ఆదివారం 23 ఫిబ్రవరి 2020
తలాక్‌, తలాక్‌!...

తలాక్‌, తలాక్‌!...

Feb 14, 2020 , 23:12:02
PRINT
తలాక్‌, తలాక్‌!...

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానంగా మోదీజీ ప్రసంగం ఢిల్లీ ఓటర్ల కోసం ఉద్దేశించినదని పరిశీలకులు భావించారు.ఆ ప్రసంగంలో మోదీజీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల్లో కొత్తదేం లేదు. ఇవెంతో కాలంనుంచి చంద్రబాబు, ఆయన మిత్రులు అలుపు లేకుండా ప్రచారం చేస్తున్న అపవాదులే. స్వేచ్ఛాయుతంగా తెలంగాణ బిల్లుపై చర్చ జరుగలేదన్నది మోదీజీ ఆరోపణ తాత్పర్యం. మోదీజీ ఎన్నడూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు.

దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు, ఓట ర్లు నిర్ద్వంద్వంగా, చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పులో (2015 లో మొదటి తీర్పు, 2020 ఫిబ్రవరిలో రెండవ తీర్పు ఆమ్‌ ఆద్మీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు అనుకూలంగా అఖండ విజయం కలిగిస్తూ) తలాక్‌, తలాక్‌, తలాక్‌ నినాదాలు తీవ్రం గా, బలంగా, దృఢంగా, నిర్ణయాత్మకంగా విన్పించాయి. కేంద్రంలోని, పలు రాష్ర్టాల్లోని పాలకపక్షం బీజేపీకి, ఆ పార్టీ అధినేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ నాయకత్వానికి, ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా. 


స్వయంగా ప్రధానమంత్రి మోదీజీ, నిన్నమొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత దేశ వ్యవహారాల మంత్రి అమిత్‌ షాజీ, కేంద్ర మంత్రులందరు, రెండు వందల మంది బీజేపీ పార్లమెంట్‌ సభ్యు లు, వేలాది ఇతర కార్యకర్తలు ఢిల్లీ గల్లీ గల్లీ వెళ్లి పదివేల ర్యాలీలు, సభ లు జరిపినా ఫలితం దక్కలేదు. బీజేపీ ఘోర పరాజయాన్ని రుచి చూడక తప్పలేదు. ఢిల్లీలోనే కాదు, 2019 లోక్‌సభ ఎన్నికల ముందు, ఆ ఎన్ని కల తర్వాత శాసనసభలకు ఎన్నికలు జరిగిన వివిధ రాష్ర్టాల్లో అధిక సం ఖ్యలో ప్రజలు, ఓటర్లు బీజేపీకి, మోదీజీ నాయకత్వానికి తలాక్‌ ఇచ్చా రు.


కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డిపాజిట్లను దక్కించుకోలేకపోతున్నది. మొన్నటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ తన పొదిలో ఉన్న అన్ని ఆయుధాలను ఉపయోగించింది. భవిష్యత్తుపై భ్రమలు కల్పించే కేంద్ర బడ్జెట్‌ (2020-21 సంవత్సరా నికి) ఢిల్లీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయిలో వచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన ట్రస్ట్‌ నియామకం ప్రకటన అప్పుడే వచ్చింది, ఆ సమయంలోనే ప్రధానమంత్రి మోదీజీ పార్లమెం ట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సుదీర్ఘ సమాధానమిస్తూ జమ్ము-కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు, పౌరసత్వ చట్టంలో సవరణ, జాతీయ జనా భా రిజిష్టర్‌, పౌరుల రిజిష్టర్‌ సమంజసమని గట్టిగా వాదిస్తూ (ఢిల్లీ ఓట ర్లలో మతావేశాన్ని రెచ్చగొట్టడానికి) భారత స్వాతంత్య్రోద్యమ నాయ కుల మీద, ప్రథమ ప్రధాని మీద బురద చల్లారు. 


ఢిల్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఒకవంక ఉధృతంగా జరుగుతుండగా మరోవంక ఒక బీజే పీ ముఖ్య నేత జాతిపిత గాంధీజీని అవమానించే వ్యాఖ్యలు చేశారు. ఎన్ని చేసినా బీజేపీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించి కేజ్రీవాల్‌ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇచ్చారు. అందువల్ల, నిశ్చయంగా ఆప్‌ది ఘన విజయం. పరిమిత అధికారాలతో, స్వల్ప నిధులతో, లెఫ్టి నెంట్‌ గవర్నర్‌ను ఒక అంకుశంగా ఉపయోగించి మోదీజీ ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం) అడుగడుగునా దైనందిన పాలనలో ఆటంకాలు కల్పి స్తున్నప్పటికీ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, రవాణా రంగాల్లో గణనీయ సంక్షేమ పథకాలను అమలు జరిపి ఢిల్లీ ప్రజల మెప్పు పొంద గలిగింది, అదీ గొప్ప విషయం. ఢిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఢిల్లీ పోలీసులు ఒక సందర్భాన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కార్యాలయంలో ప్రవేశించి, సోదా చేసి అవమానించారు. 


