సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 08, 2020 , 23:04:40

మరుగునపడ్డ మాణిక్యాలు

మరుగునపడ్డ మాణిక్యాలు

తోలుబొమ్మలాట క్రమంగా మాయమై తోలుబొమ్మలు ల్యాంప్‌ షేడ్స్‌ వంటి అలంకరణ వస్తువులుగా రూపాంతరం చెంది హోటళ్లలో, ఖరీదై న ఇళ్లలో చేరుతున్నాయి. కళాకారుడు ఇక్కడ శ్రామికుడిగా మారిపోయాడు. ఇదీ వాస్తవ చిత్రం. ఇటువంటి నేపథ్యంలో దళవాయి చలపతిరావుకు పద్మశ్రీ రావడం ఆనందదాయకం. ఈ కళారూపానికి కొంత ప్రచారం వస్తుంది. చలపతిరావుకు మరికొంత గుర్తింపు వస్తుంది.

ఈసమాజంలో కల్ల ఉంది, కపటం ఉంది, ఆర్భాటం ఉంది! వ్యవస్థ మలినమైపోయింది! ఇటువంటి మాటలు తరచూ వింటూంటాం. అంతకుమించి అందరికీ అనుభవ మూ ఉంటుంది ఆ విషయాలు నిజం చేస్తూ. ఈ మలినాల్లో, కాలుష్య కారకాల్లో ఎంతో కొంత భాగస్వాములం అయినా కాకపోయినా; చెడిపోయిన వ్యవస్థలో మనం అందరం కచ్చితంగా అంతర్భాగం. కొన్నిసార్లు తటిల్లతలాగా, కొన్ని సందర్భాలూ, సంఘటన లు మెరుస్తూ ఉంటాయి. నమ్మశక్యంగా ఉండవు. 


నిజంగా జరిగిందా? అవునా! - అంటూ ఆశ్చర్యపోవడం కూడా కద్దే. కర్ణాటక సంగీతం ఇష్టపడే శాస్త్రవేత్త: భగవద్గీతను ఆరాధించే ముస్లిం; వీణను వాయించే క్షిపణుల పారంగతుడు: వివాహాన్ని త్యజించి పరిశోధననే జీవనప్రేయసిగా చేసుకు న్న త్యాగి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారం టే అప్పట్లో తెగ ఆశ్చర్యం వేసింది. అంత విస్మయం కలిగించినా అటువంటివి కూడా వాస్తవాలే! ఏ పూర్వరంగంలో ఇటువంటివి సంభవించినా మనం ఆనందపడాలి. వారి ప్రతిభను, సృజనను గౌరవిస్తూనే గుర్తింపు కూడా దక్కిందని సంతోషపడాలి.


అలాంటి సంఘటనలు ఒకేసారి రెండు తారసపడ్డాయి. ఆ రెం డూ నాకు చాలా దగ్గరైనవి. ఒకటి నేను ఎంతో ఇష్టపడే వ్యవసాయ శాస్త్ర పరిశోధనా రంగానికి చెందింది కాగా, రెండవది నేను నా బాల్యంలో చాలా దగ్గరగా చూసిన కళారూపం. కేవలం పదవినీ, స్థాయినీ, ప్రసంగాల ఆర్భాటాలకే మన్నన అని స్థిరపడి చాలాకాలమైంది. అలాగే కష్టపడితే, నిజాయితీగా ఉండే ఫలితం లేదని నిర్ణయానికి వచ్చినవారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో పద్మ శ్రీ పొందిన జాబితాలో ఐదుపదుల చింతల వెంకటరెడ్డి, ఎనభై ఐదేండ్ల దళవాయి చలపతిరావుల పేర్లు ఉండటం ఇప్పటికీ వార్త వచ్చి పక్షమైనా ముచ్చటగానే ఉంది. 


