శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Feb 10, 2020 , 23:06:05

పెచ్చరిల్లుతున్న ఉన్మాదం

పెచ్చరిల్లుతున్న ఉన్మాదం

ప్రతిఒక్కరికి మిగతా వారంతా శత్రువులనుకునే ప్రవృత్తి అందరికి భద్రతారాహిత్యాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం, నాగరికత, చట్టాలులేని కాలంలోకి మళ్ళా వెనుకకు యాణించడం ప్రమాదకరం. ఇటీవలివరకు కులాల ఘర్షణ, మత కలహాలు జరిగితే వాటిని ఖండించే మానవీయ సంస్కృతి ఉండేది. ప్రభుత్వం కన్నా సమాజంలోని ఈ మానవీయ కోణం విద్వేష హత్యాకాండను నిలువరించేది. కానీ సమాజంలోని ఈ మానవీయతను లేకుండా చేసే దుర్మార్గ పోకడలు కనిపిస్తున్నాయి. రాజకీయ భావజాలాలకు అతీతంగా ఈ వికృత పోకడలను అరికట్టడం అందరి బాధ్యత.

ముంబయిలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్న రాజస్థాన్‌కు చెందిన కవి బప్పాదిత్య సర్కార్‌ను ఆ వాహనం డ్రైవర్‌ పోలీసులకు అప్పగించిన ఘటన దేశంలో చోటుచేసుకుంటున్న భయానక పోకడలకు అద్దం పడుతున్నది. బప్పాదిత్య ఒక ఆర్ట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి జైపూర్‌ నుంచి ముంబ యి చేరుకున్నారు. ఈయన నగరంలో క్యాబ్‌లో ప్రయాణిస్తూ ఒక మిత్రుడితో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల గురించి చర్చించారు. ఈ వాహనాన్ని నడుపుతూ బప్పాదిత్య సర్కార్‌ సంభాషణను విన్న డ్రైవర్‌ ఆయనను నేరుగా సమీప పోలీసుస్టేషన్‌కు తీసుకుపోయాడు. ఈయన కమ్యూనిస్టు అనీ, దేశాన్ని తగులబెడుతాడని, వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు తెలిపాడు. కారులో ఆయన మాటల ద్వారా తనకు అర్థమైనదేమిటో పోలీసులకు వివరించాడు. పోలీసులు బప్పాదిత్యను స్టేషన్‌లోకి తీసుకుపోయి వివరాలు తెలుసుకొని విడిచిపెట్టారు. మెడకు ఎర్రని పంచె, చేతిలో డప్పు పట్టుకొని తిరుగవద్దని కాలం బాగా లేదని కూడా వారు సలహా ఇచ్చారు. పోలీసులు విజ్ఞతతో వ్యవహరించడం వల్ల బప్పాదిత్య క్షేమంగా బయటపడ్డాడు. కానీ ఇక్కడ ఆందోళనకరమైన విషయం- ఒక క్యాబ్‌ డ్రైవర్‌ కూడా నిరసనలపై చర్చిండమే దేశద్రోహంగా భావించే పరిస్థితి ఉండటం. ప్రజల్లో దేశానికి ఏదో జరగబోతున్నదనే భయాందోళనలు నెలకొల్పడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదనే అనుమానం కలుగుతున్నది. 


