శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Feb 11, 2020 , 23:06:27

అభివృద్ధికి హారతి

అభివృద్ధికి హారతి

కేజ్రీవాల్‌ గత ఐదేండ్ల పాలనలో విద్యపై బడ్జెట్‌లో 25 శాతం నిధులను ఖర్చుచేశాడంటే సామాజికాభివృద్ధి పట్ల ఎంతటి నిబద్ధతతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగానే మోదీ ఓ మంచి మాట అన్నారు. ఢిల్లీ ఎటువైపు చూస్తుందో.. దేశమూ అటే వెళ్తుందన్నాడు. ఉద్వేగాలతో పబ్బం గడుపకుండా అభివృద్ధి కార్యక్రమాలతో విజయం సాధించవచ్చుననే సందేశాన్ని ఆయన దేశానికి అందించారనేది వాస్త వం. ఢిల్లీలో కాలుష్యం వంటి ప్రధాన సమస్యలు ఇంకా ఉన్నాయి. ప్రజల అండతో ఆయన సమస్యల పరిష్కార దిశగా సాగుతారని ఆశిద్దాం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మొత్తం 70 స్థానాలకుగాను 62 స్థానాలు గెలుచుకోవడం అభినందనీయం. కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల ఆశీస్సులు పొందారు. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 2015 నాటి ఎన్నికల్లో డబ్భు స్థానాలలో 67 గెల్చుకోవడమే అసాధారణం. ఈసారి అధికారపార్టీ పట్ల వ్యతిరేకత ఉంటుందనే అనుమానాలతో పాటు, కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ నుంచి కఠోరమైన దాడిని ఎదుర్కొనవలసి వచ్చింది. అయినా సరే, ప్రజలు కేజ్రీవాల్‌ పనితీరుకు మెచ్చి 62 స్థానాలను కట్టబెట్టడం విశేషం. గత ఎన్నికల్లో ఢిల్లీలో మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి మరో ఐదు సీట్లు మాత్రం పెంచుకు ని చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మిగిలింది. 


కొంతకాలంగా ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగానూ నాయకత్వ బలహీనతతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్‌ ఈసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరువలేకపోయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పార్టీల గెలుపోటముల పరిధిలో మాత్రమే చూసేవి కావు. బీజేపీ, కాంగ్రెస్‌ లాంటి రెండు జాతీయపార్టీలను ఢీకొని ఆప్‌ వరుసగా అధికారాన్ని నిలుపుకోవటం గమనించదగినది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి ఆప్‌ను ఢీకొన్నది. ప్రధాని నరేంద్రమోదీతో సహా కేంద్ర మంత్రులంతా ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశా రు. కార్యకర్తల బలంలో సాటిలేని శక్తిగా ఉన్న బీజేపీ సుశిక్షిత పార్టీసేనలను ఎన్నికల ప్రచారంలో దింపింది. జాతీయ అధ్యక్షుడు నేరుగా రంగంలోకి దిగి పార్టీ శ్రేణులను నడిపించారు. అయినా బీజేపీ చెప్పుకోదగిన మేర సీట్లు తెచ్చుకోలేకపోయింది. కాంగ్రెస్‌ కూడా షీలా దీక్షిత్‌ కాలం నాటి వైభవాన్ని పొందేందుకు తీవ్రంగానే కృషిచేసింది. కానీ సమన్వయలోపం ఆ పార్టీకి శాపంలా మారింది. మొత్తంగా చూస్తే ఢిల్లీ ఎన్నికల్లో పార్టీలు గెలువలేదు, ప్రజలు గెలిచారు.


దేశ రాజకీయాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రవేశమే అనూహ్యమైనదీ, ప్రయోగశీలమైనది. ప్రత్యామ్నాయ రాజకీయ విలువలతో రంగం మీదికి వచ్చిన ఆప్‌ ఆది నుంచి విలక్షణతను ప్రదర్శిస్తున్నది. తనదైన ప్రత్యేక రాజకీయాచరణతో మనగలుగుతున్నది. అవినీతి వ్యతిరేకోద్యమంలో అన్నాహజారే అనుంగు అనుచరుడిగా వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్‌ జనలోక్‌పాల్‌ బిల్లు ప్రధానాస్త్రంగా ఉద్యమించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామి అయిన కేజ్రీవాల్‌కు అవినీతి నిర్మూలన, ప్రజా సంక్షేమపాలన ప్రాధాన్యాలను చెప్పవలసిన అవసరం లేదు. 


