శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 09, 2020 , 23:31:09

మన సామెతలు

మన సామెతలు

జానపదుల జీవితం నిండా పేదరికమే పరుచుకొని ఉంటుంది. అలాగని వాళ్లు ఎప్పుడూ తాము పేదలమని, పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని బాధపడరు. జీవితం ఎట్లా పలకరిస్తే అట్లానే దాన్ని అనుభవించి ఉన్నంతలో జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. ఆ జీవితానుభవం నుంచే అనేక సామెత ల్ని ఆయా సందర్భాలకు అనుగుణంగా సృష్టించుకొని వ్యవహారాన్ని మరింత సునాయాసపరుచుకుంటారు. ఇలా కొనసాగుతున్న జీవితం నుంచి అనేక సామెతలు పుడతాయి.

‘A proverb is a short, generally known sente -nce of the folk which contains wisdom, truth, morals and traditional views’ 

-Wolfgand Mieder 

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. సామెతలను సందర్భోచితంగా వాడితే అవి సంభాషణను కాంతివంతం చేస్తాయి. ‘అల్పాక్షరాలలో అనల్పార్థ రచన’ అనే వాక్యానికి అక్షర నిదర్శ నం సామెతలు. సామెతల అధ్యయనాన్ని ‘Paremiology’ అంటారు. సామెతల సేకరణను ‘Paremiography’ అంటా రు. ‘జానపద విజ్ఞానంలోని అన్ని అంశాలలాగే సామెతలు కూడా సాంప్రదాయకమైనవి. వాటి ప్రత్యేకత వివేకవంతమైనవి కావడం, సంక్షిప్తంగా ఉండటం.’(డాక్టర్‌ సుందరం, ఆర్వీయస్‌ ‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’ పుట.172) ‘సామెత’ అనే మాట ‘సామ్యత’ నుంచి వచ్చిందని పరిశోధకులు చెప్తారు. అందుకే చాలా సామెతల్లో ఒక వస్తువును మరో వస్తువుతో పోల్చి చెప్పడం కనిపిస్తుం ది. సామెతలు సాధారణంగా ఒక వాక్యంలోనే ఉంటాయి. తక్కు వ సందర్భాల్లో మాత్రమే రెండు లేదా మూడు వాక్యాలకు విస్తరిస్తాయి. సామెతలు సరళమైన భాషలో, ప్రజాబాహుళ్యంలో ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. 


సామెతలను ఛందో దృష్టితో చూస్తే అనేక పద్య లక్షణాలు కూడా కనిపిస్తాయని వ్యాకరణకారులు, ఛందోవేత్తలు గుర్తించిందే. ‘పదునైన భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెత లక్షణం. చెప్పే విషయాన్ని సాధ్యమైనంత సూటిగా చెప్తాయవి. మానవుని దీర్ఘానుభవం ఆధారంగా రూపుదాల్చిన సంక్షిప్త వాక్యాలు కావడం చేత సామెతలకు ఈ తీక్షణత లభ్యమైందని చెప్పవచ్చు.’(పై పుస్తకమే). అంతేగాక సామెతలు ‘తరతరాలు తరచి చూసిన జీవితాలు, వడబోసిన అనుభవాలు రాబోయే తరాలకు పరంపరగా అందించే వారస త్వ మౌఖిక విజ్ఞానం సామెతలు. మనుషులెన్ని తీర్లో, భావనలెన్ని తీర్లో సామెతలన్ని తీర్లు. సన్నివేశానికి, సందర్భానికి తగినట్లు అర్థవంతంగా ఒదిగే గొప్ప సామెతలెన్నో (సిధారెడ్డి నంది ని, ‘తెలంగాణ సామెతలు’ గ్రంథానికి రాసిన ముందు మాట). సామెతలు ఎప్పుడు పుట్టాయంటే.. మానవుల అనుభవ సారాన్ని ప్రతి సామెత గర్భీకరించుకుంటుందని చెప్పవచ్చు. సామెతలు ఏ ప్రాంతంలో పుట్టాయి? ఏ కాలంలో పుట్టాయో అందులో ఉన్న ఒక పదాన్ని ఆధారంగా చేసుకొని అంచనా వేయవచ్చు. వేదకాలం నుంచి ఈనాటి ఆధునిక గ్రంథాల దాకా సామె తలు అనేక గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. 


