బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 09, 2020 , 23:29:13

మూడు చింతల కింద

మూడు చింతల కింద

ఇంట్లో గాకుండా ఇంకెక్కడైనా వెలిగించగలవేమో చూడు దీపాన్ని?

నీ ఒంట్లో కాకుండా మరెక్కడైనా దిద్దగలవేమో చూడు దేహాన్ని? 

లోకమే ఒక్కతీరుగ లేదు ఎట్లుంటావు నువ్వు ఒకే కేంద్రంగా

ఎవడు తెలుసుకుంటాడిప్పుడు అప్పటికప్పుడు తిరస్కరించడం కూడా ప్రేమే అని?

ముఖ విలువకు స్థాన విలువకు మధ్య నిలబడతావు నువ్వు

నిర్ణయిస్తుంది అన్నివేళల్లో నిన్ను నీ పని

ఒకటవ చింత

చిటికెన వేలు పట్టుకొని ఈ నేల మీద

అతనితో సమానంగా నడవాలనుకున్నది ఆమె

నడవనీయలేదు వాడు

ఆకాశం వైపు ఎగిరింది ఆమె రెక్కలు తొడుక్కొని

నువ్వు పైటను తగలేశావు గాని తల్లీ

వాడు నిన్నే కాల్చేస్తున్నాడు ఏకంగా!

రెండవ చింత

వాళ్ళు ఈ భూగోళాన్ని శుభ్రమయం చేసి

భుజానికెత్తుకొని నడిచిన వాళ్ళు

వాళ్ళ చెమట చమురు దీపాల వెలుగులో బతికినవాళ్ళే

వాళ్ళను చీకటి గుహల్లో బంధించి చంపుతున్నారు

దేవత లెక్క జూసుకుంటడని

యువరాణి తోటమాలిని ప్రేమించింది 

మేడ దిగివచ్చి ముద్దాడిన రాకుమారి పేద ప్రియుడు

తెల్లారేసరికి ఉరితీయబడ్డాడు

ఒక్కసారిగా కులం డొక్కలో కుమ్మింది

బంగ్లా మీంచి చూసిన రామచిలుక పంజరంలో బందీ అయింది

మధుకరమైన ప్రణయాలన్నీ మాడి మసైపోయినయ్‌

కులాన్ని వెలేద్దామనుకున్నావు తమ్ముడా!

వాడు వెలివాడల్ని దహనం చేస్తున్నాడు

మూడవ చింత 

బిగ్గరగా ప్రార్థించారు వాళ్ళు ఆకాశం వైపు చూస్తూ

విగ్రహాలు కదలవని కష్టాలను చూడవని

విభజన రేఖలు గీస్తున్నాయి వికృతంగా మారిన విశ్వాసాలు

సంఘర్షించుకుంటున్నాయి స్వరూపాలు స్వభావాలు

గుంపులో కలుద్దామనుకున్నావు భయ్యా!

తెలతెల్లని పావురాలను తరిమితరిమి చంపుతున్నాయి డేగలు

ఇరువై నాలుగు గంటలు ఉంటావా ఇంట్లోనే రా! వాడల్లోకి

ఎంతసేపుంటావు వాడలో రా! ఊళ్ళోకి!

ఎన్నిరోజులుంటావు ఊళ్ళో నగరానికి రా

ఎన్నేండ్లు నగరంలో చుట్టుముట్టు దేశాన్ని!

ప్రపంచ మానవుడివై లే! విశ్వవీధుల్లోకి నడు నడు

అస్తిత్వమంటే అస్థికలు కాదు మెడలో వేసుకొని తిరగడానికి!

ఆవేశం కూడా కాదు అగ్నివంటి ఆలోచన

ఆత్మగౌరవం సరే ఆత్మవిమర్శ కూడా!

వసంత మేఘాలు గర్జిస్తూనే వుంటాయి వర్షాలు కురిసేదాకా!

ఊరవతల శ్మశానంలో ఒక శవం నేను స్త్రీగానే మరణించానంది

మరొక శవం నేను కులంతోనే హత్యచేయబడ్డానంది

ఇంకో శవం నేను కాందిశీకునిగానే కాలగర్భంలో కలిసిపోయానంది

ఎవరూ మనిషిగా చావలేదని

శవంతో సహా చెట్టుమీదికెక్కిండు బేతాళుడు

- డాక్టర్‌ తైదల అంజయ్య


logo