ఆదివారం 23 ఫిబ్రవరి 2020
చట్టసభల ప్రక్షాళన

చట్టసభల ప్రక్షాళన

Feb 14, 2020 , 23:16:43
PRINT
చట్టసభల ప్రక్షాళన

ప్రజాప్రతినిధుల అక్రమాలు, అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇదివరకే అనేక చరిత్రాత్మక తీర్పులిచ్చింది. విచారణ సత్వరమే చేపట్టాలనీ, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులతో విచారణ పూర్తిచేయాలని, శిక్షలు పడినవారిని అనర్హులుగా ప్రకటించాలని గతంలోనే ప్రకటించింది. అయినా వాటితో మన రాజకీయాల్లో గుణాత్మక మార్పు సంభవించిన దాఖలాలు కనిపించటం లేదు. తాజా తీర్పును కూడా అధికార పార్టీతో సహా అన్ని రాజకీయపక్షాలూ ఆహ్వానించటం హర్షణీయం. అయితే నేరచరితులను అరికట్టే క్రమంలో రాజకీయ వేధింపులకు గురైనవారిని వెలివేసే పరిస్థితి ఉండకూడదు.

చట్టసభల్లో నేరచరితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న తీరు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నవారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో వివరణ ఇవ్వటంతోపాటు, ఆయా కేసుల జాబితాను రాజకీయపార్టీలన్నీ తమ వెబ్‌సైట్లలో ఉంచాలని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపికచేసిన 48 గంటల్లోగా లేదా, నామి నేషన్ల దాఖలు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండువారాల ముందు అభ్యర్థుల నేర చరిత్రను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి అన్ని సోషల్‌మీడియా వేదికలపై వెల్లడించాలని ఆదేశించింది. నేర వివరాలన్నీ జాతీయ, స్థానిక వార్తాపత్రికల్లోనూ ప్రకటనలుగా జారీచేయాలని చెప్పింది. అంతేకాకుండా ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు అన్ని రాజకీయపక్షాలు ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా తెలుపాలని ఆదేశించటం గమనార్హం.


అభ్యర్థులను ఎంపికచేసిన మూడురోజుల్లోగా ఈ పని పూర్తిచేయాలని కూడా ఆదేశించటం నేర రాజకీయాల పట్ల సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నదో తెలుపుతున్నది. ఎన్నికల్లో గెలుస్తారన్న ఒకేఒక్క కారణంతో నేరచరితులకు టిక్కెట్లు ఇచ్చామని పార్టీలు చెప్పటం సరికాదు, వారి అర్హతలు, సమర్థత వంటి అంశాలను ప్రస్తావిస్తూ తగిన కారణాలు చూపాలని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ రవీంద్రభట్‌ల బెంచ్‌ స్పష్టంచేయటం గమనించదగినది. రాజకీయాలు నేరపూరితం కావటంపై 2018 సెప్టెంబర్‌లో కోర్టు ఇచ్చిన తీర్పు అమలుకావటం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ధర్మాస నం విచారణ చేపట్టిన సందర్భంగా ఈ విధంగా ఆదేశాలివ్వటం ఆహ్వానించదగిన పరిణామం.


గత రెండు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల వ్యవస్థను శాసిస్తున్న అంగబలం, అర్ధబలాలు ప్రజాస్వామ్యానికి పెనుసవాళ్లు విసురుతున్నాయి. అవినీతికి రాజకీయం పర్యాయపదంగా మారిపోయింది. రాజకీయ పార్టీలకూ, ఆ పార్టీ తరఫు న పోటీ చేస్తున్న అభ్యర్థులకూ రాజకీయ విధానాలు, అమలుచేయదల్చిన సంక్షేమ కార్యక్రమా లు, అభివృద్ధి పథకాల వాగ్దానాలు ప్రచారాస్ర్తాలుగా ఉండటం లేదు. కులం, వర్గం పునాదిగా ధనబలమే నిర్ణయాత్మకశక్తిగా ఉంటున్నది. వారి నేపథ్యం ఎటువంటిదైనా గెలిచే అభ్యర్థుల నే పార్టీలు బరిలో నిలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఏటా ఎన్నికల బరిలో నేరచరితుల సంఖ్య పెరిగిపోతున్నది. 2009లో 15వ లోక్‌సభలో 30 శాతం మంది నేరచరిత్ర కలిగి ఉన్నారు. 2014 నాటికి అది 34 శాతానికి పెరిగింది. 


ఓ పదేండ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2009 నుంచి 2019 వచ్చేనాటికి ప్రజాప్రతినిధుల్లో నేరచరిత్ర కలిగినవారు 109 శాతా నికి పెరిగారు. ప్రస్తుత పార్లమెంట్‌లో ఉన్న 43 శాతం ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని తెలుస్తున్నది. ఇందులో కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాల వంటి తీవ్ర నేరాల్లో విచారణ ఎదుర్కొంటున్న వారు 20 శాతానికి పైగా ఉన్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్న దో అర్థమవుతున్నది. ఇదంతా అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు తమ అఫిడవిట్లలో స్వచ్ఛందంగా తెలిపిన సమాచారమే. నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) లాంటి సంస్థ చేస్తున్న పోరాటానికి తోడు, కొన్ని స్వచ్ఛంద, పౌరసంఘాలు చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. సందర్భానుసారంగా కోర్టులు తగురీతిన స్పందిస్తూ రాజకీయాల ప్రక్షాళనకు నడుంకట్టడం హర్షణీయం. 


కండబలానికి ధనబలం తోడైతే నేరమయ రాజకీయం పురుడుపోసుకుంటుంది. అన్ని విలువల నూ పాతరేసి అందలమెక్కుతుంది. ఈ పరిస్థితుల్లోంచి నేరచరితులు పుట్టుకొస్తున్నారు. ఈ క్రమం లోనే ఫలానా నేరాలున్నాయని పోటీచేస్తున్న నేతలు చెప్పుకోవటానికి సంకోచించడం లేదు. పార్టీలు కూడా నిస్సంకోచంగా అలాంటి అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తున్నాయి. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతున్నది. ప్రజాప్రతినిధుల అక్రమాలు, అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇదివరకే అనేక చరిత్రాత్మక తీర్పులిచ్చింది. విచారణ సత్వరమే చేపట్టాలనీ, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులతో విచారణ పూర్తిచేయాలని, శిక్షలు పడినవారిని అనర్హులుగా ప్రకటించాలని గతంలోనే ప్రకటించింది. అయినా వాటితో మన రాజకీయాల్లో గుణాత్మక మార్పు సంభవించిన దాఖలాలు కనిపించటం లేదు. 


తాజా తీర్పును కూడా అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పక్షాలూ ఆహ్వానించటం హర్షణీయం. అయితే నేరచరితులను అరికట్టే క్రమంలో రాజకీయ వేధింపులకు గురైనవారిని వెలివేసే పరిస్థితి ఉండకూడదు. అధికారపక్షం ప్రతిపక్ష నాయకులపై రాజకీయ దురద్దేశంతో కేసులు పెట్టినప్పుడు వారిని విచారణకు ముందే అప్రతిష్ఠ పాలుచేసే పరిస్థితి ఉండకూడదు. ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానాలు ఈ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే.


logo