బప్పాదిత్యకు ఎదురైన చేదు అనుభవానికి ముందు ఢిల్లీలో నిరసనల పట్ల కొందరు బెదిరింపులకు పాల్పడిన తీరు కూడా కలవరపరుస్తున్నది. ఇటీవల జామియా  విశ్వవిద్యాలయం, షహీన్‌బాగ్‌ల దగ్గర నిరసనలు తెలుపుతున్న ప్రజలపైకి కొందరు పిస్తోలుతో కాల్పులు జరిపారు. నిరసన ప్రదర్శకులను దేశద్రోహులుగా భావించి ఒక టీనేజ్‌ పిల్లడు కాల్పిపారేస్తానం టూ పిస్తోలు పట్టుకొని రావడం ఎంత ఘోరం! ప్రజల్లో ఇటువంటి విషబీజాలు నాటుతున్నదెవరనేది ఆలోచించవలసిన విషయం. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులే ద్వేషపూరిత భాషను వాడుతున్నారు. ‘గోలీ మారో.... ’ అంటూ అసభ్య పదజాలంతో ఉన్మాద ప్రచారం సాగిస్తున్నారు. ఢిల్లీ రాష్ట్రముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా ‘ఉగ్రవాది’గా పేర్కొనడం ఈ విష ప్రచారానికి పరాకాష్ఠ. సమాజంలో శాంతి సామరస్యాలను పెంచి పోషించవలసిన రాజకీయ నాయకులే ఉద్రిక్తతలను రెచ్చగొడితే ఆ ప్రభావం ప్రజలపై ఎంత తీవ్రంగా పడుతుం దో ఈ ఘటనలను బట్టి తెలుస్తున్నది. పిల్లలు తుపాకీలు తీసుకొని కాల్పులు జరుపడం వంటి దారుణ ఘటనలు అమెరికాలో జరిగితే ఆశ్చర్యంగా చూసేవారం. ఇప్పుడు ఆ భయానక ఘటనలు మన దేశంలో సాధారణంగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. మన కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరైనా కావచ్చు- బయట అడుగుపెట్టిన తరువాత ఎవరికీ భద్రత కల్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది. 


సమాజంలో విభజన రేఖలు అంటూ గీయడం మొదలుపెడితే అవి ఒక దగ్గర ఆగిపోవు. మతం, కులం, తెగ, భాష, సంస్కృతి అంటూ అనేక రీతుల్లో వైషమ్యాలు పెచ్చరిల్లవచ్చు. ఒక నగరంలో లేదా ప్రాంతంలో ఉండే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విద్వేషాలు చెలరేగవచ్చు. దీనివల్ల మెజారిటీ, మైనారిటీ అనే తేడాలేకుండా అందరూ భద్రతా రాహిత్యానికి గురవుతున్నారు. ఏ వ్యక్తి అయినా బయట ప్రపంచంలో అందరితో కలిసి బతుకక తప్పదు. తమ కులం వారితో, తమ మతం వారితోనే ప్రయాణించడం, కలిసి పనిచేయడం ఎక్కడా సాధ్యం కాదు. సమాజమం తా భిన్న వర్గాలుగా విడిపోయి, పరస్పర విశ్వాసరాహిత్యంతో బతకవలసి వస్తే అంతకన్నా భయానక వ్యవస్థ మరొకటి ఉండదు. హాబ్స్‌ అనే ఇంగ్లిష్‌ తత్తవేత్త సామాజిక ఒడంబడిక సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తూ ప్రజలను నియంత్రించే బలమైన పాలక వ్యవస్థ లేనప్పుడు సమాజం ఎంత భయానకంగా ఉండేది చిత్రీకరించాడు.


ఆయన చెప్పిన నిరంకుశవాదం ఆమోదనీయం కాకపోయినా, చట్టబద్ధపాలన మృగ్యమైన సమాజం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రతిఒక్కరికి మిగతా వారంతా శత్రువులనుకునే ప్రవృత్తి అందరికి భద్రతారాహిత్యాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం, నాగరికత, చట్టాలులేని కాలంలోకి మళ్ళా వెనుకకు ప్రయాణించడం ప్రమాదకరం. ఇటీవలివరకు కులాల ఘర్షణ, మత కలహాలు జరిగితే వాటిని ఖండించే మానవీయ సంస్కృతి ఉండేది. ప్రభు త్వం కన్నా సమాజంలోని ఈ మానవీయ కోణం విద్వేష హత్యాకాండను నిలువరించేది. కానీ సమాజంలోని ఈ మానవీయతను లేకుండా చేసే దుర్మార్గ పోకడలు కనిపిస్తున్నాయి. రాజకీయ భావజాలాలకు అతీతంగా ఈ వికృత పోకడలను అరికట్టడం అందరి బాధ్యత.


logo