ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 15, 2020 , 22:38:23

దేశం కోరుకుంటున్న నేత

దేశం కోరుకుంటున్న నేత

అన్నిరంగాల్లో అవార్డులతోపాటు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ అగ్రగామిగా దూసుకుపోతున్నది. అంటే దానివెనుక తెలంగాణ రథసారథి కేసీఆర్‌ రాజకీయ చతురత, సంక్షేమం, అభివృద్ధి పట్ల దూరదృష్టి కారణం. అలాగే సమస్యల పట్ల అవగాహన, స్పష్టమైన ప్రణాళిక, వ్యూహరచన ఉన్నాయి. సమస్యలకు పరిష్కారం చూపడంలో నేర్పరితనం ఉన్నది. అందుకే రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కేసీఆర్‌వైపే ప్రజ లు నిలిచారు.

వ్యూహాత్మకంగా గత పోరాటాలకు భిన్నంగా శాంతియుతంగా, వివిధ రాజకీయ దృక్పథాలను, ఆలోచనలను మధించి అందరిని కలుపుకుపోయి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ ఆ తర్వాత పరి పాలనారంగంలోనూ వినూత్న విధానాలతో  దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో సాగునీటి కష్టా లు తీరాయి. లక్షల ఎకరాలకు నీరిచ్చేవిధంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగానికి కల్పతరువుగా మారింది. సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన కేంద్రం సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ పట్ల వివక్ష చూపించింది. అయినప్పటికీ కేసీఆర్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 


అందరూ అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ సాకారం చేశారు. మిషన్‌ కాకతీయ పథకం మూలంగా చెరువులు నిండి గ్రామాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. భూగర్భ జలాలు పెరిగాయి.  వ్యవసాయరంగంతో పాటు దాని అనుబంధ కులవృత్తులను ప్రోత్సహించే దిశగా కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గొర్రెల పంపిణీ,  చెరువుల్లో చేపలు వేయడం వంటి పథకాలతో గ్రామస్థాయిలో ఆర్థికవృద్ధి సాధ్యమైంది. మిషన్‌ భగీరథ ద్వారా  తాగునీరు ప్రతి గ్రామాన్ని చేరుతున్నది.


వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం రైతులకు ఎకరాకు రైతుబంధు పథకం ద్వారా రూ.10 వేలు అందించడం కేసీఆర్‌ గొప్ప విధానపరమైన ఆలోచన. అందుకే 2018లో ప్రపంచ దేశాల్లోని 20 వినూత్న పథకాల్లో ఒకటిగా రైతుబంధు నిలిచింది. అట్లనే కేంద్ర ఆర్థికసర్వే 2019-20 రైతుబంధు పథకాన్ని వినూత్నమైన నవకల్పనగా అభివర్ణించింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌  రైతుబంధు పథకాన్ని రైతులకు గొప్ప వరప్రదాయనిగా అభివర్ణించారు. వ్యవసాయరంగానికి విద్యుత్‌కు అవినాభావ సంబంధం ఉంటుంది.  గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చిపో యే విద్యుత్‌తో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యేది. రాష్ట్రం వచ్చిన తర్వాత డిమాండ్‌ పెరిగినప్పటికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు పవర్‌ హాలిడే లేని స్థాయిలో తెలంగాణ విద్యుత్‌రంగం అభివృద్ధి చెందింది.


తెలంగాణ అనేక పర్యాటక స్థలాలకు పుట్టినిల్లు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకం పూర్తిగా నిర్లక్ష్యానికి లోనైంది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టి తెలంగాణ పర్యాటకరంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. చెరువులపై ఆహ్లాదకరమైన వాతావరణం లో మినీ ట్యాంక్‌బండ్ల ఏర్పాటు గొప్ప ఆలోచన. అందుకే ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జాతీయ పర్యాటక సంస్థ ద్వారా 8 అవార్డులను తెలంగాణ పర్యాటకశాఖ సాధించింది. ప్రజారోగ్య రంగంలో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం చెరగని ముద్రవేసింది. నవజాత శిశువుల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకానికి ప్రశంసలు అందుతున్నాయి. 


