గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 08, 2020 , 23:09:02

గొంతు విప్పడమే గొప్పతనం

గొంతు విప్పడమే గొప్పతనం

అహింసాయుతంగా నిరసనలు తెలుపడం నీ హక్కు నీ బాధ్యత. ఇటీవల బీజేపీ వర్గాలు విడుదల చేసిన వీడియోలు,ప్రసంగాలు నిరసన తెలుపడం అంటే దేశద్రోహం అని ప్రచారం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి అప్రజాస్వామికమైన విధానాలు సాగుతున్నప్పుడు ప్రతి పౌరుడికి నిరసనలు తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది దేశద్రోహం కాదు. బాధితుల పక్షాన మాట్లాడుతున్నామనేది తెలుస్తుంది. భారతీయ సమాజానికి ఏ పరిస్థితుల్లో అయినా సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. అసాధారణమైన అభిప్రాయాలు చెప్పి ఒప్పించడం కష్టం. కానీ, అన్యాయాలు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడం మన విధి. మన దేశానికి స్వాతంత్య్రం కూడా నిరసనలు, సత్యాగ్రహం ద్వారా వచ్చిందనేది మర్చిపోవద్దు.

నేనెప్పుడూ నిరసన ప్రదర్శకుడిని కాదు. నాలుగేండ్ల కిందటివరకు మౌనంగా ఉన్న పౌరుడిని మాత్రమే. పగటిపూట ఉద్యోగానికి పోవడం, సాయంత్రం ఏదైనా పుస్తకాన్ని చదువ డం, లేకపోతే టీవీ చూడటం. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపడం, కార్మికులు లేదా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేసే పని అనుకునేవాడిని. కొంచెం గొడవలు చేసే తత్తం ఉన్నవాళ్లు ఇట్లా ప్రదర్శనలు చేస్తుంటారనుకునేవాడిని. ఒక విషయం నిజాయితీగా అంగీకరిస్తా. నగరాల్లోని ఉద్యోగులకు పెద్దగా నిరసనలు తెలిపే అలవాటు లేదు. రోడ్లమీదకి రావడం, నినాదాలు ఇవ్వడం అలవాటు అంతకన్నా లేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. సమస్యలు అలాగే ఉంటాయి. జీవితం గడుస్తూనే ఉంటుంది. ఈ మాత్రం దానికి గొడవలు ఎందుకు అనుకుంటారు. 


అది 2016 సంవత్సరం. నా జీవితాన్ని మార్చేసింది. టీవీలో బ్రేకింగ్‌న్యూస్‌లు వస్తున్నాయి. ‘జేఎన్‌యూలో దేశద్రోహులు’, ‘దేశాన్ని ముక్కలు చేయడానికి కుట్ర’ మొదలైనవి ఫిబ్రవరి నెలలో ఓ సాయంకాలం చూశాం. నా కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇదెట్లా సాధ్యమనిపించింది. నినాదాలిస్తే దేశం ముక్కలవుతుందా! అని ఆశ్చర్యమేసింది. రెండురోజుల తర్వాత ఒక మిత్రుడు అడిగాడు. జేఎన్‌యూ లో జాతీయవాదంపై ఓ ప్రసంగం ఉంది వినడానికి వస్తావా అని. ఒకవైపు నా అం తరాత్మ గోల పెడుతున్నది. ఇటువంటి గొడవల్లో తలదూర్చకుమని. అయినా వెళ్లాలనిపించింది. వెళ్లినందుకు ఎంతో మంచిదైంది. ఆ ప్రసంగం విన్న తర్వాత నా కనిపించింది- ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునేవాళ్లు తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది. సమాజంలోని ఇటువంటి వర్గమే జేఎన్‌యూ విద్యార్థులు. ఈ టీవీ ఛానళ్లు ఎంతగా అబద్ధాలను ప్రచారం చేస్తాయనేది కూడా నాకు అప్పుడే అర్థమైంది. 


జేఎన్‌యూలో పరిస్థితిని చూసి నివ్వెరపోయాను. ఒక ప్రొఫెసర్‌ జాతీయవాదంపై మాట్లాడుతుంటే వేలాది మంది విద్యార్థులు నిశ్శబ్దంగా కూర్చొని విన్నారు. విశ్వవిద్యాలయంపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆర్నాబ్‌ గోస్వాములు, ఆ బాపతు మీడియా మనుషులు టీవీలో అరుస్తున్నట్లు ఈ విద్యార్థులేమీ వీరావేశం గల కమ్యూనిస్టులు  కాదు. దేశ ద్రోహానికి పాల్పడటం లేదు. అదేరోజు సాయంత్రం చాలామంది విద్యార్థులతో మాట్లాడాను. వారిపట్ల నాకున్న గౌరవం పెరిగింది. ప్రజాస్వామ్యంలో నిరసనలకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమైంది. ఆ తర్వాత-జంతర్‌ మంతర్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఎర్రకోట, ఇండియా గేట్‌, ప్రెస్‌క్లబ్‌, మండి హౌజ్‌ ఇంకా ఇటీవల షాహీన్‌బాగ్‌, జామియా మిలియా-లెక్కలేనన్ని ప్రదర్శనలు చూస్తూనే ఉన్న.


ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గొంతు వినిపించడానికి నిరసనలు ఒక మార్గం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపడం ఎంతోకాలంగా ఉన్నదే. ప్రజలు సేవ చేయడానికి ఏర్పడిన ప్రభుత్వం ప్రజల పట్ల అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వానికి వాస్తవాన్ని అర్థం చేయించడానికి ఇటువంటి ప్రదర్శనలు అవసరమవుతాయి.


అధికార వ్యవస్థ అనుసరిస్తున్న మతోన్మాద వైఖరికి నిరసనగా కొన్ని వారాలుగా ఎంతోమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపడం చూస్తుంటే ఉత్సాహం గా ఉన్నది. కొందరు నిరసన తెలుపాలని అనుకుంటూనే తటపటాయిస్తున్నారు. ప్రభుత్వం ఈ అసమ్మతిని సహిస్తుందా అన్నది వారి అనుమానం. కొందరు ఇలా అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇట్లా తటపటాయించేవారికి నేను కొన్ని అం శాలు వివరించదలుచుకున్నా. 


ఒకటి- అహింసాయుతంగా నిరసనలు తెలుపడం నీ హక్కు నీ బాధ్యత. ఇటీవల బీజేపీ వర్గాలు విడుదల చేసిన వీడియోలు, ప్రసంగాలు నిరసన తెలుపడం అంటే దేశద్రోహం అని ప్రచారం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి అప్రజాస్వామికమైన విధానాలు సాగుతున్నప్పుడు ప్రతి పౌరుడికి నిరసనలు తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది దేశద్రోహం కాదు. బాధితుల పక్షాన మాట్లాడుతున్నామనేది తెలుస్తుంది. భారతీయ సమాజానికి ఏ పరిస్థితుల్లో అయినా సర్దుకుపోయే స్వభావం ఉంటుంది. అసాధారణమైన అభిప్రాయాలు చెప్పి ఒప్పించడం కష్టం. 


కానీ, అన్యాయాలు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడం మన విధి. మన దేశానికి స్వాతంత్య్రం కూడా నిరసనలు, సత్యాగ్రహం ద్వారా వచ్చిందనేది మర్చిపోవద్దు. మనకు స్వాతంత్య్రం బంగారు పల్లెంలో పెట్టి ఇవ్వలేదు. మన పూర్వీకులు పోరాడి సాధించారు. హిట్లర్‌ పాలనలో జర్మనీలో యూదులపై ఊచకోత నుంచి బతికి బయటపడ్డ. ఎలీ వీజెల్‌ చేసిన వ్యాఖ్య ఆలోచింపదగినది. ‘మనం ఏదో ఒక్క పక్షం చేరవలసిందే. తటస్థంగా ఉంటే అణిచివేసేవాడికి మద్దతు ఇచ్చినట్టే, మౌనం దుర్మార్గుడికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ, బాధితుడికి న్యాయం చేకూర్చదు. మతం, జాతి, రాజకీయాభిప్రాయాలు కారణం కాదు. అణిచివేత సాగుతుంటే ఆ ప్రాంతంపై ప్రపంచం దృష్టిపడేలా చేయాలి. 


రెండవది- మీకు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలి అని ఉంటే వెళ్లండి కానీ ఆ విషయం అతిగా ఆలోచించకండి. ఆందోళన చెందడానికి, పిరికితనానికి తేడా ఉన్న ది. ఆందోళన చెందిన వ్యక్తి ముందుకువెళ్లి తనను ఇబ్బంది పెట్టేదేమిటో దానిని ఎదుర్కొంటాడు. పిరికివాడు ఆ ప్రయత్నమే చేయడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. ఏదైనా చేసినప్పుడే ధైర్యం కలుగుతుంది. నిరసనలు తెలుపడానికి వెళ్లండి. వెళ్లినందుకు మీరు సంతోషిస్తారు. ఇటీవల జామి యా మిలియా, షాహీన్‌బాగ్‌లలో చూసినట్లు ఆ ప్రదేశంలో కొంత ఉద్రిక్తంగా కనిపిస్తుంది. కానీ, టీవీల్లో చూపించినంతా భయానకంగా ఉండదు. ప్రదర్శనలకు వచ్చినవాళ్లు చాలామంది స్నేహపూర్వకంగా, సహాయకారిగా ఉంటాడు. నేనే చాలా ప్రదర్శనలకు వెళ్లాను. అవి నిర్వహించినవారు ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా, కరుణతో కూడినదిగా మార్చాలని కోరుకునేవారు. ఒంటరిగా కాకుండా కొందరు తెలిసినవారితో వెళ్లడం మంచిది.


