శనివారం 29 ఫిబ్రవరి 2020
మతపర విభజన తగదు

మతపర విభజన తగదు

Feb 13, 2020 , 23:10:41
PRINT
మతపర విభజన తగదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసా గుతున్నాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి వచ్చిన ముస్లిం శరణార్థులకు పౌరసత్వం లభించదు. శరణార్థులంటే ఎవరైనా శరణార్థులే. వారిని అనుమతించటమా లేదా అన్నది ఒక విధానం రూపొందించడంలో తప్పులేదు. ఒక మతం వారికి ఒక సూత్రం మరొక మతంవారికి మరొక సూత్రం మన రాజ్యాంగంలో లేదు. చొరబాటుదారులను గుర్తించవద్దని ఎవరూ అనడం లేదు. కానీ ఎవరు చొరబాటుదారులో, ఎవరు కాదో మతం ప్రాతిపదికన నిర్ణయించబూనుకోవడమే తప్పు. అది అమెరికాలో చేసినా, పాకిస్థాన్‌లో చేసినా తప్పు తప్పే. ఎవరో అలా చేశారు కాబట్టి ఇక్కడ కూడా అలా చేస్తామన డం మూర్ఖత్వం. పౌరసత్వ చట్టం ప్రకారం అక్రమ వలసదారుల్లో ముస్లిం లు మినహా మిగిలిన మతాల వారికి పౌరసత్వం ఇస్తున్నది. అప్పుడు ముస్లింలు మాత్రమే అక్రమ వలసదారులుగా మిగిలిపోతారు. ఒక వ్యక్తి ఇక్కడ పౌరుడని రుజువు చేసుకోవాలంటే అతను మాత్రమే కాక అతని లేక ఆమె తల్లిదండ్రులు కూడా ఇక్కడే పుట్టినట్లు రుజువు చేయాలి. ఈ చట్టంతో ఏమి నష్టం లేదంటున్న కేం ద్రం లాభాలేమున్నాయో మాత్రం చెప్పలేకపోతున్నది.


పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్థాన్‌లలో మైనార్టీ మతస్థులు (హిందువులు, క్రైస్తవులు, పార్శీలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు) అణిచివేతకు గురవుతున్నారని, ఆ అణిచివేతను తట్టుకోలేక వారంతా భారతదేశానికి పారిపోయివచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారని వారికి పౌరసత్వం కల్పించడం మన బాధ్యత అని కేంద్రం వాదిస్తున్నది. పొరుగు దేశాల్లో అణిచివేతకు గురైతే అది పొరుగు దేశానికి సంబంధించిన అంశం. అణిచివేత ఎక్కడ జరిగినా అది తప్పే కనుక మన దేశమూ స్పందించాలి. మైనార్టీలను అణిచివేయటం మంచిది కాదు మానుకోవాలని దౌత్యపరం గా చర్చించాలి. అలా దౌత్యపరంగా ప్రయత్నించారా? ఎప్పుడైనా అంతర్జాతీయ వేదికల్లో నిర్దిష్టంగా ఆ సమస్యను ప్రస్తావించారా? అలా ఎప్పు డూ చేసిన దాఖలాల్లేవు. పైగా 370 అధికరణ రద్దు తర్వాత మన దేశ అం తర్గత వ్యవహారాల్లో ఇతరులు తలదూర్చకూడదన్నదే ప్రభుత్వ సిద్ధాంతం అయితే మనం కూడా పొరుగు దేశంలో జరిగే ఉదంతాల ఊసు ఎత్తకూడదు కదా!


మనుష్యుల మధ్య మతపరమైన విభజన చేసే రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీ మిత్రపక్షాలైన అకాలీదళ్‌, అసోం గణ పరిషత్‌, జనతాదళ్‌ (యు) తమ వ్యతిరేకతను తెలియజేశాయి. అకాలీదళ్‌ ఎన్నార్సీని అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. ఏ జాతినైనా ఆ దేశ ప్రధాన స్రవంతి నుం చి వేరు చేసి చూడటం దారుణం. కాంగ్రెస్‌ అలా సిక్కులను వేరుచేసినప్పు డు ఆ బాధ ఎలా ఉంటుందో మేం అనుభవించాం. అది ముస్లిం సోదరులకే కాదు, ఎవ్వరికి ఎదురుకాకూడదని పేర్కొన్నది. సిక్కులకు చట్టంలో పౌరసత్వాన్ని అనుమతించినప్పటికీ అకాలీదళ్‌ వ్యతిరేకిస్తున్నది. ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఈ చట్టం ద్వారా తమ ప్రత్యేక సాంస్కృతిక, ఆర్థిక జీవనానికి ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు. తమ రాష్ర్టాల్లో చొరబాటుదారులకు చట్టపరమైన స్థిరనివాస హక్కును కల్పిస్తున్నారని వారంతా ఆందోళన చెందుతున్నారు.


