శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Feb 09, 2020 , 23:33:24

చారిత్రక విజ్ఞాన సారస్వం

చారిత్రక విజ్ఞాన సారస్వం

ఈ పదకోశం రాయటానికి ఆర్‌.ఎల్‌.ప్రసాదు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాలకు తిరిగాడు. సకల కుల వృత్తులువారి దగ్గరికి వెళ్లాడు. మాదిగ జీవితం దానిచుట్టూ అలుకున్న పద సంస్కృతులను పట్టుకున్నా డు. దళితులు, దళితుల ఉపకులాల చివరిమెట్టు వరకూ వెళ్లి వాళ్ల జీవనమార్గాలను పరిశీలించాడు. లందల్లోకెళ్లి అందర్లో కలిశాడు. చిందు సంస్కృతిలో అడుగులు వేశా డు. మాదిగ సంస్కృతితో సాగుతున్న జీవనయానాన్ని ఆకళింపు చేసుకున్నాడు.

చరిత్రంతా ఉత్పత్తి కులాలదే. నాగరికతలన్నీ ఉత్పత్తిశక్తుల చేతుల నుంచే పుట్టుకొచ్చాయి. ఉత్పత్తి మూలా ల్ని తెలుసుకోలేనివారు సామాజిక మూలాలను కూడా ఎప్పటికీ తెలుసుకోలేరు. కాలం నిత్యం మారుతూ తన కు తాను కావాల్సినవి సృష్టించుకుంటూ నవనాగరికతలను నిర్మించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుం ది. కాలాలు మారినా సామాజిక మార్పులు ఎన్ని వచ్చి నా మూల పునాదులు లేకుండా వర్తమానం బండి నడవదు. భవిష్యత్తు కూడా తన రూపురేఖల్ని గీసుకోవాల్సినవచ్చినప్పుడు మళ్లీ మూలాల్లోకి మూలవాసుల చరి త్ర పాదాల దగ్గరకు పోవాల్సిందే. 


చరిత్రలో కొన్నివర్గాలు అణగదొక్కబడ్డాయి. ఆ అణగదొక్కబడిన వర్గాల వీపుల మీద ఆధిపత్య సాహిత్యం, ఆధిపత్య చరిత్ర నిలబడింది. మూలాలను తడుముకుంటూ తమ అస్తిత్వంకోసం తాము పాకులాడు సందర్భాలలోనే అస్తిత్వ ఉద్యమాలు ఎగిసిపడ్డాయి.  ఈ నేప థ్యం నుంచే తన చరిత్రను తాను రాసుకునే క్రమంలో పాతచరిత్ర తోలుతీసి తమ అసలు చరిత్రను ‘చర్మపదకోశం’ అన్న తోలు సంబంధ పదాల నిఘంటువు వచ్చింది. ఈ ‘చర్మపదకోశం’ తయారుచేయడానికి ఆర్‌.ఎల్‌. ప్రసాదు అనే సామాజిక కార్యకర్త చేసిన కృషి మరిచిపోలేనిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వస్తు న్న అనేక అస్తిత్వ సాహిత్య గ్రంథాల్లో ఆర్‌.ఎల్‌. ప్రసా దు గ్రంథం ఆణిముత్యం. చరిత్రలో ఇనుపయుగం, రాగియుగం, పాతరాతియుగం, కొత్తరాతియుగం అం టూ విభజన చేసి పెట్టారు. 


కానీ ఈ చర్మ పదకోశం గ్రంథం చూస్తుంటే చరిత్ర చర్మ సంస్కృతిని, చర్మకారుల జీవితాలను, చర్మంలో నవ కానికి వేసిన పునాదులన్నీ కండ్ల ముందుంటాయి. తెలంగాణ సమాజానికే కాదు మొత్తం తెలుగు సమాజానికి ప్రసాదు అందించిన తోలుదస్త్రం చర్మపదకోశం అమూల్యమైనది.  

ఈ గ్రంథంలో నాగరికతలో తోలు పాత్ర అన్న అధ్యాయాన్ని చూస్తే మొత్తం దేశదేశాల్లో ఈ తోలు ఉత్పత్తుల ద్వారా దేశదేశాల రథచక్రాలు ఎలా కదిలాయో తెలుస్తుంది. ఈనాటి కిన్‌లే బాటిల్‌కు పునాది తోలుతిత్తి. ఈ తోలుతిత్తిద్వారా నీటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకపోయేవారు. ఇప్పటికీ సమాజంలో ఆరోగ్యకరంగా నీళ్లు తాగడానికి తోలుతిత్తిలోని నీళ్లే శ్రేష్టమైనవి. మానవునికి తొలి నైపుణ్యత గల పని ఉందంటే అది జంతువు పొట్టచీరి తోలును జాగ్రత్తగా ఒలుచడం దగ్గరే జరిగింది. 