రాజకీయపార్టీ స్థాపనను అన్నాహజారే తీవ్రంగా వ్యతిరేకించినా వెనుకడుగు వేయకుండా ఆమ్‌ఆద్మీ పార్టీని 2012 నవంబర్‌ 26న స్థాపించా రు. అనతికాలంలోనే 2013లో ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఆప్‌ 28 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించి, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే జనలోక్‌పాల్‌ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా కొద్ది రోజుల్లోనే కేజ్రీవాల్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాలంలో కేజ్రీవాల్‌ పాలనానుభవం లేనివాడు, పలాయనవాది లాంటి ఎన్ని విమర్శలొచ్చినా తనదైన సాదాసీదా వ్యక్తిత్వంతో అన్నింటినీ పటాపంచలు చేసి నిలిచి గెలిచాడు. 2015లోనూ, తాజా ఎన్నికల్లోనూ సంప్రదాయ ఆధిపత్య రాజకీయాలను ఓడించి చరిత్ర సృష్టించారు.


ప్రజాస్వామ్యం అంటే అధికార బురుజులను ఆశ్రయించుకొని ఉంటుందని భావించే రాజకీ యవాదులకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి పాఠం చెప్పాయి. పేద వాడలు, ఇరుకు సందులు, పూరిగుడిసెల్లోనే నిజమైన ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్నదని ఢిల్లీ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన ప్రచార దాడి, విష ప్రచారం అంతా ఇంతా కాదు. బీజేపీ తరఫున 200 మంది ఎంపీలు, 70 మంది మంత్రులు, 11మంది ముఖ్యమంత్రు లు ప్రచారదాడి చేశారు. ఏకంగా కేజ్రీవాల్‌నే ఉగ్రవాదిగా నింద వేశారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతున్న షాహీన్‌బాగ్‌ నిరసనకారులను కాల్చి చంపేయాలన్నారు. 


అయినా కేజ్రీవాల్‌ ఎక్కడా సహనం కోల్పోలేదు. తాను ఉగ్రవాదినో కాదో ఓటుద్వారా తెలుపాలని ప్రజలను వినమ్రంగా కోరారు. విద్య, వైద్యం, మంచినీటి సరఫరాలో తాను చేసిన పనుల సాక్షిగా ఢిల్లీ అభివృద్ధికీ, సంక్షేమానికి మాత్రమే ఓటేయాలని ఢిల్లీ ఓటర్లను కోరాడు. మందబలం, ధనబలం లేకున్నా తనదైన విలువల రాజకీయాచరణతో ఆధిపత్య రాజకీయాలకు చెక్‌పెట్టాడు. కేజ్రీవాల్‌ గత ఐదేండ్ల పాలనలో విద్యపై బడ్జెట్‌లో 25 శాతం నిధులను ఖర్చు చేశాడంటే సామాజికాభివృద్ధి పట్ల ఎంతటి నిబద్ధతతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగానే మోదీ ఓ మంచి మాట అన్నారు. ఢిల్లీ ఎటువైపు చూస్తుందో.. దేశమూ అటే వెళ్తుందన్నాడు. ఉద్వేగాలతో పబ్బం గడుపకుండా అభివృద్ధి కార్యక్రమాలతో విజయం సాధించవచ్చుననే సందేశాన్ని ఆయన దేశానికి అందించారనేది వాస్తవం. ఢిల్లీలో కాలుష్యం వంటి ప్రధాన సమస్యలు ఇంకా ఉన్నాయి. ప్రజల అండతో ఆయన సమస్యల పరిష్కార దిశగా సాగుతారని ఆశిద్దాం. 


logo