కేజ్రీవాల్‌ ప్రభుత్వంలోని మంత్రులకు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి మోదీజీ ప్రభుత్వం అష్టకష్టాలు కలిగించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరే కంగా ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను రెచ్చగొట్టి సమ్మెలు చేయించారు. ఢిల్లీ రాష్ర్టానికి ఇంతవరకు సంపూర్ణ రాష్ట్రస్థాయి (ఒక విధంగా ఇతర రాష్ర్టాలకున్న స్వతంత్ర ప్రతిపత్తి) లేనందువల్ల మోదీజీ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఉపయోగించి పెత్తనం చేయగలిగింది-రానున్న ఐదేండ్లలో తిరిగి ఈ పెత్తనం ఉండదని చెప్పలేం. ఢిల్లీ ముఖ్య మంత్రి అధికారాలేమిటి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పరిధి, అధికారాలేమిటి అన్న వివాదం ఉత్పన్నమైనప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకో ర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయింది. 


దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు భయంకర కాలుష్యం కోరల్లో నుంచి విముక్తులై మరింత మేలు పొం దాలంటే ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రస్థాయి, ప్రతిపత్తి లభించడం ముఖ్యం. ఈ దేశంలో నిజమైన ఫెడరల్‌ వ్యవస్థ ఏర్పడి పటిష్టం కావాలంటే ప్రాంతీ య పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చి సంఘటితమై కీలకపాత్ర నిర్వహిం చాలన్న కేసీఆర్‌ సిద్ధాంతానికి ఢిల్లీలో ఆప్‌ విజయం మరింత ఊపు ఇస్తు న్నది. నిజానికి ఈ రోజు ఏవీ జాతీయ పార్టీలుగా లేవు-కేసీఆర్‌ నాయక త్వంలో టీఆర్‌ఎస్‌ అద్భుత విజయాలను, ఫలితాలను సాధించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది.


ఢిల్లీ ఎన్నికల సమయంలోనే పొరుగుదేశం శ్రీలంక (సింహళం) ప్రధానమంత్రి మహీంద రాజపక్స భారత పర్యటనకు వచ్చి ఢిల్లీలో ప్రధాని మోదీజీతో చర్చలు జరిపారు. ఈరోజు భారతదేశం విచ్ఛిత్తికి, విభజనకు, విద్వేషానికి కారణమవుతున్న సమస్యలను శ్రీలంక ఎంతో కాలం నుంచి ఎదుర్కొని ఇరువై ఏడేండ్ల అంతర్యుద్ధంతో సంక్షోభానికి గురయి వినాశనం పాలైంది. శ్రీలంక జనాభా 2 కోట్ల 30 లక్షలు. ఇందు లో 75 శాతంతో అధిక సంఖ్యాకులు బౌద్ధులు, హైందవ తమిళులది 11వ శాతం, ముస్లింలది 10 శాతం. మెజారిటీ బౌద్ధుల వల్ల తమకు అన్యాయం జరుగుతున్నదంటూ న్యాయం కోసం లిబరేషన్స్‌ టైగర్స్‌ అఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) సాయుధ పోరాటం జరుపడంతో శ్రీలంక అంతర్యుద్ధం పాలైంది. 


శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద రాజపక్స కఠినం గా వ్యవహరించడంతో 2009 మే నెలలో అంతర్యుద్ధం ముగిసింది. నాటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తమిళులు తదితర అల్పసంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణకు శ్రీలంక రాజ్యాంగంలో 13వ సవరణ జరిగింది. ఈ సవరణకు అనుగు ణంగా తమకు అధికారాలు లభించాలని, సమానత్వం, న్యాయం, గౌర వం, ప్రశాంతి చేకూరాలని శ్రీలంక తమిళులు కోరుతున్నారని మోదీజీ ఢిల్లీ చర్చల్లో మహీంద రాజపక్సతో అన్నారని వార్తలు వెల్లడించాయి. 


