గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 08, 2020 , 23:09:07

అదుపు తప్పిన పొదుపు

అదుపు తప్పిన పొదుపు

మనదేశంలో ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలకు రాచబాట వేసి, విదేశీ పెట్టుబడులను, పరిశ్రమలను ఆహ్వానించారో నాటినుంచి పొదుపు పట్ల ప్రజలకు విరక్తి కలిగించడం మొదలుపెట్టాయి ప్రభుత్వాలు. ప్రతి చిన్న అవసరానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇది, అది అని లేకుండా సమస్త వస్తువులను చేతిలో నయా పైసా లేకపోయినా కొనుగోలు చేయవచ్చు.

భారతీయులకు, పొదుపునకు గల సంబంధం శరీరానికి మనసుకు గల సంబంధం లాంటిది. కష్టపడి సంపాదించడం, సంపాదించిన దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం భారతీయులకు అనాదిగా ఉన్న అలవాటు. వెయ్యి రూపాయల జీతగాడైనా, లక్ష రూపాయల జీతగాడైనా కనీసం పది శాతమైనా జీతం రాగానే బ్యాంకులో దాచుకోవడం మనకున్న ఒక మంచి లక్షణం. ఓ యాభై ఏండ్ల కిందట ఇప్పటిలా ఇల్లు కొనాలన్నా, కార్లు కొనాలన్నా బ్యాం కులు అప్పులు ఇచ్చేవి కావు. ఒకవేళ ఇచ్చినా అవి పెద్దపెద్ద ఉద్యోగులకు, సమాజంలో ఒక స్థితి ఉన్నవారికి మాత్ర మే ఇచ్చేవి. అప్పు లు చేసే అలవాటు కూడా మనకు తక్కువ. ఇతరుల దగ్గర అప్పు తీసుకోవడమంటే వారి ముందు తలవంచటమే అని మనవాళ్ల అభిప్రాయం. ఈ లోకంలో నయాపైసా అప్పు లేనివాడే అందరికన్నా కోటీశ్వరుడనే ఒక సామెత కూడా ఉన్నది.


బ్యాంకులో ఐదారేండ్ల పాటు పొదుపు చేసుకున్న డబ్బు మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ డబ్బుతో బంగారం కొనుక్కోవ డం లేదా స్థలం కొనుక్కోవడం మనవారికి ఒక ఆనవాయితీ. ఇరువై ఏండ్ల కిందటి వరకూ బంగారం తులం మూడు, నాలుగు వేలు మాత్రమే ఉండేది. అలాగే పాతికేళ్ల కిందటివరకు స్థలాలు చాలా చౌకగా ఉండేవి. చిన్నచిన్న పట్టణాల్లో యాభై గజాల స్థలం విలువ ఐదారు వేలల్లోనే లభించేది. అప్పట్లో స్థలం విలువ తక్కు వ గృహ నిర్మాణం విలువ చాలా ఎక్కువ. అందువల్ల ముందు స్థలం కొనిపెట్టుకొని, పదవీవిరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇంటిని నిర్మించుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. నగరాల్లో వంద గజాల స్థలం విలువే యాభై వేల నుంచి కోటి రూపాయలు దాటింది. ఇంటిని పది లక్షలతో అయినా నిర్మించుకోవచ్చు కానీ, స్థలాన్ని కొనడానికి ఎక్కువ వెచ్చించాల్సి వస్తున్నది.


ఉద్యోగంలో చేరిన వెంటనే పొదుపు ఖాతా తెరువడం ఒకప్పు డు అలవాటుగా ఉండేది. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మదుపు చేయడమంటే మన పొదుపు భద్రంగా ఉంటుందని అర్థం. అప్ప ట్లో మన మదుపునకు వచ్చే వడ్డీ కూడా నేటి వడ్డీలతో పోల్చితే  చాలా ఎక్కువే. ప్రజల్లో పొదుపును ప్రోత్సహించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రకరకాల పథకాలను ప్రవేశపెట్టేవి. ఇందిరా వికాస్‌ పత్ర, కిసాన్‌ వికాసపత్ర  పథకాల్లో పెట్టుబడి పెడితే ఐదేం డ్లలో రెట్టింపయ్యేది. అలాగే రికరింగ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. ఉజ్వల భవిష్యత్తు కోసం పొదుపు చేయమని రేడియో, పత్రికల ద్వారా ప్రకటనలు ఇచ్చేవి ప్రభు త్వాలు. ఈ పొదుపు పథకాల మీద బ్యాంకు లు పోటీ పడి ఒకరికన్నా మరొకరు ఎక్కువ వడ్డీ ఇచ్చేవారు. బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది, పోస్ట్‌ మాస్టర్లు ప్రజల ఇండ్లకు వెళ్లి వారి సంస్థల్లో పొదుపు చేయమని బతిమాలాడేడేవారు. 


