మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 09, 2020 , 23:30:18

దేశదిమ్మరి

దేశదిమ్మరి

అతనికీ మనకూ తేడా వుంది

మనం ఏమనుకున్నా

మనది నిర్మిత ప్రపంచం.

మన విలువలన్నీ

దీని పాదులోంచే మొలకెత్తాయి.

ఊరు మన కేంద్ర బిందువు

మన దూరాలన్నీ

ఇంటి దగ్గరి నుంచే.

గోడలుంటాయి కాబట్టి

మన ఇల్లు చిన్నది,

అతని లోకం అట్లా కాదు

దానికి అవధులుండవు

అది బహు విశాలం, విస్తృతం

అతని సంచార చక్రాల్లోంచి

మరిన్ని భ్రమణాసక్తులు పుట్టుకొస్తాయి.

అతని చూపుల్లో

కట్టడాలు కరిగిపోతాయి

కలతలుండొచ్చు

కొలతలకు లొంగడు.

అతని కదిలే నేలకు

నాలుగు కాళ్ళు మొలుస్తాయి

చేతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు.

నేలా గాలీ నీరూ

మన ఆక్రమణలకు గురవుతాయి

భౌగోళిక ఖండాలూ

అగాథ సముద్రాలూ అన్నీ అతనివే.

సాహసాలు

హమారే బస్‌ కీ బాత్‌ నహీ

కోల్పోతామనే భయం మనది.

మరణించటానికి

తోడు అవసరం మనకు

అతనికి ఎవరూ తోడు రారు

మనది ఒకటే దారి

అతడు స్వేచ్ఛా విహారి.

- డాక్టర్‌ ఎన్‌.గోపి


logo
>>>>>>