కంటి వెలుగు ద్వారా ప్రజలకు కంటిచూపు పరీక్షలు ఉచితంగా చేపట్టింది. ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత ప్రధాన మని గుర్తించిన కేసీఆర్‌ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిద్వారా ఇప్పటికే 95 శాతం బహిరంగ మలమూత్ర విసర్జనరహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ముప్ఫై రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై పకడ్బందీ చర్యలు చేపట్టారు.మున్సిపాలిటీలలో పారిశుధ్యం, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తెలంగాణ అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ప్రజారోగ్యంతో పాటు, జీవావరణ పరిరక్షణ కల్పించవచ్చని ఆలోచించడం కేసీఆర్‌కు  ప్రతి చిన్న సమస్యపై ఉన్న అవగాహనకు నిదర్శనం.


రాష్ట్ర ఆవిర్భావం తర్వాత  తెలంగాణ డిజిటల్‌ రంగంలో, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో అభివృద్ధి చెందిన రాష్ర్టాలను దాటుకుంటూ దూసుకుపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి టెక్నాలజీ అందించాలనే దృఢసంకల్పం తో ఉన్నది. పల్లెలతో పాటుగా పట్టణాల్లో సైతం అభివృద్ధి జరిగేలా గత చట్టాల్లో ఉన్న లోపాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్‌ చట్టం (2019)ను తీసుకొచ్చింది. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అనేక జాతీయ అంతర్జాతీ య ప్రశంసలను అందుకుంది.


ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల పెంపు, అన్ని సామాజికవర్గాలకు, బాలికలకు ప్రత్యేక గురుకులాల ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్‌స్థాయి విద్యపేద ప్రజలకు అందుతున్నది. గురుకులాల్లో నాణ్యమైన ఉచిత  విద్యాబోధన సాగుతున్నది. అందుకే గురుకుల విద్యార్థులు విద్యలో, క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించగలుగుతున్నారు. అక్షరాస్యత పెంపు కోసం‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' అనే వినూత్న కార్యక్రమానికి కేసీఆర్‌ అంకురార్పణ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వంఅనేక అవార్డులను సాధించింది.


తెలంగాణ ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అకాడమీ ఏర్పాటు ద్వారా ఉద్యోగార్థులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణనిస్తున్నది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ప్రభుత్వరంగం అంతా ప్రైవేటురంగం వైపు మళ్లింది. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్‌ సంస్థల్లో సైతం ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ మొదలైంది. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రపంచ దిగ్గజ కంపెనీల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించడంలోముఖ్యమంత్రి కేసీఆర్‌ సఫలమయ్యారు.  అలాగని ప్రభుత్వరంగాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు.


అన్నిరంగాల్లో అవార్డులతో పాటు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ అగ్రగామిగా దూసుకుపోతున్నది. అంటే దానివెనుక తెలంగాణ రథసారథి కేసీఆ ర్‌ రాజకీయ చతురత,  సంక్షేమం, అభివృద్ధి పట్ల దూరదృష్టి కార ణం. అలాగే  సమస్యల పట్ల అవగాహన, స్పష్టమైన ప్రణాళిక, వ్యూహరచన ఉన్నాయి. సమస్యలకు పరిష్కారం చూపడంలో నేర్పరితనం ఉన్నది. అందుకే రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కేసీఆర్‌వైపే ప్రజ లు నిలిచారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలు సమాఖ్యస్ఫూర్తికి, లౌకిక తత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నాయక త్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్నది. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయపార్టీల ఏకీకరణ అనివార్యం.  అభివృద్ధి-సంక్షేమం జోడేడ్ల లాంటి పథకాలు సామాన్యుడికి సైతం చేరవేయ డంలో కేసీఆర్‌ సిద్ధహస్తుడని దేశం గుర్తించింది. అందుకే దేశ ప్రజలు కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ విధానాలు నమూనా ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.


logo