మూడవది- నిరసనలకు వెళ్లినంతమాత్రాన సరిపోదు, ఆ నిరసనలో మీరేం చేశారనేది కూడా ప్రధానమే. నిరసన ప్రదర్శనలకు హాజరుకావాలని మాత్రమే అనుకుంటే అదైనా ఫర్వాలేదు. అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా, ధైర్యంగా  నిరసనలు తెలుపాలనుకునేవారికి మీరు సౌహార్దత తెలిపినట్టవుతుంది. నేనొక్కడిని వెళ్లినంతమాత్రాన ఏమవుద్దీ అనుకోవద్దు. మీరు వెళ్లడం ప్రజాస్వామ్యం కోసం అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నవారికి ఉత్సాహాన్నిస్తుంది. లౌకిక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్లలో మీరూ ఒకరవుతారు. 


నాలుగవది- ఒకసారి నిరసన ప్రదర్శనకు వెళ్తే వారి కృషికి మీదైన రీతిలో ఎట్లా తోడ్పడవచ్చునని కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. ఒక పోస్టర్‌ రూపొందించవచ్చు. ఒక నినాదాన్ని రాయవచ్చు. ఒక వీడియో తయారుచేయవచ్చు. లేదా ప్రదర్శనకారులకు టీ, స్నాక్స్‌ అందించే ఏర్పాటుచేయవచ్చు. ఇతరత్రా హంగులు సమకూర్చవచ్చు. ప్రదర్శనకారుల వెనుకాల నిలబడి పేస్‌బుక్‌ లైవ్‌ వీడియో చేయవచ్చు. నిరసనలో భాగం కావడానికి వందలాది విధానాలున్నాయి. మీరు అక్కడికి వెళ్తే కానీ మీదైన రీతిలో ఏమీ చేయవచ్చునో తెలుస్తుంది. 


ఐదవది- మీ నిరసన సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలె. ఎంతో సృజనాత్మకంగా ఉంటే అంత ప్రభావవంతంగా ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టం ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీలను వ్యతిరేకించేవారు వినూత్నరీతిలో నిరసనలు తెలిపారు. తమ కవితలు, పాటలు, గట్టి నినాదాలు మొదలైనవాటి ద్వారా దేశంలోని వేలాదిమందిని ఆకర్షించగలిగారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కొందరు విద్యార్థులు జామియా బయట ఒక ప్రొజెక్టర్‌ పెట్టి, గాంధీ సినిమాను ప్రదర్శించారు. ఆ రోడ్డంతా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌గా మారిపోయింది. విద్యార్థులను స్థానికులను సినిమా చూడటానికి ఆహ్వానించారు. 


దాదా పు రెండు వేల మంది వచ్చి చూశారు. ముస్లింలు ఉన్మాదులని, ఇతరుల మతాల ను కించపరుస్తారని సాగుతున్న ప్రచారానికి విరుగుడుగా ఇద్దరు హిజబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థులు గాంధీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం వంటి భజనలు ఆలపించారు. హర్ష మందిర్‌, సోహైల్‌ హష్మి వంటి ప్రముఖులు గాంధీ జీవితంపై, లౌకిక దేశం గురించి మాట్లాడారు. నేను చూసిన ఎన్నో నిరసనల్లోకెల్లా ఇదెంతో అర్థవంతమైనది. అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడటానికి ఎంతో శక్తి అవసరం. అయినా అందుకు పూనుకోవలసిందే. 

ఎలీ వీజెల్‌ మాట్లల్లో చెప్పాలంటే-

‘అన్యాయాన్ని ఎదిరించలేని నిస్సహాయ సందర్భాలు ఉంటే ఉండవచ్చు. కానీ మనం నిరసన తెలుపడంలో విఫలమైన సందర్భాలు మాత్రం ఉండకూడదు’ 

‘ది వైర్‌' సౌజన్యంతో...


logo