సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 11, 2020 , 22:58:44

మత్స్యరంగానికి మొండిచేయి!

మత్స్యరంగానికి మొండిచేయి!

భూ ఉపరితల జలవనరుల మత్స్యరంగ అభివృద్ధి ప్రణాళిక 2019 పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రతిపాదనలు చట్టరూపంలోకి రాకుండా గడిచిన మూడేండ్లుగా మూలుగుతున్నవి. దేశవ్యాప్తంగా మత్స్య పారిశ్రామికరంగంలో ఎంతో కొంత అభివృద్ధిని నమోదు చేయడానికి ఉపకరించిన ‘నీలి విప్లవం’ ప్రణాళిక కొనసాగింపుపై ఇంకా ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు.

కేంద్రం వివిధ రంగాలకు సంబంధించి సాధించదలచుకు న్న లక్ష్యాలను ఆర్థికమంత్రి పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రతిపాదించే వార్షిక బడ్జెట్‌ ద్వారా ప్రతిబింబిస్తుంది. ఇటీవల నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలు పరిశీలిస్తే మోదీ నాయకత్వంలోని కేం ద్ర ప్రభుత్వం ఊదరగొడుతున్న అభివృద్ధి అంచనాలకు, ఆచరణ రూపాలకు పొంతన లేదని తేలిపోతున్నది. ముఖ్యంగా మన దేశప్రగతికి గీటురాయిలా చూడదగిన వ్యవసాయరంగంలో అత్యంత కీలకమైన మత్స్యరంగానికి 2020 వార్షిక బడ్జెట్‌లో మొండిచేయి చూపిందనే చెప్పాలి. వ్యవసాయరంగం ద్వారా మన దేశం ఆర్జిస్తున్న విదేశీ మారకద్రవ్యంలో అత్యధిక శాతాన్ని జోడిస్తున్న మత్స్య పారిశ్రామికరంగాన్ని మోదీ ప్రభు త్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించబోతున్న ఆనవాళ్లు ఈ బడ్జెట్‌ కేటాయింపుల్లో స్పష్టంగా కనిపిస్తున్నా యి. ప్రపంచస్థాయిలో చేపల ఉత్పత్తిలో చైనా దేశం తర్వాత 2వ స్థానం లో ఉన్న భారతదేశం రానున్న రోజుల్లో తన స్థాయినీ, స్థానాన్ని నిలబెట్టుకునే సూచనలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు స్పష్టమవుతున్నది.


కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వర్తమాన ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్య పారిశ్రామికరంగానికి కేవలం రూ.560 కోట్ల అతిస్వల్ప నిధులను కేటాయించి, అమలు సాధ్యం కాని అనేక లక్ష్యాలను సాధించాలని నిర్దేశించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరకాలంలో ఏడు నిర్దేశిత కార్యక్రమాల ద్వారా ప్రధానమైన నాలుగు లక్ష్యాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో ముఖ్యంగా భారతదేశంలోని మత్స్యకారుల జీవనప్రమాణాలను మెరుగుపరిచేందుకు గాను వారి వార్షి క ఆదాయాన్ని రెండింతలకు పెంచడం, దేశంలో ఆహారభద్రతను సాధించేందుకు అనువుగా మత్స్యరంగాన్ని తీర్చిదిద్దడం, మత్స్యరంగంలో భద్ర త, రక్షణకు సంబంధించి మరింత మెరుగైన చర్యలను చేపట్టడం, చేపల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం ద్వారా మత్స్య పారిశ్రామిక రంగం వార్షిక వృద్ధిరేటును ఇనుమడింపజేయడం, విదేశాలకు చేపల ఎగుమతులను పెంచి విదేశీ మారకద్రవ్యాన్ని సముపార్జించడం లాంటి భారీ లక్ష్యాలను నిర్దేశించారు. చేపలను నిలువ చేయడం కోసం శీతలీకరణ సదుపాయాలను, శీతల రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టపరుచడం, ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకొని, వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమై న చేపలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటుగా మత్స్యపారిశ్రామికరంగం విస్తరణ ఫలితంగా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఆశించారు.


దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో కనీసం 10 శాతం వృద్ధిరేటును సాధించాలని ఈ బడ్ఞెట్‌ ప్రతిపాదనల్లో నిర్ణయించారు. అంటే గతేడాది దేశంలో జరిగిన 13.7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి కంటే అదనంగా సుమారు రెండు మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు అంటే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15.7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత వార్షిక బడ్జెట్‌లో కేటాయించిన రూ.805కోట్లలో దాదాపు రూ.245 కోట్లు ప్రస్తుత బడ్జెట్‌లో కోత విధిం చి, గతేడాది కంటే రెండు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చేపలను అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మరొక ఆసక్తికరమైన అంశమేమంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపల ఎగుమతుల ద్వారా కనీసం రూ.85 వేలకోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది సుమారు రూ.45,107కోట్ల విలువైన చేపలను ఎగుమతి చేయగా, ఈసా రి అంతకు రెట్టింపు విలువతో సమానమైన చేపలను ఎగుమతి చేయాలనుకుంటున్నారు. మనదేశంలో చేపల ఉత్పత్తి, ఎగుమతులను పెంచుకునేందుకు అనుగుణంగా ఉత్పాదకతను కూడా పెంచుకోవాలని భావిస్తున్నారు. మనదేశంలో గత ఆర్థిక సంవత్సరంలో ఒక హెక్టార్‌ నీటి విస్తీర్ణం నుంచి వార్షికంగా సగటున మూడు టన్నుల చేపలను ఉత్పత్తి చేయగా వర్ధమాన ఆర్థిక సంవత్సరంలో 3.8 టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు. పర్యవసానంగా ప్రతీ మత్స్యకారుని వార్షిక ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.96,800లను వచ్చే సంవత్సరాంతానికి 1,57,693 రూపాయల సగటు ఆదాయానికి పెంపొందించాలని భావిస్తున్నారు.