ఈ చర్మపదకోశంలో భారతదేశ సంస్కృతి నాగరికత గ్రంథంలో డి.డి. కోశాంబి తోలు గురించి చేసిన ప్రస్తావనను రికార్డు చేశారు. ఆహారనిల్వలకు, పశుపోషణకు, నీటి సరఫరాకు, కొలిమిని మండించటానికి, నాగరికత కు పునాదులు వేస్తూ తోలు చరిత్ర ఎలా మొదలైందో వివరించారు. మొగలాయిల కాలంలో తోలు ఉత్పత్తు లు, తుగ్లక్‌ పాలనలో తోలు నాణేలు దగ్గర్నుంచి ఉత్పత్తిలో తోలు భాగస్వామ్యాన్ని వివరిచడం జరిగింది. జంతువుల నుంచి ఒలిచిన తోలును నానబెట్టిన దాన్నే ‘లంద’ అంటారు. లందోల్లు అంటే లంద పనిచేసేవారని అర్థం. సంగారెడ్డి జిల్లాలో లందోల్లు పలుగురాళ్ల గుట్ట దగ్గర ఉండేవారు. అదే కాలక్రమంలో ‘అందోలు’ గా మారింది. 


గుహ నుంచి గూడుకు మనిషిచేరే క్రమం తోలు వల్ల నే జరిగింది. పుట్టుక దగ్గర్నుంచి మనిషి అంతర్థానం అయ్యేవరకు అన్ని జీవన ప్రక్రియల్లో తోలు కీలకపాత్ర పోషించింది. ఈ చరిత్రపై దేశదేశాల భాషా శాస్త్రవేత్తలు జరిపిన కృషినంతా ఇందులో చేర్చటం జరిగింది. రక్షణరంగ సామాగ్రికి తోలే, యుద్ధతంత్రానికీ తోలే, మని షి నాగరికతకు ఒంటికి తొలిబట్టగా నిలిచింది తోలే. నీటిని దాపి సమాజ దప్పిక తీర్చింది తోలే. ఆదివాసీల జీవన సంస్కృతే తొలి మానవుల ఆది జీవన సంస్కృ తి. దానికి పునాది తోలే. పురాణాలు, ఆదికావ్యాలు, చరిత్ర నిక్షిప్తమైన సమాజ నిర్మాణాల్లో తోలు ప్రస్తావన ఉంది. 


తోలు ఆవిష్కరణ, తోలు విద్యలున్నాయి. పురాణా లు, బైబిల్‌, ఖురాన్‌లలో తోలు దుస్తుల ప్రస్తావన ఉం ది. తోలు ప్రస్థానం మొదలయ్యాక సమాజ ప్రగతి ముందుకుసాగింది. సమస్త వృత్తి పనులకు పునాది తోలుతోనే ప్రారంభించబడింది. వృత్తిపనులకు అనుబంధంగా తయారుచేసిన వస్తువులపై ఒడిసెల, గులేరు, కోదండం గాండీవం,తిత్తి, కరి, ఇంటిపేర్లు వచ్చాయి. అలాగే రాగాల వారిధి, కళామేళం, బండికచ్చురం, కవచం, అవుశ, జరు దోసి, తసుమ, తోలుబిల్లు, హౌజ రు, చెవితబల, గుండె చప్పుడు, కన్నుకర్ణె, దిమ్మెలు, లక్కచెక్క ఎన్నైనా చెప్పుకోవచ్చు.   


‘పదకోశం’ అధ్యాయంలో చర్మభాషపై 6000 పదాలకు ఈ గ్రంథంలో అర్థాలు చెప్పటం జరిగింది. అవుశ అంటే మంగలికల్ప అన్న పదానికి అర్థం చెప్పటంతో ఈ పదకోశం మొదలై హౌజరు అన్న పదంతో ఈ గ్రంథం ముగుస్తుంది. 4వ అధ్యాయంలో తోలుతో తయారుచేసిన వస్తువులకు సంబంధించిన చిత్రాలను అనుబంధంగా అందించటం బాగుంది. 100 పేజీలలో ఆ వస్తువుల చిత్రాలు దర్శనమిస్తాయి.


ఈ పదకోశం తయారుచేయటానికి ఆర్‌.ఎల్‌. ప్రసాదుకు ఆరేండ్లు పట్టింది. ఈ పరిశోధకుడు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. చదువుకునేందుకు అవకాశాలు లేక తన బాల్యంలోనే చదువును వదిలివేసి సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. సమాజంపై పట్టును, సమాజనిర్మాణంలో మానవజీవన ప్రయాణా న్ని గమనించినవాడు, అర్థం చేసుకున్నవాడు. అందు వల్ల ఈ పుస్తకానికున్న విశిష్టత ఏమిటంటే ఎక్కడో ఒక దగ్గర కూర్చొని దొరికిన సమాచారాన్ని పోగేసి ఈ పదకోశాన్ని తయారుచేయలేదు. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి చర్మకారుడు వొలుస్తున్న చర్మపు చేతుల దగ్గరకు పోయి వాళ్లతో మాట్లాడి వారి మాటల్లోనే తయారుచేయటం జరిగింది. తోలు పరిశ్రమ మానవ నాగరికతకు పునాది అని ఈ పుస్తక పరిశోధనలో తేల్చారు. 


