ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 16, 2020 , 22:58:27

ఒకే మత్తు

ఒకే మత్తు

రాసిన గేయాలను

ఎవరైనా గుర్తుకు తెస్తే 

రాయలేకపోతున్న గాయాలు 

గుర్తొస్తున్నై 

వనం అశోకవనం

అయి తీరాలని వాళ్ళ  పంతం

సరయూ నదికి 

గోడకట్టాలని

వాళ్ళు కాంక్రీటు నూరుతారు!

స్వప్న సౌధం 

మత్తు తయారీదారుల 

వశమయిందేమిటి 

ఇక నుండి సూర్యుడు 

అరుణిమను అణచుకొని 

కాషాయం గుమ్మరించాలట 

చుట్టూరా మత్తు మందు 

తోటలే ఐనప్పుడు 

మన తోట కూడా 

మత్తుతో నిండాల్సిందేనట 

నలువైపులా కత్తులు 

తొడల్ని కత్తిరిస్తే 

మనమేం తక్కువ 

మెడల్ని ఉత్తరిస్తామంటున్నారు!

నాది నా ఊరేనా అని వాళ్ళ ప్రశ్న 

నా ఊపిరిలో మత్తు ఉందా లేదా అని విచారణ 

నా మూలాలనెలా చిత్రించి చూపను 

నా డిఎన్‌ఎనెలా

వాళ్ళ డాటాలోకి ఎంటర్‌ చేయను 

నా మట్టిగింజనెలా నెత్తికెత్తుకోను

మనకో ఐడీ కావాలన్నారు

ఆధార్‌ తప్పదన్నారు 

మరిప్పుడు ఒకింత మత్తు కూడా

ఉండి తీరాలంటున్నారు 

వెర్రి తలకెక్కకుండా ఉంటే

జాతిపితను హత్య చేసిందెట్లా

జాతిపత్రాన్ని తూట్లు పొడిచేదెలా

వాయువ్య రాజ్యం మనకు ఆదర్శమట

దాని కీర్తికి మనం చేరువ కావాలట

ఇప్పుడు ఒకే రకం మత్తు

ఉండాలనే వాళ్ళు

రేపు ఒకే రకం

లిపి ఉండాలంటారు

తస్మాత్‌ జాగ్రత్త..!

- ఏనుగు నరసింహారెడ్డి 89788 69183


logo