ఈ 13వ సవరణకు అనుగుణంగా శ్రీలంక ఉత్తర, తూర్పు భాగాలకు (తమిళులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలు) ప్రత్యేక ప్రతిపత్తి కల్పించ వలసి ఉంటుంది. వచ్చే ఏడాది రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో కూడా ‘తలాక్‌' లభించకుండా జాగరూకత వహించడా నికి (సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తలాక్‌ సంప్రదాయాన్ని నిషేధించే ఒక చట్టాన్ని రూపొందించడానికి మోదీజీ ఎంతో ఆసక్తితో పట్టుదల వహించారు. తలాక్‌ను నిషేధిస్తే ముస్లింల స్త్రీల ఓట్లన్ని తమ పెట్టెలో పడుతాయనుకున్నారు. మోదీజీ చొరవతో 2018లో తలాక్‌ను నిషేధిం చే చట్టం వచ్చింది. విచిత్రమేమంటే ఈ రోజు దేశమంతటా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో ముస్లిం స్త్రీలు, ముఖ్యంగా ముస్లిం విద్యార్థినులు అగ్రగామి పాత్ర నిర్వహిస్తున్నారు.) మోదీజీ శ్రీలంక తమిళుల హక్కుల కోసం గట్టిగా మాట్లాడే నైతికహక్కును కోల్పో యారు. జమ్ముకశ్మీర్‌లో 370వ ఆర్టికల్‌ను, ప్రత్యేక స్థాయిని రద్దుచేసిన మోదీజీ శ్రీలంకలో 13వ సవరణ చట్టాన్ని అమలుచేయాలని, అక్కడి అల్పసంఖ్యాక వర్గాల (మైనార్టీల) హక్కులను పరిరక్షించాలనలేదు. ఈ దేశంలో అల్పసంఖ్యాక వర్గాల హక్కులను హరిస్తున్న వారు ఆ దేశంలో మైనారిటీల హక్కుల కోసం గొంతెత్తలేరు.


అంతిమ, అప్రతిమాన, శాంతియుత ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ ఇంటింటికీ వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి, ఆవశ్యకత గురించి దేశమంతటా వివరించి చెప్పారు. ఆయన ఓపికకు, ఓరిమికి మొక్కక తప్పదు. బలపరిచేవారు బలపరిచారు, వ్యతిరేకించేవారు వ్యతిరేకించారు-అందరూ స్వేచ్ఛాయుతంగానే.


పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానంగా మోదీజీ ప్రసంగం ఢిల్లీ ఓటర్ల కోసం ఉద్దేశించినదని పరిశీలకులు భావించారు. ఆ ప్రసంగంలో మోదీజీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల్లో కొత్తదేం లేదు. ఇవెంతో కాలం నుంచి చంద్రబాబు, ఆయన మిత్రులు అలుపు లేకుండా ప్రచారం చేస్తున్న అపవాదులే. స్వేచ్ఛాయుతంగా తెలంగాణ బిల్లుపై చర్చ జరుగలేద న్నది మోదీజీ ఆరోపణ తాత్పర్యం. మోదీజీ ఎన్నడూ తెలంగాణకు అను కూలంగా మాట్లాడలేదు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్రం డిమాండ్‌పై జరిగినం త చర్చ స్వతంత్ర భారతంలో ఇంకే డిమాండ్‌పై జరుగలేదు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, వంద పర్యాయాలు తెలంగాణపై చర్చ జరిగి ఉంటుంది. ఎప్పుడైనా స్వేచ్ఛాయుతంగానే చర్చ లు జరిగాయి. 


తెలంగాణ రాష్ట్ర డిమాండును వ్యతిరేకిస్తూ మాట్లాడేవారికే ఎక్కువ సమయం, ఎక్కువ అవకాశాలు లభించాయన్నది చారిత్రక సత్యం. తెలంగాణ వ్యతిరేకులు పార్లమెంట్‌కు కర్రలు, స్ప్రేలు తెచ్చి దాడులుచేసే స్వేచ్ఛ లభించింది. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి రాజ్యసభలో చివరి నిమిషం వరకు జరిగిన గొడవ వల్లనే ఏపీ రాష్ర్టానికి ప్రత్యేకస్థాయి (ఎస్‌సీ ఎస్‌) కల్పించడానికి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభలో తెలంగాణకు వ్యతిరేకంగా ఎంత గొడవ జరిగిందో అం దరికీ తెలుసు. తెలంగాణ పై చర్చలన్నీ ఎక్కడ జరిగినా స్వేచ్ఛాయుతం గానే జరిగాయి. 


ఇందిరాగాంధీ ప్రధానిగా లోక్‌సభలో కూర్చొని తనకు ఇష్టం లేకున్నా తెలంగాణ వాదుల ప్రసంగాలను విన్నారు. అంతిమ, అప్రతిమా న, శాంతియుత ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ ఇంటింటికీ వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి, ఆవశ్యకత గురించి దేశమంతటా వివరించి చెప్పారు. ఆయన ఓపికకు, ఓరిమికి మొక్కక తప్పదు. బలపరిచేవారు బలపరిచారు, వ్యతిరేకించేవారు వ్యతిరేకించారు-అందరూ స్వేచ్ఛాయుతంగానే. ఎక్కడినుంచో రహస్యంగా వచ్చిన ఆదేశాలతో తెలంగాణపై ఎవరూ మాట్లాడలేదు అప్పుడు. ఇప్పుడై తే ఇందుకు భిన్నంగా (370వ ఆర్టికల్‌ రద్దు బిల్లును రహస్యంగా ప్రవేశ పెట్టినట్లు) జరిగేది.


logo