మనం చేసిన పొదుపు మొత్తమ్మీద బోనస్‌లు ఇచ్చేవారు. అలాగే వ్యక్తుల జీవితాలకు భరోసా ఇచ్చే లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం డియాలో పొదుపు చేయడం కూడా ఎక్కువే. అనుకోనిదేమైనా జరిగి ఇంటి యజమాని మరణించినట్లయితే ఎల్‌ఐసీ నుంచి వచ్చే సొమ్ము తో ఆ కుటుంబం నిశ్చింతగా బతికేది. నాకు గుర్తున్నంతవరకు 2000 సంవత్సరం వరకూ పోస్టాఫీసుల్లో, బ్యాంకు ల్లో మనం చేసే పొదుపు మీద ఇరువై శాతం వడ్డీ ఇచ్చేవారు. ఈ రోజు లక్ష రూపాయలు మనం పెట్టుబ డి పెడితే అరువై మాసాల్లో రూ.రెండు లక్షలు చేతికొచ్చేవి. ఇంకా కొన్ని సహకార బ్యాంకులు అయితే నాలుగేండ్ల కే రెట్టింపు సొమ్ము అందించేవి.  అప్పట్లో పొదుపు అంటే మన జీవితంలో ఒక భాగంగా పరిగణించేవాళ్లు. పిల్లలకు ఉద్యోగాలు రాగానే ముందుగా సేవింగ్స్‌ ఖాతా తెరువు అని పెద్దలు సలహా ఇచ్చేవారు. ఇరువై ఏండ్ల కిందటి వరకూ నెల మొదటివారంలో బ్యాంకులు, పోస్టాఫీసులు మదుపరులతో కిటకిటలాడుతుండేవి. పాతికేళ్లకు సేవింగ్స్‌ మొదలుపెట్టి యాభై ఏండ్ల వరకు క్రమం తప్పకుండా పొదుపు చేసినవాడు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసిన గతి పట్టేది కాదు.


అయితే అదంతా గత వైభవం. మనదేశం లో ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలకు రాచబాట వేసి, విదేశీ పెట్టుబడులను, పరిశ్రమలను ఆహ్వానించారో నాటినుంచి పొదుపు పట్ల ప్రజలకు విరక్తి కలిగించడం మొదలుపెట్టాయి ప్రభుత్వాలు. ప్రతి చిన్న అవసరానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టా యి. ఇది, అది అని లేకుండా సమస్త వస్తువులను చేతిలో నయా పైసా లేకపోయినా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా రెండు మూడు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డు లు ఉంటున్నాయి. కార్డును సుతారంగా గీకితే చాలు మనం కోరుకున్న వస్తువు మనింటికి వచ్చేస్తుంది. 


విలాసాలకు అప్పులు చేయడం ప్రభుత్వాలు దగ్గరుండి మరీ నేర్పించాయి. కొల్లలుగా విదేశీ సంస్థలు, ఉత్పత్తులు రావడంతో వాటికీ మార్కెట్‌ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పడింది. అస్తమానం దాచుకో, పొదుపు చేసుకో అంటూ నినాదాలు ఇస్తుంటే ఆ కంపెనీలు ఎలా బతుకాలి? అందుకు ఒక ఉపాయాన్ని కనిపెట్టాయి. అవేమిటం టే.. పొదుపు మీద వడ్డీలు తగ్గించడం. ఒకప్పుడు పొదుపు మొత్తాల మీద ఇరువై శాతంగా ఉన్న  వడ్డీ రేట్లు నేడు ఐదారు శాతానికి దిగిపోయాయి. అంటే ఈ రోజు మనం లక్ష రూపాయలను బ్యాంకులో దాచుకుంటే దానిమీద అయిదు వేలు వడ్డీ రావడానికి ఏడాది పాటు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూడాలి! ఐదు వేలంటే ఏముంది? మన కుటుంబం ఒక పూట రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తే మూడు వేలు అయిపోతాయి. మరి ఆ ఐదు వేల కోసం లక్షరూపాయలను బ్యాంకులో బ్లాక్‌ చేసేకంటే హాయిగా ఏ టీవీయో కొనుక్కుంటే చూస్తూ ఎంజాయ్‌ చెయ్యవచ్చు కదా అన్న మనస్తత్వాలు పెరుగుతున్నాయి.


దానికితోడు నేడు ఉద్యోగావకాశాలు కూడా ఊహించని విధం గా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఇంటి యజమానికే. భార్యాపిల్లలు అందరూ ఆయన సంపాదన మీద ఆధారపడి జీవించేవారు. అప్పట్లో వేతనాలు కూడా చాలా తక్కువ. ఇప్పు డు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో భార్యాభర్తలు ఉం టే, తొంభై శాతం మంది ఇద్దరూ ఉద్యోగులే ఉంటున్నారు. చదువుకున్న పిల్లలు ఇద్దరు ఉంటే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న నలుగురూ సంపాదనపరులు కావడం, కండ్లెదురు గా విలాసాలు నాట్యం చేస్తుండటం, పొదుపు చేస్తే వచ్చే రాబడి అతిస్వల్పం కావడంతో సేవింగ్స్‌ మీద ధ్యాస పూర్తిగా తగ్గిపోయింది. ‘అనుభవించు రాజా.. పుట్టింది, పెరిగింది ఎందుకు.. అనుభవించు రాజా’ అన్న పద్ధతి తో జీవిత బాటలు మారాయి. 


గత పది పదిహేనేండ్లుగా కేంద్రం, రాష్ట్రం ప్రవేశపెట్టే బడ్జెట్లలో ఎక్కడైనా పొదుపు అనే పదం వినిపిస్తున్నదా? విలాస వస్తువుల మీద పన్నులు తగ్గించడం, ప్రజలను అప్పుల పాలు చేయడమనే ఏకసూత్రం ప్రకారం బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. సామాన్య ప్రజలను ఇక్కట్ల పాల్జేసి కార్పొరేట్లను బతికించడమే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి. ఇవే విధానాలు కొనసాగితే ఎప్పటికైనా ప్రమాదమే అని గ్రహించాలి. ‘ఉన్నది పుష్టి మానవులకు, తిన్నది పుష్టి ఆలజాతికి..’ అన్నారు మన పెద్దలు..!

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)


logo