ప్రశ్నించేవాళ్లంతా దేశద్రోహులు కాదు. నిజం వైపు నిలబడేవారంతా దేశానికి శత్రువులు కాదు. మయన్మార్‌లో రోహింగ్యాలు, పాకిస్థాన్‌లో అహ్మదీయులు, షియాలు, శ్రీలంక తమిళుల మాటేంటి? అని అందరూ అడుగుతున్నారు. మతపరంగా వేరుచేసి వేధించిన ప్రభుత్వాల్లో ప్రస్తుత మయన్మార్‌ ప్రభుత్వం ముందున్నది. రోహింగ్యాలపై సాగించిన దారుణాలు చాలా ఉన్నాయి. దాన్ని ప్రపంచం యావత్తూ ఖండించింది. మతాతీతమైన పౌరసత్వాన్ని హామీ ఇస్తున్న రాజ్యాంగ విధానం ఉన్న దేశంలో మొదటిసారిగా అందుకు మతాన్ని ప్రాతిపదిక చేయడం వల్ల దేశంలోని సెక్యులర్‌, ప్రజాస్వామికవాదులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా సార్వత్రిక ప్రతిఘటన ఉద్యమాన్ని నడుపుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో జాతీయ జెండా, మహాత్మా గాంధీ ఫొటోలున్నాయి. కానీ అనుకూల ప్రదర్శనల్లో మాత్రం జాతీయ జెండాలతో పాటు కాషాయ జెండాలున్నాయి. బాష్పవాయువుతో చుట్టుముట్టినా, లాఠీలతో విరుచుకుపడినా నిలిచి పోరాడుతున్నారు. ప్రభుత్వ తీరుతెన్నులను మౌనంగా సహించక, నిర్బీతితో నిలదీసే ప్రజాస్వామిక చైతన్యశీలురుగా నిరసన తెలుపుతున్నారు.


దేశవ్యాప్తంగా ఆదివాసీలు అడవుల్లో నివసిస్తూ ఇప్పటికీ నాగరికతకు దూరంగానే ఉన్నారు. బీసీలుగా చెప్పబడేవాళ్లలో అనేక మంది సంచార జాతులుగా చిరునామా లు కూడా లేకుండా ఉన్నారు. వీళ్లంతా భారతీయ పౌరులుగా ఎలా నిరూపించుకుంటారు? ఏ ఆధారాలు చూపుతారు? నిరూపించుకోలేని వారంతా అస్సాంలో వలె నిర్బంధ శిబిరాల్లో మగ్గిపోవల్సిందేనా?ప్రస్తుత దేశ రాజకీయాల గురించి తెలిసిన ఎవరికైనా, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ సాధించాలనుకున్న ప్రయోజనాలేమిటో స్పష్టం గా అర్థమవుతున్నది. మొదటిదిగా బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడం, రెండవది హిందూ రాష్ట్ర దిశగా పురోగమించడం, మైనార్టీలపై ద్వేషభావం పెంచి దేశంలోని మెజారిటీ ఓట్లను సొంతం చేసుకోవాలనే పన్నాగం ఉన్నది. సమాజాన్ని మరోసారి మత విద్వేషాల్లోకి దింపుతున్నారు. హిట్లర్‌ జాత్యంహకారం వల్ల జర్మనీ 50 ఏండ్లు వెనక్కిపోయింది. 


పౌరసత్వ సవరణ చట్టం మందబలంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా  పుట్టుకొచ్చింది. వ్యతిరేకించేవారికి హింసాత్మకంగా సమాధానం చెప్తున్న ది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి మేధావులు కానవసరం లేదు. కేవలం మనుష్యులైతే సరిపోతుంది. పౌరసత్వ సవరణ చట్టం ఏ రోగం లేని వ్యక్తికి ఆపరేషన్‌ చేసినట్లుగా ఉంది. మొఘలులు ఈ దేశాన్ని 300 ఏండ్లు పాలించినా మనది ముస్లిం దేశం కాలేదు. బ్రిటిష్‌ వారు 200 ఏండ్లు పాలించినా మనది క్రైస్తవ దేశం కాలేదు. ఈ దేశాన్ని హిందువులతోనే నింపాలని బీజేపీ కలగంటే అది కలగానే మిగిలిపోతుంది. మను ష్యుల మధ్య మతపరమైన విభజన చేస్తూ, మానవ హక్కులను హరించే రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేంతవరకూ పోరాడాల్సిన అవసరం ఉన్నది.


logo