడం వుంది. అంతే వుంది.

సరే, సరే, అది సరే కానీ.. అంతిమంగా నువ్వు చెప్పొచ్చేది ఏమిటీ ఇంత కు? అని మీరు నన్ను నిలదీసి అడిగితే, ఏమీ లేదు ఇక్కడ. మృత్యుశయ్యపై ఉన్న శిశువుని ఆఖరిసారిగా చూసుకుంటూ ముద్దాడే ఒక తల్లి శ్వాస, ఉగ్గప ట్టుకుని తన చుట్టూ తిరిగే గాలి. కొంత నిశ్శబ్దం. కొంత దిగులు. మరికొంత ఇలా గడిచిపోయే కాలమూ, వాలిపోయే ఆకాశమూనూ..


ఇది ఒక కొత్త డిక్షన్‌. సరికొత్త కవిత్వ డికాక్షిన్‌. అతి సున్నిత భావ పరంపర,  మరింత సరళ భాషల మేలు కలయిక. అతి సామీప్యం నుంచి నీ హృదయా న్ని నిమిరే వేల వాక్యాల పరిమళింత. వేవేల గాయాల సలపరింత. కవిత్వ మంటే భయపడి పారిపోయేలా చేసిన పాత తుప్పునంతా పాతరేసి కాలాను గుణంగా సమకూర్చుకోవాల్సిన, సవరించుకున్న  కొత్త గొంతుక. నిత్య జీవి తంలో నిర్లక్ష్యం చేయబడిన అనేకానేక సందర్భాలు, సన్నివేశాలు, సంఘట నలు కనుల ముందుకు తోసుకొచ్చి కవితారూపం సంతరించుకోవడం శ్రీకాం త్‌ ప్రత్యేకం.


నువ్వోసారి తలుపులు, నీ తలుపులు తెరవగలిగితే పసి వాసనతో ఒక గాలి లోపలికి రావొచ్చు. లతను వొదిలి ఒక పూవు నీపైకి వొంగి నిన్ను తాకవచ్చు. రాత్రి చెమ్మని నీపై చిమ్మవచ్చు. నువ్వోసారి తలుపులు, ఆ తలుపులు తెరవ గలిగితే సన్నటి నవ్వుతో ఎవరో నిన్ను పలుకరించవచ్చు. కన్నీళ్ళతో ఎవరో నిన్ను చుట్టుకోవచ్చు. సన్నటి నవ్వుతో ఎవరో నిన్ను పలుకరించవచ్చు. కన్నీళ్ల తో ఎవరో చుట్టుకోవచ్చు. వండిన-తమకో, నీకో అన్నాన్ని నీకు ఒక ప్రార్థన వలె అందివ్వవచ్చు. నువ్వోసారి తలుపులు, నీ తలుపులు తెరవగలిగితే నీకొక ముఖం ఎదురు రావచ్చు. నీకు చెప్పాలనుకుని అప్పటిదాకా వల్లె వేసుకున్న వన్నీ లోలోపలే నొక్కిపట్టి లోపలికి వెళ్లిపోనూ వచ్చు.

పదిహేడేళ్ళ విరామం తర్వాత శ్రీకాంత్‌ నుంచి వచ్చిన మూడవ కవిత్వ పుస్తకం ఇది. రకరకాల పత్రికల ద్వారా, తన బ్లాగ్‌ ద్వారా చాలామందికి చిర పరిచితమైన కవిత్వం ఇది. మధ్యలో వచ్చిన అనేక కవులపై, వారి కవిత్వంపై ఈ కవిత్వశైలి ప్రభావం సుస్పష్టం, వొప్పుకుతీరాల్సిన వాస్తవం. వాద, వివా ద, ప్రతివాద గందరగోళాల సాహిత్య వాతావరణంలో ఒక వాసంత సమీరం ఇలా తాకుతుంది..


‘నువ్వు ఎవరినైనా ఇష్టపడితే

వాళ్ళకా విషయం ఈరోజే చెప్పు. ఎవరితోనైనా గడపాలనుకుంటే, తప్పక కాలం

గడుపు. నువ్వు ఇష్టపడ్డవాళ్ళ అరచేతులలోకి

ముందూవెనుక చూడక, నిన్ను నువ్వు వొంపుకోవాలంటే

వాయిదా వేయక, ఆ పనిని ఇప్పుడే చేయి. ప్రేమించు. రమించు. తాకు-

అందులో తప్పేం లేదు. ఏం చేసినా, ఇప్పుడే, ఇక్కడే.

ఎందుకంటే మరో లోకమేమీ లేదు..’

రొడ్డకొట్టుడు జీవితంలోని పరమ యాంత్రిక దినచర్యలోనూ వెతకగలిగితే వెలుతురు వుంది. హత్తుకుంటే ఆలంబన వుంది. ప్రేమిస్తే జీవితం వుంది అని చెప్తున్న పరమ వాత్సల్య పూరిత జీవన సందేశమూ శ్రీకాంత్‌లో వుంది. ఇలా..

‘ఇక నెమ్మదిగా చీకట్లోంచి లేచి, కనురెప్పలకి అంటుకున్న నిన్నటి రాత్రిని

ముంజేతులతో తుడుచుకుంటూ ఇలా అడుగుతాడు అతడు చిన్నటి గొంతు కతో..’

‘పడుకున్నారా పిల్లలు? అడిగి వుండను ఎన్నడూ కానీ, ఇంతకూ అన్నం తిన్నావా నువ్వు?’

అంతా ఒకే కవిత్వాకాశం పరుచుకొని వుంది. పరిపరివిధాల జీవిత పలవ రింత వుంది. కమిలిన గాయాల కలవరింత వుంది. పాఠకున్ని రకరకాల భావ తీవత్రకు లోనుచేసే లోతైన గాఢత వుంది. మూర్ఛనలు పోయేలా చేసే శక్తి వుంది.  ఇది ఒక చారిత్రాత్మక సందర్భ కవిత్వ పుస్తకం అని చెప్తూ ఇలా ముగించడం..

‘... మీరు ఇచ్చిన

గాయాలకీనూ-

గుర్తుకు ఉంచుకుంటాను తప్పక

ఇందుకు ప్రతిగా మిమ్ములను ఎప్పటికీ...’

- మోహన్‌ రుషి, 96768 93149


logo
>>>>>>