శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Feb 10, 2020 , 23:02:33

రిజర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు

రిజర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు

కేంద్రప్రభుత్వంలో కానీ, దేశంలోని ఏ రాష్ట్రంలో గానీ, న్యాయస్థానాల్లో అణగారినవర్గాల జీవన స్థితిగతులను ప్రభావితంచేసే ఏ అంశంపై కదలిక వచ్చినా ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో రాజకీయంగా బలహీనంగా ఉన్న పక్షాలు ఈ తీర్పును వ్యతిరేకించాయి. అధికార బీజేపీ, దాని మిత్రపక్షాల మౌనం అంగీకారానికి చిహ్నమా అనేది సహజ సందేహం. ఇతరదేశాల రాజ్యాంగాల్లోని చాలా అంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకున్నప్పటికీ, రిజర్వేషన్ల అంశం మాత్రం కచ్చితంగా ఈ దేశ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా పొందుపరిచినవే. సామాజిక అసమానతలు తొలిగే వరకు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. చట్టసభల్లో, రాజకీయ అవకాశాల్లో, ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో ఎక్కడా కూడా అణగారినవర్గాలకు తమ జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు రావడం లేదని ప్రభుత్వ లెక్కలే స్పష్టపరుస్తున్నా యి. పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్‌ అవసరమా? అనే ప్రశ్న కూడా పదేపదే వస్తున్నది. పదోన్నతుల ద్వారా మాత్రమే నిండే ఉన్నత ఉద్యోగాల్లో, అత్యున్నత పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నారా? లేరా? అని చూసుకోవడమే సమాధానం. ఈ దేశంలో ఏ లక్ష్యంతో రిజర్వేషన్‌ విధానం ప్రవేశపెట్టారో బోధపడితేనే, ఆ లక్ష్యం చేరుకునే మార్గం అన్వేషించడం సాధ్యమవుతుంది.

సరిగ్గా ముప్పై సంవత్సరాల కిందట ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే మండల్‌ కమిషన్‌ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశం అట్టుడికింది. అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని గట్టి పట్టుదలతో ఉన్నది. దీంతోపాటు దేశంలో సామాజికన్యాయం సాధించడం అనేది ఓ లక్ష్యం గా భావించిన రాజకీయవ్యవస్థ ఉన్నది. దీనివల్ల మండల్‌ సిఫారసులు అమలుచేయడం సాధ్యమైంది. మండల్‌ కమిషన్‌ సిఫారసులను వ్యతిరేకించిన వారు నాడు రాజకీయ శక్తిసంపన్నులు కారు. రిజర్వేషన్లను అమలుచేయడానికి సూత్రప్రాయంగా, సిద్ధాంతరీత్యా అయిష్టంగా ఉం డే ఆ శక్తులు నేడు అన్ని వ్యవస్థలను శాసించే స్థితిలో ఉన్నాయి. అందు కే నేడు రాజ్యాంగం చెట్టు నీడన తలదాచుకుంటున్న అణగారినవర్గాలు పిడుగు పడినంత భయంతో వణికిపోతున్నారు. కేంద్రప్రభుత్వంలో కానీ, దేశంలోని ఏ రాష్ట్రంలో గానీ, న్యాయస్థానా ల్లో అణగారినవర్గాల జీవన స్థితిగతులను ప్రభావితంచేసే ఏ అంశంపై కదలిక వచ్చినా ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో రాజకీయంగా బలహీనంగా ఉన్న పక్షాలు ఈ తీర్పును వ్యతిరేకించాయి. అధికార బీజేపీ, దాని మిత్రపక్షాల మౌనం అంగీకారానికి చిహ్నమా అనేది సహజ సందేహం. 


రెండేండ్ల కిందట ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అసలు ఎస్సీ, ఎస్టీ చట్టానికి తిలోదకాలు ఇవ్వడానికి వేసిన మొదటి అడుగుగా దేశంలోని బలహీనవర్గా లు భావించాయి. ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో వచ్చిన తీర్పు కూడా అదే భయాన్ని కల్పిస్తున్నది. సుప్రీం తీర్పు మాత్రమే కాదు, దాని నేపథ్యం కూడా అసలు రిజర్వేషన్లకే ఎసరు వస్తుందనే ఆందోళనకు కారణమవుతున్నది.ఉత్తరాఖండ్‌ బీజేపీ ప్రభుత్వం పీడబ్ల్యుడీలో ఏఈ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టిం ది. ఉత్తరాఖండ్‌ బీజేపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ వేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసి, రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది ఆయారాష్ర్టాల ఇష్టానికే వదిలేయాలని తేల్చింది. ఉత్తరాఖండ్‌ బీజేపీ ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కుడిలాగా వ్యవహరించి మరీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాదించింది. 


రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పులకూ, సుప్రీంకోర్టు తీర్పులకూ అనేకసార్లు ఇలా తేడాలొచ్చాయి. సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఒకసారి, జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటామని ఒకసారి వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సుప్రీంకో ర్టు సమయానుగుణంగా రిజర్వేషన్లపై వైఖరి వెల్లడిస్తున్నప్పటికీ, అది ప్రతిసారి తమ ప్రయోజనాలకు, హక్కులకు ప్రతికూలంగానే ఉంటున్నదనే అసంతృప్తి అణగారినవర్గాల్లో పేరుకుపోతున్నది. రాజ్యాంగస్ఫూర్తి అనే మాట వాడే హైకోర్టులు ఆమోదించిన రిజర్వేషరన్లను సుప్రీంకోర్టు అదే కారణంతో విభేదించడంతో వారికి ఎటూ పాలుపోవడం లేదు. ఎన్టీఆర్‌ సినిమాలో డైలాగు లాగా ‘కోర్టు కోర్టుకీ, తీర్పు తీర్పుకీ ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువర్‌ హానర్‌' అని బలహీన గొంతుకలు గట్టిగా మొత్తుకోవాల్సి వస్తున్నది. 


కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కల్పించే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలోఆదేశాలిచ్చింది. అప్పుడు అంత క్రియాశీలకంగా వ్యవహరించిన అత్యున్నత న్యాయస్థా నం, అసలు రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అనే విషయం ఆయా ప్రభుత్వాల అభీష్టమని పేర్కొనడం విస్మయపరిచే సందర్భం. 

ఇక రిజర్వేషన్లు పొందడం ప్రాథమికహక్కేమీ కాదనే సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నా యి. వివక్షకు, అణిచివేతకు గురైన వర్గాలను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పరిమితు లు లేవని రాజ్యాంగం (ఆర్టికల్‌ 46) స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 16(4), ఆర్టికల్‌ 14(4ఎ) దేశంలోని ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటునిచ్చాయి. అంతేతప్ప రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. కానీ సుప్రీంకోర్టు తనంతట తానుగా స్పందించి, తన రాజ్యాంగ సమీక్ష అధికారాన్ని ఉపయోగించుకుని తీర్పులను వెలువరిస్తున్నది.


సుప్రీంకోర్టు చెప్పినట్టే, ప్రభుత్వ ఉద్యోగాలు, నియామకాల్లో రిజర్వేషన్లు ప్రభుత్వ అభీష్టమే అయితే ఈ దేశంలో సామాజిక న్యాయం ఓ ఎండమావిగానే మారుతుంది. ఇది ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతం అనుభవం. కచ్చితమైన నిబంధన లేకుంటే సామాజిక న్యాయం ఎంత గొప్పగా అమలవుతుందో చెప్పడానికి ఈ దేశ చట్టసభలే నిలువెత్తు నిదర్శనం. పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ ఉన్నాయి. లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వారి జనాభా నిష్పత్తి ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ ఎంపిలున్నారు. కానీ రిజర్వేషన్లు లేని బీసీలు దేశ జనాభాలో 50 శాతం దాటినా, లోక్‌సభలో బీసీల ప్రాతినిధ్యం 20 శాతమే. మహిళలకు రిజర్వేషన్‌ లేకపోవడం వల్ల లోక్‌సభలో వారు 14 శాతమే ఉన్నారు. ఇక ఎవరికీ రిజర్వేషన్‌ లేని రాజ్యసభలో పరిస్థితి మరీ దారుణం. రాష్ర్టాల శాసనసభలు, మండలిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటున్నది. పొద్దున లేస్తే బలహీనవర్గాల ఉద్ధరణ కోసమే పుట్టామని చెప్పుకునే పేరుగొప్ప రాజకీయపార్టీలు ఎంపిక చేసే చట్టసభల సభ్యుల విషయంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. అసలు రిజర్వేషన్లు అమలుచేయాలనే కచ్చితమైన నిబంధనే లేకుంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. 


ఇతరదేశాల రాజ్యాంగాల్లోని చాలా అంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకున్నప్పటికీ, రిజర్వేషన్ల అంశం మాత్రం కచ్చితంగా ఈ దేశ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా పొందుపరిచినవే. సామాజిక అసమానతలు తొలిగే వరకు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. చట్టసభల్లో, రాజకీయ అవకాశాల్లో, ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో ఎక్కడా కూడా అణగారినవర్గాలకు తమ జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు రావడం లేదని ప్రభుత్వ లెక్కలే స్పష్టపరుస్తున్నా యి. పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్‌ అవసరమా? అనే ప్రశ్న కూడా పదేపదే వస్తున్నది. పదోన్నతుల ద్వారా మాత్రమే నిండే ఉన్నత ఉద్యోగాల్లో, అత్యున్నత పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నారా? లేరా? అని చూసుకోవడమే సమాధానం. ఈ దేశం లో ఏ లక్ష్యంతో రిజర్వేషన్‌ విధానం ప్రవేశపెట్టారో బోధపడితేనే, ఆ లక్ష్యం చేరుకునే మార్గం అన్వేషించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వానికి ప్రధాన అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల్లో వందకు వంద శాతం సామాజిక న్యాయం జరిగే వరకు రిజర్వేషన్లు అమలు కావాలనే కచ్చితమైన నిబంధన ఉండి తీరాలి. అది ప్రభుత్వాల బాధ్యత అని అవసరమైతే పార్లమెంటులో చట్టం చేయాలి. 

గటిక విజయ్‌ కుమార్‌logo