సామెతల్ని కూడా స్థూలంగా రెండువిధాలుగా విభజిస్తారు. 1. అకారాదిగా  2. వస్తుపరంగా. వస్తువును బట్టి సామెతలను అధ్యయనం చేయడమే సమంజసమైందని చాలామంది పరిశోధకులు చెప్పారు. 

‘తల్లిని బట్టి బిడ్డ నూలును బట్టి బట్ట’

‘తడి గుడ్డతో గొంతు కోసినట్లు’

‘తనదాకా వస్తే కాని తెలియదు’

‘తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పాలి’

‘తవ్వికొద్దీ పెంకాసులెల్లినట్టు’

 జానపదుల జీవితం నిండా పేదరికమే పరుచుకొని ఉంటుం ది. అలాగని వాళ్లు ఎప్పుడూ తాము పేదలమని, పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని బాధ పడరు. జీవితం ఎట్లా పలకరిస్తే అట్లానే దాన్ని అనుభవించి ఉన్నంతలో జీవితాన్ని ఆనందమ యం చేసుకుంటారు. ఆ జీవితానుభవం నుంచే అనేక సామెత ల్ని ఆయా సందర్భాలకు అనుగుణంగా సృష్టించుకొని వ్యవహారాన్ని మరింత సునాయాస పరుచుకుంటారు. ఇలా కొనసాగుతున్న జీవితం నుంచి అనేక సామెతలు పుడతాయి.


‘అగ్గువ అమ్మనియ్యది ఫిరం కొననియ్యది’ 

‘ఉంటే అమీర్‌సాబ్‌ లేకుంటే ఫకీర్‌సాబ్‌'

‘ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి’

‘ఉన్ననాడు ఉట్ల పండుగ లేని నాడు లొట్ల పండుగ’ 

పల్లీయులు తమకు ఏ ఆపద వచ్చినా,ఏ నష్టం వచ్చినా దాన్ని తమ అదృష్టమే ఇలా ఉందని భావిస్తారు. ఈ జీవితం ఇంతేనని సరిపుచ్చుకొని లేని దానికోసం పాకులాడరు.దక్కేది దక్కక మాన దు. దక్కనిది తమ దరికే రాదనే ఒక నిర్లిప్తతత ఉంటుంది. ఆ మాసనిక సంచలనం నుంచి అనేక సామెతలు పుడతాయి. అవి సంభాషణను ఇంకొంత పదునుదేరేలా నడిపిస్తాయి.

‘అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే చేతిలున్న చిప్పపోయిందట

‘అధమునికి ఆలయ్యేకంటే బలవంతునికి బానిసయింది మేలు’

‘ఉప్పోడు చెడె, పప్పోడు చెడె, తమలపాకోడు తమాం చెడె’

‘ఊహలు ఊళ్లేలుతుంటే కర్మ కట్టెలు మోసిందట’

జానపదులు సాధారణంగా దానశీలురు. ఆత్మగల్ల మనుషు లు. సాటి మనిషికి సాయం చేసే మనస్తత్వం గలవారు అయితే అందరు అలాగే ఉండరు కదా! కొందరు పిసినారితనాన్ని ప్రదర్శించి ఏమో సంపాదించాలని తాపత్రయపడుతుంటారు. అటువంటి వారికి పల్లీయులు తమదైన శైలిలో చురకలు అంటిస్తుంటారు. ఈ సందర్భంలో అనే సామెతలు పుట్టి పిసినారుల కొంచెపుతనాన్ని పట్టి చూపుతాయి.


‘అడిగినట్టిస్తే కడిగినట్టు పోతది’

‘ఎంగిలి చేతితోని కాకిని కొట్టనోడు బిచ్చం బెడ్తడా!’

