గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 12, 2020 , 23:56:52

గ్రామ స్వరాజ్యం

గ్రామ స్వరాజ్యం

సంపూర్ణ స్వాతంత్య్రానికి, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు లభించాలని కూడా మహాత్మాగాంధీ భావించారు. గ్రామ సీమలను సుసంపన్నం చేసేందుకు కేసీఆర్‌ రూపొందించిన అనేక పథకాలు ఈ లక్ష్యానికి అనుగుణమైనవే. మహాత్మా గాంధీ 150 జయంతి సంవత్సరమిది. గ్రామస్వరాజ్యం రావాలంటూ కలలుగన్న మహాత్ముడికి ఇచ్చే నిజమైన నివాళి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచిస్తున్న కార్యాచరణను అమలుచేయడమే.

అధికారులు, నాయకులు చిత్తశుద్ధితో, సమన్వయంతో వ్యవహరిస్తే మంగళవారం ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఏర్పాటుచేసిన కలెక్టర్ల సమావేశం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందనుకోవచ్చు. మొదటి పర్యాయం అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధికి పునాదులు ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు, స్థానిక నాయకుల క్రియాశీల భాగస్వామ్యంతో ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలుచేయాల ని భావిస్తున్నారు. ఇందుకు అధికారులను తద్వారా నాయకులను కార్యోన్ముఖులను చేసేందుకే మొదటగా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. 


చిన్న జిల్లాలను ఏర్పాటుచేయడం కేసీఆర్‌ వ్యూహంలో కీలకమైన అంశం. స్థానిక సంస్థలు సజావుగా ఉండటం కోసం ఒక అదనపు కలెక్టర్‌ ను ఏర్పాటుచేశారంటే ప్రభుత్వ పథకాల అమలులో ఎంత కృతనిశ్చయంతో ఉన్నారో తెలుస్తున్నది. గ్రామస్థాయిలో అన్ని కార్యకలాపాలను సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి చేయడం కలెక్టర్ల ముందున్న కర్తవ్యం. వ్యవసాయరంగంలో మార్పులను, పారిశ్రామీకరణ క్రమాన్ని సులభతరం చేయడం, మానవ వనరుల సద్వినియోగం మొదలైన అం శాలూ కలెక్టర్లు దృష్టిపథంలో ఉండాల్సిందే. జిల్లా యంత్రాంగం తమ బాధ్యతలను ఏ ఒక్క రంగానికో పరిమితమని భావించకూడదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాలను పథకాలను అర్థం చేసుకొని వ్యవహరించాలె.


కేసీఆర్‌ చెప్పినట్టు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు కలిసికట్టుగా కృషిచేయాలె. ప్రజలను భాగస్వాములను చేయాలె. ప్రజలు కూడా చైతన్యవంతులై తమ బాధ్యతలను గుర్తించాలె. గ్రామస్థాయిలో ఈ పరివర్తన చోటుచేసుకుంటే మొత్తం తెలంగాణ సమాజమే మారిపోతుంది. గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీలు ఏ బాధ్యతలు లేకుండా నిధులను ఉపయోగించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు గ్రామాభివృద్ధి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు జవాబుదారీతనం వహించకతప్పదు. వీరు తమ విధి నిర్వహణలో విజయవంతం కావాలంటే, ప్రజలను భాగస్వాములను చేయాల్సిందే. 


గతంలో చైతన్యవంతులైన ప్రజలు ఉంటే వారి అడ్డు తొలిగించుకోవాలని నాయకులు భావించేవారు. ప్రజల ను సమస్యలపై చర్చించకుండా ముఠాలు కట్టేవారు. ఇప్పుడు ప్రజల సహకారం కోరి తమ విధులను నిర్వర్తించుకోవడమే ఉత్తమమైన పద్ధ తి అని గ్రహిస్తారు. ఈ క్రమంలో అధికారులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల ను పర్యవేక్షించడంతోపాటు ప్రభుత్వ పథకాలను అమలుచేయవలసి ఉంటుంది. ఇందుకు గ్రామ స్థాయి నాయకులు, ప్రజలు క్రియాశీలం కావాలని వారు కోరుకోవచ్చు. కానీ ఈ క్రమంలో తమ అధికార యంత్రాంగంపై వచ్చే ఆరోపణలను కూడా స్వీకరించవలసి వస్తుంది. రాజకీయ నాయకత్వం, అధికార బృందం పరస్పరం పోటీ పడాలె, జోడు గుర్రాల్లా కలిసి పరుగెత్తాలె. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే రాష్ట్రస్థాయిలో ఎంతో అధ్యయనం చేసి రూపొందించిన పథకాలు సక్రమంగా అమలుకు నోచుకుంటాయి. కేసీఆర్‌ ఏర్పాటుచేసిన కలెక్టర్ల సమావేశం ఇందుకు నాంది కావాలె.


పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఈనాటిది కాదు. గ్రామస్వరాజ్యాన్ని ప్రబోధించిన గాంధీజీ దీనికొక తాత్విక భూమికను అందించారు. అనాదిగా భారతదేశంలో గ్రామ పాలన ఉండటమే కాదు, గ్రామాలు స్వయం పోషకంగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం 1950 దశకంలోనే దీనిపై కమిటీ వేయడంతో పునాదులు పడ్డాయి. స్థానికసంస్థలను ఏర్పాటుచేసే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో దశలవారీగా సాగాయి. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడంలో 1992 నాటి రాజ్యాంగ సవరణ  మైలురాయి వంటిది. అయినా క్షేత్రస్థాయిలో మార్పు రాలేదు. ఇందుకు రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం ఒక కారణమైతే, ప్రజల చైతన్యస్థాయి మరో కార      ణం. పరిపాలనావ్యవస్థను పరిశీలించి ప్రభుత్వ పథకాల అమలుకు, గ్రామస్థాయి రాజకీయ సం స్కృతికి ఉన్న లంకెను కనిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ రాజ్యాన్ని నెలకొల్పడానికి పట్టుదలగా ఉన్నారు. 


అట్టడుగు స్థాయిలో రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని తీసుకొనిపోయే వాహనంగా ఆయన పంచాయతీరాజ్‌ వ్యవస్థను అభివర్ణించారు. గ్రామ గణతంత్రాలు స్వయం పోషకాలు కావాలని, స్వావలంబన సాధించాలని ఆయన బోధించారు. ప్రజలందరు కనీస జీవన ప్రమాణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించిన గాంధీజీ ఈ లక్ష్యసాధనకు స్థానికసంస్థల ప్రాధాన్యాన్ని గుర్తించారు. సంపూర్ణ స్వాతంత్య్రానికి, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు లభించాలని కూడా మహాత్మాగాంధీ భావించారు. గ్రామ సీమలను సుసంపన్నం చేసేందుకు కేసీఆర్‌ రూపొందించిన అనేక పథకాలు ఈ లక్ష్యానికి అనుగుణమైనవే. మహాత్మా గాంధీ 150 జయంతి సంవత్సరమిది. గ్రామస్వరాజ్యం రావాలంటూ కలలుగన్న మహాత్ముడికి ఇచ్చే నిజమైన నివాళి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచిస్తున్న కార్యాచరణను అమలుచేయడమే.


logo