మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 16, 2020 , 22:56:42

దీపం ఉండగానే..!

దీపం ఉండగానే..!

వలసపాట ఎత్తుకుంటే

మగ్గం వొంటరవుతుందేమోనని

పట్నం తోవ తొక్కని

పేగు మాడుతున్న తండ్లాట 

ఏ గుండె తలుపు తట్టినా 

నిన్నటి దుఃఖమే  

కడుపు ఎంత మండుతున్నా 

కూలీ కోసం కొట్లాడు తీరికలేని 

నేస్తే.. మెతుకు 

నేస్తేనే.. బతుకు

చేతికి ఎముక లేనట్టు 

ఎప్పుడూ పైచేయి షావుకారుదేనా 

ఇద్దరు నేతగాళ్ళ రెక్కల కష్టం 

సరితూచని త్రాసుని కూడా పంచాయితీల పెట్టాలి

అంతా కూడితేనే కదా 

చీమయినా గెలిచేది 

ఏకమయితేనే కదా 

పోగు బలం పెరిగేది

సొంతలాభం కొంతమానుడు దేవునికెరుక 

ఇంటింటా ఎంత చెట్టూ అంత గాలి 

ఊరంతా తిరిగినా 

రూపాయి అప్పుపుట్టని మాయాజూదం 

పరుల సేవకు ప్రాణమెక్కడ?

నా నేత ప్రగతి పథాన 

అదును చూసి పడగ విప్పిన భూదందా  

భూదానం పుట్టిన చోట ఇదేందను విడ్డూరం! 

గట్టిగా నోరయినా డోరయినా 

తెరువలేని అద్దె గూటిలో ఆడుతున్న మగ్గం 

రాత్రి పగలు సొంతింటి కల వెతుకుతున్న మూల్గుడు!

పట్టు పోగుల నడుమ 

నెత్తి పోగు అడ్డుపడ్డట్టు 

జిగిబిగి అల్లిక పట్టుతప్పుతున్నది..! 

నా ఊరు 

నిండు చెరువు తీరు 

నా మగ్గం గుంతల 

సకల జనుల పాదం 

కడుపు ముంతల ఆకలి మక్కిన 

నా సాలె పని 

వంద కాకుల రొట్టెముక్క..

దీపం ఉండగానే  

ఇల్లు చక్కబెట్టు ఆత్రం అటుంచి 

ముందు దీపాన్ని కాపుగాసే 

నాలుగు చేతుల కలసి కట్టు పేనాలి... 

- గజ్జెల రామకృష్ణ, 89774 12795   


logo
>>>>>>