‘ ఆటా పాటా మాయింట మాపటి భోజనం మీయింట’

నిజానికి ఆశే మనిషికి శ్వాస. అయితే అది తక్కువైతే నిరాశ. ఎక్కువైతే దురాశ. జానపదులు ఇలాంటి సందర్భాల్లో  చాలా అర్థవంతమైన సామెతలను పుట్టించి తమ అనుభవసారాన్ని చెప్తారు. 

‘అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు దుడ్డె బుక్కిపోయిందట’

‘అన్న వస్ర్తానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట’

జానపదులు ఊహల్లో కాకుండా వాస్తవంలో జీవించడానికే ఇష్టపడుతుంటారు. దీనికి భిన్నంగా ఏ వ్యక్తి అయినా జీవించడానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డప్పుడు సామెతల్ని సృష్టించి జీవితాన్ని వ్యాఖ్యానిస్తుంటారు.


‘మింగ మెతుకు లేదుగాని మీసాలకు సంపెంగ నూనె’

‘అవ్వకు కూడు పెట్టనోడు పెద్దమ్మకు కోకపెడ్తానన్నడట’

‘ఏమిలేనోనికి ఏతులెక్కువ’  

‘కూటికి లేకున్నా కాటుక మానది’

జానపదులు పల్లెల్లో కులాలకు, మతాలకు అతీతంగా, స్థిర, చర ఆస్తులకు అతీతంగా అందరూ వావివరుసలు పెట్టుకొని జీవిస్తుంటారు. దీని ఆధారంగా అనేక సామెతలు పుట్టాయి.


‘అక్క చుట్టం అయితే లెక్క చుట్టమా?’ 

‘అక్కకుంటే అడుగరాదు చెల్లెకుంటే చేతికి రాదు’

పల్లీయులు అతి తొందరను సహించరు. ఎందుకంత తొందర పడుతావు. జర నిమ్మళంగా ఉండుమని చెబుతారు. తొందరపాటును జానపదులు గమ్మత్తయిన సామెతల్లో పొదుగుతారు.


‘అగడుబడ్డమ్మ మొగన్ని మింగిందట’

‘అయ్యేదాక ఉండి ఆరే దాక ఆగనట్టు’

జానపదుల్లో అత్త చుట్టు, అల్లుని చుట్టు, కోడలు చుట్టు అనేక సామెతలు పుట్టాయి. ఇలా పుట్టిన సామెతల్లో ఎంతో జీవితానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఈ సామెతల నిండా సున్నితమైన హాస్యంతో పాటు, ఒక కనిపించని హింస, నొప్పి  కూడా నర్మగర్భంగా ఉంటుంది.

‘అత్తగారింట్ల సుఖం మోచేతి మీది దెబ్బ’

‘అత్తగారింట్ల అల్లున్ని జూడాలె, అనుపచేనుల ఆంబోతును జూడాలె’

‘కోడలుకు బుద్ధి చెప్పి అత్త తెడ్డునాకినట్లు’

జానపదులు శృంగార రసానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. అన్ని రసాలు శృంగార రసంలోనే మిళితమవుతాయి.


‘అయ్యగారి ప్రతాపం అంతా కంచం మీదేగానీ మంచం మీద లేదట’

‘అర్జీలకు పనులు కావు ఆశీర్వచనాలకు బిడ్డలు పుట్టరు’

‘ఉద్దెరైతే నాకిద్దరు అన్నడట’

పల్లీయుల జీవితం సాంతం వ్యవసాయం చుట్టే తిరుగుతుం ది. కాబట్టి వాళ్ల సామెతల్లో అనివార్యంగా ఈ వ్యవసాయం తొంగిచూస్తుంటుంది.