పీడితవర్గాలకు, అట్టడుగు బహుజనవర్గాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ గ్రంథంలో రికార్డు చేయడం ముదావహం.

ఏదైనా పరిశోధన చేయటానికి విశ్వవిద్యాలయాల లో అందుకు సంబంధించిన మెథడాలజీని, విషయ సేకరణ, పరిశోధనా పద్ధతులను, సమాచార సేకరణను పరిశోధకులకు వివరించి పరిశోధన చేయిస్తారు. కానీ, చర్మపదకోశం,తోలు సంబంధిత నిఘంటువును రూపొందించిన ప్రసాదు మాత్రం మనుషుల దగ్గరకే నేరుగా వెళ్లి ఆ వృత్తిలోపల వున్న జీవితాలను ఆ జీవి పదబంధాలను పట్టుకొని ఆరె కత్తితో చర్మాన్ని చీరి వస్తువులను తయారుచేసినట్లు చర్మపదకోశాన్ని శుద్ధిచేసి సమాజం చేతికందించాడు.


విశ్వవిద్యాలయాల్లో చదవని విద్యార్థి చేసిన అద్భుతమైన పరిశోధనగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. చర్మకారుల వృత్తివికాసం, మానవజాతి నాగరికత, జీవ న వికాసం, చరిత్ర తిరిగిన ప్రతిమలుపులో చర్మం పాత్ర ఉంది. చర్మ సౌందర్యం ఎంత గొప్పదో, చర్మంతో చేసిన అద్భుతాలకు అర్థంచెప్పే నిఘంటువుగా ఈ పదకోశం తీర్చిదిద్దబడింది. ఈ గ్రంథ పరిశోధనకు మార్గదర్శకులు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కాదు. చర్మకారు లు, వృత్తికళాకారులు, ఆరెకత్తి బట్టిన చర్మసౌందర్య సృష్టికర్తలు. రాష్ట్ర అవతరణ తర్వాత మన ఆదిమూలా ల చరిత్రను వెలికితీసే సమయం ఆసన్నమైంది. మాదిగల జీవనశైలి, సంస్కృతులను ఇందులో విశ్లేషించటం జరిగింది. ప్రపంచీకరణ వల్ల పాత ఆచార సాంప్రదాయాలు, సంస్కృతులు అంతరించిపోతున్నాయని పలువృత్తి కులాలు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో చర్మపదకోశం రావటం ఆహ్వానించదగినది. 


ఈ పుస్తకం ప్రజలవాడుక భాషలో రాయటం బాగుంది. ఈ పదకోశం రాయటానికి ఆర్‌.ఎల్‌.ప్రసాదు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాలకు తిరిగాడు. సకల కుల వృత్తులువారి దగ్గరికి వెళ్లాడు. మాదిగ జీవితం దానిచుట్టూ అలుకున్న పద సంస్కృతులను పట్టుకున్నా డు. దళితులు, దళితుల ఉపకులాల చివరిమెట్టు వరకూ వెళ్లి వాళ్ల జీవనమార్గాలను పరిశీలించాడు. లందల్లోకెళ్లి అందర్లో కలిశాడు. చిందు సంస్కృతిలో అడుగులు వేశా డు. మాదిగ సంస్కృతితో సాగుతున్న జీవనయానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అట్టడుగు జీవనశైలి తెలుసుకునేందుకు వాళ్లతో కలిసి బతికాడు. అందుకే ఆర్‌.ఎల్‌. ప్రసాదు చాలా శక్తివంతమైన చర్మపదకోశాన్ని చరిత్రకందిస్తున్నాడు. ఇది అట్టడుగున పడివున్న సంస్కృతికి భాషకు అత్యాధునిక కాలంలో జరుగుతున్న మహోన్న త సత్కారం. ఇలాంటి పరిశోధన వల్ల మన అట్టడుగువర్గాల చరిత్ర సంస్కృతి కళారూపాలు పరిరక్షించబడుతాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వెలుగుచూస్తున్న ఈ పరిశోధనా గ్రంథానికి మొత్తం తెలంగాణ సమాజం, తెలుగు సమాజం స్వాగతం పలుకుతున్నది. 

- జూలూరు గౌరీశంకర్‌
logo