ఆదివారం 23 ఫిబ్రవరి 2020
సత్వరన్యాయం దిశగా..

సత్వరన్యాయం దిశగా..

Feb 14, 2020 , 23:09:33
PRINT
సత్వరన్యాయం దిశగా..

నేర నియంత్రణ ఒక ఎత్తయితే, నేరాలు జరుగకుండా బాల్యం నుంచే నైతిక ప్రవర్తను నేర్పడం మరో ఎత్తు. అసలు నేరం జరుగకుండా మూలాల నుంచి చికిత్స ప్రారంభించడానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇలాంటి వినూత్న ప్రయోగాన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నైతిక విలువలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైతిక విలువల అంశా న్ని పాఠ్యాంశంగా తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయంగా నిలువబోతున్నది. నైతిక విలువలు కొరవడటం వల్లే సమాజంలో చిన్నారులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయనేది వాస్తవం.

ఏదైనా నేరం జరిగినప్పుడు సత్వర న్యాయం అందిస్తే బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూరుతుంది. సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ, న్యాయవ్యవస్థల బాధ్యత. నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ చేపడుతున్నదన్న అంశాన్ని విశ్లేషించకుండా విమర్శించడం తప్పవుతుంది. నేరాలు జరుగకుండా మూలాల నుంచి సంస్కరణలు తెచ్చే ప్రయ త్నం చేస్తున్నప్పుడు, కార్యాచరణకు పూనుకున్నప్పుడు ఇంకా మాటలు చెప్పాల్సిన అవసరం ఉండదు. చర్యలు లేకుండా మీడియాలో మాట్లాడి వదిలేయడం స్పందన అనిపించుకోదు. బాధితులకు న్యాయం చేసే విధం గా తక్షణ చర్యలు చేపట్టడమే అసలైన స్పందన. 


మహిళలు, చిన్నారులకు న్యాయం అందించే విషయంలో వ్యవస్థల్లో ఏండ్లుగా ఉన్న అలసత్వాన్ని తొలిగించి నూతన బాటలు పరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మహిళలు, చిన్నారులపై లైంగికదాడుల వంటి ఘటనల్లో సత్వర న్యాయం అందించే విషయంలో నూతన ఒరవడిని సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇటీవలి కాలంలో వరంగల్‌లో చోటుచుసుకున్న 9 నెలల చిన్నారిపై లైంగికదాడి, సమత, హాజీపూర్‌ ఘటనల్లో సత్వర న్యాయం జరిగింది. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై హత్యాచారం కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటుచేసిం ది. అన్ని కోణాల్లో సాక్ష్యాధారాలను పరిశీలించిన వరంగల్‌ కోర్టు రెండు నెలల్లోపే దోషికి ఉరిశిక్ష విధించింది. 


దోషి అప్పీల్‌ చేసుకోవడంతో, హైకో ర్టు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుచేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని వరంగల్‌ పోలీసులు నిర్ణయించారు. బాధితులకు న్యాయం అందించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం. హాజీపూర్‌ వరుస హత్యాచారాల కేసుల్లో కూడా వేగంగా స్పందించిన ప్రభుత్వం నల్గొండలో ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసింది. కేసు నమోదైన మూడు నెలల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేయడంతోపాటు చార్జిషీట్‌ను దాఖలుచేశారు. 101 మంది సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు విచారణను పూర్తిచేసి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఆదిలాబాద్‌ సమత కేసులో సైతం పోలీసులు తక్షణం స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. సమతపై దారుణానికి ఒడిగట్టిన నిందితులు ముగ్గురికి  ఆదిలాబాద్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో కేవలం 67 రోజుల రికార్డు సమయంలో తీర్పు వెలువడింది. ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనం.