‘ఉత్తరం దిక్కు మబ్బుకమ్మితే ఉత్తగపోదు’

‘ఉత్తరలో చల్లిన నారు కత్తెరలో నరికిన కొయ్య’

రోజంతా శారీరక శ్రమ చేసి ఆ శ్రమను మర్చిపోవడానికి పల్లీయులు ‘కల్లు’ను ఆశ్రయిస్తారు. తాగినప్పుడు బయటపడే నిజా ల్లో సామెతలు కూడా ఉంటాయి. ఎక్కువ శాతం ఈ సామెతలు ‘మందు’ చుట్టే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తాగినప్పటి మనిషి ప్రవర్తనపైనా, అతని మానసిక స్థితిపైనా ఉంటాయి. 

‘ఈదుల్లకు బోయినోడు ఇల్లుకాలినా రాడు’

‘తాళ్లల్లకు పోయినోడు తండ్రి చచ్చినా రాడు’

పల్లీయులకున్నంత తాత్త్వికత మరొకరికి ఉండదు. వారికున్న జీవితపు లోతు తాత్త్విక సామెతల్లో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతుంది.


‘ఇయ్యాల ఇంట్ల రేపు మంట్లె’

‘ఎవరి వీపు వాళ్లకు కనబడది’

జానపదులు మోసాన్ని సహించరు. మోసపుటాలోచనలను, తద్వారా జరిగే నష్టాన్ని పూసగుచ్చినట్టు సామెతల్లో చెప్పి అందరినీ మేల్కొల్పుతారు, హెచ్చరిస్తారు.

‘ఈతాకు ఇచ్చి తాటాకు దొబ్బుడు’

‘ఇత్తేసి పొత్తుగూడుడు’

‘ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదన్నట్లు’

పనితనానికి, సామర్థ్యానికి జానపదులు విలువిస్తారు. జీవితాన్ని ఎలా జయించాలో చెప్తూనే,  పశువులాగా శరీరంతో పనిచేయకుండా, మెదడుతో పనిచేసి సుఖజీవనం చేయాలని ఈ సామెతలు విడమర్చి చెబుతాయి.

‘ఉపాయమున్నోడు ఉపాసముండడు’ 

అమాయకత్వాన్ని, అతితెలివిని పల్లీయులు సామెతల్లో పొది గి ఎంత జాగరూకతతో ఉండాలో చెప్తారు.

‘ఉత్తకుండ ఉట్టిమీద పెట్టి, నేతికుండ నేల మీద పెట్టినట్టు’

‘ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా లెంకినట్టు’ 

‘కట్టేసిన బర్రెకు కావలిగాసినట్టు’

జానపదుల జీవితాల్లో దుఃఖానికి ఎంత ప్రాధాన్యం ఉందో హాస్యానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. 

‘ఉత్తగుండి నా చేతులేంజేత్తయని దండం బెట్టిన అన్నడట’

జానపదులు జీవితంలో చాలా వాస్తవికంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటారు. అందుకే సాధ్యమైనంత సూటిగా మాట్లాడుతారు. ఈ వాస్తవికతతో మాట్లాడి కొన్నిసార్లు అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు కూడా. 


‘ఉన్నమాటంటే ఉలుకెక్కువ’

‘ఎంటికలున్న కొప్పు ఎటువెట్టినా సక్కదనమే’

జీవితం ఎన్ని కోణాల్లో దర్శనమిస్తుందో సామెతలు కూడా అన్ని రకాలున్నాయి. జీవితాన్ని మదురంగా మలిచాయి. సామెతలు తెలుగువారి మౌఖిక సంపద.

జానపద కళలను, పాటలను, సామెతలను, పలుకుబడులను, నానుడులను, పదబంధాలను, పొడుపు కథలను మనం ఇంకా సేకరించాల్సినంత స్థాయిలో సేకరించలేకపోయాం. వాటిని భద్రపర్చాల్సినంత భద్రపర్చలేకపోయాం. సామెత సేకరణ, భద్రత లో, ఇంకా మిగిలిన విభాగాల్లోని జానపద సాహిత్యాన్ని సేకరిం చి భవిష్యత్‌ తరాలకు అందించాల్సి బృహత్తర బాధ్యత మనపై ఉంది.

- డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌, 98669 77741 


logo