ఇద్దరూ ఈ నేలకు ప్రతీకలు. మాటలు చెప్పకుండా గట్టిగా కష్టపడటం వీరికి అలవాటు. ఇద్దరూ మట్టిబిడ్డలు. ఒకరు మన చెంతనే ఉన్న సికింద్రాబాద్‌ అల్వాల్లో ఉం డగా; మరొకరు కర్ణాటక సరిహద్దు అనంతపురం జిల్లా నిమ్మలకుంటలో ఉంటున్నారు. చింతల వెంకటరెడ్డి మట్టి పొరలను తొలిగిస్తూ శాస్త్రపు అజ్ఞానాన్ని సుతారంగా పెకలించి వేస్తుండగా, దళవాయి చలపతిరావు ఈ మట్టినీ, దానితో సాగే కళారూపాన్ని నమ్ముకొని కొత్తలోతులు శోధిస్తున్నాడు. కేవలం మట్టినే ఎరువుగా, పురుగుల మం దుగా వాడగలమని చింతల వెంకటరెడ్డి చెప్పేదాకా మనం కళ్ళున్న అంధులం, చెవులున్న బధిరులం, పరిశోధన చేయని శాస్త్రజ్ఞులం! అందుకే అంతగా ఆశ్చర్యపోతున్నాం.


చింతల వెంకటరెడ్డిని కలిసే అవకాశం ఇటీవల కలిగింది. ఆయన చెప్పింది ఆలకించే సందర్భం దొరికింది. తాను గమనించిందీ, తన కళ్లతో చూసింది చెబితే నమ్మరని జంకడమే కాదు; ఏతావాతా హేళనలు కూడా ఎదురయ్యాయి. ఆయన చాలా వినయంగా తను ఇంటర్మీడియెట్‌ వరకే చదివానని చెబుతూ ఎలా ఈ విషయం తారసపడిందీ వివరిస్తాడు. లోపలి పొరల్లోని మట్టి తగిలి మొక్క మరింత పెరుగడం గమనించారు. అదే మట్టి తగిలి పురుగులు చనిపోవడం కూడా చూశాడు. బోధపడలేదు. అడిగితే జవాబు దొరుకకపోగా, ఎకసెక్కాలు ముందుకొచ్చాయి. ఇక్కడ ఆయనకు దోహదపడింది ప్రశ్నకు జవాబు వెతకడంలో సాగిన అన్వేషణ. 


అరచేతిలో మొబైల్‌ లో అందివచ్చిన నెట్‌ గూగులమ్మ. పురుగులకు ఊపిరితిత్తులున్నా యా? కాలేయముందా? - అనే ప్రశ్నలకు గూగుల్‌లో అవి లేవని తెలుసుకున్నారు వెంకటరెడ్డి. దీనితో ఆయన వివరించింది మట్టి - లోపలి పొరల మట్టిలో పోషకాలు లేవు కనుక దాన్ని ద్రావకంగా కలి పి చల్లినప్పుడు అది పురుగుల శరీరాన్ని సోకుతోందని. ఇది చిన్న విషయం కాదు.  గొప్ప శోధన. పాశ్చాత్య దేశాల్లో మడ్‌ బాత్‌' అని సముద్రతీరాల్లో ఒళ్ళంతా మట్టిపూసుకొని ఎండలో పడుకుంటారు - ఆరోగ్యమని. దీని వివరాలు కూడా పరిశీలిస్తే బాగుండు.అలాగే లోపలి పొరల మట్టి ఎరువుగా పైరు ఏపుగా పెరుగడానికి దోహదపడుతుందని గుర్తించారు. ఫెర్టిలైజర్‌గా, పెస్టిసైడ్‌, ఫం గిసైడ్‌గా మట్టి ఉపయోగపడుతుందని చిం తల వెంకటరెడ్డి ఆవిష్కరణ. కొంత కాలం గా పత్రికలు, టీవీఛానళ్లు, సోషల్‌ మీడియా ఈ విషయాలు చెబుతున్నాయి. పద్మశ్రీతో ఈ విషయాలకు మరింత గుర్తింపు, ప్రచా రం రావడం ఆనందదాయకం.అధిక పంటలు అనే అత్యాశతో మనం భూములను రసాయన ఎరువులతో నింపేస్తున్నాం. రాత్రిపూట రోడ్డుకిరువైపులా పొలాలున్న ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం గమనించగలిగితే అది రసాయనాల చాంబర్‌ వంటిదని బోధపడుతుంది. మట్టికి ఉండే ఈ ధర్మాలను గుర్తించిన చింతల వెంకటరెడ్డి శాస్త్రజ్ఞులను మించి శాస్త్రవేత్త!


ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా జిల్లాల్లో తోలుబొమ్మలాటలున్నాయి. ఇవి రెండు, మూడు అడుగులు ఉండే బొమ్మలు. అయితే రాయలసీమ అనంతపురం జిల్లాలో కనబడే బొమ్మలు ఆరడగులుంటాయి. ఆకర్షించే రంగుల్లో అలరారుతాయి. తెరవెనుక నిలబడి బొమ్మలాటవా రు బొమ్మలు ఆడిస్తూ, లయబద్ధంగా పాడుతూ కథను నడిపిస్తారు. ఏ గ్రామంలో అయితే ప్రదర్శిస్తారో ఆ గ్రామానికి చెందిన విషయాలతో ఆట మొదలుపెట్టి తెల్లవార్లూ రక్తికట్టిస్తారు. కథ, వినోదం, సం గీతం ఇవి ఒకరకంగా సృజన కాగా; బొమ్మకు అవసరమైన మేక చర్మాలు సేకరించడం, శుభ్రం చేయడం, నిలువ ఉండేలా చర్యలు తీసుకోవడం, కత్తిరించడం, బొమ్మ చేయడం, రంగులు వేయడం, వాటికి కర్రలు బిగించడం వంటివి కూడా వారే చేసుకుంటారు.


ఈ సమాజంలో అగ్రకులాల సొత్తు అనబడే కళాసామర్థ్యాలు మాత్రమే కాక, అదే సమాజపు మరో వర్గపు నైపుణ్యాలు కూడా వీరి సొంతం. మహారాష్ట్ర ప్రాంతాలకు చెందినవారు తెలుగు ప్రాంతాల లో చొచ్చుకుపోయారు ఎన్నో ఏండ్ల క్రితం. అలాంటి సంప్రదాయానికి చెందినవాడే దళవాయి చలపతిరావు. ముప్పయ్యేండ్ల కిందటనే వారు జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు తిరిగివచ్చారు కళాకారుడిగా. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం దగ్గర నిమ్మలకుంట అనే గ్రామానికి చెందిన చలపతిరావు మొండిగా ఈ తోలుబొమ్మలు గురించి శ్రమపడుతున్నారు. ఇంతకుముందు దళవాయి గోవిందు, సింధే లక్ష్మీనారాయణప్ప,  సింధే మోహనరావు వంటి పేర్లు స్థానికంగా ప్రసిద్ధమే! ఇపుడు కొత్త తరాలు ఈ కళను వదిలివేస్తున్నాయీ. 


చిన్నతనంలో తన ఇంట్లో నేర్చుకున్న తన కళకు కూడా ఎనిమిది దశాబ్దాల వయసు ఉంటుంది. చలపతిరావు కుటుంబం నిమ్మలకుంటలోనే ఉంది, కానీ ధర్మవరం  రాలేదు, అనంతపురం పోలేదు. పల్లె వదిలి పట్టణం, నగరం వస్తే కళారూపం కనుమరుగవుతుంది. తోలుబొమ్మలాట క్రమంగా మాయమై తోలుబొమ్మలు ల్యాంప్‌ షేడ్స్‌ వం టి అలంకరణ వస్తువులుగా రూపాంతరం చెంది హోటళ్లలో, ఖరీదై న ఇళ్లలో చేరుతున్నాయి. కళాకారుడు ఇక్కడ శ్రామికుడిగా మారిపోయాడు. ఇదీ వాస్తవ చిత్రం. ఇటువంటి నేపథ్యంలో  దళవాయి చలపతిరావుకు పద్మశ్రీ రావడం ఆనందదాయకం. ఈ కళారూపానికి కొంత ప్రచారం వస్తుంది. చలపతిరావుకు మరికొంత గుర్తింపు వస్తుంది. అయితే తోలుబొమ్మలాట కళారూపానికి ఏదో ఒరిగిపోతుందని ఆశించలేం. దానికి తీసుకునే చర్యలు వేరుగా ఉండాలి.  అంతరించే కళారూపాలను నిలువరించే ప్రయత్నం చిత్తశుద్ధిగా మొదలైనపుడు కచ్చితంగా ఫలితం ఉంటుంది.


ఇక్కడ అభినందించవలసిన విషయం ఏమిటంటే... ఇటువంటి వారిని గుర్తించిన వ్యవస్థలోని సుగుణాన్ని, వ్యక్తుల సూక్ష్మదృష్టిని మనం గౌరవించాలి. లేకపోతే వీధిలో పళ్ళు అమ్ముకునే మంగళూరు వ్యక్తికి పద్మశ్రీ ఏమిటి? ఇలాంటివి ఇంతకుముందు జరిగినట్టు దాఖలాల్లేవు. అందువల్లనే ఈ విశ్లేషణ!


logo