అయితే కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్ఞెట్‌ ప్రతిపాదనల ద్వారా మత్స్యపారిశ్రామికరంగ అభివృద్ధికి రూపొందించుకున్న లక్ష్యాలను సాధించడానికి కొత్తగా ఎలాంటి చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నదనే కీలకాంశాల మీద ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. దేశవ్యాప్త చేపల ఉత్పత్తి లో ఐదు దశాబ్దాల కిందట 70 శాతంగా నమోదు చేసుకున్న సముద్రజలాల చేపల ఉత్పత్తి తిరోగమన దిశలో ప్రస్తుతం 35 శాతానికి పడిపోయింది. మరోవైపున భూ ఉపరితల జల వనరుల చేపల ఉత్పత్తి వాటా గతంలో నమోదైన 30 శాతం నుంచి ప్రస్తుతం 65 శాతానికి చేరుకున్నది. ఇందులో కొత్తగా ఉనికిలోకి వచ్చి శరవేగంగా విస్తృతమవుతున్న ‘ఆక్వాకల్చర్‌' రంగం తన వాటాను రోజురోజుకూ పెంచుకుంటూ 43 శాతానికి చేరుకున్నది. అందువల్ల భవిష్యత్తు లో దేశీయంగా చేపల ఆహార అవసరాలు తీరాలన్నా, విదేశాలకు ఎగుమతులు పెరుగాలన్నా ఉపరితల జల వనరుల చేపల పెంపకం, ఆక్వాకల్చ ర్‌ రంగాల మీదనే ఆధారపడక తప్పని పరిస్థితులు ప్రస్తుతం మనదేశంలో నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఉపరితల జలవనరుల చేపల పెంపకం మీద సరైన దృక్పథాన్ని, విధివిధానాలను రూపొందించుకొని అనుసరించాల్సిన ఆవశ్యకతను ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల సందర్భంగా గుర్తించిన దాఖలాలు ఏ కోశానా కనిపించడం లేదు!


భూ ఉపరితల జలవనరుల మత్స్యరంగ అభివృద్ధి ప్రణాళిక 2019 పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రతిపాదనలు చట్టరూపంలోకి రాకుం డా గడిచిన మూడేండ్లుగా మూలుగుతున్నవి. దేశవ్యాప్తంగా మత్స్య పారిశ్రామికరంగంలో ఎంతో కొంత అభివృద్ధిని నమోదు చేయడానికి ఉపకరించిన ‘నీలి విప్లవం’ ప్రణాళిక కొనసాగింపుపై ఇంకా ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. రూ.5743 కోట్ల వ్యయంతో రూపొందించిన ‘జాతీయ మత్స్యరంగ మౌలిక వసతుల అభివృద్ధి పథకం’ అమలుకోసం సింహభాగాన్ని (560 కోట్లు) గత సంవత్సర వార్షిక బడ్జెట్‌లో కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో ఆ పథకం ఊసే కనిపించడం లేదు. మెరైన్‌ ఫిషరీస్‌ రంగానికి రోజురోజుకూ ప్రాముఖ్యం తగ్గుతున్నప్పటికీ పరిపాలనాపరమైన ప్రాధాన్యాల విషయంలో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. మత్స్య పారిశ్రామిక రం గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ‘మెరైన్‌ ఫిషరీస్‌' ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పర్యవసానంగా మొత్తం చేపల ఉత్పత్తిలో సింహభాగాన్ని జోడిస్తున్న ‘ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌' రంగానికి అవసరమైన ప్రాధాన్యాలు గానీ, ప్రాముఖ్యాలు గానీ కేంద్రం రూపొందిస్తున్న విధివిధానాల్లో ప్రతిఫలించడం లేదు. మనదేశంలో మత్స్యపరిశ్రమ నిలకడగా నిలదొక్కుకోవడంలో రాను న్నరోజుల్లో అత్యంత ముఖ్య భూమికను పోషించనున్న ‘ఆక్వాకల్చర్‌' రంగం విషయంలో కూడా ఇంకా అవసరమైనంతమేరకు కేంద్రం దృష్టిసారించడం లేదనే విమర్శలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకత గతంలో కంటే ఇప్పుడు మరిం త ఎక్కువగా కనిపిస్తున్నది.

(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)


logo