హైదరాబాద్‌ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసులో సత్వర న్యాయం అం దించేందుకు ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచే స్తూ జీవో జారీచేసింది. దర్యాప్తులో భాగంగా నేరస్థలిలో క్రైం సీన్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ చేసే క్రమంలో ఎన్‌కౌంటర్‌ ఘటన చోటుచేసుకొని నిందితులు మరణించడం గమనార్హం. నేరాల కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట చర్యలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో క్రైం రేట్‌ మూడు శాతం తగ్గింది. దీంతోపాటు నేర నిరూపణ శాతం 34 నుంచి 42 శాతానికి పెరిగింది. దాదాపు ప్రతి రెండు నేరా ల్లో ఒక నేరానికి తప్పనిసరిగా శిక్ష పడుతున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.


లైంగికదాడుల కేసుల్లో సత్వర శిక్షలు అమలు చేస్తేనే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల దాడుల కేసుల్లో వేగంగా విచారణ జరిపేందుకు చర్యలు మొదలయ్యాయి. పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదయ్యే కేసులను సత్వరం పరిష్కరించేందుకు 36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ప్రభు త్వం ఏర్పాటుచేసింది. పోక్సో కేసుల విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఆదేశాలను అనుసరించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఇటీవలి దారుణ ఘటనల నేపథ్యంలో హైకోర్టు కూడా స్పందించింది. మహిళలపై జరిగే లైంగికదాడి, హత్యాచారం, ఇతర నేరాల్లో సత్వర న్యాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. మహిళా కేసుల సతర్వ విచారణకు విమెన్‌ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానాలకు న్యాయ మూర్తుల ను నియమించింది. దీంతో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో బాధితులకు న్యాయం అందనున్నది.


ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించి న షీ టీమ్స్‌ రాష్ట్రంలో విజయవంతమయ్యాయి. మహిళల పట్ల వేధింపులకు పాల్పడేవారి ఆట కట్టించేందుకు షీ టీమ్స్‌ మెరుపు వేగంతో పనిచేస్తూ కేసులు నమోదు చేస్తున్నాయి. భరోసా కేంద్రాలు, విమెన్‌ సేఫ్టీ వింగ్‌ మహిళల భద్రతకు అండగా నిలుస్తున్నాయి. సత్వర న్యాయం అందించడం, ఉన్నత న్యాయస్థానాలపై భారం తగ్గించేందుకు గ్రామ న్యాయాలయా ల చట్టం-2008 అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో గ్రామీ ణ న్యాయాలయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో 55 గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జూనియర్‌ సివిల్‌ జడ్జి స్థాయి న్యాయాధికారులు గ్రామీణ న్యాయాలయాల్లో న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ న్యాయాలయాల నిర్వహణకు కావాల్సిన సిబ్బంది నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుతో తాలూకా, జిల్లాస్థాయి కోర్టులపై భారం తగ్గి కేసుల సత్వర పరిష్కారానికి ఆస్కారం ఏర్పడుతుంది.


నేర నియంత్రణ ఒక ఎత్తయితే, నేరాలు జరుగకుండా బాల్యం నుంచే నైతిక ప్రవర్తను నేర్పడం మరో ఎత్తు. అసలు నేరం జరుగకుండా మూలా ల నుంచి చికిత్స ప్రారంభించడానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇలాంటి వినూత్న ప్రయోగాన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నైతిక విలువలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైతిక విలువల అంశా న్ని పాఠ్యాంశంగా తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయంగా నిలువబోతున్నది. నైతిక విలువలు కొరవడటం వల్లే సమాజంలో చిన్నారులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయనేది వాస్తవం. ప్రస్తుత పాఠ్యాంశాల్లో జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సహా ఇతర సబ్జెక్టుల్లో సమూల మార్పులు జరుగాల్సిన అవసరం ఉన్నది. సైన్స్‌లో పర్యావరణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ‘గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌' వంటి విషయాలను పిల్లలకు బోధించాలి. తద్వారా చిన్నారుల్లో అప్రమత్తత, జాగరూకత పెంపొందించాలి. మహిళలపై హింసకు కారణమవుతున్న సామాజికాంశాలను రూపుమాపాలి. 


logo